నెలా పది రోజుల్లో తెలంగాణ మూడో అసెంబ్లీ ఎన్నికలు, మరో ఏడు నెలల్లో ఏపీ శాసనసభ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ఉమ్మడి రాష్ట్రంలో ఎన్నికలైన వెంటనే ఎంత మంది రెండేసిసార్లు లేదా మూడుసార్లు ముఖ్యమంత్రి పదవి చేపట్టారనే అంశంపై రాజకీయ, ఎన్నికల విశ్లేషకులు ఇప్పుడు చర్చిస్తున్నారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో (1956–2014) శాసనసభ ఎన్నికలు జరిగిన వెంటనే ముఖ్యమంత్రి పదవిని రెండుసార్లు చేపట్టిన నేతలు నలుగురే ఉన్నారు. విశాల తెలుగు రాష్ట్రం అవతరించిన ఏడాదిలోపే జరిగిన 1957 అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ విజయం సాధించాక రెండోసారి సీఎంగా ప్రమాణం చేసిన తొలి ముఖ్యమంత్రి నీలం సంజీవరెడ్డి గారు రెండుసార్లూ పూర్తి కాలం పదవిలో కొనసాగలేకపోయారు, కాని దామోదరం సంజీవయ్య గారు సీఎం పదవిలో ఉండగా జరిగిన 1962 అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వెలువడిన వెంటనే కాంగ్రెస్ పార్టీ అంతర్గత రాజకీయాల వల్ల నీలం సంజీవరెడ్డి ఏపీ ముఖ్యమంత్రిగా చేజిక్కించుకున్నారు.
ఇలా అయన ఎన్నికల తర్వాత రెండుసార్లు సీఎం అయిన నేతల్లో మొదటి వ్యక్తిగా చరిత్రకెక్కారు. నాటి కాంగ్రెస్ సీఎంలలో అత్యధికంగా ఏడున్నరేళ్లకు పైగా పదవిలో ఉన్న కాసు బ్రహ్మానందరెడ్డి గారు 1967 అసెంబ్లీ ఎన్నికల తర్వాత రెండోసారి ముఖ్యమంత్రి అయ్యారు. కాని, 1972 అసెంబ్లీ ఎన్నికలకు ఆరు నెలల ముందు 1971 సెప్టెంబర్ 30న రాజీనామా చేయడంతో అసెంబ్లీ ఎలక్షన్ల తర్వాత రెండుసార్లు సీఎం అయిన నేతగా చరిత్రకెక్కే అవకాశం కోల్పోయారు. 1978 ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ విజయం సాధించడంతో నాటి పీసీసీ అధ్యక్షుడు మర్రి చెన్నారెడ్డి గారు తొలిసారి సీఎం అయ్యారు గాని రెండున్నరేళ్లకే 1980 అక్టోబర్ 11న రాజీనామా చేశారు. అయితే దాదాపు పదేళ్ల తర్వాత పీసీసీ అధ్యక్ష పదవి మరోసారి చేపట్టిన చెన్నారెడ్డి 1989 డిసెంబర్ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ గెలుపొందడంతో రెండోసారి ముఖ్యమంత్రి అయ్యారు. రెండోసారి సీఎం పదవిలో కొనసాగింది కేవలం ఏడాది రెండు వారాలే.
ఉమ్మడి ఏపీలో మూడు అసెంబ్లీ ఎన్నికలయ్యాక సీఎం అయిన ఏకైక నేత ఎన్టీఆర్
ఇక తెలుగుదేశం పార్టీ విషయానికి వస్తే–ఈ పార్టీ స్థాపకుడు ఎన్.టి.రామారావు గారు 1983 ఆరంభంలో జరిగిన ఏపీ ఏడో శాసనసభ ఎన్నికల్లో తన పార్టీ విజయం సాధించాక తొలిసారి ఆ ఏడాది జనవరి 9న ముఖ్యమంత్రి పదవి చేపట్టారు. 1984 ఆగస్ట్–సెప్టెంబర్ మధ్యకాలంలో టీడీపీ అంతర్గత సంక్షోభం కారణంగా ఎన్టీఆర్ సీఎం పదవి నుంచి బర్తరఫ్ కావడం, నెల రోజులకే మళ్లీ దాన్ని దక్కించుకోవడం వెంటవెంటనే జరిగిపోయాయి. ఎన్టీఆర్ అప్పటి అసెంబ్లీని మూడేళ్ల ముందే 1984 చివర్లో రద్దుచేయించి 1985 మార్చిలో జరిపించిన ఏపీ తొలి మధ్యంతర ఎన్నికల్లో టీడీపీ ఘన విజయం సాధించింది. దీంతో రామారావు వరుసగా రెండోసారి అసెంబ్లీ ఎన్నికల తర్వాత సీఎం అయ్యారు.
1994 డిసెంబర్ అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీ గెలిచాక ఎన్టీఆర్ –ఎన్నికలైన వెంటనే మూడుపార్లు ముఖ్యమంత్రి అయిన నేతగా కొత్త రికార్డు సృష్టించారు. ఒక ప్రాంతీయ పార్టీ అధ్యక్షుడు కావడంతో సుదీర్ఘకాలం ఏపీని పాలించిన కాంగ్రెస్ నేతలకు సైతం దక్కని గొప్ప అవకాశం ఎన్టీఆర్ చేతికి చిక్కింది. ఎన్టీఆర్ తర్వాత ఎన్నికలయ్యాక రెండుసార్లు అవిభాజ్య ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ప్రమాణం చేసే అవకాశం జననేత డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి గారికి లభించింది. కొత్త శతాబ్దం, మిలేనియంలో జరిగిన 2004 అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ విజయం సాధించడంతో మే 14న ఆయన తొలిసారి ముఖ్యమంత్రి పదవి చేపట్టారు. ఉమ్మడి ఏపీ చరిత్రలో తొలిసారి పూర్తి పదవీకాలం (ఐదు సంవత్సరాల ఆరు రోజలు) ముఖ్యమంత్రిగా ఉన్న నేతగా వైఎస్‌ది ఎవరూ చెరిపివేయలేని రికార్డు.
అంతేగాక, ఐదేళ్లు సీఎంగా పనిచేశాక జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ విజయంతో రెండోసారి ముఖ్యమంత్రిగా ప్రమాణం చేయడం కూడా వైఎస్ గారిదే రికార్డు. 2009 అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ విజయంతో రాజశేఖరరెడ్డి గారు మే 20న రెండోసారి సీఎం పదవి చేపట్టారు. 2014లో తెలంగాణ రాష్ట్రం ఏర్పాటుతో సీఎం ఎన్.చంద్రబాబు నాయుడు అప్పటి అసెంబ్లీ ఎన్నికలయ్యాక అవతరించిన నవ్యాంధ్ర ప్రదేశ్ మొదటి సీఎం అయ్యారు. కాని 2019 అసెంబ్లీ ఎన్నికల్లో ఘోర పరాజయంతో రెండోసారి ఎన్నికల తర్వాత మరోసారి పదవి దక్కించుకోలేకపోయారు. ఆ ఎన్నికల్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ చరిత్రాత్మక విజయం సాధించాక సీఎం అయిన పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి గారికి 2024 ఎన్నికల తర్వాత కూడా రెండోసారి ముఖ్యమంత్రి పదవి చేపడతారనడంలో ఎలాంటి సందేహం లేదు.
-విజయసాయిరెడ్డి, వైఎస్సార్‌సీపీ, రాజ్యసభ ఎంపీ
Comments
Please login to add a commentAdd a comment