Tangirala Prabhakar Rao
-
చైతన్యానికి చిరునామా..నందిగామా
సాక్షి, నందిగామ : రాజకీయ చైతన్యం కల్గిన ప్రాంతం నందిగామ నియోజకవర్గం. 1955లో తొలిసారిగా నందిగామ నియోజకవర్గం ఏర్పడింది. మొత్తం నాలుగు మండలాలతో దేశంలోని అత్యంత రద్దీ రహదారుల్లో రెండో స్థానం ఆక్రమించిన 65వ నెంబరు జాతీయ రహదారి ఈ నియోజకవర్గ పరిధిలోని పలు గ్రామాల మీదుగా వెళ్తుంది. ముఖ్యంగా నందిగామ, కంచికచర్ల పట్టణాలు ఈ రహదారి పక్కనే విస్తరించి ఉన్నాయి. తొలిసారి శాసనసభ స్పీకర్‌గా పనిచేసిన అయ్యదేవర కాళేశ్వరరావు ఈ నియోజకవర్గానికి చెందిన వాడే కావడం విశేషం. దేశంలోని జీవనదుల్లో ఒకటైన కృష్ణా నది చందర్లపాడు, కంచికచర్ల మండలాల మీదుగానే తూర్పునకు సాగిపోతుంది. దీనికితోడు నందిగామ, వీరులపాడు మండలాల మీదుగా మున్నేరు, వైరా ఏరు, కట్టెలేరు వంటి ఉప నదులు ప్రవహిస్తాయి. చుట్టూ నీరు ఉన్నప్పటికీ నేటికీ మంచినీరందని గ్రామాలు అనేకం ఉన్నాయి. నందిగామ పట్టణంలో కూడా ఈ సమస్య అధికం. ఇక పారిశ్రామిక పరంగా పూర్తిగా వెనుకబడిన ప్రాంతంగా చెప్పుకోవచ్చు. ఇదే నియోజకవర్గం నుంచి విజయం సాధించి వసంత నాగేశ్వరరావు హోం మంత్రి పదవిని అలంకరించారు. అదేవిధంగా రాజకీయ కురు వృద్ధుడిగా పేరుపొందిన ముక్కపాటి వెంకటేశ్వరరావు వ్యవసాయ శాఖ మంత్రిగా, దేవినేని వెంకట రమణ ప్రాథమిక విద్యాశాఖ మంత్రిగా పనిచేశారు. అత్యధిక పంచాయతీలు నందిగామ నియోజకవర్గంలో నందిగామ, కంచికచర్ల, చందర్లపాడు, వీరులపాడు మొత్తం నాలుగు మండలాలున్నాయి. నందిగామ మండల పరిధిలోని 13 గ్రామాలు మాత్రమే నియోజకవర్గ పరిధిలో ఉన్నాయి. మిగిలిన 10 గ్రామాలు జగ్గయ్యపేట నియోజకవర్గ పరిధిలో ఉన్నాయి. మొత్తం నందిగామ మండలంలో 23 గ్రామ పంచాయతీలు, కంచికచర్ల మండలంలో 16, వీరులపాడు మండలంలో 24, చందర్లపాడు మండలంలో 18 పంచాయతీలున్నాయి. నియోజకవర్గ పరిధిలో మొత్తం 71 గ్రామ పంచాయతీలు, ఓ నగర పంచాయతీ ఉన్నాయి. జీవన శైలి నందిగామ నియోజకవర్గంలో 80 శాతం మంది వ్యవసాయంపైనే ఆధారపడి జీవిస్తారు. మెట్ట ప్రాంతం కావడంతో పత్తి, మిర్చి, అపరాలు, సుబాబుల్, వరి, మొక్కజొన్న వంటివి అధికంగా సాగు చేస్తారు. దీనికితోడు పాడి పరిశ్రమపై ఆధారపడి చాలా మంది జీవిస్తున్నారు. ఎన్నికల సమయం మినహా మిగిలిన సమయంలో గ్రామాల్లో ప్రశాంత వాతావరణం ఉంటుంది. నందిగామకు పడమర వైపు దేశంలోని జీవ నదుల్లో ఒకటిగా ఉన్న కృష్ణా నది ప్రవహిస్తోంది. ఉత్తరాన జగ్గయ్యపేట నియోజకవర్గం, తూర్పున తెలంగాణ రాష్ట్ర సరిహద్దు, దక్షిణాన మైలవరం నియోజకవర్గం ఉన్నాయి. అధిక శాతం నిరుపేదలే నియోజకవర్గంలో అధిక శాతం నిరుపేదలు, మధ్య తరగతి ప్రజలే. వ్యాపారాలు చేసే వారి సంఖ్య తక్కువనే చెప్పాలి. సంపన్నుల శాతం అతి తక్కువ. నిరుద్యోగులు అధికం. పారిశ్రామికంగా కూడా నియోజకవర్గం ఎటువంటి వృద్ధి సాధించకపోవడంతో జీవనశైలిలో పెద్దగా మార్పులు కనపడటం లేదు. నందిగామకు ప్రత్యేక స్థానం ఎన్నికలు జరిగిన తొలి ఏడాదిలోనే ఇక్కడి నుంచి సీపీఐ తరపున బరిలో నిలిచిన పిల్లలమర్రి వెంకటేశ్వర్లు ఘన విజయం సాధించారు. అనంతరం జరిగిన ఎన్నికల్లో సైతం విజయం ఆయననే వరించింది. 