nandyala mp
-
ఇదేందయ్యా.. భార్గవా?
సాక్షి, నంద్యాల: నంద్యాల పార్లమెంట్ స్థానానికి ఓ వ్యక్తి స్వతంత్య్ర అభ్యర్థిగా నామినేషన్ వేయడం, ఉపసంహరించుకోవడం ఇప్పుడు జిల్లాలో చర్చగా మారింది. ఆయన ఎవరో కాదు ఆళ్లగడ్డ టీడీపీ అభ్యర్థి భూమా అఖిల ప్రియ భర్త మద్దూరు భార్గవ రామ్ నాయుడు. టీడీపీ నుంచి నంద్యాల ఎంపీగా బైరెడ్డి శబరి పోటీ చేస్తున్నారు. అయితే నామినేషన్లలో చివరి రోజు ఈనెల 25వ తేదీ భార్గవ రామ్ చడీచప్పుడు కాకుండా నంద్యాల ఎంపీగా నామినేషన్ వేశారు. ఇండిపెండెంట్‌గా పోటీ చేస్తున్నట్లు తాను సమర్పించిన నామినేషన్ల పత్రాల్లో పేర్కొన్నారు. ఈ విషయం తెలుసుకున్న శబరి.. అఖిలప్రియ వ్యవహారశైలిపై పార్టీ పెద్దలకు ఫిర్యాదు చేసినట్లు తెలుస్తోంది. ఎన్నికల ఖర్చు భరిస్తామని హామీ ఇస్తేనే భార్గవరామ్ నామినేషన్ విత్ డ్రా చేసుకుంటారని.. లేని పక్షంలో ఇండిపెండెంట్‌గా బరిలో ఉంటామని అఖిల ప్రియ చెప్పినట్లు ప్రచారం సాగింది. అయితే నామినేషన్ల ఉపసంహరణకు గడువు ముగుస్తుండడంతో టీడీపీలో హైడ్రామా నడిచింది. భార్గవరామ్ తన నామినేషన్ విత్‌డ్రా చేసుకోకుంటే పార్టీ పరంగా తీవ్ర చర్యలు తీసుకుంటామని అధిష్టానం నుంచి గట్టి హెచ్చరికలు చేయడంతో భార్గవ్ నామినేషన్ విత్ డ్రా చేసుకున్నట్లు తెలిసింది. ‘సార్.. ఏం ఆశించి నామినేషన్ వేశారో’ అన్న చర్చ ఇప్పుడు జిల్లా వ్యాప్తంగా సాగుతోంది. ఈ తంతంగంపై బైరెడ్డి శబరి అసంతృప్తి వ్యక్తం చేసినట్లు సమాచారం. -
ఎస్పీవై రెడ్డి అంత్యక్రియలు పూర్తి
సాక్షి, కర్నూలు : నంద్యాల ఎంపీ ఎస్పీవై రెడ్డి అంత్యక్రియలు గురువారం అధికారిక లాంఛనాల మధ్య ముగిశాయి. బొమ్మలసత్రంలో ఉన్న ఎస్పీవై రెడ్డి ఇంటి ఆవరణలోనే కుటుంబసభ్యులు అంత్యక్రియలు నిర్వహించారు. ఎస్పీవై రెడ్డి తల్లి ఈరమ్మ సమాధి పక్కనే ఆయన అంత్యక్రియలు కూడా చేశారు. అంత్యక్రియల కార్యక్రమానికి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి, కాటసాని రామిరెడ్డి, కోట్ల సుజాతమ్మ, బ్రహ్మానందరెడ్డి, శిల్ప రవిచంద్ర, కిషోర్ రెడ్డితో పాటు పెద్ద ఎత్తున రైతులు హాజరయ్యారు. పైపుల రెడ్డిని కడసారి చూసేందుకు.. మూడు సార్లు ఎంపీగా విజయం సాధించి నంద్యాల పార్లమెంట్ నియోజకవర్గంలో మంచి పేరు కలిగివున్న ఎస్పీవై రెడ్డి మరణించారని తెలియగానే నంద్యాల ప్రజలు శోకసంద్రంలో మునిగిపోయారు. పేదల ఆకలిని తీర్చిన అన్నదాత పైపులరెడ్డి ఇక లేరనే విషయాన్ని జీర్ణించుకోలేకపోతున్నారు. నంద్యాల ఎంపీ ఎస్పీ వైరెడ్డి మంగళవారం రాత్రి హైదరాబాద్ కేర్ ఆసుపత్రిలో మరణించిన విషయం తెలిసిందే. హైదరాబాద్ నుంచి ఆయన భౌతికకాయాన్ని బుధవారం ఉదయం 6 గంటలకు నంద్యాలకు తీసుకొచ్చి ఆయన ఇంటి వద్ద ఉంచారు. ఎస్పీవై రెడ్డిని చూడటానికి పెద్ద ఎత్తున ప్రజలు తరలి వచ్చారు. అధికారులు, ప్రజాప్రతినిధులు, ప్రజాసంఘాలు, పలు పార్టీల నాయకులు మృతదేహాన్ని సందర్శించి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఉదయం నుంచి పట్టణంలోని బొమ్మలసత్రంలోని ఎస్పీవైరెడ్డి స్వగృహం ప్రజలతో నిండిపోయింది. పైపుల రెడ్డి ఇక లేరని పలువురు కన్నీరు మున్నీరయ్యారు. ఎస్పీవై రెడ్డి భౌతికాయం వద్ద నివాళులర్పించిన నాయకులు, అధికారులు ఆయన కుమార్తె సుజలరెడ్డి, అల్లుడు శ్రీధర్‌రెడ్డిలను ఓదార్చి ధైర్యం చెప్పారు. ఎస్పీవై రెడ్డి పెద్ద కుమార్తె సుజలరెడ్డి తండ్రి మృతదేహం వద్ద విలపించిన తీరు అందరినీ కలచివేసింది. -
నంద్యాల పీఠంపై పాగా వేసేదెవరు.?
సాక్షి, నంద్యాల : దేశ చరిత్రలో కీలక పదవులు అధిరోహించిన నేతలను లోక్‌సభకు పంపిన నియోజకవర్గంగా నంద్యాల లోక్‌సభ పసిద్ధి. మాజీ రాష్ట్రపతి నీలం సంజీవరెడ్డి , మాజీ ప్రధాని పి.వి.నరసింహారావు ఇక్కడి నుంచే ప్రాతినిథ్యం వహించారు. 1952లో నంద్యాల లోక్‌సభ నియోజకవర్గం ఏర్పడింది. అప్పుడు జరిగిన ఎన్నికల్లో స్వతంత్ర అభ్యర్థి రాయసం శేషగిరి ఎంపికయ్యారు. తరువాత పలు కారణాల వల్ల నంద్యాల నియోజకవర్గం రద్దయింది. 1967లో మళ్లీ ప్రత్యేక పార్లమెంటరీ నియోజకవర్గంగా అవతరించింది. 1977లో నీలం సంజీవరెడ్డి జనతా పార్టీ అభ్యర్థిగా పోటీ చేసి ఏపీ నుంచి ఆ పార్టీకి ఎంపికైన ఏకైక అభ్యర్థిగా పార్లమెంట్లో ప్రవేశించారు. అనంతరం నీలం భారత రాష్ట్రపతిగా ఎన్నికయ్యారు. 1991లో పీవీ నరసింహారావు ప్రధాని అయ్యారు. అప్పటి సిట్టింగ్ ఎంపీ గంగుల ప్రతాప్‌రెడ్డి రాజీనామా చేసి నంద్యాల నుంచి పీవీని పోటీకి ఆహ్వానించారు. 1991లో నంద్యాల పార్లమెంట్‌కు ఉప ఎన్నిక జరిగింది. ఆ ఎన్నికల్లో పీవీ తన ప్రత్యర్థి బీజేపీ అభ్యర్థి బంగారు లక్ష్మణ్‌పై 5,80,035 ఓట్లతో భారీ మెజారిటీతో గెలుపొంది రికార్డు సృష్టించారు. ఇక పెండేకంటి వెంకటసుబ్బయ్య ఐదు సార్లు నంద్యాల లోక్‌సభ నుంచి గెలుపొందారు. కేంద్రమంత్రిగా, కర్నాటక, ఒరిస్సా రాష్ట్రాల గవర్నర్‌గా పనిచేశారు. అసెంబ్లీ నియోజకవర్గాలివే ఆళ్లగడ్డ, శ్రీశైలం, నందికొట్కూరు, పాణ్యం, నంద్యాల, బనగానపల్లె, డోన్. 2004, 2009లో జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ తరఫున ఎస్పీవై రెడ్డి గెలుపొందారు. 