శుక్రవారం రిటర్నింగ్ అధికారి నుంచి డిక్లరేషన్ ఫాం అందుకుంటున్న భూమా అఖిలప్రియ
ఆళ్లగడ్డ: కర్నూలు జిల్లా ఆళ్లగడ్డ అసెంబ్లీ నియోజకవర్గ ఉప ఎన్నికలో వైఎస్సార్‌సీపీ అభ్యర్థి భూమా అఖిలప్రియ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. వైఎస్సార్‌సీపీ నాయకురాలు శోభా నాగిరెడ్డి మృతితో వచ్చిన ఉప ఎన్నికలో వైఎస్‌ఆర్ కాంగ్రెస్ తరఫున అఖిలప్రియ పోటీ చేశారు. ఎంఎల్‌ఏ మరణానంతరం ఆ స్థానంలో నిర్వహించే ఉప ఎన్నికలో కుటుంబ సభ్యులు పోటీ చేస్తే ఇతర పార్టీలేవీ తమ అభ్యర్థులను పోటీలో నిలపరాదనే సంప్రదాయానికి కాంగ్రెస్, టీడీపీ సహా ఇతర పార్టీలన్నీ కట్టుబడ్డాయి.
అఖిలప్రియతో పాటు ఆరుగురు స్వతంత్రులు నామినేషన్లు దాఖలు చేశారు. నలుగురి నామినేషన్లను రిటర్నింగ్ అధికారి పలు కారణాలతో తిరస్కరించారు. శుక్రవారం ఉపసంహరణకు అవకాశం కల్పించడంతో మిగిలిన ఇద్దరు స్వతంత్రులూ పోటీ నుంచి తప్పుకున్నారు. దీంతో ఎన్నిక ఏకగ్రీవమైనట్లు రిటర్నింగ్ అధికారి ప్రకటించారు. తహశీల్దార్ కార్యాలయంలో నంద్యాల ఎంఎల్‌ఏ భూమా నాగిరెడ్డితో కలసి అఖిలప్రియ డిక్లరేషన్ ఫాం అందుకున్నారు. ఎన్నిక ఏకగ్రీవమయ్యేందుకు సహకరించిన వైఎస్‌ఆర్‌సీపీ అధ్యక్షుడు జగన్‌మోహన్‌రెడ్డి, భూమా నాగిరెడ్డి.. తెలుగుదేశం, కాంగ్రెస్, ఇతర పార్టీల నేతలు, ప్రజలకు అఖిలప్రియ కృతజ్ఞతలు తెలిపారు.