భూమా చనిపోయాక బాబుకు గుర్తుకొచ్చాయా?
విజయవాడ : మహాభారతంలో దుర్యోధనుడి మరణానికి శకుని కారణమైతే ...నంద్యాల ఎమ్మెల్యే భూమా నాగిరెడ్డి మృతికి కారణం మాత్రం చంద్రబాబు నాయుడే అని వైఎస్‌ఆర్ సీపీ ఎమ్మెల్యే నారాయణస్వామి అన్నారు. ఆయన మంగళవారమిక్కడ మాట్లాడుతూ బతికున్నంతకాలం నాగిరెడ్డిని చంద్రబాబు పట్టించుకోలేదని, ఆయన చనిపోయిన తర్వాత మాత్రం కర్నూలు జిల్లా అభివృద్ధికి కృషి చేస్తామంటూ చెప్పడం హాస్యాస్పదంగా ఉందన్నారు.
మనిషిని పోగొట్టుకున్నాక చంద్రబాబు మొసలి కన్నీరు కారుస్తున్నారని నారాయణస్వామి వ్యాఖ్యానించారు. భూమా కోరిక అంటూ ఇప్పుడేమో నంద్యాల అభివృద్ధికి కృషి చేస్తామని చంద్రబాబు చెప్పడం విడ్డూరంగా ఉందన్నారు. తండ్రి అంత్యక్రియల జరిగి 24 గంటలు గడవకముందే అఖిలప్రియను చంద్రబాబు అసెంబ్లీకి తీసుకు వచ్చారన్నారు. ఈ ఘటన చూస్తుంటే ఆయనకు మానవత్వం ఉందా అనే అనుమానం కలుగుతుందన్నారు.
భూమా నాగిరెడ్డికి సానుభూతి తెలపాల్సిన సభలో వైఎస్ జగన్‌ను టార్గెట్ చేసుకుని మాట్లాడటం ఎంతవరకూ సమంజసమని ఎమ్మెల్యే నారాయణస్వామి ప్రశ్నించారు. సంతాప తీర్మానానికి ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ రాలేదంటూ, దుర్మార్గులంతూ సభ ద్వారా కుట్రపూరితంగా వ్యవహరిస్తూ విలువైన సమాయాన్ని దుర్వినియోగం చేశారన్నారు. శకునిలాంటి చంద్రబాబును కాపాడేందుకు మంత్రులు, టీడీపీ ఎమ్మెల్యేలు, పార్టీ మారిన ఎమ్మెల్యేలు ప్రయత్నిస్తున్నారన్నారు.
వైఎస్‌ఆర్ సీపీ నుంచి టీడీపీలో చేరిన వారితో వైఎస్ జగన్‌ను తిట్టించారన్నారు. తనకు రాజకీయ భిక్ష పెట్టిన ఎన్టీఆర్‌పై వైస్రాయ్ హోటల్ సాక్షిగా చెప్పులు వేయించిన ఘనత చంద్రబాబుది అని ఎమ్మెల్యే నారాయణస్వామి ధ్వజమెత్తారు. మంత్రి పదవి ఆశచూపి.... సంవత్సరం అయినా ఇవ్వకుండా భూమాను మానసిక క్షోభకు గురిచేసి ఆయన మృతికి చంద్రబాబే కారణమని అందరికీ తెలుసని నారాయణస్వామి అన్నారు.