condolence motion
-
కేసులు.. వేధింపులు.. అవమానాలు
-
ఇదేం దిగజారుడు రాజకీయం?
-
ఇదేం దిగజారుడు రాజకీయం?
టీడీపీ తీరుపై వైఎస్ జగన్మోహన్రెడ్డి ఫైర్ ⇒ భూమా సంతాప తీర్మానాన్ని కూడా రాజకీయాలకు వాడుకుంటారా? ⇒ ఆయన మంచి మాత్రమే రికార్డుల్లో ఉండాలని సభకు దూరంగా ఉన్నాం ⇒ భూమాతో చంద్రబాబు తప్పు చేయించారు.. అది మేం చెప్పాల్సి వచ్చేది ⇒ అఖిల ప్రియకు మొట్టమొదట ఫోన్ చేసింది నేను, మా అమ్మే.. ⇒ భూమా మరణించి 24 గంటలు కూడా గడవలేదు..రాజకీయం కోసమే ఆయన కూతుర్ని శాసనసభకు తీసుకొచ్చారు ⇒ బాబు మూడురోజుల్లో మంత్రిని చేస్తానన్నాడని మావాళ్లకు భూమా చెప్పాడు ⇒ నంద్యాల మాదే.. ఉప ఎన్నికలలో కచ్చితంగా పోటీ చేస్తాం సాక్షి, అమరావతి: దివంగత ఎమ్మెల్యే భూమా నాగిరెడ్డి మంచితనమే ఏపీ శాసనసభ రికార్డుల్లో ఉండాలని, ఆయన చివరి దశలో చేసిన తప్పులు రికార్డుల్లోకి వెళ్లడం తమకు ఇష్టం లేదని వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్రెడ్డి చెప్పారు. ఈ కారణంగానే వైఎస్సార్సీపీ శాసనసభా పక్షం మంగళవారం భూమా సంతాప తీర్మానం సందర్భంగా శాసనసభలోకి వెళ్లలేదని స్పష్టం చేశారు. దివంగత నాయకుడి సంతాప తీర్మానాన్ని కూడా రాజకీయం చేసిన ఘనత టీడీపీదేనని ధ్వజమెత్తారు. దిగజారుడు, కుసంస్కార రాజకీయాలు ఆ పార్టీకి కొత్తేమీ కాదని మండిపడ్డారు. మంగళవారం అసెంబ్లీ వాయిదా పడిన తరువాత వైఎస్ జగన్ లాబీల్లోని తన చాంబర్లో మీడియాతో మాట్లాడారు. మనుషుల్లో ఉండాల్సింది తొలుత మానవత్వమని చెప్పారు. అయితే, మంగళవారం అసెంబ్లీలో జరిగింది చూస్తే సంతాప తీర్మానం వెనక్కిపోయి రాజకీయమే ముందుకొచ్చిందనే విషయం స్పష్టమైందన్నారు. తాము సభలోకి వెళ్లి సంతాప తీర్మానంపై మాట్లాడి ఉంటే భూమా నాగిరెడ్డి మంచితోపాటుగా చివరలో ఆయన చేసిన తప్పును కూడా చెప్పాల్సి వచ్చేదన్నారు. భూమా చేసిన తప్పును చెప్పడం ఇష్టంలేకనే హుందాతనం పాటించామని పేర్కొన్నారు. జగన్ ఇంకా ఏం చెప్పారంటే.... మొదట ఫోన్ చేసింది నేను, మా అమ్మే ‘‘భూమా నాగిరెడ్డి చనిపోయాడు. ఆయన చివరిదశలో చేసిన తప్పును ఎందుకు చెప్పడం, అదంతా అసెంబ్లీ రికార్డుల్లోకి పోవడం ఎందుకు అని సభలోకి వెళ్లకుండా మౌనంగానే ఉందామనుకున్నాం. మేము కనుక అసెంబ్లీలోకి వెళ్లి ఉంటే.. చంద్రబాబు చేయిస్తే భూమా ఎలా తప్పు చేశారో మేం చెప్పాల్సి వచ్చేది. అలా చెప్పి ఉంటే ఏమయ్యేది? ఎవరు రాజకీయాలు చేస్తున్నారు? ఎవరు హుందాగా వ్యవహరిస్తున్నారో అర్థం చేసుకోండి. నాగిరెడ్డి చనిపోయాడని తెలిసి మొట్టమొదట ఫోన్ చేసింది నేనూ, మా అమ్మే. మృతి వార్త తెలియగానే చాలా బాధేసింది. ఇద్దరమూ అఖిలప్రియతో మాట్లాడి ధైర్యం చెప్పాం. అదీ వ్యక్తిగతంగా మేం ప్రదర్శించిన మానవత్వం. కానీ, ఇక్కడ కుట్ర రాజకీయాలు జరుగుతున్నాయి. 