Akhilapriya
-
ఆళ్లగడ్డలో హైటెన్షన్.. ఏవీ సుబ్బారెడ్డి ఇంటి చుట్టూ పోలీసుల మోహరింపు
సాక్షి, నంద్యాల జిల్లా: ఆళ్లగడ్డలో హైటెన్షన్ వాతావరణ నెలకొంది. ఏవీ సుబ్బారెడ్డి ఇంటి చుట్టూ పోలీసులు మోహరించారు. ఏవీ సుబ్బారెడ్డి ఇంటి వెనుక ఉన్న మోహన్ రెడ్డి నివాసంలో ఎమ్మెల్యే అఖిల ప్రియ తిష్ట వేసింది. మోహన్‌రెడ్డి నివాసంలో సాయంత్రం కార్యకర్తల సమావేశానికి రావాలంటూ అఖిల ప్రియ పిలుపు నిచ్చింది. పెద్ద ఎత్తున కార్యకర్తలు వస్తే ఏవీ సుబ్బారెడ్డికి ,అఖిల ప్రియ మధ్య గొడవ జరిగే అవకాశం ఉందని పోలీసులు ముందుగానే మోహరించారు. సంఘటన స్థలంలో పరిస్థితిని డీఎస్పీ ప్రమోద్ పర్యవేక్షిస్తున్నారు. -
ఆళ్లగడ్డ.. ఇది నా అడ్డా!
సాక్షి, నంద్యాల: ఎమ్మెల్యే అఖిలప్రియ సొంత పార్టీ నేతలనే ఇబ్బందులకు గురిచేస్తూ నిత్యం వార్తల్లోకి ఎక్కుతున్నారు. ప్రతీ విషయంలోనూ తలదూర్చి వివాదాస్పద నిర్ణయాలు తీసుకుంటూ తలనొప్పిగా మారుతున్నారు. రెడ్ బుక్‌లో వంద మంది పేర్లున్నాయని, ఎవరినీ విడిచిపెట్టేది లేదంటూ ప్రతిపక్ష పార్టీ నాయకులను బహిరంగంగా బెదిరించిన ఆమె.. నియోజకవర్గంలో ఏ పనులు చేయాలన్నా తన వద్దకు రావాలని సొంత పార్టీ వారికి కూడా డైరెక్ట్‌గా చెప్పేస్తున్నారు. సొంతంగా పనులు చేసుకునే వారిపైకి అధికారులను ఉసిగొల్పుతున్నారనే విమర్శలూ వినిపిస్తున్నాయి.మద్యం షాపులన్నింటిలో వాటా..ఆళ్లగడ్డ నియోజకవర్గంలో 18 మద్యం షాపులకు ప్రభుత్వం నోటిఫికేషన్ ఇచ్చింది. ఇందులో మెజార్టీ షాపులు ఎమ్మెల్యే అనుచరులకే దక్కాయి. ఇరిగెల వర్గానికి 5, ఏవీ సుబ్బారెడ్డి వర్గానికి 1 తప్ప.. మిగిలినవి తటస్థులు దక్కించుకున్నారు. అయితే ప్రతీ షాపు నుంచి సేల్స్‌ను బట్టి నెలకు రూ.50 వేల నుంచి రూ.1 లక్ష వరకు మామూళ్లు ఇవ్వాలని హుకుం జారీ చేశారు. ఏ పార్టీ వారైనా మామూళ్లు ఇచ్చిన తర్వాతే వ్యాపారం చేసుకోవాలని, లేదంటే బెల్ట్ షాపులు ఏర్పాటు చేసుకునేందుకు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుందని హెచ్చరిస్తున్నట్లు దుకాణాదారులు వాపోతున్నారు. ఎన్నికల ముందు జనసేనలో చేరి అఖిల విజయానికి చేయూతనిచ్చిన ఇరిగెల కుటుంబాన్ని కూడా దగ్గరకు రానివ్వడం లేదు. మద్యం లైసెన్స్ దక్కించుకున్న ఇరిగెల వర్గీయులకు దుకాణా లు ఏర్పాటు చేసేందుకు ఆటుపోట్లు ఎదుర్కోవాల్సి వస్తోంది. మరోవైపు ఏవీ సుబ్బారెడ్డితో నిత్యం కయ్యానికి కాలు దువ్వుతున్నారు. నారా లోకేష్ చేపట్టిన యువగళం పాదయాత్ర నుంచి మొదలైన దాడులు ఇప్పటికీ కొనసాగుతున్నాయి. ఏవీ సుబ్బారెడ్డి ఆళ్లగడ్డకు వచ్చిన ప్రతీసారి ఉద్రిక్త పరిస్థితులు తలెత్తేలా అఖిల వ్యవహారశైలి ఉన్నట్లు సొంత పార్టీ నేతలే చెబుతున్నారు. ఆళ్లగడ్డలో ఎవరు అడుగుపెట్టాలో.. ఎవరు అడుగు పెట్టొద్దో నిర్ణయించడానికి అఖిలకు ఉన్న అధికారం ఏంటని ఏవీ వర్గీయులు ప్రశ్నిస్తున్నారు.ఇసుక మాయం వెనుక..జగనన్న ఇళ్ల నిర్మాణాల కోసం గత వైఎస్సార్ సీపీ ప్రభుత్వం పట్టణంలోని మార్కెట్ యార్డ్‌లో స్టాక్ పాయింట్ పెట్టి అక్కడి నుంచి లబ్ధిదారులకు అందజేసేది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే స్థానిక ప్రజాప్రతినిధి కన్ను ఇసుకపై పడింది. కొద్దికొద్దిగా ఇసుకను బయటకు తరలించి సొమ్ముచేసుకున్నారు. అధికారులకు అనుమానం వచ్చి పరిశీలిస్తే సుమారు 600 టన్నులకు పైగా ఇసుకను తరలించారు. దీని విలువ సుమారు రూ.9 లక్షలు. ఇప్పటివరకు ఇసుకను రికవరీ చేయడమో.. లేక నిందితుల నుంచి డబ్బు వసూలు చేయడమో జరగాలి. కానీ హౌసింగ్ ఏఈని బాధ్యుడిని చేస్తూ సస్పెండ్ చేసి ఉన్నతాధికారులు చేతులు దులుపుకున్నారు.అధిష్టానానికి ఫిర్యాదులుఅఖిలప్రియ వ్యవహారశైలి, దుందుడుకు చర్యల వల్ల పార్టీకి తీరని నష్టం వాటిళ్లుతున్నట్లు జిల్లా నాయకులు ఆ పార్టీ అధిష్టానం దృష్టికి తీసుకెళ్లినట్లు సమాచారం. నిత్యం ఏదో ఒక అంశాన్ని లేవనెత్తుతూ రచ్చ చేస్తున్న అఖిలపై ఆ పార్టీ హైకమాండ్ కూడా ఆగ్రహంగా ఉన్నట్లు తెలుస్తోంది. ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు ఇప్పటికే అఖిలతో మాట్లాడినట్లు సమాచారం. దూకుడు తగ్గించుకోవాలని, పార్టీలో అందరిని కలుపుకుని వెళ్లాలని సూచించినట్లు సమాచారం. అయితే అధిష్టానం ఆదేశాలను సైతం అఖిలప్రియ పెడచెవిన పెట్టినట్లు టీడీపీలో చర్చ సాగుతోంది.విజయ డెయిరీలోనూ రాజకీయమేస్వార్థ రాజకీయాల కోసం విజయ డెయిరీని అఖిలప్రియ వదలడం లేదు. ప్రశాంతంగా ఉన్న నంద్యాలలో కూడా తన వ్యవహారశైలితో అలజడి రేపుతున్నారు. రెండు రోజుల క్రితం మందిమార్బలంతో డెయిరీలోకి ప్రవేశించి చైర్మన్ ఎస్వీ జగన్మోహన్రెడ్డిని ఫోన్లోనే బెదిరించిన ఘటన చర్చనీయాంశంగా మారింది. తన పరిధిలో లేని అంశంపై స్పందించాల్సిన అవసరం ఏమిటని, ఆళ్లగడ్డ నుంచి వచ్చి నంద్యాలలో రాజకీయాలు చేయడమేంటని టీడీపీ నేతలే ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. -
బాబు.. అఖిలప్రియని పరామర్శించరా?: అంబటి
సాక్షి, తాడేపల్లి: ‘పేద కార్మికుల డబ్బును కొట్టేసిన అవినీతి కేసులో అరెస్టయిన అచ్చెన్నాయుడిని చంద్రబాబు, లోకేష్ పరామర్శించారు. కిడ్నాప్ కేసులో అరెస్టయిన మాజీ మంత్రి అఖిలప్రియను పరామర్శించరా బాబు’ అంటూ వైఎస్సార్ సీపీ ఎమ్మెల్యే, అధికార ప్రతినిధి అంబటి రాంబాబు ఎద్దేవా చేశారు. ఈ మేరకు ఆయన మాట్లాడుతూ.. ‘పేద కార్మికులకు సంబంధించిన నిధులను కాజేసి భారీ ఎత్తున అవినీతికి పాల్పడ్డ మాజీ మంత్రి, టీడీపీ ఏపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడును, చంద్రబాబు నాయుడు, ఆయన కుమారుడు లోకేష్ పరామర్శించారు. ఈ కేసును రాజకీయ ప్రతీకార కేసుగా వక్రీకరించి ప్రచారం చేశారు. ఇప్పుడు ఏకంగా తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌కు బంధువులుగా పేర్కొంటున్నవారిని కిడ్నాప్ చేసి అరెస్టయిన మరో మాజీ మంత్రి అఖిల ప్రియను పరామర్శించరా? చంద్రబాబుగారి కేబినెట్లో మంత్రి అయిన అఖిలప్రియ కిడ్నాప్ కేసులో ఏ–1 ముద్దాయిగా అరెస్టయితే చంద్రబాబు, లోకేష్‌లు ఎందుకు నోరుమెదపడంలేదు. అచ్చెన్నాయుడు అరెస్టు సమయంలో ఒకలా, అఖిలప్రియ అరెస్టు విషయంలో మరోలా ఎందుకు వ్యవహరిస్తున్నారు. అఖిలప్రియ అరెస్టుపై తేలుకుట్టిన దొంగల్లా తండ్రీ, కొడుకులిద్దరూ ఎందుకు వ్యవహరిస్తున్నారు’ అంటూ అంబటి ప్రశ్నించారు. (చదవండి: చంద్రబాబు మతం మనిషి ఎప్పుడయ్యాడు?) ‘అచ్చెన్నాయుడు అవినీతి కేసులో అడ్డంగా దొరికిపోయినా, దాన్ని రాజకీయ వేధింపులు కేసుగా చిత్రీకరించి రాజకీయ పబ్బం గడుపుకోవాలని చంద్రబాబు ఆరాటపడ్డారు. దీనికోసం ఎన్నిడ్రామాలు చేయాలో, అన్ని డ్రామాలు చేశారు. అఖిలప్రియ అరెస్టు విషయంలో మరెందుకు మౌనంగా ఉన్నారో...? దీన్ని ఎలా అర్థం చేసుకోవాలి. అఖిలప్రియ అరెస్టు వ్యవహారంపై చంద్రబాబుగారి ట్వీట్లు, ఘీంకారాలు, లోకేష్ కూతలు.. ఏమీ కనిపించకపోవడం ఆశ్చర్యం కలిగిస్తోంది. అదే కిడ్నాప్ కేసు ఏపీలో జరిగి ఉంటే ఇదే చంద్రబాబుగారు, లోకేష్, వారి అనుకూల మీడియా ఎలా రచ్చ చేసేవారో మనం ఊహించుకోవచ్చు. తండ్రిలేని పిల్లను వేధిస్తున్నారని, పార్టీ మారినందుకు కక్షకట్టారని.. ఇలా నాటకాలను ఆడుతూ ప్రచారాన్ని రక్తికట్టించేవారు. టీడీపీ నాయకుల నైజానికి, వారి అధినేత చంద్రబాబు డొంకతిరుగుడు వ్యవహారానికి, టీడీపీ మాజీ మంత్రి అఖిలప్రియ అరెస్టు వ్యవహారం ఒక పక్కా ఉదాహరణ’ అంటూ అంబటి మండిపడ్డారు. -
