ఆళ్లగడ్డలో అనధికారికంగా ఇంటింటికి తిరుగుతూ ఓటర్ల వివరాలు సేకరిస్తున్న టీడీపీ నాయకులు
ఓటర్లకు ఎర వేస్తున్న ఆళ్లగడ్డ టీడీపీ అభ్యర్థి
ఇంటింటా వివరాలు ఆరా తీస్తున్న వైనం
ఫోన్, బ్యాంక్ నంబర్లు సేకరణ
పార్టీలో ప్రాధాన్యత కల్పిస్తామని వైఎస్సార్‌సీపీ నాయకులకు ఫోన్ కాల్స్
తిప్పికొడుతున్న అధికార పార్టీ నేతలు
ఆళ్లగడ్డ: ఓటమి భయంతో ఆళ్లగడ్డ నియోజకవర్గ టీడీపీ అభ్యర్థిని భూమా అఖిలప్రియ ఓటర్లకు ఎర వేసేందుకు యత్నిస్తున్నారు. ఎన్నికల వేళ ఓటర్లను ప్రలోభపెట్టి.. కులాల మధ్య కుంపటి రాజేసి గెలుపొందాలని కుటిల ప్రయత్నం చేస్త్తున్నారు. అవినీతి, అక్రమాలు, భూకబ్జాల ద్వారా సంపాదించిన డబ్బులతో ఓటర్లను ప్రలోభపెట్ట్టేందుకు రంగం సిద్ధం చేసుకుంటున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి. ప్రస్తుత ఎన్నికల్లో ప్రజలు అధికార పార్టీ వైపు ఉన్నారనే సమాచారంతో ఆపార్టీ నేతలు, కార్యకర్తలను ప్రలోభాలకు గురిచేయాలనే ప్రయత్నంలో దిగజారి రాజకీయాలు చేస్తున్నారు. టీడీపీ నేతలు గ్రామాలు, వార్డులను ఎంచుకుని ఇంటింటికి తిరిగి ఫోన్ నంబర్లతో సహా వివరాలు సేకరిస్తున్నారు.
వాటిని అఖిలప్రియ భర్త భార్గవరామ్‌కు అందజేస్తున్నారు. ఆయన నాయకులకు ఫోన్ చేసి నగదు ఆశ చూపడమే కాక ‘పెత్తనం మీదేనంటూ’ నమ్మబలికే ప్రయత్నం చేస్తున్నారు. అయితే గ్రామాల్లో ఎంతో బలంగా ఉన్న వైఎస్సార్‌సీపీ నాయకులు, కార్యకర్తలు టీడీపీ ప్రలోభాలుక లొంగకుండా ధీటుగా సమాధానం చెబుతున్నారు. చాగలమర్రి, రుద్రవరం మండలాల పరిధిలోని సీనియర్ నాయకులకు ఇదే తరహాలో ఫోన్ వస్తే చాలా మంది ఆగ్రహం వ్యక్తం చేయడంతో ఫోన్ కట్ చేసిన ఘటనలు ఇటీవల చోటు చేసుకున్నాయి.
ముఖ్యంగా ఎమ్మెల్యే గంగుల బిజేంద్రారెడ్డి సొంత మండలమైన రుద్రవరాన్ని టీడీపీ నాయకులు టార్గెట్ చేసి ప్రలోభాల పర్వానికి తెరతీశారని తెలుస్తోంది. మండల కేంద్రం రుద్రవరానికి చెందిన బలిజ సంఘం నాయకుడు అఖిలప్రియ భర్తతో కలిసి వైఎస్సార్‌సీపీకి చెందిన బలిజ నేతలే లక్ష్యంగా నిత్యం ప్రలోభాలకు గురి చేస్తున్నారని తెలుస్తోంది. తమ పార్టీలోకి వస్తే పెత్తనం అంతా మీదే అని ఖర్చులకు నగదు కూడా ఇస్తామని అఖలప్రియ భర్త భార్గవరామ్ నేరుగా ప్రలోభపెడుతున్నారని సమచారం.
ఎన్నికల నియమావళి ఉల్లంఘనే..
అనుమతి లేకుండా టీడీపీ నాయకులు ఇంటింటికి తిరుగుతూ ఇంట్లో ఎంతమంది ఉన్నారు. ఏం పనిచేస్తారు. ఏ కులం, ఏ పార్టీకి ఓటు వేస్తారని వివరాలు అడగటంతో పాటు ఫోన్ నంబర్, ఆధార్, బ్యాంకు ఖాతా వివరాలు కూడా సేకరించి ఓటర్లను ప్రలోభాలకు గురిచేయడం ముమ్మాటికీ ఎన్నికల నియమావళి ఉల్లంఘన కిందకే వస్తుందని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. నియోజకవర్గ వ్యాప్తంగా వందలాది మంది టీడీపీ కార్యకర్తలు ఓటర్ల వివరాలతో పాటు ఇంటి పెద్ద ఆధార్, బ్యాంక్ ఖాతా వివరాలు సేకరిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఓట్లు అడిగితే తప్పులేదని ప్రలోభాలకు గురిచేయడం, వ్యక్తిగత వివరాలు సేకరించే వ్యక్తులపై ఆధారాలు తమకు సమర్పిస్తే కచ్చితంగా చర్యలు తీసుకుంటామని అధికారులు చెబుతున్నారు.
ఎందుకు అంటే ఏమి చెప్పడం లేదు
టీడీపీకి చెందిన కొందరు వ్యక్తులు మా ఇంటితో పాటు చుట్టూ ఉన్న వాళ్ల ఇళ్ల దగ్గరకు వచ్చి మీ ఇంట్లో ఎన్ని ఓట్లు ఉన్నాయి? ఎంతమంది ఉన్నారు? ఏం పనిచేస్తున్నారు? మీరు ఏ పార్టీ.. అంటూ వివరాలు అడిగి విషయాలు రాసుకున్నారు. ఫోన్ నంబర్లతో పాటు కొందరి బ్యాంక్ అకౌంట్ కూడా అడిగి రాసుకున్నారు. ఎందుకు అంటే అఖిలమ్మ రాసుకు రమ్మంది అంటున్నారు. అంతకంటే ఏమీ చెప్పడం లేదు.
– నజీర్, రహిమాన్ వీధి, ఆళ్లగడ్డ
Comments
Please login to add a commentAdd a comment