అమ్మ డైరీలో రాసుకున్నవన్నీ చేస్తా!
అంతర్వీక్షణం అఖిల ప్రియ
అఖిలప్రియకు పాతికేళ్లు నిండి రెండేళ్లు కూడా కాలేదు. ఈ పిన్న వయసులోనే ఒక నియోజకవర్గ ప్రజలకు అండగా నిలవాల్సి వచ్చింది. ఆళ్ళగడ్డ ఉప ఎన్నికలో ఏకగ్రీవంగా ఎన్నికై, తల్లి స్వర్గీయ శోభా నాగిరెడ్డి నిలిపిన అంచనాలకు తగ్గట్టుగా ప్రజలకు సేవ చేయాల్సిన బాధ్యత ఇప్పుడామె మీద పడింది. ఈ సందర్భంగా ఈ యువ ఎమ్మెల్యే ఆలోచనాంతరంగం...
► ఆళ్లగడ్డ ప్రజలు మీలో శోభమ్మను చూస్తున్నారు. ఇంత చిన్న వయసులో ఇంత పెద్ద బాధ్యత...
రాజకీయాల్లోకి వచ్చేటప్పటికి అమ్మకు కూడా ఇరవై ఆరేళ్లే. కొద్ది నెలల తేడాలో ఇద్దరం ఒకే వయసులో రాజకీయాల్లోకి వచ్చాం. అప్పుడు అమ్మకు ఇంటి బాధ్యతలు, మా పెంపకంతోపాటు చాలా కీలకమైన బాధ్యతలుండేవి. అలాంటప్పుడే ఆమె భయపడలేదు. ఆ స్ఫూర్తితోనే పనిచేస్తాను.
► మీ మీద అంచనాలు చాలా ఎక్కువగా ఉంటాయేమో?
నిజమే... ఎమ్మెల్యేగా అద్భుతమైన పనితీరు చూపింది. నేను ఆ స్థాయిని చేరాలంటే చాలా శ్రమించాలి. ముందుగా ప్రతి విషయాన్నీ లోతుగా అధ్యయనం చేయాలి. అందుకు నేను సిద్ధమే.
► ఆళ్లగడ్డలో పర్యటిస్తుంటే... ప్రతి ఒక్కరూ అమ్మను తలుచుకుంటూ, నాకు ధైర్యం చెబుతున్నారు. వారితో ఉంటే, అమ్మ దగ్గర ఉన్నట్లే అనిపిస్తోంది. ఆ ప్రజల మధ్యే ఎక్కువ సమయం గడపాలనిపిస్తోంది.
► అమ్మ కోసం ఎన్నికల ప్రచారం చేసినప్పటి ఫీలింగ్స్...!
అమ్మానాన్నల కోసం పిల్లలం ముగ్గురం చిన్నప్పటి నుంచి ఎన్నికల ప్రచారంలో పాల్గొంటూనే ఉన్నాం. చిన్నప్పుడు ఎగ్జయిట్‌మెంట్ ఉండేది. అమ్మ లేనప్పుడు ఆమె కోసం చేసిన ప్రచారంలో ప్రజల్లో అంతులేని బాధ, భయం కనిపించాయి. మా కుటుంబం నుంచి ఒకరు వస్తారని తెలిసిన తర్వాత వారిలో ధైర్యాన్ని చూశా.
► ఆళ్లగడ్డ కోసం ఏం చేయాలనుకుంటున్నారు?
అమ్మ ఒక డైరీలో ఆమె చేయాలనుకున్న పనులను రాసుకుంది. అవి ఆళ్లగడ్డ కోసం ఆమె అనుకున్న పనులు మాత్రమే కాదు ఆళ్లగడ్డ ప్రజలు కోరుకున్న పనులు కూడా! ఆమె పోయాక ఆ డైరీ గురించి తెలిసింది. ఇప్పుడు వాటన్నింటినీ పూర్తి చేయాలనుకుంటున్నాను.
► రాజకీయాల్లోకి రాకముందు వ్యాపార రంగంలో స్థిరపడాలనుకున్నారు కదా! నియోజక వర్గ ప్రజలకు ఉపాధి ఇవ్వగలిగితే బావుణ్ణనేది అమ్మ. అందుకోసమే డైరీ ఫామ్, రైతులకు ఉపయోగపడే పరిశ్రమలు అనుకున్నాం.
► మీ అమ్మగారికి ఇంత ప్రజాదరణ ఉందని ఎప్పుడు తెలిసింది?
అమ్మ మాకు ఎప్పుడూ గృహిణిగానే కనిపించేది. తాను రాజకీయాల్లో ఉండడం వల్ల మేము తనని మిస్ కాకూడదని తపన పడేది. ఎక్కడున్నా గంట గంటకూ ఫోన్ చేసి ‘తిన్నారా, ఇంకా పడుకోలేదా’ అని అడిగేది. మాకు ఒంట్లో బాగాలేదని తెలిస్తే ఉన్న పళంగా వచ్చేసేది. మాకు అలాగే తెలుసు. కానీ ఆమె పోయాక మాత్రమే ఇంతటి ఆదరణ ఉందని తెలిసింది.
► పెద్దకూతురిగా మీ బాధ్యతలు... చెల్లి, తమ్ముడు చిన్నవాళ్లు. వాళ్లకు ధైర్యం చెబుతుండాలి. అమ్మ కోరుకున్నట్లు వాళ్లు తయారయ్యే వరకు పర్యవేక్షించాలి. నాన్న డీలా పడకుండా చూసుకోవాలి. ఇక నా జీవితానికి గమ్యం అంటారా... ఒక లక్ష్యంతో సాగుతున్న వారికి జీవితమే గమ్యాన్ని సూచిస్తుంది. నేను జీవితంలో అమ్మను తప్ప మరి దేనిని మిస్ కావడం లేదు.
- వి.ఎం.ఆర్