24 గంటలైనా గడవక ముందే అఖిలను అసెంబ్లీకి ఎందుకు తీసుకొచ్చారు? తండ్రి మరణించి 24 గంటలైనా గడవక ముందే అఖిలప్రియను రాజకీయాల కోసం అసెంబ్లీకి తీసుకొ చ్చారు. ఆమె తన కుటుంబ సభ్యులతో కలిసి ఉండి ఏడ్వడానికీ అవకాశం ఇవ్వలేదు. వీళ్ల(టీడీపీ పెద్దలు) రాజకీయాలను చూసి అందరూ సిగ్గుపడాల్సిన పరిస్థితి ఏర్పడింది. రాజకీయ పార్టీని నడిపేటప్పుడు ఒక అంశాన్ని గుర్తుంచుకోవాలి. మేము సారథ్యం వహిస్తున్న పార్టీని కూడా పరిగణనలోకి తీసుకోవాల్సి ఉంటుంది. అది చాలా ముఖ్యం. మనకు ఒకరిపై ఉన్న వ్యక్తిగత అభిమానం పార్టీ శ్రేణుల నైతికతను దెబ్బతీసే విధంగా ఉండరాదు. భూమా మృతి చెందిన విషయం తెలియగానే మేము ఆయన కుమార్తెకు ఫోన్ చేసి, పరామర్శించాం. ఇదీ తక్షణమే మేము స్పందించిన తీరు. అంతకు మించి ఏం చేసినా పార్టీ శ్రేణులకు తప్పుడు సంకేతాలు వెళతాయి. ఫిరాయించినవారితో మాట్లాడించి లబ్ధి పొందుదామనుకున్నారు.. మేం అక్కడకు (సభలోకి) వెళ్లి ఏం చెప్పినా అది వివాదానికి దారితీసి, పరిస్థితి వేరే రకంగా ఉండేది. మా పార్టీ నుంచి ఎవరైతే టీడీపీలోకి ఫిరాయించారో అలాంటి వారి చేతనే... చాంద్బాషా మొదలు డేవిడ్రాజు లాంటి వారి చేతనే మాట్లాడించారు. వాళ్లతో మాట్లాడించిన తీరు చూస్తే దీనిలో నుంచి ఏ విధంగా రాజకీయ లబ్ది పొందాలా అనే ఆలోచనలోనే టీడీపీ వారు మునిగిపోయినట్లుగా కనిపిస్తుంది. 24 గంటలైనా గడవక ముందే అఖిలప్రియను తీసుకొచ్చి శాసనసభలో కూర్చోబెట్టి రాజకీయాలు చేస్తా ఉన్నపుడు అలాంటి సభలో మేం ఏం మాట్లాడినా భూమా ప్రతిష్ట దెబ్బతినడమే కాకుండా మొత్తం రాజకీయంగా వివాదాస్పదం అవుతుంది. అసెంబ్లీలో సంతాపతీర్మానంపై ముందు విష్ణుకుమార్రాజుతో మాట్లాడించారు. ఆయన మాట్లాడిన మాటలు ఎంత రెచ్చగొట్టే విధంగా ఉన్నాయో అర్ధం అయ్యే ఉంటుంది. మేం కనుక అసెంబ్లీలోకి వెళ్లి ఉంటే చంద్రబాబు తప్పు చేయిస్తే భూమా నాగిరెడ్డి ఎలా తప్పు చేశారో మేం చెప్పాల్సి వచ్చేది. అలా చెప్పి ఉంటే ఏమయ్యేదో అర్ధం చేసుకోండి. చంద్రబాబు మూడు రోజుల్లో మంత్రిపదవి ఇస్తానని చెప్పాడట.. భూమా వైఎస్సార్సీపీని వీడి వెళ్లాలని అనుకుంటున్న రోజు సజ్జల రామకృష్ణారెడ్డి, వైవీ సుబ్బారెడ్డి ఆయనతో మాట్లాడ్డానికి ఆయన ఇంటికి వెళ్లారు. ‘ఎందుకు వెళుతున్నారన్నా.. మీరు పొరబాటు చేస్తున్నారు’ అని నచ్చజెప్పేందుకు ప్రయత్నించారు. ‘నాకు మూడే మూడు రోజుల్లో మంత్రి పదవి ఇస్తానని చంద్రబాబు చెప్పారు. పచ్చకండువా వేసుకోవడమే ఆలస్యం... వెంటనే మంత్రిగా ప్రమాణస్వీకారం చేయిస్తారు. అందుకే టీడీపీలోకి వెళుతున్నా’ అని సజ్జల, వైవీతో భూమా చెప్పారు. ‘జగన్ను విడిచిపెట్టి పోవడం ఇష్టం లేదు’ అని భూమా కన్నీళ్లు పెట్టుకున్నారు. ఒక పార్టీలో గెలిచి మరో పార్టీలోకి వెళితే మంత్రి పదవి ఎలా ఇస్తారని రామకృష్ణారెడ్డి ప్రశ్నిస్తే... చంద్రబాబు ఇస్తానన్నాడని నాగిరెడ్డి సమాధానమిచ్చారు. అలాంటి వ్యక్తిని సంవత్సరంపాటు అలాగే ఉంచేశారు. ప్రలోభాలు పెట్టినవాళ్లది ఎంత తప్పో, ఆ ప్రలోభాలకు లొంగిన వాళ్లది కూడా అంతే తప్పు. చంద్రబాబు గతంలో ఎన్టీ రామారావును ఏ రకంగా క్షోభకు గురిచేసి గుండెపోటుతో చనిపోయేటట్లుగా చేశారో ఇప్పుడు భూమా విషయంలో కూడా సరిగ్గా అలాగే జరిగింది. ఇంగితం