అవన్నీ అవాస్తవాలు: భూమా జగత్‌విఖ్యాత్ రెడ్డి
సాక్షి, ఆళ్లగడ్డ: భూ వివాదానికి సంబంధించి టీడీపీ నేత భూమా అఖిలప్రియకు వ్యతిరేకంగా ఆమె సోదరుడు జగత్‌విఖ్యాత్‌రెడ్డి న్యాయస్థానాన్ని ఆశ్రయించాడు. ఇద్దరు అక్కల నుంచి తనకు న్యాయం చేయాలంటూ ఈనెల 14న రంగారెడ్డి జిల్లా అదనపు కోర్డులో కేసు దాఖలు చేసి ప్రతివాదులకు నోటీసులు పంపించారు. భూమా శోభా నాగిరెడ్డి పేరుతో రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్ మండలం మంచిరేవులలో ఉన్న వెయ్యి గజాల స్థలాన్ని ఆమె మృతి అనంతరం 2016లో దాదాపు రూ.2 కోట్లకు విక్రయించినట్లు సమాచారం. అప్పట్లో భూమా నాగిరెడ్డితోపాటు ఆయన ఇద్దరు కుమార్తెలు ఆఖిలప్రియ, మౌనికారెడ్డి దీనిపై సంతకాలు చేయగా తనయుడు జగత్‌విఖ్యాత్‌రెడ్డి వేలిముద్ర వేశాడు. ప్రస్తుతం ఆ స్థలం విలువ రెట్టింపు అయింది. అయితే స్థలం అమ్మే సమయానికి తాను మైనర్‌నని, తనకు ఏమీ తెలియని వయసులో తండ్రితో పాటు సోదరిలిద్దరూ కలిసి విక్రయించారని, ఇప్పుడు తన వాటాగా మూడో భాగం కావాలని కోరుతూ జగత్‌విఖ్యాత్‌రెడ్డి న్యాయస్థానాన్ని ఆశ్రయించాడు. అక్కలతో పాటు భూమిని కొనుగోలు చేసిన హైదరాబాద్‌కు చెందిన సుధాకర్‌రెడ్డి, వెంకటహరిత చీమల, సుబ్బరాయ ప్రఫుల్ల చందు రేటూరి, సయ్యద్ ఎతేష్యామ్ హుస్సేన్, పశ్చిమ గోదావరికి చెందిన ప్రవీణ రంగోలను ప్రతివాదులుగా పేర్కొన్నాడు. కాగా జగత్‌విఖ్యాత్‌రెడ్డి తరపున అఖిలప్రియ మరిది (భార్గవరామ్ తమ్ముడు) శ్రీసాయి చంద్రహాస్ కేసు వేశారు. అందరూ ఒకే ఇంట్లో ఉంటూ కోర్టును ఆశ్రయించడం పట్ల కొనుగోలుదారులు అఖిలప్రియపై అనుమానాలు వ్యక్తం చేస్తున్నట్లు సమాచారం. అయితే తన సోదరుడు తమపై కేసు వేయలేదని అఖిలప్రియ అన్నారు. భూ విక్రయంపై కొనుగోలుదారులు కోర్టుకు వెళ్లారని, అందులో భాగంగా తమకు తాఖీదులు వచ్చాయన్నారు. మరోవైపు జగత్‌విఖ్యాత్‌రెడ్డి తమ కుటుంబంలో ఎలాంటి విభేదాలు లేవంటూ ఓ వీడియో విడుదల చేశారు. సామాజిక మాధ్యమాల్లో వస్తున్న వార్తలు అవాస్తవమని, ప్రస్తుతం సోదరి అఖిలప్రియతో కలిసి దుబాయ్‌లో ఉన్నట్లు చెప్పారు. -
నేను పార్టీ మారడం లేదు : అఖిలప్రియ
సాక్షి, అమరావతి : తాను పార్టీ మారబోతున్నట్లు వస్తున్న వార్తలను ఆంధ్రప్రదేశ్ మంత్రి అఖిలప్రియ ఖండించారు. తానే పార్టీలోకి వెళ్లబోవడం లేదని తేల్చిచెప్పారు. తెలుగుదేశం పార్టీ నుంచి 2019 ఎన్నికల్లో పోటీ చేస్తానని చెప్పారు. ఆళ్లగడ్డ సీటును ముఖ్యమంత్రి చంద్రబాబు చేతిలో పెడతానని.. ఆపై మిగతా విషయాలు సీఎం ఇష్టమని వ్యాఖ్యానించారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీని ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలను వెనక్కుతీసుకోబోనని అన్నారు. మోదీపై చేసిన వ్యాఖ్యలకు కట్టుబడి ఉంటానని చెప్పారు. దేశంలో మహిళలకు, మైనర్ బాలికలు రక్షణ లేదని అఖిలప్రియ పునురుద్ఘాటించారు. అందుకే ఒక మహిళగా, మంత్రిగా ప్రధానిని ఉద్దేశించి వ్యాఖ్యలు చేసినట్లు వెల్లడించారు. ప్రధానిని వ్యక్తిగతం విమర్శించే స్థాయి తనకు లేదని అన్నారు. 13 సంవత్సరాలు దాటిన బాలికలపై రేప్ జరిగితే బీజేపీ ప్రభుత్వం పట్టించుకోదా? అని ప్రశ్నించారు. -
మంత్రి అఖిలప్రియ దిష్టి బొమ్మ దగ్ధం
సాక్షి, తూర్పు గోదావరి : ప్రధానమంత్రి నరేంద్ర మోదీపై ఏపీ మంత్రి భూమా అఖిలప్రియ చేసిన వ్యాఖ్యలను రాష్ట్ర బీజేపీ నాయకులు తీవ్రంగా ఖండించారు. బుధవారం రాష్ట్ర బీజేపీ నేతలు మంత్రి అఖిలప్రియకు వ్యతిరేకంగా నిరసనలు తెలిపారు. ఈ నిరసనలో భాగంగా రాష్ట్ర మహిళామోర్చ అధ్యక్షురాలు శరణాల మాలతీరాణి మాట్లాడుతూ... ప్రధాని మోదీపై అనుచిత వ్యాఖ్యలు చేసిన మంత్రి అఖిలప్రియను మంత్రి పదవి నుంచి తొలగించాలని డిమాండ్ చేశారు. మానభంగాలకు ఉసిగొల్పుతున్నారంటూ ప్రధాని మోదీపై ఆమె వ్యాఖ్యలు చేయడం సంస్కారహీనంగా ఉన్నాయని అన్నారు. నిరసనలో భాగంగా ఆమె బీజేపీ నేతలతో కలసి తాడేపల్లిగూడెం ఆర్టీసీ బస్టాండ్ ఎదురుగా అఖిలప్రియ దిష్టిబొమ్మను దగ్ధం చేసి మండల తహసీల్దారుకు వినతిపత్రాన్ని అందజేశారు. -
సైకిల్ భారమై.. ప్రజా మద్దతు కరువై
కర్నూలు(కొండారెడ్డి ఫోర్టు) : ప్రత్యేక హోదా సాధన కోసమంటూ టీడీపీ నేతలు జిల్లాలో శనివారం చేపట్టిన సైకిల్ యాత్రలు మొక్కుబడిగా కొనసాగాయి. ప్రజలు నుంచి స్పందన కరువై హోదా నినాదం ఎక్కడా వినిపించ లేదు. కొన్ని నియోజకవర్గాల్లో కనీసం కార్యకర్తలు కూడా వెంట లేక పోవడంతో నేతలు తూతూమంత్రంగా చేపట్టారు. కొన్ని చోట్ల నేతలు సైకిల్ తొక్కలేక ఇబ్బంది పడ్డారు. మరి కొన్ని చోట్ల సైకిల్ కష్టమంటూ బైక్ ర్యాలీలు నిర్వహించారు. కర్నూలులో టీడీపీ జిల్లా అధ్యక్షుడు సోమిశెట్టి వెంకటేశ్వర్లు, ఎమ్మెల్యే ఎస్వీ మోహన్‌రెడ్డి బైక్ ర్యాలీ నిర్వహించారు. వారి వెంట కార్యకర్తలు, ప్రజలు కనిపించలేదు. నందికొట్కూరు ఇన్చార్జి మాండ్ర శివానందరెడ్డి ఆధ్వర్యంలో సైకిల్ యాత్ర జూపాడుబంగ్లా నుంచి పాములపాడు వరకు కొనసాగింది. నంద్యాలలో ఎమ్మెల్యే భూమా బ్రహ్మానందారెడ్డి ఆధ్వర్యంలో కొత్తపల్లి నుంచి నంద్యాల వరకు, మంత్రి భూమా అఖిలప్రియ చాగలమర్రిలో సైకిల్ ర్యాలీ చేపట్టారు. బనగానపల్లె ఎమ్మెల్యే బీసీ జనార్దన్‌రెడ్డి ఆధ్వర్యంలో బనగానపల్లె నుంచి పసుపల వరకు బైక్ ర్యాలీ చేశారు. డోన్‌లో కేఈ ప్రతాప్ ఆధ్వర్యంలో అవులదొడ్డి నుంచి కామగానిగుండ్ల వరకు నాయకులు సైకిల్ తొక్కారు. కోడుమూరు ఎమ్మెల్యే మణిగాంధీ ఆధ్వర్యంలో సి. బెళగల్లో సైకిల్ ర్యాలీ నిర్వహించారు. సైకిల్ తొక్కేందుకు ఇతరుల సాయం తీసుకోవాల్సి వచ్చింది. ఆత్మకూరు ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖరరెడ్డి వెలుగోడులో సైకిల్ ర్యాలీలో పాల్గొన్నారు.ఎమ్మిగనూరులో ఎమ్మెల్యే జయనాగేశ్వరరెడ్డి ఆధ్వర్యంలో పట్టణంలో సైకిల్ ర్యాలీ చేపట్టారు. కేఈ శ్యామ్‌బాబు ఆధ్వర్యంలో పులికొండ నుంచి పత్తికొండకు వరకు యాత్ర కొనసాగింది. పాణ్యంలో ఇన్చార్జి ఏరాసు ప్రతాప్‌రెడ్డి ఆధ్వర్యంలో సైకిల్ ర్యాలీ నిర్వహించారు. -
మంత్రి అఖిలప్రియ వర్గీయుల దాడి
