సాక్షి, నంద్యాల: నంద్యాల పార్లమెంట్ స్థానానికి ఓ వ్యక్తి స్వతంత్య్ర అభ్యర్థిగా నామినేషన్ వేయడం, ఉపసంహరించుకోవడం ఇప్పుడు జిల్లాలో చర్చగా మారింది. ఆయన ఎవరో కాదు ఆళ్లగడ్డ టీడీపీ అభ్యర్థి భూమా అఖిల ప్రియ భర్త మద్దూరు భార్గవ రామ్ నాయుడు. టీడీపీ నుంచి నంద్యాల ఎంపీగా బైరెడ్డి శబరి పోటీ చేస్తున్నారు. అయితే నామినేషన్లలో చివరి రోజు ఈనెల 25వ తేదీ భార్గవ రామ్ చడీచప్పుడు కాకుండా నంద్యాల ఎంపీగా నామినేషన్ వేశారు.
ఇండిపెండెంట్‌గా పోటీ చేస్తున్నట్లు తాను సమర్పించిన నామినేషన్ల పత్రాల్లో పేర్కొన్నారు. ఈ విషయం తెలుసుకున్న శబరి.. అఖిలప్రియ వ్యవహారశైలిపై పార్టీ పెద్దలకు ఫిర్యాదు చేసినట్లు తెలుస్తోంది. ఎన్నికల ఖర్చు భరిస్తామని హామీ ఇస్తేనే భార్గవరామ్ నామినేషన్ విత్ డ్రా చేసుకుంటారని.. లేని పక్షంలో ఇండిపెండెంట్‌గా బరిలో ఉంటామని అఖిల ప్రియ చెప్పినట్లు ప్రచారం సాగింది.
అయితే నామినేషన్ల ఉపసంహరణకు గడువు ముగుస్తుండడంతో టీడీపీలో హైడ్రామా నడిచింది. భార్గవరామ్ తన నామినేషన్ విత్‌డ్రా చేసుకోకుంటే పార్టీ పరంగా తీవ్ర చర్యలు తీసుకుంటామని అధిష్టానం నుంచి గట్టి హెచ్చరికలు చేయడంతో భార్గవ్ నామినేషన్ విత్ డ్రా చేసుకున్నట్లు తెలిసింది. ‘సార్.. ఏం ఆశించి నామినేషన్ వేశారో’ అన్న చర్చ ఇప్పుడు జిల్లా వ్యాప్తంగా సాగుతోంది. ఈ తంతంగంపై బైరెడ్డి శబరి అసంతృప్తి వ్యక్తం చేసినట్లు సమాచారం.
Comments
Please login to add a commentAdd a comment