ఉన్న వారికెవరికైనా.... ఒక పార్టీ నుంచి గెలిచిన వారికి మరో పార్టీలో మంత్రి పదవి ఇవ్వరాదనేది ఇంగితం ఉన్న వారెవరికైనా తెలిసిన అంశం. పదో తరగతి చదివినోడికి కూడా ఈ విషయం తెలుస్తుంది. అందుకే భూమా దగ్గరకి మా వాళ్లు వెళ్లి ఆయనకు జ్ఞానోదయం కలిగించేందుకు ప్రయత్నించారు. కానీ మూడు రోజుల్లో మంత్రి పదవి ఇస్తానని చంద్రబాబు చూపిన ఆశ ముందు మా వాళ్ల హితవు పని చేయలేదు. తెలంగాణలో టీడీపీ వారికి టీఆర్ఎస్ ప్రభుత్వంలో మంత్రి పదవి ఇచ్చినపుడు చంద్రబాబు ఏ విధంగా బయటకు వచ్చి మాట్లాడారో అందరికీ తెలుసు. గవర్నర్ను తప్పు దోవ పట్టించారనీ, అందుకే గవర్నర్ తప్పు చేశారని అన్నారు కదా. ఆరోజు గవర్నర్ను తప్పుదోవ పట్టించిన పరిస్థితుల్లో ఆయన తప్పు చేశారు. అక్కడ జరిగిన అదే తప్పును గవర్నర్ చేత రెండోసారి, మూడో సారి తప్పు చేయించాలంటే ఎవరూ చేయరు. ఒక పార్టీలో ఉన్న వారికి మంత్రిపదవి ఇవ్వాలంటే ఉన్న పార్టీకి రాజీనామా ఇచ్చి దానిని ఆమోదింప జేసుకున్న తరువాతనే మంత్రివర్గంలోకి తీసుకుంటారు. అలా జరగక పోతే ఇక ప్రజాస్వామ్యమనేదే ఉండదు. ఏ పార్టీ టికెట్ మీద గెలిచిన వాడైనా వచ్చి మంత్రి పదవి తీసుకోవడం ఏ మాత్రం ప్రజాస్వామ్య బద్ధం కాదు. స్పీకర్ మనవాడే... అధికారపక్షానికి చెందిన వాడే కాబట్టి ఏం చేసినా అనర్హత వేటు పడదు అంటే, అసలు ప్రజాస్వామ్యం ఉందనుకోవాలా... బతుకుతుందా? ప్రజాస్వామ్యం బతకాలి అనంటే అందుకు కొన్ని విధానాలు కచ్చితంగా పాటించాల్సి ఉంటుంది. ప్రజాస్వామ్యంలో మెజారిటీ వచ్చిన పార్టీ అధికారంలోకి వస్తుంది. అధికారపక్షం ఎమ్మెల్యేలే మంత్రులుగా ప్రమాణస్వీకారం చేస్తారు. దాన్నే ప్రజాస్వామ్యమంటారు. దేశంలో... ప్రపంచంలో ఎక్కడ చూసినా ఇదే కనిపిస్తుంది. అధికారపక్షంలో మంత్రి పదవి పొందాలంటే ముందుగా తామున్న పదవికి రాజీనామా చేయాలి. మళ్లీ గెలుపొందాలి. ఆ తరువాతనే పదవి పొందాలి. ఎవరి ఇష్టా ఇష్టాల మీదనో ఆధారపడి అన్నీ ఇష్టానుసారం చేస్తాం అంటే కుదరదు. రేపు పొద్దున మేం కూడా అధికారంలోకి వస్తాం. వచ్చాక ఇదే కార్యక్రమం టప టప చేయాలంటే అదేమీ పెద్ద పని కానే కాదు. ఎవరైనా చేస్తారు. అందుకే గవర్నర్ ఫిరాయించిన వాళ్లతో ప్రమాణం చేయించలేరు. గవర్నర్ ఇలాంటివి ప్రోత్సహించరు. (భవిష్యత్తులో మీరు ఇలాంటివి ప్రోత్సహించరా? అని ప్రశ్నించినపుడు) ఇపుడే కాదు, గతంలో కూడా ఇలాంటివి చేయించలేదు. నా వ్యక్తిత్వానికి, చంద్రబాబు వ్యక్తిత్వానికి నక్కకూ... నాకలోకానికీ ఉన్నంత తేడా ఉంది. మేం ఎప్పుడైనా ఏదైనా రాజకీయాలు చేయాలనుకుంటే హుందాగానే చేస్తాం. నేనెవరికైనా మంత్రి పదవి ఇవ్వాలనుకుంటే ముందున్న పార్టీ పదవికి రాజీనామా చేయించి ఆమోదింప జేస్తాను. ఆ తరువాతనే మంత్రి పదవిని ఇస్తాను. అలా మంత్రి పదవి ఇచ్చిన వ్యక్తిని ప్రజల దగ్గరకు తీసుకు పోయి నా పార్టీ టికెట్ ఇచ్చి, నేనే ప్రచారం చేసి నన్ను చూసి ఓట్లేయమని అడుగుతాను. గెలిపించుకుని వస్తాను. ఇది కొత్తగా ఈ రోజు చేసింది కాదు. గతంలో మా పార్టీలోకి