సాక్షి ప్రతినిధి, కర్నూలు : అధికార పార్టీ నేతల మధ్య విభేదాలు దీక్షల సాక్షిగా మరోసారి బయటపడ్డాయి. ఎవరికి వారే.. యమునా తీరే అన్న చందంగా దీక్షా శిబిరాలను ఏర్పాటు చేసుకున్నారు. కర్నూలు, కోడుమూరు, మంత్రాలయం, ఆళ్లగడ్డ నియోజకవర్గాల్లో ఎవరికి వారుగా దీక్షలు చేపట్టారు. ‘ధర్మపోరాట దీక్ష’ పేరుతో ముఖ్యమంత్రి చంద్రబాబు చేపట్టిన కార్యక్రమానికి మద్దతుగా జిల్లాలోని అన్ని నియోజకవర్గాల్లో అధికార పార్టీ నేతలు దీక్షలు చేపట్టారు. అయితే, ఎవరికి వారుగా బలప్రదర్శన తరహాలో వీటిని చేపట్టడం గమనార్హం. ఆళ్లగడ్డలో ఏకంగా దీక్షకు తరలి వచ్చిన ఏవీ సుబ్బారెడ్డి అనుచరులపై మంత్రి వర్గీయులు దాడికి దిగారు. పరిస్థితి కొట్టుకునే స్థాయి వరకూ వెళ్లింది. నంద్యాల నుంచి ఏవీ సుబ్బారెడ్డి ఆధ్వర్యంలో భారీ బైకు ర్యాలీగా చేరుకుని.. ఆళ్లగడ్డలోని దీక్షా శిబిరానికి మద్దతు ఇచ్చేందుకు వెళ్లారు. ఈ సందర్భంగా మంత్రి అఖిలప్రియ అనుచరులు వారిపై దాడికి దిగినట్టు తెలుస్తోంది. మంత్రాలయంలో నియోజకవర్గ ఇన్చార్జ్ తిక్కారెడ్డి, పార్టీ నేత మాధవరం రామకృష్ణారెడ్డి వర్గాలు పక్కపక్కనే వేర్వేరుగా దీక్షా శిబిరాలను ఏర్పాటు చేశాయి. రామకృష్ణారెడ్డి ఆధ్వర్యంలో ర్యాలీ చేసేందుకు ప్రయత్నించగా.. పోలీసులు అనుమతించలేదు. కోడుమూరు నియోజకవర్గంలోని కోడుమూరు, గూడూరు, సి. బెళగల్లో అటు ఎమ్మెల్యే మణిగాంధీ వర్గం, ఇటు ఇన్చార్జ్ విష్ణువర్దన్‌రెడ్డి వర్గాలు వేర్వేరుగా దీక్షా శిబిరాలను ఏర్పాటు చేసి బలప్రదర్శనకు దిగాయి. దీంతో ఒక విధమైన ఉద్రిక్త వాతావరణం చోటుచేసుకుంది. కర్నూలులో ఏకంగా మూడు ప్రాంతాల్లో దీక్షలు చేపట్టారు. జెడ్పీ ఆవరణలో చైర్మన్ దీక్ష చేయగా, రాజ్‌విహార్ సర్కిల్లో ఎమ్మెల్యే ఎస్వీ మోహన్ రెడ్డి, కేడీసీసీబీ వద్ద సంస్థ చైర్మన్ మల్లికార్జున రెడ్డి దీక్షలు చేపట్టారు. జెడ్పీ చైర్మన్ దీక్ష సందర్భంగా ఉద్యోగులందరూ వచ్చి మద్దతు ఇచ్చేలా ఆదేశాలు జారీ చేశారు. ఎమ్మెల్యే ఎస్వీ దీక్షకు మహిళలను బలవంతంగా మెప్మా అధికారుల సాయంతో తరలించారు. మంత్రి అఖిలప్రియ చేపట్టిన దీక్షకూ ఇదే పరిస్థితి. మొత్తమ్మీద జిల్లావ్యాప్తంగా అధికార పార్టీ ఆధ్వర్యంలో చేపట్టిన దీక్షల్లో ఒకవైపు ఆధిపత్య పోరు, మరోవైపు అధికార దుర్వినియోగం స్పష్టంగా కన్పించింది. టీడీపీ ఆధ్వర్యంలో దీక్షలు కర్నూలు : ప్రత్యేక హోదా కోసం టీడీపీ ఆధ్వర్యంలో శుక్రవారం జిల్లాలో దీక్షలు చేపట్టారు. జెడ్పీ చైర్మన్ మల్లెల రాజశేఖర్ జెడ్పీ ప్రాంగణంలో చేపట్టిన దీక్షకు ఎంపీలు టీజీ వెంకటేష్, బుట్టారేణుక, జెడ్పీ వైస్ చైర్మన్ పుష్పావతి, మాజీ ఎమ్మెల్సీ సుధాకర్‌బాబు తదితరులు సంఘీభావం తెలిపారు. నగరంలోని నంద్యాల చెక్‌పోస్టు సమీపంలో పాణ్యం నియోజకవర్గ ఇన్చార్జ్ ఏరాసు ప్రతాప్‌రెడ్డి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన దీక్షా శిబిరాన్ని టీజీ సందర్శించారు. కర్నూలు ఎమ్మెల్యే ఎస్వీ మోహన్‌రెడ్డి ఆధ్వర్యంలో పాత ఆర్టీసీ డిపోలో దీక్ష చేపట్టారు. ఎమ్మిగనూరులో ఎమ్మెల్యే జయనాగేశ్వర్‌రెడ్డి, డోన్‌లో నియోజకవర్గ ఇన్చార్జ్ కేఈ ప్రతాప్, మంత్రాలయంలో ఇన్చార్జ్ తిక్కారెడ్డి, ఆదోనిలో మాజీ ఎమ్మెల్యే మీనాక్షి నాయుడు, ఆలూరులో ఇన్చార్జ్ వీరభద్ర గౌడ్, బనగానపల్లెలో ఎమ్మెల్యే బీసీ జనార్దన్‌రెడ్డి, నందికొట్కూరులో ఇన్చార్జ్ శివానందరెడ్డి, ఆత్మకూరులో ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర్‌రెడ్డి, నంద్యాలలో ఎమ్మెల్యే భూమా బ్రహ్మానందరెడ్డి ఆధ్వర్యంలో దీక్షలు చేపట్టారు. కర్నూలు కేంద్ర సహకార బ్యాంకు దగ్గర చైర్మన్ మల్లికార్జునరెడ్డి, డోన్‌లో కేఈ ప్రతాప్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన దీక్షా శిబిరాలను ఉపముఖ్యమంత్రి కేఈ కృష్ణమూర్తి సందర్శించి సంఘీభావం తెలిపారు. -
ఎవరికి వారే..యమునా తీరే
► ఆశీర్వాద యాత్రలో కానరాని ‘అనుబంధం’ ► మంత్రి అఖిల, ఏవీ సుబ్బారెడ్డి మధ్య కుదరని సయోధ్య ►మంత్రి ఫొటో, పేరు లేకుండానే ఏవీ వార్డుల పర్యటన ►కార్యకర్తల్లో ఆందోళన కర్నూలు: ఆశీర్వాద యాత్ర పేరుతో అధికార పార్టీ చేపట్టిన కార్యక్రమంలో నేతలు ఎవరికి వారే యమునా తీరే అన్న చందంగా వ్యవహరిస్తున్నారు. మంత్రి అఖిలప్రియ, భూమా సన్నిహితుడు ఏవీ సుబ్బారెడ్డి మధ్య అగాధం మరింత పెరిగిందన్న చర్చ అధికార పార్టీలో సాగుతోంది. ఇందుకు కారణం.. ఆశీర్వాద యాత్ర పేరుతో ఏవీ సుబ్బారెడ్డి చేపట్టిన వార్డుల పర్యటన కోసం ప్రచురించిన కరపత్రాల్లో ఎక్కడా భూమా అఖిలప్రియ పేరుకానీ, ఫొటో కానీ ప్రచురించకపోవడమే. ఈ విషయం కాస్తా ఇప్పుడు నంద్యాలలో హాట్‌టాపిక్‌గా మారింది. ఇదే తరుణంలో అధికార పార్టీ నేతలు, కార్యకర్తల్లో గందరగోళం కూడా నెలకొంది. ఎవరి వెనక వెళితే ఎవరికి కోపం వస్తుందేమోనన్న ఆందోళనకు వారు గురవుతున్నారు. ఒకానొక దశలో స్వయంగా ముఖ్యమంత్రి చంద్రబాబు పిలిపించి.. ఏవీతో కలిసి పనిచేయాలని మంత్రి అఖిలప్రియకు సూచించారు. అయినా అదే పరిస్థితి కొనసాగుతోంది. తానేమీ తక్కువ తినలేదన్నట్టుగా ఏవీ సుబ్బారెడ్డి కూడా తన దారి తనదే అన్నట్లు వ్యవహరిస్తున్నారు. ఈ క్రమంలోనే మంత్రి అఖిలప్రియ పేరు ఎత్తకుండానే వార్డుల పర్యటనకు దిగినట్టు తెలుస్తోంది. ఆది నుంచీ అంతే! వాస్తవానికి భూమా మరణం తర్వాత మంత్రికి, ఏవీ సుబ్బారెడ్డికి మధ్య అంతరం పెరిగిపోయింది. ఒకరికి ఒకరు మాటలు లేకుండా రోజుల తరబడి ఉన్నారు. నంద్యాల ఉప ఎన్నిక నేపథ్యంలో ఏవీ సుబ్బారెడ్డిని కలుపుకొని వెళ్లాలని సీఎం ఆదేశించారు. అయినప్పటికీ మంత్రి పొడిపొడిగానే మాట్లాడి చేతులు దులిపేసుకున్నట్టు తెలుస్తోంది. కొన్ని రోజుల క్రితం నంద్యాలలో నేతలు, కార్యకర్తలతో జరిగిన సమావేశానికి జిల్లా అధ్యక్షుడు సోమిశెట్టి, మాజీ మంత్రి కేఈ ప్రభాకర్ నాయకత్వం వహించినప్పటికీ ఆమె హాజరుకాలేదు. ఈ విషయం సీఎం దృష్టికి తీసుకెళ్లినా అదే తీరే కొనసాగుతోంది. మొత్తమ్మీద ఇక సయోధ్య కుదరదని భావించి ఎవరి యాత్రలకు వారు శ్రీకారం చుట్టారు. దీంతో ఎవరి వెనకాల నడవాలనే విషయంలో అధికార పార్టీ నేతలు, కార్యకర్తల్లో గందరగోళం నెలకొంది. ఆర్థిక వ్యవహారాలే కారణమా? భూమాకు, ఏవీకి మధ్య సన్నిహిత సంబంధాలు అందరికీ తెలిసిందే. ఒకరికి తెలియకుండా మరొకరు ఎటువంటి వ్యవహారాలూ నడిపే అవకాశం లేనంతగా వారి మధ్య సంబంధబాంధవ్యాలు ఉండేవి. అయితే, భూమా మరణం తర్వాత ఆ కుటుంబంతో ఏవీకి సంబంధాలు పూర్తిగా దెబ్బతిన్నాయి. ఆర్థికపరమైన విషయాల్లోనే ఇరువురి మధ్య విభేదాలు నెలకొన్నట్లు తెలుస్తోంది. తమకు సంబంధించిన ఆర్థిక వ్యవహారాలను తెలియజేయనివ్వడం లేదన్న అభిప్రాయంలో ఇరువర్గాలు ఉన్నట్టు తెలుస్తోంది. ఓ కాంట్రాక్టు వ్యవహారంలో కూడా తమకు తెలియకుండా ఆర్థిక వ్యవహారాలు చక్కబెట్టుకుంటున్నారని ఒకరిపై ఒకరు ఫిర్యాదు చేసుకుంటున్నట్టు సమాచారం. ఈ నేపథ్యంలోనే ఇరువురి మధ్య అగాధం భారీగా పెరిగిపోయి.. యాత్రలు కూడా ఎవరికివారుగా చేపట్టారు. -
మంత్రివర్గంలో జిల్లాకు చోటు?
