సాక్షి, నంద్యాల : దేశ చరిత్రలో కీలక పదవులు అధిరోహించిన నేతలను లోక్‌సభకు పంపిన నియోజకవర్గంగా నంద్యాల లోక్‌సభ పసిద్ధి. మాజీ రాష్ట్రపతి నీలం సంజీవరెడ్డి , మాజీ ప్రధాని పి.వి.నరసింహారావు ఇక్కడి నుంచే ప్రాతినిథ్యం వహించారు. 1952లో నంద్యాల లోక్‌సభ నియోజకవర్గం ఏర్పడింది. అప్పుడు జరిగిన ఎన్నికల్లో స్వతంత్ర అభ్యర్థి రాయసం శేషగిరి ఎంపికయ్యారు. తరువాత పలు కారణాల వల్ల నంద్యాల నియోజకవర్గం రద్దయింది. 1967లో మళ్లీ ప్రత్యేక పార్లమెంటరీ నియోజకవర్గంగా అవతరించింది.
1977లో నీలం సంజీవరెడ్డి జనతా పార్టీ అభ్యర్థిగా పోటీ చేసి ఏపీ నుంచి ఆ పార్టీకి ఎంపికైన ఏకైక అభ్యర్థిగా పార్లమెంట్‌లో ప్రవేశించారు. అనంతరం నీలం భారత రాష్ట్రపతిగా ఎన్నికయ్యారు. 1991లో పీవీ నరసింహారావు ప్రధాని అయ్యారు. అప్పటి సిట్టింగ్ ఎంపీ గంగుల ప్రతాప్‌రెడ్డి రాజీనామా చేసి నంద్యాల నుంచి పీవీని పోటీకి ఆహ్వానించారు. 1991లో నంద్యాల పార్లమెంట్‌కు ఉప ఎన్నిక జరిగింది. ఆ ఎన్నికల్లో పీవీ తన ప్రత్యర్థి బీజేపీ అభ్యర్థి బంగారు లక్ష్మణ్‌పై 5,80,035 ఓట్లతో భారీ మెజారిటీతో గెలుపొంది రికార్డు సృష్టించారు. ఇక పెండేకంటి వెంకటసుబ్బయ్య ఐదు సార్లు నంద్యాల లోక్‌సభ నుంచి గెలుపొందారు. కేంద్రమంత్రిగా, కర్నాటక, ఒరిస్సా రాష్ట్రాల గవర్నర్‌గా పనిచేశారు.
అసెంబ్లీ నియోజకవర్గాలివే
ఆళ్లగడ్డ, శ్రీశైలం, నందికొట్కూరు, పాణ్యం, నంద్యాల, బనగానపల్లె, డోన్.
2004, 2009లో జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ తరఫున ఎస్పీవై రెడ్డి గెలుపొందారు. 2014లో వైఎస్సార్‌సీపీ నుంచి విజయం సాధించారు. తరువాత అధికార టీడీపీలో చేరిపోయారు. ప్రస్తుత ఎన్నికల్లో వైఎస్సార్‌సీపీ నుంచి పోచా బ్రహ్మానందరెడ్డి, టీడీపీ తరుపున మాండ్ర శివానందరెడ్డి, జనసేన నుంచి ఎస్పీవై రెడ్డి బరిలో నిలిచారు.
దూసుకుపోతున్న పోచా
వైఎస్సార్‌సీపీ తరఫున బరిలో నిలిచిన పోచా బ్రహ్మానందరెడ్డి ఎన్నికల ప్రచారంలో దూసుకుపోతున్నారు. రైతు కుటుంబానికి చెందిన వ్యక్తి కావడంతో రైతులతో నేరుగా సంబంధాలు కలిగి ఉన్నారు. నియోజకవర్గంలోని ప్రతి గ్రామం లోని పరిస్థితులు, సమస్యలపై అవగాహన ఉంది. తనకున్న పరిచయాలతో యువతకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించగలరు.
మాండ్రకు నయీంతో సంబంధాలు
టీడీపీ నుంచి బరిలో నిలిచిన మాండ్ర ఐపీఎస్ అధికారిగా పనిచేస్తున్న సమయంలో తెలంగాణలో అరాచకాలు, హత్యలు చేసిన నయీంతో సంబంధాలు కలిగి ఉన్న వ్యక్తిగా ఈయన గుర్తింపు పొందారు. టీడీపీలో చేరినప్పటి నుంచి వందల కోట్ల ఆస్తులు సంపాదించుకున్నారనే ఆరోపణలు ఉన్నాయి. పార్లమెంటు పరిధిలోని అసెంబ్లీ నియోజకవర్గాలపై ఈయనకు ఏ మాత్రం అవగాహన లేదు. ఇక జనసేన తరఫున పోటీ చేస్తున్న ఎస్పీవై రెడ్డి.. టీడీపీతో లోపాయికారిగా ఒప్పందంతోనే పోటీ చేశారని గ్రామాల్లో విస్తృతంగా చర్చించుకుంటున్నారు.
– కురువ జమ్మన్న, కర్నూలు (సిటీ)
Comments
Please login to add a commentAdd a comment