2014లో వైఎస్సార్సీపీ నుంచి విజయం సాధించారు. తరువాత అధికార టీడీపీలో చేరిపోయారు. ప్రస్తుత ఎన్నికల్లో వైఎస్సార్సీపీ నుంచి పోచా బ్రహ్మానందరెడ్డి, టీడీపీ తరుపున మాండ్ర శివానందరెడ్డి, జనసేన నుంచి ఎస్పీవై రెడ్డి బరిలో నిలిచారు. దూసుకుపోతున్న పోచా వైఎస్సార్సీపీ తరఫున బరిలో నిలిచిన పోచా బ్రహ్మానందరెడ్డి ఎన్నికల ప్రచారంలో దూసుకుపోతున్నారు. రైతు కుటుంబానికి చెందిన వ్యక్తి కావడంతో రైతులతో నేరుగా సంబంధాలు కలిగి ఉన్నారు. నియోజకవర్గంలోని ప్రతి గ్రామం లోని పరిస్థితులు, సమస్యలపై అవగాహన ఉంది. తనకున్న పరిచయాలతో యువతకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించగలరు. మాండ్రకు నయీంతో సంబంధాలు టీడీపీ నుంచి బరిలో నిలిచిన మాండ్ర ఐపీఎస్ అధికారిగా పనిచేస్తున్న సమయంలో తెలంగాణలో అరాచకాలు, హత్యలు చేసిన నయీంతో సంబంధాలు కలిగి ఉన్న వ్యక్తిగా ఈయన గుర్తింపు పొందారు. టీడీపీలో చేరినప్పటి నుంచి వందల కోట్ల ఆస్తులు సంపాదించుకున్నారనే ఆరోపణలు ఉన్నాయి. పార్లమెంటు పరిధిలోని అసెంబ్లీ నియోజకవర్గాలపై ఈయనకు ఏ మాత్రం అవగాహన లేదు. ఇక జనసేన తరఫున పోటీ చేస్తున్న ఎస్పీవై రెడ్డి.. టీడీపీతో లోపాయికారిగా ఒప్పందంతోనే పోటీ చేశారని గ్రామాల్లో విస్తృతంగా చర్చించుకుంటున్నారు. – కురువ జమ్మన్న, కర్నూలు (సిటీ) -
నంద్యాల ఖ్యాతి.. దేశ వ్యాప్తి
సాక్షి, నంద్యాల(ఎలక్షన్ డెస్క్): రాష్ట్రపతి, ప్రధానమంత్రులను అందించిన ఘనత నంద్యాల నియోజకవర్గానికి దక్కుతుంది. 1971లో దేశమంతా ఇందిరాగాంధీ గాలి వీస్తోంది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లోని మొత్తం 42 స్థానాల్లో కాంగ్రెస్ పార్టీ 41 స్థానాలను కైవసం చేసుకుంది. నంద్యాలలో మాత్రం ఇందిరా గాంధీతో విభేదించి జనతాపార్టీ తరఫున పోటీ చేసిన నీలం సంజీవరెడ్డి విజయం సాధించారు. కాంగ్రెస్ అభ్యర్థి పెండెకంటి వెంకటసుబ్బయ్యపై 35,743 ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. లోక్‌సభ స్పీకర్‌గా ఎన్నికై మూడు నెలలు పనిచేసి తర్వాత 1977 నుంచి 1982 వరకు 9వ రాష్ట్రపతిగా ఎన్నికయ్యారు. అలాగే దేశ 10వ ప్రధానిగా పీవీ నరసింహరావు 1991 జూన్ 21న బాధ్యతలు చేపట్టారు. ఆయన పార్లమెంట్లో సభ్యుడు కాకపోవడంతో ఎన్నిక అనివార్యమైంది. అప్పటి నంద్యాల ఎంపీ గంగుల ప్రతాప్‌రెడ్డిని రాజీనామా చేయించి ఇక్కడి నుంచి పోటీ చేశారు. బీజేపీ అభ్యర్థి బంగారు లక్ష్మణ్‌పై 5,80,035 ఓట్ల మెజార్టీతో గెలుపొంది రికార్డు సృష్టించారు. ఆ తరువాత పీవీ 1996లో నంద్యాలతో పాటు ఒరిస్సాలోని బరంపురం నుంచి పోటీ చేశారు. రెండు స్థానాల్లోనూ గెలవడంతో నంద్యాలకు రాజీనామా చేశారు. అలాగే బనగానపల్లెకు చెందిన పెండెకంటి వెంకటసుబ్బయ్య నంద్యాల నుంచి ఎంపీగా ఎన్నికై ఇందిరా, రాజీవ్ గాంధీల హయాంలో కేంద్రమంత్రిగా పనిచేశారు. కర్ణాటక, బీహార్ రాష్ట్రాలకు గవర్నర్‌గా పనిచేశారు. -