– అఖిలప్రియకు స్థానం...! – మండిపడుతున్న పాత కాపులు సాక్షి ప్రతినిధి, కర్నూలు: మంత్రివర్గ విస్తరణలో కర్నూలు జిల్లాకు స్థానం దక్కనుంది. ఆళ్లగడ్డ నుంచి ఎమ్మెల్యేగా గెలిచిన అఖిలప్రియకు మంత్రివర్గంలో స్థానం కల్పించాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నిర్ణయం తీసుకున్నట్టు ఆ పార్టీలో చర్చ జరుగుతోంది. విజయవాడలో ఆదివారం నిర్వహిస్తున్న ప్రమాణ స్వీకార కార్యక్రమానికి రావాలంటూ కబురు కూడా అందిందని ఆమె అనుచరులు పేర్కొంటున్నారు. అదేవిధంగా తాము కూడా కార్యక్రమానికి వెళ్తున్నట్టు ఆ పార్టీ నేతలు చెబుతున్నారు. అయితే, అధికార పార్టీలోని మరికొందరు మాత్రం అఖిలప్రియకు మంత్రి పదవి ఇవ్వడంపై మండిపడుతున్నారు. పార్టీ మారి వచ్చిన వారికి పదవులు కట్టబెడితే తమ పరిస్థితి ఏమిటని వాపోతున్నారు. ఇది అంతిమంగా పార్టీనే నమ్ముకున్న కార్యకర్తలను, నేతలను అవమానపర్చినట్టేనని వాదిస్తున్నారు. మరోవైపు తెలంగాణలో తలసానికి మంత్రి పదవి ఇచ్చినప్పుడు రచ్చ చేసిన మనమే.. ఇప్పుడు అదే తప్పు చేస్తే ప్రజలు ఏమనుకుంటారోనన్న విషయాన్ని కూడా ఆలోచించాలని కోరుతున్నారు. ఏదేమైనప్పటికీ అఖిలప్రియకు మాత్రం మంత్రి పదవి ఖాయమని ఆమె వర్గీయులు బల్లగుద్ది చెబుతున్నారు. రాజీనామా చేయకుండానే..! వాస్తవానికి భూమా అఖిలప్రియ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నుంచి ఎమ్మెల్యేగా గెలుపొందారు. ఈ నేపథ్యంలో ఆమెకు మంత్రి పదవి ఇవ్వాలంటే మొదట ఆ పదవికి రాజీనామా చేయాల్సి ఉంటుంది. అనంతరం ఆరు నెలల్లోగా తిరిగి ఎన్నిక కావాల్సి ఉంది. అయితే, ఈ సంప్రదాయాలకు భిన్నంగా ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయకుండానే మంత్రి పదవి కట్టబెట్టాలని నిర్ణయం తీసుకోవడం విమర్శల పాలవుతోంది. గతంలో తలసానికి మంత్రి పదవి ఇచ్చినప్పుడు గవర్నర్‌కు ఫిర్యాదు చేయడంతో పాటు ఏకంగా గవర్నర్‌పై కేంద్ర హోంశాఖకు కూడా తెలంగాణ తెలుగుదేశం పార్టీ ఫిర్యాదు చేసింది. ఈ నేపథ్యంలో కేంద్ర హోంశాఖ కూడా గవర్నర్‌కు లేఖ రాసి.. సదరు వ్యవహారంపై నివేదిక పంపాలని కూడా ఆదేశించినట్టు వార్తలు గుప్పుమంటున్నాయి. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్‌లో అదే తప్పు చేసేందుకు తమ అధిష్టానం సిద్ధపడటాన్ని ఇక్కడి నేతలు జీర్ణించుకోలేకపోతున్నారు. పార్టీలోని పలువురు పాత కాపులు ఈ నిర్ణయంపై మండిపడుతున్నారు. తమను కాదని కొత్తగా వచ్చిన వారికి పదవులు కట్టబెట్టడంపై అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ప్రధానంగా జిల్లా అధ్యక్షుడు శిల్పా చక్రపాణిరెడ్డితో పాటు బనగానపల్లె, ఎమ్మిగనూరు ఎమ్మెల్యేలు బీసీ జనార్దన్ రెడ్డి, జయనాగేశ్వరరెడ్డిలు కూడా మంత్రి పదవి ఆశిస్తున్నారు. తమకు అవకాశం ఇస్తారని వీరు ఎదురుచూస్తున్నారు. వీరు కూడా ఎవరికి వారుగా తమ ప్రయత్నాలు కొనసాగిస్తున్నారు. అదే సందర్భంలో పార్టీ మారిన వారికి మంత్రి పదవి ఇస్తే తాము కూడా ఏదో ఒక నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుందని కూడా అధికార పార్టీలోని పలువురు తమ సన్నిహితులతో వ్యాఖ్యానిస్తున్నట్టు సమాచారం. -
కేసులు.. వేధింపులు.. అవమానాలు
-
ఇదేం దిగజారుడు రాజకీయం?
-
ఇదేం దిగజారుడు రాజకీయం?
టీడీపీ తీరుపై వైఎస్ జగన్మోహన్రెడ్డి ఫైర్ ⇒ భూమా సంతాప తీర్మానాన్ని కూడా రాజకీయాలకు వాడుకుంటారా? ⇒ ఆయన మంచి మాత్రమే రికార్డుల్లో ఉండాలని సభకు దూరంగా ఉన్నాం ⇒ భూమాతో చంద్రబాబు తప్పు చేయించారు.. అది మేం చెప్పాల్సి వచ్చేది ⇒ అఖిల ప్రియకు మొట్టమొదట ఫోన్ చేసింది నేను, మా అమ్మే.. ⇒ భూమా మరణించి 24 గంటలు కూడా గడవలేదు..రాజకీయం కోసమే ఆయన కూతుర్ని శాసనసభకు తీసుకొచ్చారు ⇒ బాబు మూడురోజుల్లో మంత్రిని చేస్తానన్నాడని మావాళ్లకు భూమా చెప్పాడు ⇒ నంద్యాల మాదే.. ఉప ఎన్నికలలో కచ్చితంగా పోటీ చేస్తాం సాక్షి, అమరావతి: దివంగత ఎమ్మెల్యే భూమా నాగిరెడ్డి మంచితనమే ఏపీ శాసనసభ రికార్డుల్లో ఉండాలని, ఆయన చివరి దశలో చేసిన తప్పులు రికార్డుల్లోకి వెళ్లడం తమకు ఇష్టం లేదని వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్రెడ్డి చెప్పారు. ఈ కారణంగానే వైఎస్సార్సీపీ శాసనసభా పక్షం మంగళవారం భూమా సంతాప తీర్మానం సందర్భంగా శాసనసభలోకి వెళ్లలేదని స్పష్టం చేశారు. దివంగత నాయకుడి సంతాప తీర్మానాన్ని కూడా రాజకీయం చేసిన ఘనత టీడీపీదేనని ధ్వజమెత్తారు. దిగజారుడు, కుసంస్కార రాజకీయాలు ఆ పార్టీకి కొత్తేమీ కాదని మండిపడ్డారు. మంగళవారం అసెంబ్లీ వాయిదా పడిన తరువాత వైఎస్ జగన్ లాబీల్లోని తన చాంబర్లో మీడియాతో మాట్లాడారు. మనుషుల్లో ఉండాల్సింది తొలుత మానవత్వమని చెప్పారు. అయితే, మంగళవారం అసెంబ్లీలో జరిగింది చూస్తే సంతాప తీర్మానం వెనక్కిపోయి రాజకీయమే ముందుకొచ్చిందనే విషయం స్పష్టమైందన్నారు. తాము సభలోకి వెళ్లి సంతాప తీర్మానంపై మాట్లాడి ఉంటే భూమా నాగిరెడ్డి మంచితోపాటుగా చివరలో ఆయన చేసిన తప్పును కూడా చెప్పాల్సి వచ్చేదన్నారు. భూమా చేసిన తప్పును చెప్పడం ఇష్టంలేకనే హుందాతనం పాటించామని పేర్కొన్నారు. జగన్ ఇంకా ఏం చెప్పారంటే.... మొదట ఫోన్ చేసింది నేను, మా అమ్మే ‘‘భూమా నాగిరెడ్డి చనిపోయాడు. ఆయన చివరిదశలో చేసిన తప్పును ఎందుకు చెప్పడం, అదంతా అసెంబ్లీ రికార్డుల్లోకి పోవడం ఎందుకు అని సభలోకి వెళ్లకుండా మౌనంగానే ఉందామనుకున్నాం. మేము కనుక అసెంబ్లీలోకి వెళ్లి ఉంటే.. చంద్రబాబు చేయిస్తే భూమా ఎలా తప్పు చేశారో మేం చెప్పాల్సి వచ్చేది. అలా చెప్పి ఉంటే ఏమయ్యేది? ఎవరు రాజకీయాలు చేస్తున్నారు? ఎవరు హుందాగా వ్యవహరిస్తున్నారో అర్థం చేసుకోండి. నాగిరెడ్డి చనిపోయాడని తెలిసి మొట్టమొదట ఫోన్ చేసింది నేనూ, మా అమ్మే. మృతి వార్త తెలియగానే చాలా బాధేసింది. ఇద్దరమూ అఖిలప్రియతో మాట్లాడి ధైర్యం చెప్పాం. అదీ వ్యక్తిగతంగా మేం ప్రదర్శించిన మానవత్వం. కానీ, ఇక్కడ కుట్ర రాజకీయాలు జరుగుతున్నాయి. 24 గంటలైనా గడవక ముందే అఖిలను అసెంబ్లీకి ఎందుకు తీసుకొచ్చారు? తండ్రి మరణించి 24 గంటలైనా గడవక ముందే అఖిలప్రియను రాజకీయాల కోసం అసెంబ్లీకి తీసుకొ చ్చారు. ఆమె తన కుటుంబ సభ్యులతో కలిసి ఉండి ఏడ్వడానికీ అవకాశం ఇవ్వలేదు. వీళ్ల(టీడీపీ పెద్దలు) రాజకీయాలను చూసి అందరూ సిగ్గుపడాల్సిన పరిస్థితి ఏర్పడింది. రాజకీయ పార్టీని నడిపేటప్పుడు ఒక అంశాన్ని గుర్తుంచుకోవాలి. మేము సారథ్యం వహిస్తున్న పార్టీని కూడా పరిగణనలోకి తీసుకోవాల్సి ఉంటుంది. అది చాలా ముఖ్యం. మనకు ఒకరిపై ఉన్న వ్యక్తిగత అభిమానం పార్టీ శ్రేణుల నైతికతను దెబ్బతీసే విధంగా ఉండరాదు. భూమా మృతి చెందిన విషయం తెలియగానే మేము ఆయన కుమార్తెకు ఫోన్ చేసి, పరామర్శించాం. ఇదీ తక్షణమే మేము స్పందించిన తీరు. అంతకు మించి ఏం చేసినా పార్టీ శ్రేణులకు తప్పుడు సంకేతాలు వెళతాయి. ఫిరాయించినవారితో మాట్లాడించి లబ్ధి పొందుదామనుకున్నారు.. మేం అక్కడకు (సభలోకి) వెళ్లి ఏం చెప్పినా అది వివాదానికి దారితీసి, పరిస్థితి వేరే రకంగా ఉండేది. మా పార్టీ నుంచి ఎవరైతే టీడీపీలోకి ఫిరాయించారో అలాంటి వారి చేతనే... చాంద్‌బాషా మొదలు డేవిడ్‌రాజు లాంటి వారి చేతనే మాట్లాడించారు. వాళ్లతో మాట్లాడించిన తీరు చూస్తే దీనిలో నుంచి ఏ విధంగా రాజకీయ లబ్ది పొందాలా అనే ఆలోచనలోనే టీడీపీ వారు మునిగిపోయినట్లుగా కనిపిస్తుంది. 