1955 నుంచి ఇప్పటివరకు మొత్తం 14 సార్లు (బై ఎలక్షన్‌తో కలిపి) ఎన్నికలు జరిగాయి. ఈ నియోజకవర్గం నుంచి వివిధ పార్టీల ద్వారా విజయం సాధించిన వారిలో మొత్తం ముగ్గురు మంత్రులుగా పనిచేశారు. వీరిలో వసంత నాగేశ్వరరావు ఏకంగా హోం మినిష్టర్‌గా పనిచేయడం గమనార్హం. ఉమ్మడి మద్రాసు రాష్ట్రానికి తొలి శాసనసభ స్పీకర్‌గా పనిచేసిన అయ్యదేవర కాళేశ్వరరావు నందిగామకు చెందిన వారే. మహిళలే కింగ్ మేకర్లు నందిగామ నియోజకవర్గంలో మహిళల ఓట్లే అత్యంత కీలకం, వారు ఎవరికి ఓటు వేస్తే వారినే విజయలక్ష్మి వరిస్తుంది. నియోజకవర్గంలో మహిళ ఓటర్లే అధికంగా ఉండటంతోపాటు జనాభా పరంగా కూడా వారే అధికం కావడమే కాకండా ఓటు హక్కు వినియోగించుకోవడంలో కూడా వీరి శాతమే అధికంగా ఉంటోంది. దీంతో వీరు ఎవరి వైపు మొగ్గు చూపితే, ఆ పార్టీ, సంబంధిత అభ్యర్థి ఎమ్మెల్యే కావడం ఖాయం. దాదాపుగా మొత్తం జనాభా 2,54,734 కాగా వీరిలో 1,28,531 మహిళా ఓటర్లు ఉన్నాయి. ప్రతి ఎన్నికల్లో 65 నుంచి 75 శాతం మధ్య పోలింగ్ జరుగుతుంది. ఓటు వేసే వారిలో మహిళల సంఖ్యే అధికంగా ఉంటోంది. నాడు కంచుకోట! పదకొండు పర్యాయాలపాటు జనరల్ కేటగిరీలో ఉన్న నియోజకవర్గం 2009 నుంచి ఎస్సీలకు రిజర్వు చేశారు. దీంతో 2009, 2014 ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ అభ్యర్థి తంగిరాల ప్రభాకరరావు విజయం సాధించారు. అయితే ఎన్నికలు పూర్తయిన నెల రోజులకే ఆయన మృతిచెందారు. దీంతో ఉప ఎన్నికల్లో ఆయన కుమార్తె ప్రస్తుత ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య గెలుపొందారు. ఉప ఎన్నికల్లో వైఎస్సార్సీపీ అభ్యర్థిని నిలబెట్ట లేదు. అయితే కాంగ్రెస్ పార్టీ బరిలో నిలిచినా, డిపాజిట్లు కూడా దక్కలేదు. నందిగామ నియోజకవర్గం మొత్తం జనాభా : 2,54,734 పురుషులు : 1,26,203 మహిళలు : 1,28,531 నియోజకవర్గంలో ఓటర్ల సంఖ్య : 1,93,712 పురుషులు : 95,279 మహిళలు : 98,426 థర్డ్ జెండర్ : 7 విస్తీర్ణం(చదరపు కిలోమీటర్లలో : 718 రెవెన్యూ గ్రామాలు : 81 గ్రామ పంచాయతీలు : 69 -
నాన్న మంచితనమే గెలిపించింది