చేరడానికి ఉత్సాహం చూపించిన 18 మంది ఎమ్మెల్యేల చేత అప్పటి రాష్ట్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా అవిశ్వాసతీర్మానంపై ఓట్లు వేయించాను. వారంతా అనర్హతకు గురయ్యాక మా పార్టీ బీ ఫాం ఇచ్చి ఉప ఎన్నికల్లో పోటీ చేయించాం. అపుడు నేను, మా అమ్మ మాత్రమే పార్టీలో ఉన్నాం. ఎన్నికల్లో 15 మంది ఎమ్మెల్యేలు తిరిగి గెలుపొందారు. నంద్యాలలో పోటీ చేస్తాం విలేకరుల ప్రశ్నలకు జగన్ సమాధానమిస్తూ....‘నంద్యాల ఉప ఎన్నికలో కచ్చితంగా పోటీ చేస్తాం... అది అక్షరాలా మాసీటే... అయితే మేం ఈ విషయంలో ఏం చేస్తాం... ఎప్పుడు చేస్తాం అనేది వేచి చూడండి. సరైన సమయంలో మేం కచ్చితంగా ఒక నిర్ణయం తీసుకుంటాం. ఈ విషయంలో మాకు ఎలాంటి మొహమాటం (ఆబ్లిగేషన్) లేదు. ఎందుకంటే అది మా సీటే... గతంలో కొన్ని సందర్భాల్లో ఎవరైనా ఎమ్మెల్యేలు ఏ పార్టీకి చెందిన వారైనా చనిపోతే వారి కుటుంబం నుంచే మరొకరు పోటీ చేసినపుడు అలాంటి చోట్ల పోటీ చేయరాదనే విధానానికి కట్టుబడి పోటీ పెట్టలేదు. కానీ నంద్యాల విషయంలో ఈ సారి అలా చేయం. ఈ సీటు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీదే. అక్కడి ప్రజలు గత ఎన్నికల్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకే ఓట్లేశారు. అందుకే పోటీ చేస్తాం. చంద్రబాబుది విలన్ క్యారెక్టర్ ఏ సినిమాకు వెళ్లినా... ఏ కథలోనైనా ఒకటే కనిపిస్తుందని రాజకీయాలు చేసే వారు ఎప్పుడూ గుర్తుంచుకోవాలి. వాటిలో ఒక హీరో క్యారెక్టర్, ఒక విలన్ క్యారెక్టర్ ఉంటాయి. హీరో క్యారెక్టర్ ఎలా ఉంటుందో కొంచెం ఆలోచించుకోండి. కానీ విలన్ క్యారెక్టర్ గురించి పెద్దగా ఆలోచించాల్సిన పని లేదు. చంద్రబాబు దగ్గర కూర్చుంటే తెలిసి పోతుంది. మేము కనుక సంతాప తీర్మానం సందర్భంగా సభలోకి వెళ్లి ఉంటే పాపం చనిపోయిన భూమా నాగిరెడ్డిని తప్పు చేసిన వ్యక్తిగా చెప్పాల్సి వచ్చేది. చనిపోయాడు కనుక ఆయన విషయంలో మర్యాద పాటించాలనుకున్నాం. మా మంచితనం చూపించాలనుకున్నాం, మంచితనాన్ని ప్రదర్శించాం. టీడీపీ వాళ్లు కుసంస్కార రాజకీయాల్లో పుట్టి పెరిగారు. 24 గంటలైనా గడవక ముందే భూమా కుమార్తెను అసెంబ్లీకి తేవడం వారి కుసంస్కారానికి నిదర్శనం. నిజంగా కుసంస్కారం, దిగజారుడు రాజకీయాలు వారివే. గతంలో శాసనసభలో శోభానాగిరెడ్డికి సంతాపం చెప్పడానికి కూడా టీడీపీ ప్రభుత్వం అంగీకరించలేదు. మా ఎమ్మెల్యేలు ప్రెస్మీట్ పెట్టి విమర్శించిన తరువాత గానీ ఆమె పేరును తీర్మానంలో చేర్చలేదు. ఇవన్నీ జరిగిన యథార్థాలే... అసెంబ్లీ రికార్డులను తిరగేస్తే అన్నీ తెలుస్తాయి. కుసంస్కార రాజకీయాల్లో పుట్టి పెరిగిన వీళ్లు ఎన్టీరామారావును వెన్నుపోటు పొడిచిన దగ్గరి నుంచీ అంతా కుసంస్కార రాజకీయాలే చేశారు. అయినా ఎవరు రాజకీయాలు చేస్తున్నారు, ఎవరు చేయడం లేదు, ఎవరు హుందాతనాన్ని ప్రదర్శించారు, ఎవరు ప్రదర్శించలేదు ఇవన్నీ చూసే వారికి అర్థం అవుతుంది. ఇంతకంటే నేను చెప్పేదేమీ లేదు. -
అఖిలప్రియతో అబద్ధాలు చెప్పించారు..
