Former minister Bhuma Akhila Priya arrested by Nandyal police
నంద్యాల: టీడీపీ నంద్యాల అసెంబ్లీ నియోజకవర్గ టికెట్ కోసం మాజీ ఎమ్మెల్యే భూమా బ్రహ్మానంద రెడ్డి, మాజీ మంత్రి ఎన్‌ఎండీ ఫరూక్, సీడ్స్ కార్పొరేషన్ మాజీ చైర్మన్ ఏవీ సుబ్బారెడ్డి, దివంగత భూమా నాగిరెడ్డి తనయుడు భూమా జగత్ విఖ్యాత్‌రెడ్డి తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. టికెట్ ప్రయత్నంలో భాగంగా నాయకులు నంద్యాలలో నాలుగు గ్రూపులుగా విడిపోయి రాజకీయం చేస్తున్నారు. వీరి మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటోంది. యువగళం పాదయాత్రలో భాగంగా నంద్యాల నియోజకవర్గంలోకి ప్రవేశించిన లోకేష్ కు నలుగురు నాయకులు తమ వర్గీయులతో వేర్వేరుగా స్వాగతం పలికారు.
ఈ కోవలోనే మాజీ మంత్రి భూమా అఖిలప్రియ, వారి అనుచరులు సీడ్స్ కార్పొరేషన్ మాజీ చైర్మన్ ఏవీ సుబ్బారెడ్డిపై దాడి చేసిన విషయం తెలిసిందే. ఈ దాడిలో ఏవీ సుబ్బారెడ్డిని కిందకు తోసి, చొక్కా చింపి దంతాలు ఊడే విధంగా కొట్టారు. ఈ ఘటనతో టీడీపీ నాయకుల మధ్య విభేదాలు రచ్చకెక్కాయి. టీడీపీకి నియోజకవర్గంలో అంతంత మాత్రమే బలం ఉంది. గ్రూపు తగాదాలతో కార్యకర్తల్లో నిరాశ, నిస్పృహలు నెలకొన్నాయి. యువగళం పాదయాత్రలో నారాలోకేష్ ముందే టీడీపీ నాయకులు దాడి చేసుకోవడం టీడీపీ కార్యకర్తలు భయాందోళనకు గురవుతున్నారు.
భూమా అఖిలప్రియకు రిమాండ్..
సీడ్స్ కార్పొరేషన్ మాజీ చైర్మన్ ఏవీ సుబ్బారెడ్డి ఫిర్యాదు మేరకు భూమా అఖిలప్రియతో పాటు ఆమె భర్త భార్గవరామ్, పీఏ మోహన్, శక్తి వెంకటసాయినాథ్‌లు లతో పాటు మరో 8 మందిపై హత్యాయత్నం కేసు నమోదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు బుధవారం ఆళ్లగడ్డలోని భూమా అఖిలప్రియ ఇంటికి చేరుకున్నారు. అఖిలప్రియతో మరో ముగ్గురిని అదుపులోకి తీసుకొని విచారణ నిమిత్తం పాణ్యం పోలీసు స్టేషన్‌కు తరలించారు.
విచారణ అనంతరం భూమా అఖిలప్రియను నంద్యాల ప్రభుత్వాసుపత్రిలో ఆరోగ్య పరీక్షలు నిర్వహించారు. అనంతరం నంద్యాల జిల్లా కోర్టులో పోలీసులు హాజరు పరిచారు. నంద్యాల మెజి్రస్టేట్ అఖిలప్రియ, భార్గవరామ్, మోహన్, సాయినాథ్‌లకు 14రోజుల పాటు రిమాండ్ విధించారు. అఖిలప్రియను కర్నూలు మహిళా సబ్‌జైలుకు , మిగిలిన వారిని కర్నూలు సబ్‌జైలుకు తరలించారు. ఈ కేసులో మరో ఏడుగురు పరారీలో ఉన్నారని, వారిని త్వరలో అరెస్ట్ చేస్తామని నంద్యాల డీఎస్పీ మహేశ్వరరెడ్డి తెలిపారు.
లోకేష్ పాదయాత్రలో ఎవరికి వారే బ్యానర్లు..