24 గంటలైనా గడవక ముందే అఖిలప్రియను తీసుకొచ్చి శాసనసభలో కూర్చోబెట్టి రాజకీయాలు చేస్తా ఉన్నపుడు అలాంటి సభలో మేం ఏం మాట్లాడినా భూమా ప్రతిష్ట దెబ్బతినడమే కాకుండా మొత్తం రాజకీయంగా వివాదాస్పదం అవుతుంది. అసెంబ్లీలో సంతాపతీర్మానంపై ముందు విష్ణుకుమార్‌రాజుతో మాట్లాడించారు. ఆయన మాట్లాడిన మాటలు ఎంత రెచ్చగొట్టే విధంగా ఉన్నాయో అర్ధం అయ్యే ఉంటుంది. మేం కనుక అసెంబ్లీలోకి వెళ్లి ఉంటే చంద్రబాబు తప్పు చేయిస్తే భూమా నాగిరెడ్డి ఎలా తప్పు చేశారో మేం చెప్పాల్సి వచ్చేది. అలా చెప్పి ఉంటే ఏమయ్యేదో అర్ధం చేసుకోండి. చంద్రబాబు మూడు రోజుల్లో మంత్రిపదవి ఇస్తానని చెప్పాడట.. భూమా వైఎస్సార్సీపీని వీడి వెళ్లాలని అనుకుంటున్న రోజు సజ్జల రామకృష్ణారెడ్డి, వైవీ సుబ్బారెడ్డి ఆయనతో మాట్లాడ్డానికి ఆయన ఇంటికి వెళ్లారు. ‘ఎందుకు వెళుతున్నారన్నా.. మీరు పొరబాటు చేస్తున్నారు’ అని నచ్చజెప్పేందుకు ప్రయత్నించారు. ‘నాకు మూడే మూడు రోజుల్లో మంత్రి పదవి ఇస్తానని చంద్రబాబు చెప్పారు. పచ్చకండువా వేసుకోవడమే ఆలస్యం... వెంటనే మంత్రిగా ప్రమాణస్వీకారం చేయిస్తారు. అందుకే టీడీపీలోకి వెళుతున్నా’ అని సజ్జల, వైవీతో భూమా చెప్పారు. ‘జగన్‌ను విడిచిపెట్టి పోవడం ఇష్టం లేదు’ అని భూమా కన్నీళ్లు పెట్టుకున్నారు. ఒక పార్టీలో గెలిచి మరో పార్టీలోకి వెళితే మంత్రి పదవి ఎలా ఇస్తారని రామకృష్ణారెడ్డి ప్రశ్నిస్తే... చంద్రబాబు ఇస్తానన్నాడని నాగిరెడ్డి సమాధానమిచ్చారు. అలాంటి వ్యక్తిని సంవత్సరంపాటు అలాగే ఉంచేశారు. ప్రలోభాలు పెట్టినవాళ్లది ఎంత తప్పో, ఆ ప్రలోభాలకు లొంగిన వాళ్లది కూడా అంతే తప్పు. చంద్రబాబు గతంలో ఎన్టీ రామారావును ఏ రకంగా క్షోభకు గురిచేసి గుండెపోటుతో చనిపోయేటట్లుగా చేశారో ఇప్పుడు భూమా విషయంలో కూడా సరిగ్గా అలాగే జరిగింది. ఇంగితం ఉన్న వారికెవరికైనా.... ఒక పార్టీ నుంచి గెలిచిన వారికి మరో పార్టీలో మంత్రి పదవి ఇవ్వరాదనేది ఇంగితం ఉన్న వారెవరికైనా తెలిసిన అంశం. పదో తరగతి చదివినోడికి కూడా ఈ విషయం తెలుస్తుంది. అందుకే భూమా దగ్గరకి మా వాళ్లు వెళ్లి ఆయనకు జ్ఞానోదయం కలిగించేందుకు ప్రయత్నించారు. కానీ మూడు రోజుల్లో మంత్రి పదవి ఇస్తానని చంద్రబాబు చూపిన ఆశ ముందు మా వాళ్ల హితవు పని చేయలేదు. తెలంగాణలో టీడీపీ వారికి టీఆర్ఎస్ ప్రభుత్వంలో మంత్రి పదవి ఇచ్చినపుడు చంద్రబాబు ఏ విధంగా బయటకు వచ్చి మాట్లాడారో అందరికీ తెలుసు. గవర్నర్‌ను తప్పు దోవ పట్టించారనీ, అందుకే గవర్నర్ తప్పు చేశారని అన్నారు కదా. ఆరోజు గవర్నర్‌ను తప్పుదోవ పట్టించిన పరిస్థితుల్లో ఆయన తప్పు చేశారు. అక్కడ జరిగిన అదే తప్పును గవర్నర్ చేత రెండోసారి, మూడో సారి తప్పు చేయించాలంటే ఎవరూ చేయరు. ఒక పార్టీలో ఉన్న వారికి మంత్రిపదవి ఇవ్వాలంటే ఉన్న పార్టీకి రాజీనామా ఇచ్చి దానిని ఆమోదింప జేసుకున్న తరువాతనే మంత్రివర్గంలోకి తీసుకుంటారు. అలా జరగక పోతే ఇక ప్రజాస్వామ్యమనేదే ఉండదు. ఏ పార్టీ టికెట్ మీద గెలిచిన వాడైనా వచ్చి మంత్రి పదవి తీసుకోవడం ఏ మాత్రం ప్రజాస్వామ్య బద్ధం కాదు. స్పీకర్ మనవాడే... అధికారపక్షానికి చెందిన వాడే కాబట్టి ఏం చేసినా అనర్హత వేటు పడదు అంటే, అసలు ప్రజాస్వామ్యం ఉందనుకోవాలా... బతుకుతుందా? ప్రజాస్వామ్యం బతకాలి అనంటే అందుకు కొన్ని విధానాలు కచ్చితంగా పాటించాల్సి ఉంటుంది. ప్రజాస్వామ్యంలో మెజారిటీ వచ్చిన పార్టీ అధికారంలోకి వస్తుంది. అధికారపక్షం ఎమ్మెల్యేలే మంత్రులుగా ప్రమాణస్వీకారం చేస్తారు. దాన్నే ప్రజాస్వామ్యమంటారు. దేశంలో... ప్రపంచంలో ఎక్కడ చూసినా ఇదే కనిపిస్తుంది. అధికారపక్షంలో మంత్రి పదవి పొందాలంటే ముందుగా తామున్న పదవికి రాజీనామా చేయాలి. మళ్లీ గెలుపొందాలి. ఆ తరువాతనే పదవి పొందాలి. ఎవరి ఇష్టా ఇష్టాల మీదనో ఆధారపడి అన్నీ ఇష్టానుసారం చేస్తాం అంటే కుదరదు. రేపు పొద్దున మేం కూడా అధికారంలోకి వస్తాం. వచ్చాక ఇదే కార్యక్రమం టప టప చేయాలంటే అదేమీ పెద్ద పని కానే కాదు. ఎవరైనా చేస్తారు. అందుకే గవర్నర్ ఫిరాయించిన వాళ్లతో ప్రమాణం చేయించలేరు. గవర్నర్ ఇలాంటివి ప్రోత్సహించరు. (భవిష్యత్తులో మీరు ఇలాంటివి ప్రోత్సహించరా? అని ప్రశ్నించినపుడు) ఇపుడే కాదు, గతంలో కూడా ఇలాంటివి చేయించలేదు. నా వ్యక్తిత్వానికి, చంద్రబాబు వ్యక్తిత్వానికి నక్కకూ... నాకలోకానికీ ఉన్నంత తేడా ఉంది. మేం ఎప్పుడైనా ఏదైనా రాజకీయాలు చేయాలనుకుంటే హుందాగానే చేస్తాం. నేనెవరికైనా మంత్రి పదవి ఇవ్వాలనుకుంటే ముందున్న పార్టీ పదవికి రాజీనామా చేయించి ఆమోదింప జేస్తాను. ఆ తరువాతనే మంత్రి పదవిని ఇస్తాను. అలా మంత్రి పదవి ఇచ్చిన వ్యక్తిని ప్రజల దగ్గరకు తీసుకు పోయి నా పార్టీ టికెట్ ఇచ్చి, నేనే ప్రచారం చేసి నన్ను చూసి ఓట్లేయమని అడుగుతాను. గెలిపించుకుని వస్తాను. ఇది కొత్తగా ఈ రోజు చేసింది కాదు. గతంలో మా పార్టీలోకి చేరడానికి ఉత్సాహం చూపించిన 18 మంది ఎమ్మెల్యేల చేత అప్పటి రాష్ట్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా అవిశ్వాసతీర్మానంపై ఓట్లు వేయించాను. వారంతా అనర్హతకు గురయ్యాక మా పార్టీ బీ ఫాం ఇచ్చి ఉప ఎన్నికల్లో పోటీ చేయించాం. అపుడు నేను, మా అమ్మ మాత్రమే పార్టీలో ఉన్నాం. ఎన్నికల్లో 15 మంది ఎమ్మెల్యేలు తిరిగి గెలుపొందారు. నంద్యాలలో పోటీ చేస్తాం విలేకరుల ప్రశ్నలకు జగన్ సమాధానమిస్తూ....‘నంద్యాల ఉప ఎన్నికలో కచ్చితంగా పోటీ చేస్తాం... అది అక్షరాలా మాసీటే... అయితే మేం ఈ విషయంలో ఏం చేస్తాం... ఎప్పుడు చేస్తాం అనేది వేచి చూడండి. సరైన సమయంలో మేం కచ్చితంగా ఒక నిర్ణయం తీసుకుంటాం. ఈ విషయంలో మాకు ఎలాంటి మొహమాటం (ఆబ్లిగేషన్) లేదు. ఎందుకంటే అది మా సీటే... గతంలో కొన్ని సందర్భాల్లో ఎవరైనా ఎమ్మెల్యేలు ఏ పార్టీకి చెందిన వారైనా చనిపోతే వారి కుటుంబం నుంచే మరొకరు పోటీ చేసినపుడు అలాంటి చోట్ల పోటీ చేయరాదనే విధానానికి కట్టుబడి పోటీ పెట్టలేదు. కానీ నంద్యాల విషయంలో ఈ సారి అలా చేయం. ఈ సీటు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీదే. అక్కడి ప్రజలు గత ఎన్నికల్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకే ఓట్లేశారు. అందుకే పోటీ చేస్తాం. చంద్రబాబుది విలన్ క్యారెక్టర్ ఏ సినిమాకు వెళ్లినా... ఏ కథలోనైనా ఒకటే కనిపిస్తుందని రాజకీయాలు చేసే వారు ఎప్పుడూ గుర్తుంచుకోవాలి. వాటిలో ఒక హీరో క్యారెక్టర్, ఒక విలన్ క్యారెక్టర్ ఉంటాయి. హీరో క్యారెక్టర్ ఎలా ఉంటుందో కొంచెం ఆలోచించుకోండి. కానీ విలన్ క్యారెక్టర్ గురించి పెద్దగా ఆలోచించాల్సిన పని లేదు. చంద్రబాబు దగ్గర కూర్చుంటే తెలిసి పోతుంది. మేము కనుక సంతాప తీర్మానం సందర్భంగా సభలోకి వెళ్లి ఉంటే పాపం చనిపోయిన భూమా నాగిరెడ్డిని తప్పు చేసిన వ్యక్తిగా చెప్పాల్సి వచ్చేది. చనిపోయాడు కనుక ఆయన విషయంలో మర్యాద పాటించాలనుకున్నాం. మా మంచితనం చూపించాలనుకున్నాం, మంచితనాన్ని ప్రదర్శించాం. టీడీపీ వాళ్లు కుసంస్కార రాజకీయాల్లో పుట్టి పెరిగారు. 24 గంటలైనా గడవక ముందే భూమా కుమార్తెను అసెంబ్లీకి తేవడం వారి కుసంస్కారానికి నిదర్శనం. నిజంగా కుసంస్కారం, దిగజారుడు రాజకీయాలు వారివే. గతంలో శాసనసభలో శోభానాగిరెడ్డికి సంతాపం చెప్పడానికి కూడా టీడీపీ ప్రభుత్వం అంగీకరించలేదు. మా ఎమ్మెల్యేలు ప్రెస్‌మీట్ పెట్టి విమర్శించిన తరువాత గానీ ఆమె పేరును తీర్మానంలో చేర్చలేదు. ఇవన్నీ జరిగిన యథార్థాలే... అసెంబ్లీ రికార్డులను తిరగేస్తే అన్నీ తెలుస్తాయి. కుసంస్కార రాజకీయాల్లో పుట్టి పెరిగిన వీళ్లు ఎన్టీరామారావును వెన్నుపోటు పొడిచిన దగ్గరి నుంచీ అంతా కుసంస్కార రాజకీయాలే చేశారు. అయినా ఎవరు రాజకీయాలు చేస్తున్నారు, ఎవరు చేయడం లేదు, ఎవరు హుందాతనాన్ని ప్రదర్శించారు, ఎవరు ప్రదర్శించలేదు ఇవన్నీ చూసే వారికి అర్థం అవుతుంది. ఇంతకంటే నేను చెప్పేదేమీ లేదు. -
భూమా చనిపోయాక బాబుకు గుర్తుకొచ్చాయా?
-
భూమా చనిపోయాక బాబుకు గుర్తుకొచ్చాయా?