విజయవాడ: అసెంబ్లీ సాక్షిగా తెలుగుదేశం పార్టీ శవ రాజకీయాలు చేస్తోందని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గిడ్డి ఈశ్వరి తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. ఇవాళ అసెంబ్లీలో జరిగిన తీరు చూస్తుంటే.. భూమా నాగిరెడ్డికి సంతాప తీర్మానం కార్యక్రమమా లేక వైఎస్ జగన్పై విమర్శలా అనే అనుమానం కలుగుతోందన్నారు. భూమా నాగిరెడ్డి సతీమణి శోభా నాగిరెడ్డి ఒకప్పుడు టీడీపీలో కీలక పాత్ర వహించారని, ఆ పార్టీకి ఎంత చేశారని, అలాంటిది...ఆమె చనిపోయినప్పుడు సంతాపం తెలిపేందుకు టీడీపీ నేతలు ఎందుకు రాలేదని ఎమ్మెల్యే గిడ్డి ఈశ్వరి ప్రశ్నలు సంధించారు. అసెంబ్లీలో శోభా నాగిరెడ్డికి సంతాప తీర్మానం తెలిపేందుకు కూడా టీడీపీ ఇష్టపడలేదన్నారు. గతంలో చంద్రబాబు నాయుడు ప్రవర్తించిన తీరు ఇప్పుడు గుర్తుకు రావడం లేదా అని అడిగారు. శోభా నాగిరెడ్డి చనిపోతే ... ఆ స్థానంలో ఎన్నికలు జరిగితే ఇదే చంద్రబాబు తమ పార్టీ అభ్యర్థిని ఎందుకు నిలబెట్టారన్నారు. ఇక భూమా నాగిరెడ్డి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్నప్పుడు ఆయనపై రౌడీషీట్ పెట్టిందెవరని, ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసులు పెట్టించి, పోలీసులతో అరెస్ట్ చేయించి వేధింపులకు గురి చేసింది ఎవరో చెప్పాలని గిడ్డి ఈశ్వరి డిమాండ్ చేశారు. ఆ రోజు భూమా నాగిరెడ్డిని కేసులతో వేధించింది టీడీపీ కాదా అని అడిగారు. పార్టీ మారితే మూడు రోజుల్లో మంత్రి ఇస్తానని చెప్పి, ఏడాది గడిచినా పదవి ఇవ్వకపోవడం వాస్తవం కాదా అని అన్నారు. చంద్రబాబు మోసంతోనే భూమా నాగిరెడ్డి మానసిక క్షోభకు గురయ్యారన్నారు. చనిపోయిన తర్వాత భూమా నాగిరెడ్డిపై ప్రేమ ఒలకబోస్తున్న చంద్రబాబు ... ఆయన బతికి ఉన్నప్పుడు ఏం చేశారన్నారు. హిందు సంప్రదాయం ప్రకారం కుటుంబంలో వ్యక్తి చనిపోతే ... ఆ కుటుంబసభ్యులు కనీసం మూడురోజుల పాటు అయినా ఊరి పొలిమేర దాటరన్నారు. అలాంటిది తండ్రిని కోల్పోయి పుట్టెడు దుఖంలో ఉన్న అఖిలప్రియను అసెంబ్లీ సమావేశాలుకు తీసుకు రావడం వెనుక చంద్రబాబు, ఆయన కుమారుడు లోకేశ్ పాత్ర ఉందన్నారు. ఒక మహిళగా అఖిలప్రియ బాధ, ఆవేదన, సంఘర్షణను తాము అర్థం చేసుకుంటామన్నారు. అలాంటిది ఓ అమాయకురాలి చేత లేనిపోని అబద్ధాలు మాట్లాడించారన్నారు. తనను ఎవరూ అసెంబ్లీ సమావేశాలకు రమ్మనలేదని, తన అంతట తానుగానే వచ్చానని అఖిలప్రియతో చెప్పించారన్నారు. ఆమెను చంద్రబాబు, ఆయన కుమారుడే బలవంతంగా సమావేశాలకు రప్పించారన్నారు. నూతన రాజధానిలో అసెంబ్లీ సమావేశాలు ప్రారంభంలో హాజరు కాని అఖిలప్రియ.... తండ్రి చనిపోయి పట్టుమని మూడు రోజులు కూడా కాకముందే సభకు ఎలా వచ్చారన్నారు. ఇక భూమా సంతాప తీర్మాన కార్యక్రమం సందర్భంగా అసెంబ్లీకి వెళ్లకపోవడంతో ప్రతిపక్ష పార్టీపై టీడీపీ బురద జల్లుతుందన్నారు. ప్రజల ముందు తమను తప్పుగా చిత్రీకరించేందుకు చూస్తోందన్నారు. ఈ విషయాన్ని ప్రజలంతా గమనిస్తున్నారని అన్నారు. విలువల గురించి మాట్లాడేవారు ఒకసారి గతాన్ని గుర్తు చేసుకుంటే మంచిదని అన్నారు. ఓ పార్టీ నుంచి గెలిచి మరో పార్టీలోకి వెళ్లడం నైతిక విలువలతో కూడిన రాజకీయమా అని గిడ్డి ఈశ్వరి ప్రశ్నించారు. సంతాప తీర్మానంలో ఎక్కడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో గెలిచి టీడీపీలోకి వెళ్లిన విషయాన్ని ప్రస్తావించకపోవడం సరికాదన్నారు. -
అఖిలప్రియతో అబద్ధాలు చెప్పించారు..
-
24గంటల్లో అఖిలప్రియను అసెంబ్లీకా?