నందిగామ ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య ప్రశాంతంగా ముగిసిన ఉప ఎన్నిక కౌంటింగ్ దివంగత తంగిరాల ప్రభాకరరావు కుమార్తెకు పట్టం 74,827 ఓట్ల మెజారిటీ కాంగ్రెస్‌కు దక్కిన డిపాజిట్ ‘నోటా’కు మూడో స్థానం నందిగామ : తన తండ్రి దివంగత ఎమ్మెల్యే తంగిరాల ప్రభాకరరావు మంచితనం వల్లే ఉప ఎన్నికలో భారీ మెజారిటీతో గెలుపొందానని నందిగామ ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య పేర్కొన్నారు. ఈ నెల 13న నందిగామ(ఎస్సీ) అసెంబ్లీ నియోజకవర్గానికి జరిగిన ఉప ఎన్నిక కౌంటింగ్‌ను మంగళవారం స్థానిక కేవీఆర్ కళాశాలలో నిర్వహించారు. తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా పోటీచేసిన తంగిరాల సౌమ్య 74,827 ఓట్ల మెజారిటీతో విజయం సాధించారు. నియోజకవర్గంలో 1,84,064 ఓట్లు ఉండగా, 1,27,434 ఓట్లు పోలయ్యాయి. సౌమ్యకు 99,748 ఓట్లు వచ్చాయి. రెండో స్థానంలో నిలిచిన కాంగ్రెస్ అభ్యర్థి బోడపాటి బాబురావుకు 24,921 ఓట్లు లభించాయి. ఇండిపెండెంట్లుగా పోటీచేసిన కటారపు పుల్లయ్యకు 941, మాతంగి పుల్లారావుకు 647 ఓట్లు వచ్చాయి. ఎన్నికల్లో గెలుపొందినట్లు రిటర్నింగ్ అధికారి రజనీకాంతరావు నుంచి ధ్రువీకరణపత్రం అందుకున్న అనంతరం సౌమ్య మీడియాతో మాట్లాడారు. తన తండ్రి ఆశయ సాధన కోసం పని చేస్తానని చెప్పారు. నియోజకవర్గ అభివృద్ధికి శక్తివంచన లేకుండా కృషి చేస్తానని పేర్కొన్నారు. విజయవాడను రాజధానిగా ప్రకటించడం కూడా తన గెలుపునకు దోహదపడినట్లు ఆమె తెలిపారు. తన గెలుపునకు సహకరించిన సీఎం చంద్రబాబు, మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావులకు సౌమ్య కృతజ్ఞతలు తెలిపారు. అనంతరం కార్యకర్తలతో కలసి ర్యాలీగా స్థానిక రైతుపేటలోని టీడీపీ కార్యాలయానికి వెళ్లిన సౌమ్య మంత్రి ఉమాకు పాదాభివందనం చేశారు. కేక్ కట్ చేసి టీడీపీ శ్రేణులకు పంచారు. అక్కడి నుంచి తంగిరాల ప్రభాకరరావు ఘాట్ వద్దకు వెళ్లి నివాళులర్పించారు. మంత్రి ఉమా మాట్లాడుతూ ఈ ప్రాంత ప్రజలు టీడీపీపై ఉంచిన నమ్మకాన్ని వమ్ము చేయబోమని చెప్పారు. ప్రతి రౌండ్లోనూ మెజారిటీ నందిగామ కేవీఆర్ కళాశాలలోని స్ట్రాంగ్ రూమ్ నుంచి ఉదయం 8 గంటలకు ఈవీఎంలను బయటకు తీసుకొచ్చి కౌంటింగ్ సిబ్బందికి అందజేశారు. ఎన్నికల రిటర్సింగ్ అధికారి రజనీకాంతరావు కౌంటింగ్ సిబ్బందికి పలు సూచనలు చేశారు. కౌంటింగ్ సమయంలో సిబ్బంది అవకతవకలకు పాల్పడితే సస్పెండ్ చేయటంతోపాటు క్రిమినల్ కేసు కూడా నమోదు చేస్తామని హెచ్చరించారు. అదనపు జాయింట్ కలెక్టర్ చెన్నకేశవరావు, అబ్జర్వర్ సాగర్ల పర్యవేక్షణలో కౌంటింగ్ జరిగింది. కలెక్టర్ రఘునందన్‌రావు, ఎస్పీ విజయ్‌కుమార్ కౌంటింగ్ ప్రక్రియను పరిశీలించి అధికారులకు పలు సూచనలు చేశారు. కౌంటింగ్ ప్రారంభం నుంచి తెలుగుదేశం పార్టీ అభ్యర్థి తంగిరాల సౌమ్య చివరి 15వ రౌండ్ వరకు ఆధిక్యంలోనే కొనసాగారు. అదనపు జాయింట్ కలెక్టర్ చెన్నకేశవరావు, ఎన్నికల అబ్జర్వర్ సాగర్, తహశీల్దార్ ఎంసీహెచ్ నాగేశ్వరరావు పాల్గొన్నారు. మాకు గెలుపు, ఓటములతో పనిలేదు : బోడపాటి తమకు గెలుపు, ఓటములతో సంబంధం లేదని కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి బోడపాటి బాబూరావు అన్నారు. కౌంటింగ్ అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడుతూ సార్వత్రిక ఎన్నికల సమయంలో టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు తప్పుడు హామీలు ఇచ్చారని విమర్శించారు. చంద్రబాబు మోసాలను ప్రజల్లోకి తీసుకెళ్లేందుకే ఎన్నికల్లో పోటీ చేశామని వివరించారు. గత ఎన్నికల్లో రెండు వేల ఓట్లు మాత్రమే వచ్చిన తమ పార్టీకి ఉప ఎన్నికల్లో 24,921 ఓట్లు లభించడం సంతోషంగా ఉందన్నారు. తనకు ఓట్లు వేసిన ప్రతి ఒక్కరికి ఆయన కృతజ్ఞతలు తెలిపారు. ఈ సమావేశంలో కాంగ్రెస్ నాయకులు వేల్పుల పరమేశ్వరరావు, గింజుపల్లి అనిల్, జాఫర్ పాల్గొన్నారు. డిపాజిట్ దక్కించుకున్న కాంగ్రెస్ ఉప ఎన్నికలో కాంగ్రెస్ పార్టీ డిపాజిట్ దక్కించుకుంది. టీడీపీ పార్టీ అభ్యర్థి తంగిరాల సౌమ్యకు 74,827 భారీ మెజారిటీ రాగా, కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి బోడపాటి బాబురావుకు 24,921 ఓట్లు వచ్చాయి. సార్వత్రిక ఎన్నికల్లో డిపాజిట్ కోల్పోయిన కాంగ్రెస్‌కు ఉప ఎన్నికల్లో ఊరట లభించింది. మూడో స్థానంలో ‘నోటా’ నందిగామ ఉప ఎన్నికల్లో మూడో స్థానం ‘నోటా’కు లభించింది. స్వతంత్ర అభ్యర్థులుగా పోటీ చేసిన కటారపు పుల్లయ్యకు 941 ఓట్లు, మాతంగి పుల్లారావుకు 647 ఓట్లు వచ్చాయి. కానీ, నోటా గుర్తును 1,177 మంది నొక్కారు. దీంతో మూడో స్థానం ‘నోటా’కు లభించినట్లయింది. -
తంగిరాల ప్రభాకర్‌కు ఏపి అసెంబ్లీ నివాళి
-
ఆ బాధ నాకు తెలుసు: వైఎస్ జగన్
-
ఆ బాధ నాకు తెలుసు: వైఎస్ జగన్
హైదరాబాద్: నందిగామ శాసనసభ్యుడు తంగిరాల ప్రభాకరరావు ఆకస్మిక మరణం దురదృష్టకరమని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి అన్నారు. తంగిరాల, శోభానాగిరెడ్డి మృతికి ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో సంతాప తీర్మానం ప్రవేశపెట్టారు. ఈ సందర్భంగా జగన్ మాట్లాడుతూ... తంగిరాల గురించి తనకు పెద్దగా తెలియనప్పటికీ వరుసగా రెండోసారి ఎమ్మెల్యేగా ఎన్నికైన దళిత నాయకుడు కాబట్టి ఆయన గురించి వేరే చెప్పక్కర్లేదన్నారు. కుటుంబ పెద్దను కోల్పోతే ఆ బాధ ఎలావుంటుందో తనకు తెలుసునని జగన్ అన్నారు. తంగిరాల కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలిపారు. ఆయన ఆత్మకు శాంతి కలగాలని మనస్ఫూర్తిగా ఆకాంక్షించారు. తంగిరాల ప్రభాకరరావు సేవలను పలువురు నేతలు కొనియాడారు. కోడెల శివప్రసాదరావు, ప్రత్తిపాటి పుల్లారావు, గొల్లపాటి సూర్యారావు, ఉప్పులేటి కల్పన, రావెల కిశోర్, బొండా ఉమామహేశ్వరరావు తదితరులు సభలో మాట్లాడారు. -
ఎమ్మెల్యే తంగిరాల ప్రభాకరరావు మృతి