విజయవాడ : మహాభారతంలో దుర్యోధనుడి మరణానికి శకుని కారణమైతే ...నంద్యాల ఎమ్మెల్యే భూమా నాగిరెడ్డి మృతికి కారణం మాత్రం చంద్రబాబు నాయుడే అని వైఎస్ఆర్ సీపీ ఎమ్మెల్యే నారాయణస్వామి అన్నారు. ఆయన మంగళవారమిక్కడ మాట్లాడుతూ బతికున్నంతకాలం నాగిరెడ్డిని చంద్రబాబు పట్టించుకోలేదని, ఆయన చనిపోయిన తర్వాత మాత్రం కర్నూలు జిల్లా అభివృద్ధికి కృషి చేస్తామంటూ చెప్పడం హాస్యాస్పదంగా ఉందన్నారు. మనిషిని పోగొట్టుకున్నాక చంద్రబాబు మొసలి కన్నీరు కారుస్తున్నారని నారాయణస్వామి వ్యాఖ్యానించారు. భూమా కోరిక అంటూ ఇప్పుడేమో నంద్యాల అభివృద్ధికి కృషి చేస్తామని చంద్రబాబు చెప్పడం విడ్డూరంగా ఉందన్నారు. తండ్రి అంత్యక్రియల జరిగి 24 గంటలు గడవకముందే అఖిలప్రియను చంద్రబాబు అసెంబ్లీకి తీసుకు వచ్చారన్నారు. ఈ ఘటన చూస్తుంటే ఆయనకు మానవత్వం ఉందా అనే అనుమానం కలుగుతుందన్నారు. భూమా నాగిరెడ్డికి సానుభూతి తెలపాల్సిన సభలో వైఎస్ జగన్‌ను టార్గెట్ చేసుకుని మాట్లాడటం ఎంతవరకూ సమంజసమని ఎమ్మెల్యే నారాయణస్వామి ప్రశ్నించారు. సంతాప తీర్మానానికి ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ రాలేదంటూ, దుర్మార్గులంతూ సభ ద్వారా కుట్రపూరితంగా వ్యవహరిస్తూ విలువైన సమాయాన్ని దుర్వినియోగం చేశారన్నారు. శకునిలాంటి చంద్రబాబును కాపాడేందుకు మంత్రులు, టీడీపీ ఎమ్మెల్యేలు, పార్టీ మారిన ఎమ్మెల్యేలు ప్రయత్నిస్తున్నారన్నారు. వైఎస్ఆర్ సీపీ నుంచి టీడీపీలో చేరిన వారితో వైఎస్ జగన్‌ను తిట్టించారన్నారు. తనకు రాజకీయ భిక్ష పెట్టిన ఎన్టీఆర్‌పై వైస్రాయ్ హోటల్ సాక్షిగా చెప్పులు వేయించిన ఘనత చంద్రబాబుది అని ఎమ్మెల్యే నారాయణస్వామి ధ్వజమెత్తారు. మంత్రి పదవి ఆశచూపి.... సంవత్సరం అయినా ఇవ్వకుండా భూమాను మానసిక క్షోభకు గురిచేసి ఆయన మృతికి చంద్రబాబే కారణమని అందరికీ తెలుసని నారాయణస్వామి అన్నారు. -
అఖిలప్రియతో అబద్ధాలు చెప్పించారు..
విజయవాడ: అసెంబ్లీ సాక్షిగా తెలుగుదేశం పార్టీ శవ రాజకీయాలు చేస్తోందని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గిడ్డి ఈశ్వరి తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. ఇవాళ అసెంబ్లీలో జరిగిన తీరు చూస్తుంటే.. భూమా నాగిరెడ్డికి సంతాప తీర్మానం కార్యక్రమమా లేక వైఎస్ జగన్‌పై విమర్శలా అనే అనుమానం కలుగుతోందన్నారు. భూమా నాగిరెడ్డి సతీమణి శోభా నాగిరెడ్డి ఒకప్పుడు టీడీపీలో కీలక పాత్ర వహించారని, ఆ పార్టీకి ఎంత చేశారని, అలాంటిది...ఆమె చనిపోయినప్పుడు సంతాపం తెలిపేందుకు టీడీపీ నేతలు ఎందుకు రాలేదని ఎమ్మెల్యే గిడ్డి ఈశ్వరి ప్రశ్నలు సంధించారు. అసెంబ్లీలో శోభా నాగిరెడ్డికి సంతాప తీర్మానం తెలిపేందుకు కూడా టీడీపీ ఇష్టపడలేదన్నారు. గతంలో చంద్రబాబు నాయుడు ప్రవర్తించిన తీరు ఇప్పుడు గుర్తుకు రావడం లేదా అని అడిగారు. శోభా నాగిరెడ్డి చనిపోతే ... ఆ స్థానంలో ఎన్నికలు జరిగితే ఇదే చంద్రబాబు తమ పార్టీ అభ్యర్థిని ఎందుకు నిలబెట్టారన్నారు. ఇక భూమా నాగిరెడ్డి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్నప్పుడు ఆయనపై రౌడీషీట్ పెట్టిందెవరని, ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసులు పెట్టించి, పోలీసులతో అరెస్ట్ చేయించి వేధింపులకు గురి చేసింది ఎవరో చెప్పాలని గిడ్డి ఈశ్వరి డిమాండ్ చేశారు. ఆ రోజు భూమా నాగిరెడ్డిని కేసులతో వేధించింది టీడీపీ కాదా అని అడిగారు. పార్టీ మారితే మూడు రోజుల్లో మంత్రి ఇస్తానని చెప్పి, ఏడాది గడిచినా పదవి ఇవ్వకపోవడం వాస్తవం కాదా అని అన్నారు. చంద్రబాబు మోసంతోనే భూమా నాగిరెడ్డి మానసిక క్షోభకు గురయ్యారన్నారు. చనిపోయిన తర్వాత భూమా నాగిరెడ్డిపై ప్రేమ ఒలకబోస్తున్న చంద్రబాబు ... ఆయన బతికి ఉన్నప్పుడు ఏం చేశారన్నారు. హిందు సంప్రదాయం ప్రకారం కుటుంబంలో వ్యక్తి చనిపోతే ... ఆ కుటుంబసభ్యులు కనీసం మూడురోజుల పాటు అయినా ఊరి పొలిమేర దాటరన్నారు. అలాంటిది తండ్రిని కోల్పోయి పుట్టెడు దుఖంలో ఉన్న అఖిలప్రియను అసెంబ్లీ సమావేశాలుకు తీసుకు రావడం వెనుక చంద్రబాబు, ఆయన కుమారుడు లోకేశ్ పాత్ర ఉందన్నారు. ఒక మహిళగా అఖిలప్రియ బాధ, ఆవేదన, సంఘర్షణను తాము అర్థం చేసుకుంటామన్నారు. అలాంటిది ఓ అమాయకురాలి చేత లేనిపోని అబద్ధాలు మాట్లాడించారన్నారు. తనను ఎవరూ అసెంబ్లీ సమావేశాలకు రమ్మనలేదని, తన అంతట తానుగానే వచ్చానని అఖిలప్రియతో చెప్పించారన్నారు. ఆమెను చంద్రబాబు, ఆయన కుమారుడే బలవంతంగా సమావేశాలకు రప్పించారన్నారు. నూతన రాజధానిలో అసెంబ్లీ సమావేశాలు ప్రారంభంలో హాజరు కాని అఖిలప్రియ.... తండ్రి చనిపోయి పట్టుమని మూడు రోజులు కూడా కాకముందే సభకు ఎలా వచ్చారన్నారు. ఇక భూమా సంతాప తీర్మాన కార్యక్రమం సందర్భంగా అసెంబ్లీకి వెళ్లకపోవడంతో ప్రతిపక్ష పార్టీపై టీడీపీ బురద జల్లుతుందన్నారు. ప్రజల ముందు తమను తప్పుగా చిత్రీకరించేందుకు చూస్తోందన్నారు. ఈ విషయాన్ని ప్రజలంతా గమనిస్తున్నారని అన్నారు. విలువల గురించి మాట్లాడేవారు ఒకసారి గతాన్ని గుర్తు చేసుకుంటే మంచిదని అన్నారు. ఓ పార్టీ నుంచి గెలిచి మరో పార్టీలోకి వెళ్లడం నైతిక విలువలతో కూడిన రాజకీయమా అని గిడ్డి ఈశ్వరి ప్రశ్నించారు. సంతాప తీర్మానంలో ఎక్కడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో గెలిచి టీడీపీలోకి వెళ్లిన విషయాన్ని ప్రస్తావించకపోవడం సరికాదన్నారు. -
అఖిలప్రియతో అబద్ధాలు చెప్పించారు..
-
24గంటల్లో అఖిలప్రియను అసెంబ్లీకా?
-
24గంటల్లో అఖిలప్రియను అసెంబ్లీకా?: వైఎస్ జగన్
విజయవాడ : నంద్యాల ఎమ్మెల్యే భూమా నాగిరెడ్డి సంతాప తీర్మానాన్ని రాజకీయం చేస్తున్నారని ప్రతిపక్ష నేత, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అన్నారు. సంతాప తీర్మానం సమయంలోనూ రాజకీయ విమర్శలు చేయడం సరికాదన్నారు. ఇంత దిగజారుడు రాజకీయాలు అవసరమా అని వైఎస్ జగన్ సూటిగా ప్రశ్నించారు. మంగళవారం వైఎస్ జగన్ ఇక్కడ మాట్లాడుతూ అసెంబ్లీ జరుగుతున్న తీరు చూస్తుంటే సిగ్గుతో తల దించుకోవాల్సి వస్తోందన్నారు. తండ్రి మృతి చెందిన 24 గంటల్లోనే అఖిలప్రియను అసెంబ్లీకి తీసుకురావడం చంద్రబాబు కుసంస్కారానికి నిదర్శనమని వైఎస్ జగన్ అన్నారు. నాగిరెడ్డి చనిపోయిన విషయం తెలియగానే అఖిలప్రియతో తాను, అమ్మ ఫోన్లో మాట్లాడామన్నారు. మంత్రి పదవి ఆశ చూపినందువల్లే భూమా నాగిరెడ్డి పార్టీ మారారన్నారు. పార్టీ మారిన మూడు రోజుల్లో మంత్రి పదవి ఇస్తానని చంద్రబాబు నాయుడు తనకు చెప్పారని తమ పార్టీ నేతలతో భూమా చెప్పారన్నారు. ఏడాది గడిచినా పదవి ఇవ్వలేదని, అంటే భూమా ఎంత మానసిక క్షోభకు గురయ్యారో అర్థం అవుతుందన్నారు. ఎన్టీఆర్ లాగానే నాగిరెడ్డిని కూడా చంద్రబాబు మానసిక క్షోభకు గురి చేశారని వైఎస్ జగన్ అన్నారు. భూమా హుందాతనాన్ని కాపాడేందుకే తాము సభకు వెళ్లలేదన్నారు. తాము సభకు వెళితే చంద్రబాబు చేయించిన తప్పులు, భూమా చేసిన పనులు గురించి మాట్లాడాల్సి వచ్చేదని అన్నారు. అవన్నీ రికార్డుల్లో వెళ్లేవని, అందుకే తాము సభకు వెళ్లలేదని వైఎస్ జగన్ పేర్కొన్నారు. తనకు, చంద్రబాబుకు నక్కకు, నాగలోకానికి ఉన్నంత తేడా ఉందన్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏర్పాటు చేసినప్పుడు తమ వాళ్లతో రాజీనామా చేయించి గెలిపించుకున్నామన్నారు. భూమా నాగిరెడ్డి మరణించారని, ఆయనపై వివాదాలు అనవసరమని వైఎస్ జగన్ అన్నారు. అలాగే నంద్యాల ఉప ఎన్నికపై సరైన సమయంలో నిర్ణయం తీసుకుంటామని తెలిపారు. ఆ సీటు తమ పార్టీదే అని, గతంలో ఏ పార్టీవారు మరణిస్తే..గౌరవంగా వాళ్లకే వదిలేసేవాళ్లమని అన్నారు. కాగా భూమా నాగిరెడ్డి మృతికి సంతాప తీర్మానం సందర్భంగా ఏపీ అసెంబ్లీ సమావేశాలకు ఎమ్మెల్యే భూమ అఖిలప్రియ హాజరయ్యారు. -
భూమాకు తుది వీడ్కోలు