యువగళం పాదయాత్రలో లోకేష్ కు స్వాగతం పలికేందుకు నంద్యాల పట్టణంలో టీడీపీ నాయకులు ఎవరికి వారు బ్యానర్లు వేయించుకున్నారు. భూమా బ్రహా్మనందరెడ్డి, ఫరూక్, ఏవీ సుబ్బారెడ్డి, భూమా అఖిలప్రియ మద్దతు దారులు వేర్వేరుగా తమ అనుచరులతో బ్యానర్లు కట్టారు. ఈ బ్యానర్లు చూసిన నంద్యాల ప్రజలు పట్టణంలో టీడీపీ నాయకులు అధికమయ్యారని నవ్వుకుంటున్నారు.
ఆధిపత్యం కోసమే ఏవీపై దాడి..
వచ్చే ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ అధిష్టానం ఆదేశిస్తే నంద్యాల లేదంటే ఆళ్లగడ్డ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేస్తానని ఏవీ సుబ్బారెడ్డి తరచూ ప్రకటనలు ఇస్తున్నారు. ఈ నేపథ్యంలో ఆధిపత్యం కోసమే ఏవీ సుబ్బారెడ్డిపై దాడి జరిగిందని ఆయన వర్గీయులు ఆరోపిస్తున్నారు. 2019 ఎన్నికల ముందు శిరివెళ్ల మండలంలో సైకిల్ యాత్ర చేస్తున్న ఏవీ సుబ్బారెడ్డి సైతం రాళ్ల దాడి చేయించారు. అనంతరం ఏవీ సుబ్బారెడ్డిని హత్య చేసేందుకు కిరాయి హంతకులతో కుట్ర పన్నిన విషయాన్ని పోలీసులు బట్టబయలు చేశారు. అప్పటి నుంచి వీరి మధ్య విభేదాలు భగ్గుమంటున్నాయి. యువగళం పాదయాత్రలో ఏవీ సుబ్బారెడ్డిపై మరో సారి దాడి చేయడంతో వీరి మధ్య విభేదాలు ఎక్కడికి వెళ్తాయోనని కార్యకర్తలు చర్చించుకుంటున్నారు.
ఎన్‌టీఆర్ వర్ధంతి, జయంతి వేడుకల్లో సైతం విభేదాలే..
ప్రతి ఏడాది జరిగే ఎన్‌టీ రామారావు జయంతి, వర్ధంతి వేడుకల్లో సైతం మాజీ ఎమ్మెల్యే భూమా బ్రహా్మనందరెడ్డి, మాజీ మంత్రి ఫరూక్‌లు వేర్వేరుగా కార్యక్రమాల్లో పాల్గొనేవారు. సోషల్ మీడియాలో సైతం ఎవరి వర్గం వారు టికెట్ మాకేనంటూ పోస్టులు పెట్టుకోవడంతో పాటు సొంత నాయకులపైనే విమర్శలు గుప్పిస్తున్నారు. ఇదిలా ఉండగా మాజీ ఎమ్మెల్యే భూమా బ్రహా్మనందరెడ్డి, మాజీ మంత్రి భూమా అఖిలప్రియ, భూమా జగత్ విఖ్యాత్‌రెడ్డి మధ్య ఏడాది కాలంగా విభేదాలు భగ్గుమంటున్నాయి. భూమా జగత్ విఖ్యాత్‌రెడ్డికి నంద్యాల టికెట్ ఇప్పించాలనే ప్రయత్నంతో నంద్యాలలో అఖిలప్రియ సొంత కార్యాలయం కూడా ఏర్పాటు చేశారు.
భూమా నాగిరెడ్డి, శోభానాగిరెడ్డి వరి్ధంతి కార్యక్రమాలను వేర్వేరుగా నిర్వహించడం అప్పట్లో చర్చనీయాశమైంది. భూమా అఖిలప్రియ, భూమా బ్రహా్మనందరెడ్డి.. ఏడాదిన్నర కాలంగా ఒక్క కార్యక్రమంలో కూడా కలిసి పాల్గొనలేదు. టికెట్ మాకంటే మాకు అంటూ అనుచరులకు చెప్పుకుంటున్నారు. దీంతో టీడీపీ నాయకులు ఎవరి వైపు వెళ్లాలో అర్థం కాక తలలు పట్టుకుంటున్నారు. వచ్చే ఎన్నికల్లో ఏ నాయకుడికి టికెట్ ఇచ్చినా మిగిలిన ముగ్గురు మద్దతు ఇచ్చే ప్రసక్తే కనిపించనంతగా విభేదాలు నెలకొన్నాయి.
Comments
Please login to add a commentAdd a comment