* సంజీవరెడ్డి హయాంలో రాష్ట్రంలో ప్రధాన ప్రాజెక్టుల నిర్మాణం
* ‘నీలం’ శత జయంతి ముగింపు ఉత్సవాల్లో రాష్ట్రపతి ప్రణబ్ ప్రశంసలు
* దేశాన్ని సమర్థంగా నడిపిన మేరునగధీరుడు
* సీఎం పదవిని తృణప్రాయంగా త్యజించిన ధీశాలి
* తెలుగు ‘వజ్రం’గా కొనియాడిన గవర్నర్
సాక్షి, అనంతపురం: ఆంధ్రప్రదేశ్ అన్నపూర్ణగా వెలుగొందుతోందంటే ఆ ఖ్యాతి నీలం సంజీవరెడ్డికే దక్కుతుందని రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ కొనియాడారు. శ్రీశైలం, నాగార్జునసాగర్, శ్రీరాంసాగర్, వంశధార ప్రాజెక్టులను ఆయన హయాంలో నిర్మించడంవల్లే దేశానికి ఆంధ్రప్రదేశ్ అన్నం పెడుతోందన్నారు. అనంతపురంలో సోమవారం నిర్వహించిన మాజీ రాష్ట్రపతి, ఆంధ్రప్రదేశ్ తొలి ముఖ్యమంత్రి నీలం సంజీవరెడ్డి శత జయంతి ముగింపు ఉత్సవాల్లో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు.
ఈ సందర్భంగా మాట్లాడుతూ.. గొప్ప రాజకీయ నాయకుడు.. సమర్థవంతమైన పరిపాలకుడు.. అత్యుత్తమ పార్లమెంటేరియన్‌గా పేరుగాంచిన నీలం సంజీవరెడ్డి సుపరిపాలనను అందించడంలో రోల్ మోడల్ అని ప్రశంసించారు. అనంతపురం జిల్లాలో మారుమూల గ్రామమైన ఇల్లూరులో రైతు కుటుంబంలో జన్మించిన నీలం సంజీవరెడ్డి విద్యార్థి దశలోనే నాయకత్వ లక్షణాలను పుణికిపుచ్చుకున్నారన్నారు. మహాత్మాగాంధీ 1929 జూలైలో అనంతపురంలో పర్యటించిన సందర్భంలో ఆయన స్ఫూర్తితో 16 ఏళ్ల వయసులో చదువును పక్కన పెట్టి.. స్వాతంత్య్ర సమరంలోకి అడుగుపెట్టారని చెప్పారు.
అతిపిన్న వయసులో 25 ఏళ్లకే 1938లో ఆంధ్ర ప్రాంత కాంగ్రెస్ అధ్యక్షుడిగా ఎన్నికై.. పదేళ్లపాటు ఆ పదవిలో కొనసాగారన్నారు. 1940 -1945 మధ్య కాలంలో స్వాతంత్య్ర ఉద్యమంలో చురుగ్గా పాల్గొన్న నీలంను పలుమార్లు బ్రిటిష్ ప్రభుత్వం జైల్లో నిర్బంధించిందని తెలిపారు. జైల్లో టంగుటూరి ప్రకాశం, కామరాజ్ నాడార్, వి.వి.గిరి, సత్యమూర్తి వంటి యోధుల సహచర్యంతో నీలం మరింత రాటుదేలారని చెప్పారు. 1946లో మద్రాసు రాష్ట్ర అసెంబ్లీకి ఎన్నికై.. ఎక్సైజ్, అటవీ, గృహ నిర్మాణ శాఖ మంత్రిగా సమర్థవంతమైన పాలనను అందించారని కొనియాడారు.
1952లో ఆంధ్ర రాష్ట్ర ఉప ముఖ్యమంత్రిగా పనిచేసిన నీలం.. తెలుగు జాతిని ఐక్యం చేసేందుకు భాషా ప్రయుక్త రాష్ట్రాలను ఏర్పాటు చేయాలని పోరాడారన్నారు. ఆ పోరాటాల ఫలితంగానే 1956లో ఆంధ్రప్రదేశ్ ఏర్పాటైందని.. ఆ రాష్ట్రానికి తొలి ముఖ్యమంత్రిగా నీలం సంజీవరెడ్డి ఎన్నికయ్యారని చెప్పారు. సమైక్యాంధ్రప్రదేశ్‌కు రెండోసారి 1962లో ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన నీలం.. 1964లో ఆ పదవికి రాజీనామా చేశారన్నారు. ఓ కేసులో సుప్రీం కోర్టు ముఖ్యమంత్రిగా నీలం సంజీవరెడ్డిని తప్పుపట్టకపోయినా.. సకాలంలో అఫిడవిట్ ఎందుకు దాఖలు చేయలేకపోయారని ప్రశ్నించినందుకే నైతిక బాధ్యత వహిస్తూ ఆయన రాజీనామా చేసి ప్రజాస్వామ్య విలువలకు సరి కొత్త నిర్వచనం చెప్పారని ప్రశంసించారు.
లోక్‌సభ స్పీకర్‌గా ఆయన బాధ్యతలు స్వీకరించిన తొలి రోజే.. బాధ్యతలను నిష్పక్షపాతంగా నిర్వహించాలన్న లక్ష్యంతో పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి కూడా రాజీనామా చేసి ఆదర్శప్రాయంగా నిలిచారన్నారు. కేంద్ర ప్రభుత్వంపై ప్రతిపక్షాలు అవిశ్వాస తీర్మానం ప్రతిపాదించిన తొలి రోజే స్పీకర్ హోదాలో ఆ అంశంపై చర్చ జరిగేలా చర్యలు తీసుకున్న దార్శనికుడు అని ప్రశంసించారు. 1977 నుంచి 1982 వరకు ఆయన రాష్ట్రపతిగా పనిచేశారని.. ఆ మధ్య కాలంలో కేంద్రంలో మొరార్జీదేశాయ్, చరణ్‌సింగ్, ఇందిరాగాంధీ నేతృత్వంలో మూడు ప్రభుత్వాలు కొలువుతీరి, రాజకీయ అస్థిరత ఏర్పడినా దేశాన్ని ప్రగతిపథం వైపు నడపడానికి ఆయన నాయకత్వ లక్షణాలే కారణమని కొనియాడారు.