-
24గంటల్లో అఖిలప్రియను అసెంబ్లీకా?: వైఎస్ జగన్
విజయవాడ : నంద్యాల ఎమ్మెల్యే భూమా నాగిరెడ్డి సంతాప తీర్మానాన్ని రాజకీయం చేస్తున్నారని ప్రతిపక్ష నేత, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అన్నారు. సంతాప తీర్మానం సమయంలోనూ రాజకీయ విమర్శలు చేయడం సరికాదన్నారు. ఇంత దిగజారుడు రాజకీయాలు అవసరమా అని వైఎస్ జగన్ సూటిగా ప్రశ్నించారు. మంగళవారం వైఎస్ జగన్ ఇక్కడ మాట్లాడుతూ అసెంబ్లీ జరుగుతున్న తీరు చూస్తుంటే సిగ్గుతో తల దించుకోవాల్సి వస్తోందన్నారు. తండ్రి మృతి చెందిన 24 గంటల్లోనే అఖిలప్రియను అసెంబ్లీకి తీసుకురావడం చంద్రబాబు కుసంస్కారానికి నిదర్శనమని వైఎస్ జగన్ అన్నారు. నాగిరెడ్డి చనిపోయిన విషయం తెలియగానే అఖిలప్రియతో తాను, అమ్మ ఫోన్లో మాట్లాడామన్నారు. మంత్రి పదవి ఆశ చూపినందువల్లే భూమా నాగిరెడ్డి పార్టీ మారారన్నారు. పార్టీ మారిన మూడు రోజుల్లో మంత్రి పదవి ఇస్తానని చంద్రబాబు నాయుడు తనకు చెప్పారని తమ పార్టీ నేతలతో భూమా చెప్పారన్నారు. ఏడాది గడిచినా పదవి ఇవ్వలేదని, అంటే భూమా ఎంత మానసిక క్షోభకు గురయ్యారో అర్థం అవుతుందన్నారు. ఎన్టీఆర్ లాగానే నాగిరెడ్డిని కూడా చంద్రబాబు మానసిక క్షోభకు గురి చేశారని వైఎస్ జగన్ అన్నారు. భూమా హుందాతనాన్ని కాపాడేందుకే తాము సభకు వెళ్లలేదన్నారు. తాము సభకు వెళితే చంద్రబాబు చేయించిన తప్పులు, భూమా చేసిన పనులు గురించి మాట్లాడాల్సి వచ్చేదని అన్నారు. అవన్నీ రికార్డుల్లో వెళ్లేవని, అందుకే తాము సభకు వెళ్లలేదని వైఎస్ జగన్ పేర్కొన్నారు. తనకు, చంద్రబాబుకు నక్కకు, నాగలోకానికి ఉన్నంత తేడా ఉందన్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏర్పాటు చేసినప్పుడు తమ వాళ్లతో రాజీనామా చేయించి గెలిపించుకున్నామన్నారు. భూమా నాగిరెడ్డి మరణించారని, ఆయనపై వివాదాలు అనవసరమని వైఎస్ జగన్ అన్నారు. అలాగే నంద్యాల ఉప ఎన్నికపై సరైన సమయంలో నిర్ణయం తీసుకుంటామని తెలిపారు. ఆ సీటు తమ పార్టీదే అని, గతంలో ఏ పార్టీవారు మరణిస్తే..గౌరవంగా వాళ్లకే వదిలేసేవాళ్లమని అన్నారు. కాగా భూమా నాగిరెడ్డి మృతికి సంతాప తీర్మానం సందర్భంగా ఏపీ అసెంబ్లీ సమావేశాలకు ఎమ్మెల్యే భూమ అఖిలప్రియ హాజరయ్యారు. -
'భూమా నాగిరెడ్డి చివరి కోరిక అదే'
-
'భూమా నాగిరెడ్డి చివరి కోరిక అదే'
అమరావతి: నంద్యాల ఎమ్మెల్యే భూమా నాగిరెడ్డి మరణం కర్నూలు జిల్లాకు తీరని లోటని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు. భూమా నాగిరెడ్డిపై మంగళవారం అసెంబ్లీలో సంతాప తీర్మానం ప్రవేశపెట్టారు. ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ.. నాగిరెడ్డి మరణం బాధాకరమని అన్నారు. గ్రామస్థాయి నుంచి అత్యున్నత చట్టసభ వరకు ఆయన రాజకీయ ప్రస్థానం కొనసాగిందన్నారు. ఆయన రాజకీయ ప్రస్థానం స్ఫూర్తిదాయకమని కొనియాడారు. రైతు సంక్షేమం కోసం తపించారని, ఫ్యాక్షన్ వ్యతిరేకంగా పోరాడారని తెలిపారు. ముఠాకక్షలకు వ్యతిరేకంగా శాంతియాత్రలు చేశారని వెల్లడించారు. తనను కలిసిన 24 గంటల్లోనే నాగిరెడ్డి మరణించడం పట్ల చంద్రబాబు ఆవేదన వ్యక్తం చేశారు. నంద్యాల నియోజకవర్గాన్ని బాగా అభివృద్ధి చేయాలని, పేదలందరికీ ఇళ్లు కట్టించాలని తనను కోరారని, అదే ఆయన చివరి కోరిక అని చెప్పారు. భూమా కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలుపుతూ అన్నివిధాలా అండగా ఉంటామని భరోసాయిచ్చారు. భూమా నాగిరెడ్డి కుమార్తె అఖిలప్రయ అసెంబ్లీ సమావేశాలకు హాజరయ్యారు. సంతాప తీర్మానం తరువాత సభ వాయిదా పడనుంది. బుధవారం అసెంబ్లీలో యనమల రామకృష్ణుడు బడ్జెట్ ప్రవేశపెట్టనున్నారు. -
