'శోభా నాగిరెడ్డి ఆత్మ క్షోభిస్తుంది' | Roja criticises Bhuma nagireddy and akhilapriya anti defection | Sakshi
Sakshi News home page

'శోభా నాగిరెడ్డి ఆత్మ క్షోభిస్తుంది'

Published Tue, Feb 23 2016 12:22 PM | Last Updated on Mon, Oct 29 2018 8:08 PM

'శోభా నాగిరెడ్డి ఆత్మ క్షోభిస్తుంది' - Sakshi

'శోభా నాగిరెడ్డి ఆత్మ క్షోభిస్తుంది'

తిరుపతి: వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని వీడి భూమా నాగిరెడ్డి, అఖిలప్రియ టీడీపీలోకి వెళ్లడం వల్ల పైలోకంలో ఉన్న శోభానాగిరెడ్డి ఆత్మ క్షోభించి ఉంటుందని ఎమ్మెల్యే ఆర్కే రోజా వ్యాఖ్యానించారు. చిత్తూరు జిల్లా తిరుపతిలో మీడియాతో ఆమె మాట్లాడారు. శోభా నాగిరెడ్డి మరణం తర్వాత టీడీపీ సర్కార్ ఏపీ శాసనసభలో కనీసం సంతాపాన్ని కూడా ప్రకటించలేదని ఆమె విమర్శించారు. ఇప్పుడు అదే పార్టీలోకి ఆమె కుటుంబ సభ్యులే వెళ్లడం దారుణమన్నారు. దేశ రాజకీయాల్లో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు శని లాంటి వాడంటూ మండిపడ్డారు.

టీఆర్ఎస్‌లోకి టీడీపీ ఎమ్మెల్యేలు వెళ్తే నైతిక విలువలు లేవన్న చంద్రబాబు ఇప్పుడు ఏం చేశారని ఈ సందర్భంగా రోజా ప్రశ్నించారు. మునిగిపోయే పడవ లాంటి టీడీపీలోకి ఎమ్మెల్యేలు వెళ్లారంటే.. ఏదో ప్రయోజనం ఆశించి వెళ్లి ఉంటారని ఆరోపించారు. చంద్రబాబుకు దమ్ము, ధైర్యం ఉంటే ఎన్నికలకు సిద్ధపడాలని డిమాండ్ చేశారు. నలుగురు ఎమ్మెల్యే పోయినంత మాత్రాన వైఎస్ఆర్ సీపీ బెదిరేది లేదని పేర్కొన్నారు. అభివృద్ధి పనుల పేరుతో చంద్రబాబు, ఆయన తనయుడు నారా లోకేష్ వేల కోట్లు సంపాదించారని, సెక్యూరిటీ లేకుండా చంద్రబాబు ప్రజల్లోకి వెళ్లగలడా అంటూ ఏపీ సీఎంను వైఎస్ఆర్ సీపీ ఎమ్మెల్యే రోజా సూటిగా ప్రశ్నించారు.

మా పార్టీ ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు భూమా నాగిరెడ్డికి సంకెళ్లు వేసి కూర్చోబెట్టారు. ప్రస్తుతం షేక్ హ్యాండ్ ఇచ్చి, కండువా కప్పి టీడీపీలోకి ఆహ్వానించారు. శోభా నాగిరెడ్డికి కనీసం సంతాపం తెలిపలేదని.. అంతా తెలిసి కూడా ఆమె భర్త, కూతురు అధికార టీడీపీలో చేరడాన్ని తప్పుబట్టారు. తమ పార్టీ చేసిన అభివృద్ది చూసి వస్తున్నారని అధికార పార్టీ వారు చెప్పడం నిజంగా సిగ్గుచేటు. అసలు టీడీపీ ప్రభుత్వం చేసిన అభివృద్ధి ఏంటని ఈ సందర్భంగా రోజా ధ్వజమెత్తారు. ఒక్క నిరుద్యోగికి కూడా ఉద్యోగం ఇవ్వలేదని, రైతులు, చేనేత కార్మికులకు రుణమాఫీ చేయలేదని వివరించారు.

మొదటి నుంచి కూడా బాబుకు రాజకీయాలను భ్రష్టు పట్టించడం అలవాటు అని.. అందులో భాగంగానే తెలంగాణలో ఓటుకు కోట్లు కేసులో రెడ్ హ్యాండెడ్ గా దొరికి పోయాడని ఆరోపించారు. అందుకే అక్కడ టీడీపీ సీన్ రివర్స్ అయిందన్నారు. ఈ పార్టీ వాళ్లు టీఆర్ఎస్ లో చేరితో సంతలో పశువుల్లా ప్రతిపక్ష ఎమ్మెల్యేలను కొంటున్నారంటూ టీఆర్ఎస్ పార్టీని విమర్శించిన చంద్రబాబు ఈ రోజు వైఎస్ఆర్ సీపీ ఎమ్మెల్యేలను రాజీనామా చేయించకుండా, టీడీపీ నుంచి ఎన్నికల్లో నిలబెట్టకుండానే మీ పార్టీలో ఏ విధంగా చేర్చుకున్నారని చంద్రబాబును సూటిగా ప్రశ్నించారు. రాజధాని రైతుల భూములను దోచుకుని, సింగపూర్ బృందం చేతికి అప్పగించి అభివృద్ధి చేస్తామని చెప్పిన చంద్రబాబు... టీడీపీ నేతలు, తన సన్నిహితులకు ఆ భూములను కట్టబెట్టడం దారుణమంటూ మండిపడ్డారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement