24గంటల్లో అఖిలప్రియను అసెంబ్లీకా?: వైఎస్‌ జగన్‌ | Bhuma Nagireddy condolence motion: chandrababu is doing shameful politics, says ys jagan mohan reddy | Sakshi
Sakshi News home page

24గంటల్లో అఖిలప్రియను అసెంబ్లీకా?: వైఎస్‌ జగన్‌

Published Tue, Mar 14 2017 11:33 AM | Last Updated on Sat, Jul 28 2018 3:39 PM

Bhuma Nagireddy condolence motion: chandrababu is doing shameful politics, says ys jagan mohan reddy

విజయవాడ : నంద్యాల ఎమ్మెల్యే భూమా నాగిరెడ్డి సంతాప తీర్మానాన్ని రాజకీయం చేస్తున్నారని ప్రతిపక్ష నేత,  వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు  వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి అన్నారు. సంతాప తీర్మానం సమయంలోనూ రాజకీయ విమర్శలు చేయడం సరికాదన్నారు. ఇంత దిగజారుడు రాజకీయాలు అవసరమా అని వైఎస్‌ జగన్‌ సూటిగా ప్రశ్నించారు.

మంగళవారం వైఎస్‌ జగన్‌ ఇక్కడ మాట్లాడుతూ అసెంబ్లీ జరుగుతున్న తీరు చూస్తుంటే సిగ్గుతో తల దించుకోవాల్సి వస్తోందన్నారు. తండ్రి మృతి చెందిన 24 గంటల్లోనే అఖిలప్రియను అసెంబ్లీకి  తీసుకురావడం చంద్రబాబు కుసంస్కారానికి నిదర్శనమని వైఎస్‌ జగన్‌ అన్నారు. నాగిరెడ్డి చనిపోయిన విషయం తెలియగానే అఖిలప్రియతో తాను, అమ్మ  ఫోన్‌లో మాట్లాడామన్నారు.  మంత్రి పదవి ఆశ చూపినందువల్లే భూమా నాగిరెడ్డి పార్టీ మారారన్నారు. పార్టీ మారిన మూడు రోజుల్లో మంత్రి పదవి ఇస్తానని చంద్రబాబు నాయుడు తనకు చెప్పారని తమ పార్టీ నేతలతో భూమా చెప్పారన్నారు.  ఏడాది గడిచినా పదవి ఇవ్వలేదని, అంటే భూమా ఎంత మానసిక క్షోభకు గురయ్యారో అర్థం అవుతుందన్నారు.

ఎన్టీఆర్‌ లాగానే నాగిరెడ్డిని కూడా చంద్రబాబు మానసిక క్షోభకు గురి చేశారని వైఎస్‌ జగన్‌ అన్నారు. భూమా హుందాతనాన్ని కాపాడేందుకే తాము సభకు వెళ్లలేదన్నారు. తాము సభకు వెళితే చంద్రబాబు చేయించిన తప్పులు, భూమా చేసిన పనులు గురించి మాట్లాడాల్సి వచ్చేదని అన్నారు. అవన్నీ రికార్డుల్లో వెళ్లేవని, అందుకే తాము సభకు వెళ్లలేదని వైఎస్‌ జగన్‌ పేర్కొన్నారు. తనకు, చంద్రబాబుకు నక్కకు, నాగలోకానికి ఉన్నంత తేడా ఉందన్నారు. 

వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ ఏర్పాటు చేసినప్పుడు తమ వాళ్లతో రాజీనామా చేయించి గెలిపించుకున్నామన్నారు.  భూమా నాగిరెడ్డి మరణించారని, ఆయనపై వివాదాలు అనవసరమని వైఎస్‌ జగన్‌ అన్నారు. అలాగే నంద్యాల ఉప ఎన్నికపై సరైన సమయంలో నిర్ణయం తీసుకుంటామని తెలిపారు. ఆ సీటు తమ పార్టీదే అని, గతంలో ఏ పార్టీవారు మరణిస్తే..గౌరవంగా వాళ్లకే వదిలేసేవాళ్లమని అన్నారు.

కాగా భూమా నాగిరెడ్డి మృతికి సంతాప తీర్మానం సందర్భంగా ఏపీ అసెంబ్లీ సమావేశాలకు ఎమ్మెల్యే భూమ అఖిలప్రియ హాజరయ్యారు.

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement