తీవ్ర వివాదాస్పదమవుతున్న ఎమ్మెల్యే అఖిలప్రియ తీరు
రోజూ ఏదో ఒక విషయాన్ని పట్టుకుని లొల్లి
విజయ డెయిరీలోనూ రాజకీయం చేసేందుకు విఫలయత్నం
తాజాగా ఏవీ సుబ్బారెడ్డితోనూ జగడం
సాక్షి, నంద్యాల: ఎమ్మెల్యే అఖిలప్రియ సొంత పార్టీ నేతలనే ఇబ్బందులకు గురిచేస్తూ నిత్యం వార్తల్లోకి ఎక్కుతున్నారు. ప్రతీ విషయంలోనూ తలదూర్చి వివాదాస్పద నిర్ణయాలు తీసుకుంటూ తలనొప్పిగా మారుతున్నారు. రెడ్ బుక్‌లో వంద మంది పేర్లున్నాయని, ఎవరినీ విడిచిపెట్టేది లేదంటూ ప్రతిపక్ష పార్టీ నాయకులను బహిరంగంగా బెదిరించిన ఆమె.. నియోజకవర్గంలో ఏ పనులు చేయాలన్నా తన వద్దకు రావాలని సొంత పార్టీ వారికి కూడా డైరెక్ట్‌గా చెప్పేస్తున్నారు. సొంతంగా పనులు చేసుకునే వారిపైకి అధికారులను ఉసిగొల్పుతున్నారనే విమర్శలూ వినిపిస్తున్నాయి.
మద్యం షాపులన్నింటిలో వాటా..
ఆళ్లగడ్డ నియోజకవర్గంలో 18 మద్యం షాపులకు ప్రభుత్వం నోటిఫికేషన్ ఇచ్చింది. ఇందులో మెజార్టీ షాపులు ఎమ్మెల్యే అనుచరులకే దక్కాయి. ఇరిగెల వర్గానికి 5, ఏవీ సుబ్బారెడ్డి వర్గానికి 1 తప్ప.. మిగిలినవి తటస్థులు దక్కించుకున్నారు. అయితే ప్రతీ షాపు నుంచి సేల్స్‌ను బట్టి నెలకు రూ.50 వేల నుంచి రూ.1 లక్ష వరకు మామూళ్లు ఇవ్వాలని హుకుం జారీ చేశారు. ఏ పార్టీ వారైనా మామూళ్లు ఇచ్చిన తర్వాతే వ్యాపారం చేసుకోవాలని, లేదంటే బెల్ట్ షాపులు ఏర్పాటు చేసుకునేందుకు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుందని హెచ్చరిస్తున్నట్లు దుకాణాదారులు వాపోతున్నారు. ఎన్నికల ముందు జనసేనలో చేరి అఖిల విజయానికి చేయూతనిచ్చిన ఇరిగెల కుటుంబాన్ని కూడా దగ్గరకు రానివ్వడం లేదు. మద్యం లైసెన్స్ దక్కించుకున్న ఇరిగెల వర్గీయులకు దుకాణా లు ఏర్పాటు చేసేందుకు ఆటుపోట్లు ఎదుర్కోవాల్సి వస్తోంది. మరోవైపు ఏవీ సుబ్బారెడ్డితో నిత్యం కయ్యానికి కాలు దువ్వుతున్నారు. నారా లోకేష్ చేపట్టిన యువగళం పాదయాత్ర నుంచి మొదలైన దాడులు ఇప్పటికీ కొనసాగుతున్నాయి. ఏవీ సుబ్బారెడ్డి ఆళ్లగడ్డకు వచ్చిన ప్రతీసారి ఉద్రిక్త పరిస్థితులు తలెత్తేలా అఖిల వ్యవహారశైలి ఉన్నట్లు సొంత పార్టీ నేతలే చెబుతున్నారు. ఆళ్లగడ్డలో ఎవరు అడుగుపెట్టాలో.. ఎవరు అడుగు పెట్టొద్దో నిర్ణయించడానికి అఖిలకు ఉన్న అధికారం ఏంటని ఏవీ వర్గీయులు ప్రశ్నిస్తున్నారు.
ఇసుక మాయం వెనుక..
జగనన్న ఇళ్ల నిర్మాణాల కోసం గత వైఎస్సార్ సీపీ ప్రభుత్వం పట్టణంలోని మార్కెట్ యార్డ్‌లో స్టాక్ పాయింట్ పెట్టి అక్కడి నుంచి లబ్ధిదారులకు అందజేసేది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే స్థానిక ప్రజాప్రతినిధి కన్ను ఇసుకపై పడింది. కొద్దికొద్దిగా ఇసుకను బయటకు తరలించి సొమ్ముచేసుకున్నారు. అధికారులకు అనుమానం వచ్చి పరిశీలిస్తే సుమారు 600 టన్నులకు పైగా ఇసుకను తరలించారు. దీని విలువ సుమారు రూ.9 లక్షలు. ఇప్పటివరకు ఇసుకను రికవరీ చేయడమో.. లేక నిందితుల నుంచి డబ్బు వసూలు చేయడమో జరగాలి. కానీ హౌసింగ్ ఏఈని బాధ్యుడిని చేస్తూ సస్పెండ్ చేసి ఉన్నతాధికారులు చేతులు దులుపుకున్నారు.
అధిష్టానానికి ఫిర్యాదులు
అఖిలప్రియ వ్యవహారశైలి, దుందుడుకు చర్యల వల్ల పార్టీకి తీరని నష్టం వాటిళ్లుతున్నట్లు జిల్లా నాయకులు ఆ పార్టీ అధిష్టానం దృష్టికి తీసుకెళ్లినట్లు సమాచారం. నిత్యం ఏదో ఒక అంశాన్ని లేవనెత్తుతూ రచ్చ చేస్తున్న అఖిలపై ఆ పార్టీ హైకమాండ్ కూడా ఆగ్రహంగా ఉన్నట్లు తెలుస్తోంది. ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు ఇప్పటికే అఖిలతో మాట్లాడినట్లు సమాచారం. దూకుడు తగ్గించుకోవాలని, పార్టీలో అందరిని కలుపుకుని వెళ్లాలని సూచించినట్లు సమాచారం. అయితే అధిష్టానం ఆదేశాలను సైతం అఖిలప్రియ పెడచెవిన పెట్టినట్లు టీడీపీలో చర్చ సాగుతోంది.
విజయ డెయిరీలోనూ రాజకీయమే
స్వార్థ రాజకీయాల కోసం విజయ డెయిరీని అఖిలప్రియ వదలడం లేదు. ప్రశాంతంగా ఉన్న నంద్యాలలో కూడా తన వ్యవహారశైలితో అలజడి రేపుతున్నారు. రెండు రోజుల క్రితం మందిమార్బలంతో డెయిరీలోకి ప్రవేశించి చైర్మన్ ఎస్వీ జగన్‌మోహన్‌రెడ్డిని ఫోన్‌లోనే బెదిరించిన ఘటన చర్చనీయాంశంగా మారింది. తన పరిధిలో లేని అంశంపై స్పందించాల్సిన అవసరం ఏమిటని, ఆళ్లగడ్డ నుంచి వచ్చి నంద్యాలలో రాజకీయాలు చేయడమేంటని టీడీపీ నేతలే ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment