ఆళ్లగడ్డ: ఆళ్లగడ్డ నియోజకవర్గంలో రాజకీయ ప్రాభవం ఉన్న భూమా వర్గం మాజీ మంత్రి అఖిల ప్రియకు దూరమవుతోంది. ఆమె తీరు నచ్చక ఇప్పటికే కొంత బంధువర్గం, కుటుంబీకులు వీడుతూ వచ్చారు. తాజాగా అఖిలప్రియ పెదనాన్న కొడుకు మాజీ ఎంపీపీ భూమా కిషోర్‌రెడ్డి సోమవారం ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి సమక్షంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. 2014 ఎన్నికల ముందు అప్పటి వైఎస్సార్‌సీసీ అభ్యర్థి శోభా నాగిరెడ్డి మరణంతో జరిగిన ఉప ఎన్నికలో వైఎస్సార్‌సీపీ నుంచి ఆమె కుమార్తె భూమా అఖిలప్రియ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.
అటు తరువాత చంద్రబాబు మాయ మాటలు నమ్మి టీడీపీలో చేరిన అఖిలప్రియ అతి చిన్న వయస్సు, ఆళ్లగడ్డ నుంచి ఎన్నికైన ఎమ్మెల్యేల్లో మొదటి కేబినెట్ మంత్రి కూడా అయ్యారు. అంతవరకు ఎన్ని ఆటుపోట్లు ఎదురైనా కుటుంబ సభ్యులందరూ ఒకటేమాట ఒకటే బాటగా ఉండేవారు. మంత్రి అయిన తరువాత ఆమె మరో సామాజిక వర్గానికి చెందిన వ్యక్తిని వివాహం చేసుకోవడం, ఆమె భర్త భార్గవరామ్ పెత్తనాన్ని జీర్ణించుకోలేని కుటుంబ సభ్యులు ఒకొక్కరుగా ఆమెకు దూరమవుతూ వచ్చారు. ఆ క్రమంలోనే అఖిలప్రియ పెద నాన్న కొడుకు మాజీ ఎంపీపీ భూమా కిషోర్‌రెడ్డి భూమా రాజకీయ వారసత్వం తమకే అని.. రాజకీయంగా నిలదొక్కుకునే ప్రయత్నంలో భాగంగా బీజేపీలో చేరారు. అప్పటి నుంచి అనేక రకాలుగా ప్రజలకు చేరువయ్యారు.
భూమా వర్గంలో దాదాపు సగం మంది నాయకులు కిషోర్ వెంట నడచడంతో నియోజకవర్గంలో మంచి పేరు తెచ్చుకున్నాడు. భూమా నాగిరెడ్డి వారసుడిగా గుర్తింపు రావడంతో పొత్తులో భాగంగా అయినా లేదా టీడీపీ నుంచే అయినా తనకే టికెట్ ఇస్తుందని భారీగా ఖర్చు పెట్టుకున్నాడు. అయితే టీడీపీ, బీజేపీ పొత్తు ఉంటుందో లేదో తేలకపోవడంతో పాటు టీడీపీ టికెట్ అఖిలప్రియకే ఇవ్వడంతో కిషోర్‌రెడ్డి తీవ్ర అసంతృప్తికి లోనయ్యాడు.
ఇక అఖిలప్రియ ఓటమే ధ్యేయంగా సోమవారం ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి సమక్షంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. ఎవరూ ఊహించని విధంగా కిషోర్‌రెడ్డి తమ వర్గానికి చెందిన నియోజకవర్గంలోని ముఖ్య కార్యకర్తలతో సుమారు 50 వాహనాల్లో విజయవాడకు వెళ్లి వైఎస్సార్‌సీపీ కండువా కప్పుకున్నారు. దీంతో ఇంత వరకు అంతా ఒకే వర్గంగా ఉన్న భూమా కోటకు బీటలు వారినట్లుగా నియోజకవర్గంలో చర్చిచుంకుటున్నారు.
అంతర్మథనంలో అఖిల వర్గం
ఇంతవరకు ఎప్పుడు ఏ ఎన్నికలు వచ్చినా భూమా కుటుంబం అంతా ఒక్కటిగా ఉండేది. అయితే మొదటిసారిగా భూమా కుటుంబం మొత్తం అఖిలప్రియ, ఆమె తమ్ముడు తప్ప దాదాపు కుటుంబ సభ్యులు, బంధువులు అందరూ కిషోర్‌రెడ్డి వెంటే నడవడంతో భూమా వర్గం నిట్టనిలువునా రెండు వర్గాలుగా చీలిపోయింది. దీంతో ఆ వర్గం ఆలోచనలో పడింది. కనీసం పోటీ కూడా ఇవ్వలేమని ఆ వర్గం నేతలు చెబుతున్నారు. ఇక ఆళ్లగడ్డలో గంగుల బిజేంద్రారెడ్డి విజయం నల్లేరు మీద నడకేనని గతంలో వచ్చిన మెజార్టీ కంటే రెండింతలు వస్తుందని నియోజకవర్గంలో చర్చించుకుంటున్నారు.
Comments
Please login to add a commentAdd a comment