⇒ అధికారిక లాంఛనాలతో అంత్యక్రియలు ⇒ భౌతిక కాయానికి నివాళులర్పించిన నేతలు ⇒ కుటుంబ సభ్యులను ఓదార్చిన ముఖ్యమంత్రి చంద్రబాబు ⇒ అఖిలప్రియకు మంత్రి పదవి ఇవ్వాలని కార్యకర్తల నినాదాలు సాక్షి ప్రతినిధి, కర్నూలు: నంద్యాల ఎమ్మెల్యే భూమా నాగిరెడ్డికి సోమవారం ఆళ్లగడ్డలో అధికారిక లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వ హించారు. పెద్ద ఎత్తున తరలివచ్చిన నాయ కులు, వేలాదిమంది అభిమానుల మధ్య భూమా అంతిమయాత్ర సాగింది. ఆళ్లగడ్డ లోని శోభానాగిరెడ్డి ఘాట్ వద్దనే భూమా అంత్యక్రియలను ఆయన కుమారుడు జగత్ విఖ్యాత్‌రెడ్డి నిర్వహించారు. ఆదివారం ఉద యం భూమా గుండెపోటుతో హఠాన్మరణం చెందిన విషయం తెలిసిందే. సాయంత్రం నాలుగు గంటల సమయంలో భారీ జన సందోహం మధ్య భూమా పార్థివ దేహాన్ని ప్రత్యేక వాహనంపై ఉంచి వైపీపీఎం కళాశాల, పాత బస్టాండు మీదుగా శోభాఘాట్ వరకు అంతిమయాత్ర నిర్వహించారు. అనంతరం అక్కడే అంత్యక్రియలను అధికార లాంఛనా లతో పూర్తి చేశారు. ప్రత్యేక పోలీసులు గౌరవ వందనం సమర్పించి సంతాపసూచకంగా గాల్లోకి రెండు రౌండ్ల కాల్పులు జరిపారు. అనంతరం జగత్‌విఖ్యాత్‌రెడ్డి తన తండ్రి చితికి నిప్పంటించారు. భూమా కుమార్తెలు ఆళ్లగడ్డ ఎమ్మెల్యే అఖిల ప్రియ, నాగ మౌనిక, కుటుంబసభ్యుల రోద నలతో ఆ ప్రాంతంలో విషాదం అలుముకుంది. భూమా కుటుంబానికి సీఎం భరోసా భూమా కుటుంబానికి అండగా ఉంటామని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రకటించారు. కుటుంబ సభ్యులతో కాసేపు ఏకాంతంగా చర్చించి ఓదార్చారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ.. చనిపోయే సమయానికి 24 గంటల ముందు భూమా విజయవాడలో తనను కలిశారని.. నంద్యాల, ఆళ్లగడ్డ నియోజకవర్గాల అభివృద్ధి గురించి చర్చించారని తెలిపారు. అఖిలప్రియ ద్వారా ఆయన ఆశయాలను నెరవేరుస్తామని ప్రకటించారు. సీఎం మాట్లాడుతున్నప్పుడు కొందరు కార్యకర్తలు అఖిలప్రియకు మంత్రి పదవి ఇవ్వాలంటూ నినాదాలు చేశారు. అయితే సీఎం స్పందించలేదు. నేతల నివాళి భూమా భౌతిక కాయానికి కేంద్ర మంత్రి సుజనా చౌదరి, శాసనమండలి చైర్మన్ చక్ర పాణి యాదవ్, స్పీకర్ కోడెల శివప్రసాద్ రావుతో పాటు డిప్యూటీ సీఎంలు కె.ఇ.కృష్ణ మూర్తి, చిన్నరాజప్ప, మంత్రులు అచ్చెన్నా యుడు, పరిటాల సునీత, పీతల సుజాత, ప్రత్తిపాటి పుల్లారావు, కొల్లు రవీంద్ర, చీఫ్ విప్ కాల్వ శ్రీనివాసులు, ఎంపీ జె.సి.దివా కర్రెడ్డితో పాటు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నుంచి మాజీ ఎంపీ అనంత వెంకట్రామిరెడ్డి, పార్టీ జిల్లా అధ్యక్షుడు గౌరువెంకటరెడ్డి, ఎమ్మెల్యేలు బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి, ఐజ య్య, సాయిప్రసాద్‌రెడ్డి, బాలనాగిరెడ్డి, ఆది మూలపు సురేష్, మాజీ ఎమ్మెల్యే కాటసాని రామిరెడ్డి, కాపు రామచంద్రారెడ్డి, రాజ గోపాల్‌రెడ్డిలు భూమాకు నివాళులు అర్పించి కుటుంబ సభ్యులను ఓదార్చారు. -
అచ్చెన్నా.. ఇటు చూడన్నా!
టీడీపీలో పెరిగిపోతున్న విభేదాలు జిల్లా వైపు కన్నెత్తి చూడని ఇన్చార్జ్ మంత్రి నియోజకవర్గ ఇన్‌చార్జ్‌లను పట్టించుకోని దుస్థితి మూడు నెలలుగా ప్రత్యేక సమావేశాల్లేవ్! సాక్షి ప్రతినిధి, కర్నూలు: తెలుగుదేశం పార్టీలో నాయకుల మధ్య రోజురోజుకీ అంతరాలు పెరిగిపోతున్నాయి. వాటిని సరిచేయాల్సిన జిల్లా ఇన్చార్జ్ మంత్రి అచ్చెన్నాయుడు పట్టించుకోవడం లేదు. పార్టీకి చెందిన నియోజకవర్గ ఇన్‌చార్జ్‌లతో ఆయన కనీసం సమావేశం కూడా కావడం లేదు. వారి సాధకబాధకాలు వినడం లేదన్న విమర్శలు వినిపిస్తున్నాయి. మరోవైపు టీడీపీలో నంద్యాల, ఆళ్లగడ్డ ఎమ్మెల్యేలు భూమా నాగిరెడ్డి, అఖిలప్రియల చేరికతో లుకలుకలు ప్రారంభమయ్యాయి. నియోజకవర్గాల్లో తమ పెత్తనం అంటే తమ పెత్తనమే సాగుతుందంటూ ప్రచారం చేసుకుంటున్నారు. ఈ నేపథ్యంలో జిల్లాలో పర్యటించి సమన్వయం చేయాల్సిన ఇన్చార్జ్ మంత్రి మిన్నకండడంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ప్రత్యేక సమావేశాలేవీ? వాస్తవానికి అధికార పార్టీకి చెందిన నేతల మధ్య సమన్వయం చేయడంతో పాటు పార్టీ కోసం కష్టపడ్డ వారిని గుర్తించి వారికి అవసరమయ్యే సంక్షేమ కార్యక్రమాలు అమలయ్యేలా చూడాల్సిన బాధ్యత ప్రధానంగా ఇంచార్జీ మంత్రిదే. అదేవిధంగా ప్రతీ నియోజకవర్గ ఇన్‌చార్జ్‌తో నిరంతరం మాట్లాడుతూ వారికి ఎదురవుతున్న సమస్యలను కూడా అడిగి తెలుసుకని పరిష్కరించడమూ ఇతను చేయాల్సిందే. అయితే, ఇవేవీ పట్టించుకోకుండా ఆయన గాలికి వదిలేశారన్న విమర్శలు వినిపిస్తున్నాయి. అంతేకాకుండా ఆయన జిల్లాలో అడుగుపెట్టి మూడు నెలలకుపైగా సమయం దాటింది. అప్పటి నుంచి ఇప్పటివరకు కనీసం ఒక్కరికంటే ఒక్కరితో కూడా నేరుగా మాట్లాడిన సందర్భం లేదని పార్టీ నేతలు, కార్యకర్తలు వాపోతున్నారు. సమన్వయం సాధ్యమేనా? టీడీపీలో విభేదాలు ముదిరి పాకాన పడ్డాయి. నంద్యాల, ఆళ్లగడ్డ ఎమ్మెల్యేల చేరికతో ఈ గొడవలు ఇంకా పెరిగాయి. ఆళ్లగడ్డలో గంగుల తన అనుచరులతో నేడో, రేపో ప్రత్యేకంగా సమావేశం కానున్నారు. ఇరిగెల వర్గీయులు కూడా తమ పనులు కావని ఆందోళన చెందుతున్నారు. తాము గొడవపడుతుంటే మూడో వర్గానికి లబ్ధి చేకూరుతుందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇక నంద్యాలలో భూమా వర్గీయులు తమను తొక్కేస్తారనే ఆందోళనకు శిల్పా వర్గీయులు లోనవుతున్నారు. ఇప్పటికే భూమా- శిల్పాల మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటోన్న పరిస్థితి నెలకొంది. ఇంకోవైపు నందికొట్కూరు, కోడుమూరులో కూడా వర్గ విబేధాలు భగ్గుమంటున్నాయి. ఈ నేపథ్యంలో అందరి మధ్య సఖ్యత తెచ్చేందుకు, సమన్వయం సాధించేందుకు కృషి చేయాల్సిన ఇన్చార్జీ మంత్రి కనీసం జిల్లా గోడు పట్టించుకోవడం లేదని ఆ పార్టీ కార్యకర్తలు విమర్శలు చేస్తున్నారు. -
'శోభా నాగిరెడ్డి ఆత్మ క్షోభిస్తుంది'
తిరుపతి: వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని వీడి భూమా నాగిరెడ్డి, అఖిలప్రియ టీడీపీలోకి వెళ్లడం వల్ల పైలోకంలో ఉన్న శోభానాగిరెడ్డి ఆత్మ క్షోభించి ఉంటుందని ఎమ్మెల్యే ఆర్కే రోజా వ్యాఖ్యానించారు. చిత్తూరు జిల్లా తిరుపతిలో మీడియాతో ఆమె మాట్లాడారు. శోభా నాగిరెడ్డి మరణం తర్వాత టీడీపీ సర్కార్ ఏపీ శాసనసభలో కనీసం సంతాపాన్ని కూడా ప్రకటించలేదని ఆమె విమర్శించారు. ఇప్పుడు అదే పార్టీలోకి ఆమె కుటుంబ సభ్యులే వెళ్లడం దారుణమన్నారు. దేశ రాజకీయాల్లో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు శని లాంటి వాడంటూ మండిపడ్డారు. టీఆర్ఎస్లోకి టీడీపీ ఎమ్మెల్యేలు వెళ్తే నైతిక విలువలు లేవన్న చంద్రబాబు ఇప్పుడు ఏం చేశారని ఈ సందర్భంగా రోజా ప్రశ్నించారు. మునిగిపోయే పడవ లాంటి టీడీపీలోకి ఎమ్మెల్యేలు వెళ్లారంటే.. ఏదో ప్రయోజనం ఆశించి వెళ్లి ఉంటారని ఆరోపించారు. చంద్రబాబుకు దమ్ము, ధైర్యం ఉంటే ఎన్నికలకు సిద్ధపడాలని డిమాండ్ చేశారు. నలుగురు ఎమ్మెల్యే పోయినంత మాత్రాన వైఎస్ఆర్ సీపీ బెదిరేది లేదని పేర్కొన్నారు. అభివృద్ధి పనుల పేరుతో చంద్రబాబు, ఆయన తనయుడు నారా లోకేష్ వేల కోట్లు సంపాదించారని, సెక్యూరిటీ లేకుండా చంద్రబాబు ప్రజల్లోకి వెళ్లగలడా అంటూ ఏపీ సీఎంను వైఎస్ఆర్ సీపీ ఎమ్మెల్యే రోజా సూటిగా ప్రశ్నించారు. మా పార్టీ ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు భూమా నాగిరెడ్డికి సంకెళ్లు వేసి కూర్చోబెట్టారు. ప్రస్తుతం షేక్ హ్యాండ్ ఇచ్చి, కండువా కప్పి టీడీపీలోకి ఆహ్వానించారు. శోభా నాగిరెడ్డికి కనీసం సంతాపం తెలిపలేదని.. అంతా తెలిసి కూడా ఆమె భర్త, కూతురు అధికార టీడీపీలో చేరడాన్ని తప్పుబట్టారు. తమ పార్టీ చేసిన అభివృద్ది చూసి వస్తున్నారని అధికార పార్టీ వారు చెప్పడం నిజంగా సిగ్గుచేటు. అసలు టీడీపీ ప్రభుత్వం చేసిన అభివృద్ధి ఏంటని ఈ సందర్భంగా రోజా ధ్వజమెత్తారు. ఒక్క నిరుద్యోగికి కూడా ఉద్యోగం ఇవ్వలేదని, రైతులు, చేనేత కార్మికులకు రుణమాఫీ చేయలేదని వివరించారు. మొదటి నుంచి కూడా బాబుకు రాజకీయాలను భ్రష్టు పట్టించడం అలవాటు అని.. అందులో భాగంగానే తెలంగాణలో ఓటుకు కోట్లు కేసులో రెడ్ హ్యాండెడ్ గా దొరికి పోయాడని ఆరోపించారు. అందుకే అక్కడ టీడీపీ సీన్ రివర్స్ అయిందన్నారు. ఈ పార్టీ వాళ్లు టీఆర్ఎస్ లో చేరితో సంతలో పశువుల్లా ప్రతిపక్ష ఎమ్మెల్యేలను కొంటున్నారంటూ టీఆర్ఎస్ పార్టీని విమర్శించిన చంద్రబాబు ఈ రోజు వైఎస్ఆర్ సీపీ ఎమ్మెల్యేలను రాజీనామా చేయించకుండా, టీడీపీ నుంచి ఎన్నికల్లో నిలబెట్టకుండానే మీ పార్టీలో ఏ విధంగా చేర్చుకున్నారని చంద్రబాబును సూటిగా ప్రశ్నించారు. రాజధాని రైతుల భూములను దోచుకుని, సింగపూర్ బృందం చేతికి అప్పగించి అభివృద్ధి చేస్తామని చెప్పిన చంద్రబాబు... టీడీపీ నేతలు, తన సన్నిహితులకు ఆ భూములను కట్టబెట్టడం దారుణమంటూ మండిపడ్డారు. -
టీడీపీలో చేరిన భూమా నాగిరెడ్డి, ఆదినారాయణ రెడ్డి..
