ఇదేం దిగజారుడు రాజకీయం?
టీడీపీ తీరుపై వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఫైర్
⇒ భూమా సంతాప తీర్మానాన్ని కూడా రాజకీయాలకు వాడుకుంటారా?
⇒ ఆయన మంచి మాత్రమే రికార్డుల్లో ఉండాలని సభకు దూరంగా ఉన్నాం
⇒ భూమాతో చంద్రబాబు తప్పు చేయించారు.. అది మేం చెప్పాల్సి వచ్చేది
⇒ అఖిల ప్రియకు మొట్టమొదట ఫోన్ చేసింది నేను, మా అమ్మే..
⇒ భూమా మరణించి 24 గంటలు కూడా గడవలేదు..రాజకీయం కోసమే ఆయన కూతుర్ని శాసనసభకు తీసుకొచ్చారు
⇒ బాబు మూడురోజుల్లో మంత్రిని చేస్తానన్నాడని మావాళ్లకు భూమా చెప్పాడు
⇒ నంద్యాల మాదే.. ఉప ఎన్నికలలో కచ్చితంగా పోటీ చేస్తాం
సాక్షి, అమరావతి: దివంగత ఎమ్మెల్యే భూమా నాగిరెడ్డి మంచితనమే ఏపీ శాసనసభ రికార్డుల్లో ఉండాలని, ఆయన చివరి దశలో చేసిన తప్పులు రికార్డుల్లోకి వెళ్లడం తమకు ఇష్టం లేదని వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు, ప్రతిపక్ష నేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి చెప్పారు. ఈ కారణంగానే వైఎస్సార్‌సీపీ శాసనసభా పక్షం మంగళవారం భూమా సంతాప తీర్మానం సందర్భంగా శాసనసభలోకి వెళ్లలేదని స్పష్టం చేశారు. దివంగత నాయకుడి సంతాప తీర్మానాన్ని కూడా రాజకీయం చేసిన ఘనత టీడీపీదేనని ధ్వజమెత్తారు. దిగజారుడు, కుసంస్కార రాజకీయాలు ఆ పార్టీకి కొత్తేమీ కాదని మండిపడ్డారు.
మంగళవారం అసెంబ్లీ వాయిదా పడిన తరువాత వైఎస్ జగన్ లాబీల్లోని తన చాంబర్‌లో మీడియాతో మాట్లాడారు. మనుషుల్లో ఉండాల్సింది తొలుత మానవత్వమని చెప్పారు. అయితే, మంగళవారం అసెంబ్లీలో జరిగింది చూస్తే సంతాప తీర్మానం వెనక్కిపోయి రాజకీయమే ముందుకొచ్చిందనే విషయం స్పష్టమైందన్నారు. తాము సభలోకి వెళ్లి సంతాప తీర్మానంపై మాట్లాడి ఉంటే భూమా నాగిరెడ్డి మంచితోపాటుగా చివరలో ఆయన చేసిన తప్పును కూడా చెప్పాల్సి వచ్చేదన్నారు. భూమా చేసిన తప్పును చెప్పడం ఇష్టంలేకనే హుందాతనం పాటించామని పేర్కొన్నారు. జగన్ ఇంకా ఏం చెప్పారంటే....
మొదట ఫోన్ చేసింది నేను, మా అమ్మే
‘‘భూమా నాగిరెడ్డి చనిపోయాడు. ఆయన చివరిదశలో చేసిన తప్పును ఎందుకు చెప్పడం, అదంతా అసెంబ్లీ రికార్డుల్లోకి పోవడం ఎందుకు అని సభలోకి వెళ్లకుండా మౌనంగానే ఉందామనుకున్నాం. మేము కనుక అసెంబ్లీలోకి వెళ్లి ఉంటే.. చంద్రబాబు చేయిస్తే భూమా ఎలా తప్పు చేశారో మేం చెప్పాల్సి వచ్చేది. అలా చెప్పి ఉంటే ఏమయ్యేది? ఎవరు రాజకీయాలు చేస్తున్నారు? ఎవరు హుందాగా వ్యవహరిస్తున్నారో అర్థం చేసుకోండి. నాగిరెడ్డి చనిపోయాడని తెలిసి మొట్టమొదట ఫోన్ చేసింది నేనూ, మా అమ్మే. మృతి వార్త తెలియగానే చాలా బాధేసింది. ఇద్దరమూ అఖిలప్రియతో మాట్లాడి ధైర్యం చెప్పాం. అదీ వ్యక్తిగతంగా మేం ప్రదర్శించిన మానవత్వం. కానీ, ఇక్కడ కుట్ర రాజకీయాలు జరుగుతున్నాయి.
24 గంటలైనా గడవక ముందే అఖిలను అసెంబ్లీకి ఎందుకు తీసుకొచ్చారు?
తండ్రి మరణించి 24 గంటలైనా గడవక ముందే అఖిలప్రియను రాజకీయాల కోసం అసెంబ్లీకి తీసుకొ చ్చారు. ఆమె తన కుటుంబ సభ్యులతో కలిసి ఉండి ఏడ్వడానికీ అవకాశం ఇవ్వలేదు. వీళ్ల(టీడీపీ పెద్దలు) రాజకీయాలను చూసి అందరూ సిగ్గుపడాల్సిన పరిస్థితి ఏర్పడింది. రాజకీయ పార్టీని నడిపేటప్పుడు ఒక అంశాన్ని గుర్తుంచుకోవాలి. మేము సారథ్యం వహిస్తున్న పార్టీని కూడా పరిగణనలోకి తీసుకోవాల్సి ఉంటుంది. అది చాలా ముఖ్యం. మనకు ఒకరిపై ఉన్న వ్యక్తిగత అభిమానం పార్టీ శ్రేణుల నైతికతను దెబ్బతీసే విధంగా ఉండరాదు. భూమా మృతి చెందిన విషయం తెలియగానే మేము ఆయన కుమార్తెకు ఫోన్ చేసి, పరామర్శించాం. ఇదీ తక్షణమే మేము స్పందించిన తీరు. అంతకు మించి ఏం చేసినా పార్టీ శ్రేణులకు తప్పుడు సంకేతాలు వెళతాయి.
ఫిరాయించినవారితో మాట్లాడించి లబ్ధి పొందుదామనుకున్నారు..
మేం అక్కడకు (సభలోకి) వెళ్లి ఏం చెప్పినా అది వివాదానికి దారితీసి, పరిస్థితి వేరే రకంగా ఉండేది. మా పార్టీ నుంచి ఎవరైతే టీడీపీలోకి ఫిరాయించారో అలాంటి వారి చేతనే... చాంద్‌బాషా మొదలు డేవిడ్‌రాజు లాంటి వారి చేతనే మాట్లాడించారు. వాళ్లతో మాట్లాడించిన తీరు చూస్తే దీనిలో నుంచి ఏ విధంగా రాజకీయ లబ్ది పొందాలా అనే ఆలోచనలోనే టీడీపీ వారు మునిగిపోయినట్లుగా కనిపిస్తుంది. 24 గంటలైనా గడవక ముందే అఖిలప్రియను తీసుకొచ్చి శాసనసభలో కూర్చోబెట్టి రాజకీయాలు చేస్తా ఉన్నపుడు అలాంటి సభలో మేం ఏం మాట్లాడినా భూమా ప్రతిష్ట దెబ్బతినడమే కాకుండా మొత్తం రాజకీయంగా వివాదాస్పదం అవుతుంది. అసెంబ్లీలో సంతాపతీర్మానంపై ముందు విష్ణుకుమార్‌రాజుతో మాట్లాడించారు. ఆయన మాట్లాడిన మాటలు ఎంత రెచ్చగొట్టే విధంగా ఉన్నాయో అర్ధం అయ్యే ఉంటుంది. మేం కనుక అసెంబ్లీలోకి వెళ్లి ఉంటే చంద్రబాబు తప్పు చేయిస్తే భూమా నాగిరెడ్డి ఎలా తప్పు చేశారో మేం చెప్పాల్సి వచ్చేది. అలా చెప్పి ఉంటే ఏమయ్యేదో అర్ధం చేసుకోండి.
