
ఆళ్లగడ్డ ఎన్నికపై సమాలోచన
ఆళ్లగడ్డ: ఆళ్లగడ్డ ఉప ఎన్నికలపై వైఎస్‌ఆర్‌సీపీ నేత, నంద్యాల ఎమ్మెల్యే భూమానాగిరెడ్డి మంగళవారం అందుబాటులో ఉన్న నేతలు...
ఆళ్లగడ్డ: ఆళ్లగడ్డ ఉప ఎన్నికలపై వైఎస్‌ఆర్‌సీపీ నేత, నంద్యాల ఎమ్మెల్యే భూమానాగిరెడ్డి మంగళవారం అందుబాటులో ఉన్న నేతలు, కౌన్సిలర్లతో పట్టణంలోని తన నివాసంలో సమావేశమయ్యారు. ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహంపై వారితో సమాలోచన చేశారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా భూమా అఖిలప్రియను బరిలో దించుతున్నట్లు పార్టీ అధ్యక్షుడు జగన్‌మోహన్‌రెడ్డి ప్రకటించిన తరువాత భూమానాగిరెడ్డి మొదటిసారి ఆళ్లగడ్డకు వచ్చారు.
శోభానాగిరెడ్డి మృతిచెందడంతో జరుగుతున్న ఈ ఎన్నిక ఎకగ్రీవం కాకపోతే ఎన్నికల్లో అనుసరించాల్సిన తీరుపై ఆయన పార్టీశ్రేణులతో చర్చించారు. గ్రామాల వారీగా పార్టీ పరిస్థితులను అడిగి తెలుసుకున్నారు. 2014 ఎన్నికల్లో మెజార్టీ వచ్చిన గ్రామాల్లో ఎక్కువ మెజార్టీ వచ్చేటట్లు చర్యలు తీసుకోవడంతోపాటు, తక్కువ ఓట్లు వచ్చిన గ్రామాల్లో ఓట్ల సంఖ్యను పెంచడానికి కసరత్తు చేయాలన్నారు. ఉప ఎన్నిక జరిగితే ఎన్నికలు ఎదుర్కొవడానికి పార్టీ నేతలు సన్నద్ధ కావాలన్నారు.
పోటీలో ఉన్న అభ్యర్థుల వివరాల ఆధారంగా ఎన్నికల వ్యూహరచన చేయాలని నేతలు నిర్ణయించుకున్నారు. అనంతరం ఆళ్లగడ్డ నగర పంచాయతీలో ఉన్న సమస్యలపై కౌన్సిలర్‌లతో చ ర్చించారు. కౌన్సిలర్‌లు తమ పరిధిలో ఉన్న సమస్యలపై అవగాహన పెంచుకుని ఎన్నికల కోడ్ అనంతరం వాటి పరిష్కరించాలని సూచించారు.
ప్రజలకు అందుబాటులో ఉండి..వారికి అవసరమైన తాగునీరు, వీధిలైట్లు తదితర సౌకర్యాల ఏర్పాటుకు చర్యలు చేపట్టాలని పిలుపునిచ్చారు. సమావేశంలో పార్టీ నాయకులు బీవీ రామిరెడ్డి, చంద్రశేఖర్‌రెడ్డి, రాముయాదవ్, కుమార్‌రెడ్డి, మహేశ్వరరెడ్డి, నగరపంచాయతీ చైర్‌పర్సన్ ఉషారాణి, వైస్ చైర్మన్ రామలింగారెడ్డి తదితరులు పాల్గొన్నారు.