'ఎస్పీవై రెడ్డి అభ్యర్థిత్వాన్ని రద్దు చేయండి'
-
ఎస్పీవై రెడ్డిపై అనర్హత వేటు వేయండి
న్యూఢిల్లీ : నంద్యాల ఎంపీ ఎస్పీవై రెడ్డిపై అనర్హత వేటు వేయాలంటూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గురువారం స్పీకర్ సుమిత్రా మహాజన్‌కు ఫిర్యాదు చేసింది. వైఎస్ఆర్సీపీ తరపున గెలుపొంది టీడీపీలో చేరిన ఎస్పీవై రెడ్డిని అనర్హుడిగా ప్రకటించాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పార్లమెంటరీ పార్టీ నేత మేకపాటి రాజమోహన్ రెడ్డి, పార్టీ ఎంపీలు...స్పీకర్‌ను కలిసి విజ్ఞప్తి చేశారు. అనంతరం మేకపాటి మాట్లాడుతూ టీడీపీలో చేరినట్లు ఎస్పీవై రెడ్డి తనకు తానుగానే ప్రకటించుకున్నారని గుర్తు చేశారు. అనర్హత వేటు వేస్తే టీడీపీ తరపున పోటీ చేస్తానని ఆయనే చెప్పారని, నిబంధనల ప్రకారం ఎస్పీవై రెడ్డిపై అనర్హత వేటు వేయాలని స్పీకర్‌ను కోరినట్లు చెప్పారు. ఈ అంశంలో త్వరితగతిన నిర్ణయం తీసుకోవాలని స్పీకర్‌ను కోరినట్లు చెప్పారు. దీనికి సంబంధించి అన్ని ఆధారాలను స్పీకర్‌కు సమర్పించామన్న ఎంపీ మేకపాటి...నిబంధనల ప్రకారం వ్యవహరిస్తానని స్పీకర్ చెప్పినట్లు వెల్లడించారు. కాగా వైఎస్సార్సీపీ నంద్యాల ఎంపీ అభ్యర్థిగా ఎస్పీవెరైడ్డి విజయం సాధించి ఆ తర్వాత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి దూరమై చంద్రబాబునాయుడు సమక్షంలో టీడీపీ తీర్థం పుచ్చుకున్నారు. -
అవన్నీ అవాస్తవ కథనాలు: ఎస్పీవై రెడ్డి
హైదరాబాద్ : తనపై కొన్ని టీవీ చానెళ్లు అవాస్తవ కథనాలు ప్రచారం చేస్తున్నాయని నంద్యాల ఎంపీ ఎస్పీవై రెడ్డి అన్నారు. అది సరైన పద్ధతి కాదని ఆయన శుక్రవారమిక్కడ అన్నారు. వైఎస్ఆర్ సీపీని వీడుతున్నట్లు వస్తున్న వార్తల్లో నిజం లేదన్నారు. తాను వైఎస్ జగన్ మోహన్ రెడ్డితో కలిసే ముందుకు వెళుతున్నానని....మనస్ఫూర్తిగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోనే ఉన్నానని ఎస్పీవై రెడ్డి తెలిపారు. తనును మరోసారి వివాదాల్లోకి లాగవద్దని ఆయన సూచించారు. ముఖ్యమంత్రి క్యాంప్ కార్యాలయానికి వెళ్లిన మాట వాస్తవమేనని.. తన వ్యక్తిగత పనిపై సీఎం కార్యదర్శిని కలిసేందుకు వెళ్లినట్లు ఎస్పీవై రెడ్డి తెలిపారు. తన నిజాయితీని శంకించాల్సిన పనిలేదని ..మున్సిపల్ ఛైర్మన్‌గా ఉన్న తనను ఎంపీగా పోటీ చేయాలని వైఎస్ రాజశేఖరరెడ్డే ప్రోత్సహించారన్నారు.