చంద్రబాబు మూడు రోజుల్లో మంత్రిపదవి ఇస్తానని చెప్పాడట..
భూమా వైఎస్సార్‌సీపీని వీడి వెళ్లాలని అనుకుంటున్న రోజు సజ్జల రామకృష్ణారెడ్డి, వైవీ సుబ్బారెడ్డి ఆయనతో మాట్లాడ్డానికి ఆయన ఇంటికి వెళ్లారు. ‘ఎందుకు వెళుతున్నారన్నా.. మీరు పొరబాటు చేస్తున్నారు’ అని నచ్చజెప్పేందుకు ప్రయత్నించారు. ‘నాకు మూడే మూడు రోజుల్లో మంత్రి పదవి ఇస్తానని చంద్రబాబు చెప్పారు. పచ్చకండువా వేసుకోవడమే ఆలస్యం... వెంటనే మంత్రిగా ప్రమాణస్వీకారం చేయిస్తారు. అందుకే టీడీపీలోకి వెళుతున్నా’ అని సజ్జల, వైవీతో భూమా చెప్పారు. ‘జగన్‌ను విడిచిపెట్టి పోవడం ఇష్టం లేదు’ అని భూమా కన్నీళ్లు పెట్టుకున్నారు. ఒక పార్టీలో గెలిచి మరో పార్టీలోకి వెళితే మంత్రి పదవి ఎలా ఇస్తారని రామకృష్ణారెడ్డి ప్రశ్నిస్తే... చంద్రబాబు ఇస్తానన్నాడని నాగిరెడ్డి సమాధానమిచ్చారు. అలాంటి వ్యక్తిని సంవత్సరంపాటు అలాగే ఉంచేశారు. ప్రలోభాలు పెట్టినవాళ్లది ఎంత తప్పో, ఆ ప్రలోభాలకు లొంగిన వాళ్లది కూడా అంతే తప్పు. చంద్రబాబు గతంలో ఎన్టీ రామారావును ఏ రకంగా క్షోభకు గురిచేసి గుండెపోటుతో చనిపోయేటట్లుగా చేశారో ఇప్పుడు భూమా విషయంలో కూడా సరిగ్గా అలాగే జరిగింది.
ఇంగితం ఉన్న వారికెవరికైనా....
ఒక పార్టీ నుంచి గెలిచిన వారికి మరో పార్టీలో మంత్రి పదవి ఇవ్వరాదనేది ఇంగితం ఉన్న వారెవరికైనా తెలిసిన అంశం. పదో తరగతి చదివినోడికి కూడా ఈ విషయం తెలుస్తుంది. అందుకే భూమా దగ్గరకి మా వాళ్లు వెళ్లి ఆయనకు జ్ఞానోదయం కలిగించేందుకు ప్రయత్నించారు. కానీ మూడు రోజుల్లో మంత్రి పదవి ఇస్తానని చంద్రబాబు చూపిన ఆశ ముందు మా వాళ్ల హితవు పని చేయలేదు. తెలంగాణలో టీడీపీ వారికి టీఆర్‌ఎస్ ప్రభుత్వంలో మంత్రి పదవి ఇచ్చినపుడు చంద్రబాబు ఏ విధంగా బయటకు వచ్చి మాట్లాడారో అందరికీ తెలుసు. గవర్నర్‌ను తప్పు దోవ పట్టించారనీ, అందుకే గవర్నర్ తప్పు చేశారని అన్నారు కదా. ఆరోజు గవర్నర్‌ను తప్పుదోవ పట్టించిన పరిస్థితుల్లో ఆయన తప్పు చేశారు.
