అనంతపురం జిల్లాపరిషత్తు, న్యూస్‌లైన్ : అన్నదమ్ముల్లా కలిసున్న తెలుగు ప్రజలను ఓట్లు, సీట్ల కోసం కొందరు చీల్చడానికి ప్రయత్నిస్తున్నారని, ఆ కుటిల యత్నాలను అడ్డుకోవాలని వైఎస్‌ఆర్‌సీపీ ఎమ్మెల్యేలు గురునాథరెడ్డి, కాపు రామచంద్రారెడ్డి రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీని కోరారు. ఈ మేరకు వారు సోమవారం ఆయనకు వినతిపత్రం అందజేశారు. నీలం సంజీవరెడ్డి శత జయంతి ఉత్సవాలకు హాజరయ్యేందుకు అనంతపురం వచ్చిన రాష్ట్రపతికి హెలిప్యాడ్ వద్ద వైఎస్‌ఆర్‌సీపీ ఎమ్మెల్యేలు పుష్పగుచ్ఛం, వినతిపత్రం అందజేశారు. ప్రజల మనోభావాలు పట్టించుకోకుండా కాంగ్రెస్ పార్టీ పెద్దలు ఏకపక్షంగా, నిరంకుశంగా వ్యవహరిస్తున్నారని తెలిపారు. తెలుగు జాతి ఒక్కటిగా ఉండాలన్న ఆశయంతో 1956లో బళ్లారి జిల్లాను, తుంగభద్ర నీటి వనరులను కోల్పోయామన్నారు. అప్పటి నుంచి ‘అనంత’ ఎడారి ప్రాంతంగా రూపాంతరం చెందుతున్నా తెలుగుజాతి కోసం త్యాగాలు చేశామన్నారు.
అమరజీవి పొట్టిశ్రీరాములు వంటి ఎందరో త్యాగధనుల ప్రాణాలే పునాదులుగా ఏర్పడిన ఆంధ్రప్రదేశ్‌ను ముక్కలు చేయడానికి పూనుకోవడం మంచిది కాదన్నారు. మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డి సీఎంగా ఉన్నప్పుడు వేర్పాటువాదాన్ని మొగ్గలోనే తుంచేసి, రాష్ట్ర ప్రజలంతా బాగుపడేలా సంక్షేమ పథకాలు చేపట్టారన్నారు. ఫలితంగా దేశంలో మిగిలిన రాష్ట్రాలకు ఆంధ్రప్రదేశ్ ఆదర్శంగా నిలిచిందన్నారు. వైఎస్ మరణం తర్వాత రాష్ట్ర పరిస్థితి దయనీయంగా మారిందని పేర్కొన్నారు. ప్రజలు, ప్రాంతాల మధ్య రాగద్వేషాలు సృష్టించి రాజకీయ లబ్ధి పొందే కుట్ర చేస్తున్నారని, ఫలితంగా రాష్ట్రాభివృద్ధి కుంటుపడి ప్రజలు అష్టకష్టాలు పడుతున్నారని తెలిపారు. దేశంలో జైసల్మేర్ తర్వాత అత్యల్ప వర్షపాతం నమోదయ్యే అనంతపురం జిల్లా కరువుకు నిలయమన్నారు. ఈ పరిస్థితుల్లో రాష్ట్రాన్ని చీల్చడం వల్ల ‘అనంత’ లాంటి వెనుకబడిన ప్రాంతాలు మరిన్ని సమస్యలతో కొట్టుమిట్టాడుతాయని ఆందోళన వ్యక్తం చేశారు. ప్రజానీకం తరఫున తాము చేస్తున్న ఈ విన్నపాన్ని మన్నించి విభజనకు అడ్డుకట్ట వేయాలని వినతిపత్రంలో పేర్కొన్నారు.