సాక్షి, నంద్యాల(ఎలక్షన్ డెస్క్): రాష్ట్రపతి, ప్రధానమంత్రులను అందించిన ఘనత నంద్యాల నియోజకవర్గానికి దక్కుతుంది. 1971లో దేశమంతా ఇందిరాగాంధీ గాలి వీస్తోంది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లోని మొత్తం 42 స్థానాల్లో కాంగ్రెస్ పార్టీ 41 స్థానాలను కైవసం చేసుకుంది.
నంద్యాలలో మాత్రం ఇందిరా గాంధీతో విభేదించి జనతాపార్టీ తరఫున పోటీ చేసిన నీలం సంజీవరెడ్డి విజయం సాధించారు. కాంగ్రెస్ అభ్యర్థి పెండెకంటి వెంకటసుబ్బయ్యపై 35,743 ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. లోక్‌సభ స్పీకర్‌గా ఎన్నికై మూడు నెలలు పనిచేసి తర్వాత 1977 నుంచి 1982 వరకు 9వ రాష్ట్రపతిగా ఎన్నికయ్యారు.
అలాగే దేశ 10వ ప్రధానిగా పీవీ నరసింహరావు 1991 జూన్ 21న బాధ్యతలు చేపట్టారు. ఆయన పార్లమెంట్‌లో సభ్యుడు కాకపోవడంతో ఎన్నిక అనివార్యమైంది. అప్పటి నంద్యాల ఎంపీ గంగుల ప్రతాప్‌రెడ్డిని రాజీనామా చేయించి ఇక్కడి నుంచి పోటీ చేశారు. బీజేపీ అభ్యర్థి బంగారు లక్ష్మణ్‌పై 5,80,035 ఓట్ల మెజార్టీతో గెలుపొంది రికార్డు సృష్టించారు. ఆ తరువాత పీవీ 1996లో నంద్యాలతో పాటు ఒరిస్సాలోని బరంపురం నుంచి పోటీ చేశారు. రెండు స్థానాల్లోనూ గెలవడంతో నంద్యాలకు రాజీనామా చేశారు. అలాగే బనగానపల్లెకు చెందిన పెండెకంటి వెంకటసుబ్బయ్య నంద్యాల నుంచి ఎంపీగా ఎన్నికై ఇందిరా, రాజీవ్ గాంధీల హయాంలో కేంద్రమంత్రిగా పనిచేశారు. కర్ణాటక, బీహార్ రాష్ట్రాలకు గవర్నర్‌గా పనిచేశారు.
Comments
Please login to add a commentAdd a comment