అక్కడ జరిగిన అదే తప్పును గవర్నర్ చేత రెండోసారి, మూడో సారి తప్పు చేయించాలంటే ఎవరూ చేయరు. ఒక పార్టీలో ఉన్న వారికి మంత్రిపదవి ఇవ్వాలంటే ఉన్న పార్టీకి రాజీనామా ఇచ్చి దానిని ఆమోదింప జేసుకున్న తరువాతనే మంత్రివర్గంలోకి తీసుకుంటారు. అలా జరగక పోతే ఇక ప్రజాస్వామ్యమనేదే ఉండదు. ఏ పార్టీ టికెట్ మీద గెలిచిన వాడైనా వచ్చి మంత్రి పదవి తీసుకోవడం ఏ మాత్రం ప్రజాస్వామ్య బద్ధం కాదు. స్పీకర్ మనవాడే... అధికారపక్షానికి చెందిన వాడే కాబట్టి ఏం చేసినా అనర్హత వేటు పడదు అంటే, అసలు ప్రజాస్వామ్యం ఉందనుకోవాలా... బతుకుతుందా? ప్రజాస్వామ్యం బతకాలి అనంటే అందుకు కొన్ని విధానాలు కచ్చితంగా పాటించాల్సి ఉంటుంది. ప్రజాస్వామ్యంలో మెజారిటీ వచ్చిన పార్టీ అధికారంలోకి వస్తుంది. అధికారపక్షం ఎమ్మెల్యేలే మంత్రులుగా ప్రమాణస్వీకారం చేస్తారు. దాన్నే ప్రజాస్వామ్యమంటారు. దేశంలో... ప్రపంచంలో ఎక్కడ చూసినా ఇదే కనిపిస్తుంది.
అధికారపక్షంలో మంత్రి పదవి పొందాలంటే ముందుగా తామున్న పదవికి రాజీనామా చేయాలి. మళ్లీ గెలుపొందాలి. ఆ తరువాతనే పదవి పొందాలి. ఎవరి ఇష్టా ఇష్టాల మీదనో ఆధారపడి అన్నీ ఇష్టానుసారం చేస్తాం అంటే కుదరదు. రేపు పొద్దున మేం కూడా అధికారంలోకి వస్తాం. వచ్చాక ఇదే కార్యక్రమం టప టప చేయాలంటే అదేమీ పెద్ద పని కానే కాదు. ఎవరైనా చేస్తారు. అందుకే గవర్నర్ ఫిరాయించిన వాళ్లతో ప్రమాణం చేయించలేరు. గవర్నర్ ఇలాంటివి ప్రోత్సహించరు. (భవిష్యత్తులో మీరు ఇలాంటివి ప్రోత్సహించరా? అని ప్రశ్నించినపుడు) ఇపుడే కాదు, గతంలో కూడా ఇలాంటివి చేయించలేదు. నా వ్యక్తిత్వానికి, చంద్రబాబు వ్యక్తిత్వానికి నక్కకూ... నాకలోకానికీ ఉన్నంత తేడా ఉంది. మేం ఎప్పుడైనా ఏదైనా రాజకీయాలు చేయాలనుకుంటే హుందాగానే చేస్తాం.
నేనెవరికైనా మంత్రి పదవి ఇవ్వాలనుకుంటే ముందున్న పార్టీ పదవికి రాజీనామా చేయించి ఆమోదింప జేస్తాను. ఆ తరువాతనే మంత్రి పదవిని ఇస్తాను. అలా మంత్రి పదవి ఇచ్చిన వ్యక్తిని ప్రజల దగ్గరకు తీసుకు పోయి నా పార్టీ టికెట్ ఇచ్చి, నేనే ప్రచారం చేసి నన్ను చూసి ఓట్లేయమని అడుగుతాను. గెలిపించుకుని వస్తాను. ఇది కొత్తగా ఈ రోజు చేసింది కాదు. గతంలో మా పార్టీలోకి చేరడానికి ఉత్సాహం చూపించిన 18 మంది ఎమ్మెల్యేల చేత అప్పటి రాష్ట్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా అవిశ్వాసతీర్మానంపై ఓట్లు వేయించాను. వారంతా అనర్హతకు గురయ్యాక మా పార్టీ బీ ఫాం ఇచ్చి ఉప ఎన్నికల్లో పోటీ చేయించాం. అపుడు నేను, మా అమ్మ మాత్రమే పార్టీలో ఉన్నాం. ఎన్నికల్లో 15 మంది ఎమ్మెల్యేలు తిరిగి గెలుపొందారు.
