
ఆ బాధ నాకు తెలుసు: వైఎస్ జగన్
హైదరాబాద్: నందిగామ శాసనసభ్యుడు తంగిరాల ప్రభాకరరావు ఆకస్మిక మరణం దురదృష్టకరమని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి అన్నారు. తంగిరాల, శోభానాగిరెడ్డి మృతికి ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో సంతాప తీర్మానం ప్రవేశపెట్టారు. ఈ సందర్భంగా జగన్ మాట్లాడుతూ... తంగిరాల గురించి తనకు పెద్దగా తెలియనప్పటికీ వరుసగా రెండోసారి ఎమ్మెల్యేగా ఎన్నికైన దళిత నాయకుడు కాబట్టి ఆయన గురించి వేరే చెప్పక్కర్లేదన్నారు.
కుటుంబ పెద్దను కోల్పోతే ఆ బాధ ఎలావుంటుందో తనకు తెలుసునని జగన్ అన్నారు. తంగిరాల కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలిపారు. ఆయన ఆత్మకు శాంతి కలగాలని మనస్ఫూర్తిగా ఆకాంక్షించారు. తంగిరాల ప్రభాకరరావు సేవలను పలువురు నేతలు కొనియాడారు. కోడెల శివప్రసాదరావు, ప్రత్తిపాటి పుల్లారావు, గొల్లపాటి సూర్యారావు, ఉప్పులేటి కల్పన, రావెల కిశోర్, బొండా ఉమామహేశ్వరరావు తదితరులు సభలో మాట్లాడారు.