ఆయన పదవులకు అతీతం...
అఖిల భారత జాతీయ కాంగ్రెస్ అధ్యక్షునిగా 1960లో ఎన్నికైన సంజీవరెడ్డి.. సీఎం పదవికి రాజీనామా చేసి పార్టీ బాధ్యతలు చేపట్టారని రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ చెప్పారు. పార్టీ పదవి తక్కువ.. ప్రభుత్వ పదవి ఎక్కువ అని ఏనాడూ భావించలేదన్నారు. మహాత్మాగాంధీ ఇచ్చిన స్ఫూర్తితోనే తాను ఇంతటి వాడినయ్యాయని 1978లో స్వాతంత్య్ర దినోత్సవ ప్రసంగంలో ఆయన పేర్కొన్నారని చెప్పారు. ‘ఎవరినీ విజయం వెతుక్కుంటూ రాదు.. చిత్తశుద్ధి, నిజాయితీ, నిబద్ధతలతో పోరాడితే విజయం పరిగెత్తుకుంటూ వస్తుందని జవహర్‌లాల్ నెహ్రూ చేసిన వ్యాఖ్యలే తనను రైతు బిడ్డ నుంచి రాష్ట్రపతిని చేశాయి’ అని నీలం సంజీవరెడ్డి తన ఆత్మకథ ‘విత్ అవుట్ ఫియర్ ఆర్ ఫేవర్’లో రాశారని గుర్తుచేశారు.
అనంతపురం జిల్లా నుంచి నీలం సంజీవరెడ్డి, సర్వేపల్లి రాధాకృష్ణన్ (అనంతపురం ఆర్ట్స్ కళాశాలలో అధ్యాపకునిగా పనిచేశారు) రాష్ర్టపతులయ్యారని, ఈ జిల్లానుంచి మరికొందరు సమర్థమైన నేతలు రావాలని పిలుపునిచ్చారు. చివరలో ‘విష్ యూ ఏ హ్యాపీ క్రిస్‌మస్.. హ్యాపీ న్యూ ఇయర్’ అంటూ తన 25 నిమిషాల ప్రసంగాన్ని ముగించారు. అంతకుముందు గవర్నర్ ఈఎస్‌ఎల్ నరసింహన్ మాట్లాడుతూ తెలుగు వజ్రం నీలం అని కొనియాడారు. డాక్టర్ కేవీ కృష్ణకుమారి రచించిన ‘నిరుపమాన త్యాగధనుడు నీలం’ పుస్తకాన్ని.. ఎస్కేయూ రూపొందించిన ‘ఏ హిస్టారికల్ స్టడీ అండ్ అసెస్‌మెంట్’ పుస్తకాన్ని గవర్నర్ ఆవిష్కరించి.. రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీకి అందజేశారు.
అనంతరం రెవెన్యూ మంత్రి ఎన్.రఘువీరారెడ్డి.. రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ, గవర్నర్ ఈఎస్‌ఎల్ నరసింహన్‌లకు జ్ఞాపిక (లేపాక్షి నంది)లను అందజేశారు. కార్యక్రమంలో సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డి, శాసనమండలి చైర్మన్ ఎ.చక్రపాణి, ప్రాథమిక విద్యాశాఖ మంత్రి ఎస్.శైలజానాథ్, ఎంపీ అనంత వెంకటరామిరెడ్డి తదితరులు పాల్గొన్నారు.
సత్యసాయి మహా సమాధిని దర్శించుకున్న రాష్ట్రపతి
పుట్టపర్తి, న్యూస్‌లైన్: రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ సోమవారం సత్యసాయి మహా సమాధిని సందర్శించి నివాళులర్పించారు. అనంతపురంలో నీలం సంజీవరెడ్డి శత జయంతి ఉత్సవాల ముగింపు కార్యక్రమంలో పాల్గొన్న ఆయన మధ్యాహ్నం 2.30 గంటలకు పుట్టపర్తి విమానాశ్రయానికి చేరుకున్నారు. అక్కడినుంచి భారీ భద్రత మధ్య 2.50 గంటలకు ప్రశాంతి నిలయం చేరుకున్నారు. సత్యసాయి మహాసమాధి వద్ద పుష్పగుచ్చం ఉంచి నివాళి అర్పించారు.
రెవెన్యూ అకాడమీకి నీలం సంజీవరెడ్డి పేరు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర రెవెన్యూ అకాడమీకి రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి, మాజీ రాష్ట్రపతి నీలం సంజీవరెడ్డి పేరు పెడుతూ ప్రభుత్వం సోమవారం ఉత్తర్వులు జారీ చేసింది. అకాడమీని ఇకపై డాక్టర్ నీలం సంజీవ రెడ్డి రెవెన్యూ అకాడమీగా వ్యవహరించనున్నట్టు పేర్కొంది.
‘అన్నపూర్ణ’ ఘనత.. నీలం చలవే
Published Tue, Dec 24 2013 1:10 AM | Last Updated on Wed, Aug 8 2018 6:12 PM
Advertisement
Advertisement