నంద్యాలలో పోటీ చేస్తాం
విలేకరుల ప్రశ్నలకు జగన్ సమాధానమిస్తూ....‘నంద్యాల ఉప ఎన్నికలో కచ్చితంగా పోటీ చేస్తాం... అది అక్షరాలా మాసీటే... అయితే మేం ఈ విషయంలో ఏం చేస్తాం... ఎప్పుడు చేస్తాం అనేది వేచి చూడండి. సరైన సమయంలో మేం కచ్చితంగా ఒక నిర్ణయం తీసుకుంటాం. ఈ విషయంలో మాకు ఎలాంటి మొహమాటం (ఆబ్లిగేషన్) లేదు. ఎందుకంటే అది మా సీటే... గతంలో కొన్ని సందర్భాల్లో ఎవరైనా ఎమ్మెల్యేలు ఏ పార్టీకి చెందిన వారైనా చనిపోతే వారి కుటుంబం నుంచే మరొకరు పోటీ చేసినపుడు అలాంటి చోట్ల పోటీ చేయరాదనే విధానానికి కట్టుబడి పోటీ పెట్టలేదు. కానీ నంద్యాల విషయంలో ఈ సారి అలా చేయం. ఈ సీటు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీదే. అక్కడి ప్రజలు గత ఎన్నికల్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకే ఓట్లేశారు. అందుకే పోటీ చేస్తాం.
చంద్రబాబుది విలన్ క్యారెక్టర్
ఏ సినిమాకు వెళ్లినా... ఏ కథలోనైనా ఒకటే కనిపిస్తుందని రాజకీయాలు చేసే వారు ఎప్పుడూ గుర్తుంచుకోవాలి. వాటిలో ఒక హీరో క్యారెక్టర్, ఒక విలన్ క్యారెక్టర్ ఉంటాయి. హీరో క్యారెక్టర్ ఎలా ఉంటుందో కొంచెం ఆలోచించుకోండి. కానీ విలన్ క్యారెక్టర్ గురించి పెద్దగా ఆలోచించాల్సిన పని లేదు. చంద్రబాబు దగ్గర కూర్చుంటే తెలిసి పోతుంది. మేము కనుక సంతాప తీర్మానం సందర్భంగా సభలోకి వెళ్లి ఉంటే పాపం చనిపోయిన భూమా నాగిరెడ్డిని తప్పు చేసిన వ్యక్తిగా చెప్పాల్సి వచ్చేది. చనిపోయాడు కనుక ఆయన విషయంలో మర్యాద పాటించాలనుకున్నాం. మా మంచితనం చూపించాలనుకున్నాం, మంచితనాన్ని ప్రదర్శించాం.
టీడీపీ వాళ్లు కుసంస్కార రాజకీయాల్లో పుట్టి పెరిగారు. 24 గంటలైనా గడవక ముందే భూమా కుమార్తెను అసెంబ్లీకి తేవడం వారి కుసంస్కారానికి నిదర్శనం. నిజంగా కుసంస్కారం, దిగజారుడు రాజకీయాలు వారివే. గతంలో శాసనసభలో శోభానాగిరెడ్డికి సంతాపం చెప్పడానికి కూడా టీడీపీ ప్రభుత్వం అంగీకరించలేదు. మా ఎమ్మెల్యేలు ప్రెస్‌మీట్ పెట్టి విమర్శించిన తరువాత గానీ ఆమె పేరును తీర్మానంలో చేర్చలేదు. ఇవన్నీ జరిగిన యథార్థాలే... అసెంబ్లీ రికార్డులను తిరగేస్తే అన్నీ తెలుస్తాయి. కుసంస్కార రాజకీయాల్లో పుట్టి పెరిగిన వీళ్లు ఎన్టీరామారావును వెన్నుపోటు పొడిచిన దగ్గరి నుంచీ అంతా కుసంస్కార రాజకీయాలే చేశారు. అయినా ఎవరు రాజకీయాలు చేస్తున్నారు, ఎవరు చేయడం లేదు, ఎవరు హుందాతనాన్ని ప్రదర్శించారు, ఎవరు ప్రదర్శించలేదు ఇవన్నీ చూసే వారికి అర్థం అవుతుంది. ఇంతకంటే నేను చెప్పేదేమీ లేదు.