విజయవాడ: రెండేళ్ల పరిపాలనా వైఫల్యాలు, భారీ అవినీతి ఆరోపణల నుంచి ప్రజల దృష్టిని మళ్లించేక్రమంలో దిగజారుడు రాజకీయాలను తెరపైకి తీసుకొచ్చారు సీఎం చంద్రబాబు నాయుడు. ఓవైపు తెలంగాణలో టీఆర్ఎస్ లోకి టీడీపీ ఎమ్మెల్యేల చేరికలను గర్హిస్తున్న ఆయనే.. ఏపీ ప్రతిపక్ష పార్టీకి చెందిన నలుగురు ఎమ్మెల్యేలను సోమవారం తమ పార్టీలోకి చేర్చుకున్నారు. సోమవారం రాత్రి చంద్రబాబుతో భేటీ అనంతరం టీడీపీలో చేరినట్లు ఎమ్మెల్యేలు భూమా నాగిరెడ్డి, ఆయన కుమార్తె భూమా అఖిలప్రియ, జలీల్ ఖాన్, ఆదినారాయణ రెడ్డిలు ప్రకటించారు. సోమవారం మధ్యహ్నం పబ్లిక్ అకౌంట్స్ కమిటీ (పీఏసీ) చైర్మన్ పదవికి రాజీనామాచేసిన అనంతరం భూమా తన కూతురుతో కలిసి విజయవాడలోని చంద్రబాబు నివాసానికి వెళ్లారు. మరికాసేపటికి జమ్మలమడుగు ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి, విజయవాడ ఎమ్మెల్యే జలీల్ ఖాన్ లు కూడా బాబుతో భేటీ అయ్యారు. కాగా, ఆదినారాయణ రెడ్డి చేరికను ఆ నియోజకవర్గ టీడీపీ ఇన్ చార్జి రామసుబ్బారెడ్డి, మాజీ మంత్రి శివారెడ్డి సతీమణి లక్ష్మీదేవమ్మలు తీవ్రంగా వ్యతిరేకించారు. వాళ్లను పార్టీలో చేర్చుకుంటే తమదారి తాము చూసుకుంటామని హెచ్చరించారు. చంద్రబాబు సర్దిచెప్పడంతో చివరికి కాస్త మెత్తబడ్డారు. -
అమ్మ డైరీలో రాసుకున్నవన్నీ చేస్తా!
అంతర్వీక్షణం అఖిల ప్రియ అఖిలప్రియకు పాతికేళ్లు నిండి రెండేళ్లు కూడా కాలేదు. ఈ పిన్న వయసులోనే ఒక నియోజకవర్గ ప్రజలకు అండగా నిలవాల్సి వచ్చింది. ఆళ్ళగడ్డ ఉప ఎన్నికలో ఏకగ్రీవంగా ఎన్నికై, తల్లి స్వర్గీయ శోభా నాగిరెడ్డి నిలిపిన అంచనాలకు తగ్గట్టుగా ప్రజలకు సేవ చేయాల్సిన బాధ్యత ఇప్పుడామె మీద పడింది. ఈ సందర్భంగా ఈ యువ ఎమ్మెల్యే ఆలోచనాంతరంగం... ► ఆళ్లగడ్డ ప్రజలు మీలో శోభమ్మను చూస్తున్నారు. ఇంత చిన్న వయసులో ఇంత పెద్ద బాధ్యత... రాజకీయాల్లోకి వచ్చేటప్పటికి అమ్మకు కూడా ఇరవై ఆరేళ్లే. కొద్ది నెలల తేడాలో ఇద్దరం ఒకే వయసులో రాజకీయాల్లోకి వచ్చాం. అప్పుడు అమ్మకు ఇంటి బాధ్యతలు, మా పెంపకంతోపాటు చాలా కీలకమైన బాధ్యతలుండేవి. అలాంటప్పుడే ఆమె భయపడలేదు. ఆ స్ఫూర్తితోనే పనిచేస్తాను. ► మీ మీద అంచనాలు చాలా ఎక్కువగా ఉంటాయేమో? నిజమే... ఎమ్మెల్యేగా అద్భుతమైన పనితీరు చూపింది. నేను ఆ స్థాయిని చేరాలంటే చాలా శ్రమించాలి. ముందుగా ప్రతి విషయాన్నీ లోతుగా అధ్యయనం చేయాలి. అందుకు నేను సిద్ధమే. ► ఆళ్లగడ్డలో పర్యటిస్తుంటే... ప్రతి ఒక్కరూ అమ్మను తలుచుకుంటూ, నాకు ధైర్యం చెబుతున్నారు. వారితో ఉంటే, అమ్మ దగ్గర ఉన్నట్లే అనిపిస్తోంది. ఆ ప్రజల మధ్యే ఎక్కువ సమయం గడపాలనిపిస్తోంది. ► అమ్మ కోసం ఎన్నికల ప్రచారం చేసినప్పటి ఫీలింగ్స్...! అమ్మానాన్నల కోసం పిల్లలం ముగ్గురం చిన్నప్పటి నుంచి ఎన్నికల ప్రచారంలో పాల్గొంటూనే ఉన్నాం. చిన్నప్పుడు ఎగ్జయిట్మెంట్ ఉండేది. అమ్మ లేనప్పుడు ఆమె కోసం చేసిన ప్రచారంలో ప్రజల్లో అంతులేని బాధ, భయం కనిపించాయి. మా కుటుంబం నుంచి ఒకరు వస్తారని తెలిసిన తర్వాత వారిలో ధైర్యాన్ని చూశా. ► ఆళ్లగడ్డ కోసం ఏం చేయాలనుకుంటున్నారు? అమ్మ ఒక డైరీలో ఆమె చేయాలనుకున్న పనులను రాసుకుంది. అవి ఆళ్లగడ్డ కోసం ఆమె అనుకున్న పనులు మాత్రమే కాదు ఆళ్లగడ్డ ప్రజలు కోరుకున్న పనులు కూడా! ఆమె పోయాక ఆ డైరీ గురించి తెలిసింది. ఇప్పుడు వాటన్నింటినీ పూర్తి చేయాలనుకుంటున్నాను. ► రాజకీయాల్లోకి రాకముందు వ్యాపార రంగంలో స్థిరపడాలనుకున్నారు కదా! నియోజక వర్గ ప్రజలకు ఉపాధి ఇవ్వగలిగితే బావుణ్ణనేది అమ్మ. అందుకోసమే డైరీ ఫామ్, రైతులకు ఉపయోగపడే పరిశ్రమలు అనుకున్నాం. ► మీ అమ్మగారికి ఇంత ప్రజాదరణ ఉందని ఎప్పుడు తెలిసింది? అమ్మ మాకు ఎప్పుడూ గృహిణిగానే కనిపించేది. తాను రాజకీయాల్లో ఉండడం వల్ల మేము తనని మిస్ కాకూడదని తపన పడేది. ఎక్కడున్నా గంట గంటకూ ఫోన్ చేసి ‘తిన్నారా, ఇంకా పడుకోలేదా’ అని అడిగేది. మాకు ఒంట్లో బాగాలేదని తెలిస్తే ఉన్న పళంగా వచ్చేసేది. మాకు అలాగే తెలుసు. కానీ ఆమె పోయాక మాత్రమే ఇంతటి ఆదరణ ఉందని తెలిసింది. ► పెద్దకూతురిగా మీ బాధ్యతలు... చెల్లి, తమ్ముడు చిన్నవాళ్లు. వాళ్లకు ధైర్యం చెబుతుండాలి. అమ్మ కోరుకున్నట్లు వాళ్లు తయారయ్యే వరకు పర్యవేక్షించాలి. నాన్న డీలా పడకుండా చూసుకోవాలి. ఇక నా జీవితానికి గమ్యం అంటారా... ఒక లక్ష్యంతో సాగుతున్న వారికి జీవితమే గమ్యాన్ని సూచిస్తుంది. నేను జీవితంలో అమ్మను తప్ప మరి దేనిని మిస్ కావడం లేదు. - వి.ఎం.ఆర్ -
ఆళ్లగడ్డ ఎన్నికపై సమాలోచన
ఆళ్లగడ్డ: ఆళ్లగడ్డ ఉప ఎన్నికలపై వైఎస్ఆర్సీపీ నేత, నంద్యాల ఎమ్మెల్యే భూమానాగిరెడ్డి మంగళవారం అందుబాటులో ఉన్న నేతలు, కౌన్సిలర్లతో పట్టణంలోని తన నివాసంలో సమావేశమయ్యారు. ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహంపై వారితో సమాలోచన చేశారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా భూమా అఖిలప్రియను బరిలో దించుతున్నట్లు పార్టీ అధ్యక్షుడు జగన్మోహన్రెడ్డి ప్రకటించిన తరువాత భూమానాగిరెడ్డి మొదటిసారి ఆళ్లగడ్డకు వచ్చారు. శోభానాగిరెడ్డి మృతిచెందడంతో జరుగుతున్న ఈ ఎన్నిక ఎకగ్రీవం కాకపోతే ఎన్నికల్లో అనుసరించాల్సిన తీరుపై ఆయన పార్టీశ్రేణులతో చర్చించారు. గ్రామాల వారీగా పార్టీ పరిస్థితులను అడిగి తెలుసుకున్నారు. 2014 ఎన్నికల్లో మెజార్టీ వచ్చిన గ్రామాల్లో ఎక్కువ మెజార్టీ వచ్చేటట్లు చర్యలు తీసుకోవడంతోపాటు, తక్కువ ఓట్లు వచ్చిన గ్రామాల్లో ఓట్ల సంఖ్యను పెంచడానికి కసరత్తు చేయాలన్నారు. ఉప ఎన్నిక జరిగితే ఎన్నికలు ఎదుర్కొవడానికి పార్టీ నేతలు సన్నద్ధ కావాలన్నారు. పోటీలో ఉన్న అభ్యర్థుల వివరాల ఆధారంగా ఎన్నికల వ్యూహరచన చేయాలని నేతలు నిర్ణయించుకున్నారు. అనంతరం ఆళ్లగడ్డ నగర పంచాయతీలో ఉన్న సమస్యలపై కౌన్సిలర్లతో చ ర్చించారు. కౌన్సిలర్లు తమ పరిధిలో ఉన్న సమస్యలపై అవగాహన పెంచుకుని ఎన్నికల కోడ్ అనంతరం వాటి పరిష్కరించాలని సూచించారు. ప్రజలకు అందుబాటులో ఉండి..వారికి అవసరమైన తాగునీరు, వీధిలైట్లు తదితర సౌకర్యాల ఏర్పాటుకు చర్యలు చేపట్టాలని పిలుపునిచ్చారు. సమావేశంలో పార్టీ నాయకులు బీవీ రామిరెడ్డి, చంద్రశేఖర్‌రెడ్డి, రాముయాదవ్, కుమార్‌రెడ్డి, మహేశ్వరరెడ్డి, నగరపంచాయతీ చైర్పర్సన్ ఉషారాణి, వైస్ చైర్మన్ రామలింగారెడ్డి తదితరులు పాల్గొన్నారు.