ఏంచేయాలో అది చేస్తాం: చంద్రబాబు
హైదరాబాద్: తమకు అధికారం ముఖ్యం కాదని రాష్ట్ర ప్రయోజనాలే ముఖ్యమని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. ప్రత్యేక హోదాపై ప్రతిపక్ష వైఎస్సార్ సీపీ రాజకీయం చేస్తోందని ఆయన ఆరోపించారు. ప్రత్యేక హోదా బలిదానాలు చేసుకున్నవారికి సంతాపం ప్రకటిస్తూ శాసనసభలో సోమవారం తీర్మానం ప్రవేశపెట్టారు. ఈ సందర్భంగా విపక్ష నాయకుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి మాట్లాడుతూ.... ప్రత్యేక హోదాపై చంద్రబాబు, బీజేపీ కేంద్ర మంత్రులు ఇష్టమొచ్చినట్టు మాట్లాడడం వల్లే ఆత్మహత్యలకు పాల్పడ్డారని ఆరోపించారు. మధ్యలో కలగజేసుకున్న చంద్రబాబు తీవ్రస్థాయిలో విపక్ష పార్టీపై మండిపడ్డారు. ప్రతిపక్షం ఇష్టమొచ్చినట్టు మాట్లాడుతున్నారని అన్నారు. మీరిలాగే మాట్లాడితే.. మేం ఏంచేయాలో అది చేస్తాం అంటూ బెదిరింపు ధోరణిలో మాట్లాడారు. కేంద్రం నుంచి తమ మంత్రులను తప్పుకోవాలని అడిగే హక్కు వైఎస్సార్ సీపీకి లేదన్నారు. తమ మంత్రులు రాజీనామా చేస్తే... వైఎస్సార్ సీపీ వాళ్లు ఏమైనా కేంద్రంలో చేరతారా అని ప్రశ్నించారు. విభజన చట్టాన్ని సంపూర్ణంగా అమలు చేయాలని కేంద్రాన్ని కోరినట్టు చంద్రబాబు చెప్పారు. -
అచ్చెన్నాయుడికి స్పీకర్ మందలింపు
హైదరాబాద్: శాసనసభ వేదికగా ఆంధ్రప్రదేశ్ మంత్రి కె అచ్చెన్నాయుడు మరోసారి నోరు పారేసుకున్నారు. సభలో ప్రతిపక్ష నాయకుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డిని దుర్భాషలాడారు. గోదావరి పుష్కరాల సందర్భంగా రాజమండ్రిలో జరిగిన తొక్కిసలాటలో మృతి చెందిన వారికి సంతాపంగా సోమవారం అసెంబ్లీలో సంతాప తీర్మానం ప్రవేశపెట్టారు. ఈ సందర్భంగా వైఎస్ జగన్ మాట్లాడుతూ... తొక్కిసలాట జరగడానికి సీఎం చంద్రబాబే కారణమని ఆరోపించారు. దీంతో అధికార సభ్యులు జగన్ ప్రసంగానికి అడ్డుతగిలారు. గోదావరి పుష్కరాలపై రోజంతా చర్చకు సిద్ధమంటూనే మంత్రి అచ్చెన్నాయుడు ఒంటికాలిపై లేచారు. జగన్ పై వ్యక్తిగత విమర్శలకు దిగారు. స్పీకర్ మందలించడంతో అచ్చెన్నాయుడు వెనక్కి తగ్గారు. తొక్కిసలాట ఘటనపై ప్రతిపక్ష నేత నిలదీయడంతో ప్రభుత్వం ఇరుకున పడడంతో టీడీపీ సభ్యులు తమ నోటికి పనిచెప్పారు. -
పుష్కరాల్లో తొక్కిసలాట బాధాకరం: చంద్రబాబు
హైదరాబాద్: గోదావరి పుష్కరాలు సందర్భంగా రాజమండ్రిలో తొక్కిసలాట చోటుచేసుకోవడం దురదృష్టకరమని ఏపీ సీఎం చంద్రబాబు అన్నారు. అన్ని ఏర్పాట్లు చేసినా తొక్కిసలాట జరిగిందని వాపోయారు. సోమవారం శాసనసభలో తొక్కిసలాట మృతులకు సంతాపం తెలుపుతూ తీర్మానాన్ని ఆయన ప్రవేశపెట్టారు. ఇతర రాష్ట్రాల నుంచి భారీ సంఖ్యలో వస్తారని అంచనాతో ఏర్పాట్లు చేసినా తొలి రోజునే ఘటన జరగడం బాధాకరమని చంద్రబాబు అన్నారు. తొక్కిసలాటలో 28 మంది చనిపోవడం కలచివేసిందన్నారు. ఘటన జరిగిన తర్వాత తాను రాజమండ్రిలోనే ఉండి పరిస్థితులు చక్కదిద్దానని చెప్పుకొచ్చారు. చనిపోయినా వారికి తీసుకురాలేకపోయినా వారి కుటుంబాలను ఆదుకుంటామని హామీయిచ్చారు. మృతుల కుటుంబాలకు రూ.10 లక్షల ఎక్స్ గ్రేషియా ఇచ్చామని తెలిపారు. -
మామూలు కుటుంబంలో పుట్టి....
హైదరాబాద్: రాష్ట్రపతి పదవికి వన్నె తెచ్చిన వ్యక్తి అబ్దుల్ కలాం అని ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు అన్నారు. దేశాన్ని అగ్రస్థానంలో నిలిపేందుకు ఆయన కృషి చేశారని కొనియాడారు. సోమవారం శాసనసభలో మాజీ రాష్ట్రపతి అబ్దుల్ కలాంపై సంతాప తీర్మానాన్ని ఆయన ప్రవేశపెట్టారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ... యువతలో స్ఫూర్తి నింపేందుకు కలాం అనునిత్యం ప్రయత్నం చేశారని చెప్పారు. మామూలు కుటుంబంలో పుట్టి అసాధారణ వ్యక్తిగా ఎదిగారని ప్రశంసించారు. రాష్ట్రపతిగా నదుల అనుసంధానికి కృషి చేశారని వెల్లడించారు. కలాం పేరుతో పురస్కారాలు ఇవ్వనున్నామని, నాగార్జున వర్సిటీలో కలాం విగ్రహం పెడతామని తెలిపారు. ఒంగోలు ట్రిపుల్ ఐటీకి కలాం పేరు పెడతామన్నారు. కలాం ఆశయ సాధన కోసం కృషి చేయడమే ఆయనకు నిజమైన నివాళి అని చంద్రబాబు అన్నారు. -
శోభ భర్తగా గర్వపడుతున్నా: భూమా నాగిరెడ్డి
హైదరాబాద్: శోభానాగిరెడ్డి తనకు భార్య మాత్రమే కాదని మంచి స్నేహితురాలు కూడా అని భూమా నాగిరెడ్డి అన్నారు. దివంగత శోభానాగిరెడ్డికి ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సంతాపం తెలిపింది. ఈ సందర్భంగా నాగిరెడ్డి మాట్లాడుతూ... చాలా బాధతో అసెంబ్లీలో నిలుచున్నానని చెప్పారు. రాష్ట్రం విడిపోయిన తర్వాత జరుగుతున్న ఆంధ్రప్రదేశ్ తొలి అసెంబ్లీ సమావేశాల్లో ఆమె గురించి ఇలా మాట్లాడాల్సి వస్తుందని ఊహించలేదన్నారు. రాజకీయాల్లో తీరిక లేకుండా ఉన్నా కుటుంబాన్ని ఆమె నిర్లక్ష్యం చేయలేదని తెలిపారు. అన్ని విషయాలపై తామిద్దరం మాట్లాడుకునేవాళ్లమని చెప్పారు. ప్రతి విషయంపై చర్చించుకున్న తర్వాత తమ దినచర్య మొదలయ్యేదని వెల్లడించారు. తన నియోజకవర్గ ప్రజల కోసం ఆమె ఎంతో తపించేవారని తెలిపారు. తనను మించి నాయకురాలిగా ఎదిగారని ప్రశంసించారు. శోభ భర్తగా గర్వపడుతున్నానని పేర్కొన్నారు. తామిద్దం అసెంబ్లీలో ఉండి జగన్ కు అండదండగా ఉండాలని శోభ ఆలోచించారని, కానీ ఆమె మనమధ్య లేకుండా వెళ్లిపోయారంటూ ఉద్వేగానికి లోనయ్యారు. ఆమె ఆత్మకు శాంతి కలగాలని నాగిరెడ్డి ప్రార్థించారు. -
శోభానాగిరెడ్డి సౌమ్యశీలి, స్నేహశీలి: చంద్రబాబు
హైదరాబాద్: దివంగత భూమా శోభానాగిరెడ్డికి ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సంతాపం తెలిపింది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సంతాప తీర్మానాన్ని ప్రవేశపెట్టారు. ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ శోభానాగిరెడ్డి సేవలను కొనియాడారు. చిన్న వయస్సులోనే ఆమె ఎమ్మెల్యే అయ్యారని ప్రశంసించారు. తాగునీటి సమస్య పరిష్కారంకోసం అనేక పోరాటాలు చేశారని, రైతు సమస్యలకోసం రాజీలేని పోరాటం చేశారని గుర్తు చేసుకున్నారు. అసెంబ్లీ కార్యకలాపాల్లో చురుగ్గా పాల్గొన్నారని అన్నారు. శోభానాగిరెడ్డి సౌమ్యశీలి, స్నేహశీలి కొనియాడారు. శోభానాగిరెడ్డి కుటుంబానికి చంద్రబాబు తన ప్రగాఢ సంతాపం తెలిపారు. -
ఆ బాధ నాకు తెలుసు: వైఎస్ జగన్
-
ఆ బాధ నాకు తెలుసు: వైఎస్ జగన్
హైదరాబాద్: నందిగామ శాసనసభ్యుడు తంగిరాల ప్రభాకరరావు ఆకస్మిక మరణం దురదృష్టకరమని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి అన్నారు. తంగిరాల, శోభానాగిరెడ్డి మృతికి ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో సంతాప తీర్మానం ప్రవేశపెట్టారు. ఈ సందర్భంగా జగన్ మాట్లాడుతూ... తంగిరాల గురించి తనకు పెద్దగా తెలియనప్పటికీ వరుసగా రెండోసారి ఎమ్మెల్యేగా ఎన్నికైన దళిత నాయకుడు కాబట్టి ఆయన గురించి వేరే చెప్పక్కర్లేదన్నారు. కుటుంబ పెద్దను కోల్పోతే ఆ బాధ ఎలావుంటుందో తనకు తెలుసునని జగన్ అన్నారు. తంగిరాల కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలిపారు. ఆయన ఆత్మకు శాంతి కలగాలని మనస్ఫూర్తిగా ఆకాంక్షించారు. తంగిరాల ప్రభాకరరావు సేవలను పలువురు నేతలు కొనియాడారు. కోడెల శివప్రసాదరావు, ప్రత్తిపాటి పుల్లారావు, గొల్లపాటి సూర్యారావు, ఉప్పులేటి కల్పన, రావెల కిశోర్, బొండా ఉమామహేశ్వరరావు తదితరులు సభలో మాట్లాడారు.