సాక్షి, అమరావతి: ఎమ్మెల్యే భూమా నాగిరెడ్డి ఆకస్మిక మరణాన్ని రాజకీయం చేసిన ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రతిపక్షంపై వింత ప్రదర్శన, విచిత్రమైన విమర్శలు గుప్పించారు. మంగళవారం శాసనసభలో భూమా నాగిరెడ్డికి నివాళులు అర్పించి ఆయన కుటుంబానికి సంతాపం తెలియజేయడంకన్నా ప్రతిపక్ష పార్టీని విమర్శించడానికే ఎక్కువ సమయం వెచ్చించారు. అంత్యక్రియలు పూర్తయిన మరుసటి రోజే భూమా నాగిరెడ్డి కుమార్తెను అసెంబ్లీకి రప్పించిన దరిమిలా ఎలాంటి రాజకీయపరమైన అంశాల జోలికి వెళ్లకుండా నివాళులకే పరిమితం కావలసింది. అలా కాకుండా చంద్రబాబు తన పార్టీ ఎమ్మెల్యేలతో ప్రతిపక్షంపై విమర్శలు గుప్పించే కార్యక్రమాన్ని చేపట్టారు.
సభలో ఒక సభ్యుడు ఆకస్మికంగా మరణించిన సందర్భాల్లో సభ్యుడికి నివాళులర్పించడంతో పాటు ఆ కుటుంబానికి అండగా ఉంటామన్న భరోసా శాసనసభ ద్వారా కల్పించాల్సిన బాధ్యత అధికార పక్షానికి ఉంటుంది. అనేక సంవత్సరాలుగా శాసనసభ సాక్షిగా ఇదే సంప్రదాయం కొనసాగుతోంది. అలాంటి సంప్రదాయానికి భిన్నంగా అసెంబ్లీలో టీడీపీ నేతలతో ప్రతిపక్షంపై దుమ్మెత్తిపోయడం అసందర్భమే అవుతుందన్న విమర్శలున్నాయి. మరణించిన సభ్యుడిని పట్ల ఆ రకంగా వ్యవహరించడం సభా మర్యాద కాదన్న వాదనలు ఉన్నాయి.
వీటన్నింటినీ పక్కన పెట్టి టీడీపీ ఎమ్మెల్యేలు, మంత్రులతో ప్రతిపక్షంపై తిట్ల పురాణం కురిపించిన చంద్రబాబు సభ వాయిదా పడిన అనంతరం మీడియాతో మాట్లాడుతూ వింత వాదన చేశారు. ‘‘ఎమ్మెల్యే భూమా నాగిరెడ్డిని మంత్రి పదవిలోకి తీసుకోవద్దని వైఎస్సార్ కాంగ్రెస్‌పార్టీ వాళ్లే గవర్నర్‌కు ఫిర్యాదు చేశారు కదా?" అని ప్రశ్నించారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సభ్యుడిగా ఎమ్మెల్యేగా ఎన్నికైన భూమా నాగిరెడ్డిని అనేక రకాలుగా ప్రలోభ పెట్టి పార్టీ ఫిరాయించేలా చంద్రబాబు ఒత్తిడి చేసినట్లు అప్పట్లోనే అనేక వార్తలొచ్చాయి. చంద్రబాబు ఒత్తిడి మేరకు భూమా నాగిరెడ్డి, ఆయన కుమార్తె అఖిల ప్రియలు ఇద్దరూ పార్టీ ఫిరాయించి టీడీపీలో చేరిన విషయం తెలిసిందే.
ఇదే విషయంపై అప్పట్లో వైఎస్సార్ కాంగ్రెస్ నేతలు స్పీకర్ ను కలిసి ఫిర్యాదు చేశారు. వారిపై అనర్హత వేటు వేయాలని కోరారు. ఇదే విషయంపై గవర్నర్ ను కలిసి ఫిర్యాదు చేశారు. అనేక రకాల ప్రలోభాలకు గురిచేస్తూ ప్రజాస్వామిక విలువలను కాలరాస్తూ పార్టీ ఫిరాయింపులను ప్రోత్సహిస్తున్నారని చంద్రబాబుపై ఫిర్యాదు చేశారు. నాణానికి మరోవైపు చూస్తూ... తెలంగాణలో టీడీపీ ఎమ్మెల్యేలు టీఆర్ఎస్ పార్టీలోకి ఫిరాయిస్తే వారిపైన టీడీపీ నాయకత్వం కూడా గవర్నర్ ను కలిసి ఇదే విధంగా ఫిర్యాదు చేసింది. కేసీఆర్ మంత్రివర్గంలో చేరిన టీడీపీ ఎమ్మెల్యేలను బర్తరఫ్ చేయాలని డిమాండ్ చేశారు.
ఆ విషయాన్ని విస్మరించిన మంగళవారం అసెంబ్లీలో దివంగత భూమానాగిరెడ్డికి సంతాపతీర్మానం ముగిసి సభ వాయిదా పడిన అనంతరం చంద్రబాబునాయుడు తన చాంబర్‌నుంచి బయటకు వెళ్తూ అక్కడ కలసిన మీడియాతో మాట్లాడుతూ, మంత్రి పదవిలోకి తీసుకోవద్దని గవర్నర్ కు ఫిర్యాదు చేశారు కదా అంటూ మాట్లాడటం విడ్డూరం. "భూమాకు మంత్రి పదవి ఇస్తామని ఆశచూపి ఇవ్వకపోవడం వల్లనే చనిపోయారని మాపై బురద చల్లుతున్నారు. మంత్రి పదవి ఇవ్వవద్దని చెప్పిందీ వాళ్లే... ఇప్పుడు ఇవ్వలేదని మాట్లాడుతున్నదీ వాళ్లే’’ అని చంద్రబాబునాయుడు పేర్కొన్నారు.
భూమా పార్టీ ఫిరాయించిన రోజునే కుటుంబంలో ఒకరికి మంత్రి పదవి ఇస్తారని టీడీపీ వర్గాలే చెప్పుకొచ్చాయి. అప్పట్లో ఆ ప్రచారాన్ని టీడీపీ నేతలు గానీ చంద్రబాబు నాయుడు గానీ ఎక్కడా ఖండించలేదు. తాజాగా ఈ విషయంలో... మీరు మంత్రి పదవి ఆశచూపి ఇవ్వకపోవడం, క్షోభ పెట్టడం వల్లనే భూమా నాగిరెడ్డి అస్వస్థతకు గురై చనిపోయినట్లు వచ్చిన విమర్శల గురించి విలేకరులు అడగ్గా ‘‘భూమాకు మంత్రి పదవి ఇస్తానని మీకు (మీడియాకు) చెప్పానా.... అయినా మంత్రి పదవిలోకి తీసుకోవద్దని గవర్నర్‌కు వాళ్లే (వైఎస్సార్ కాంగ్రెస్) ఫిర్యాదు చేశారు. ఇప్పుడు మళ్లీ మంత్రి పదవి ఇవ్వలేదంటారు.’’ అని రుసరుసలాడారు. ఎమ్మెల్యేలు తమ ఆరోగ్యం గురించి పట్టించుకోవడం లేదని గతంలో మాదిరి యోగా వంటి శిక్షణ ఇస్తారా? అంటే అదే ఆలోచిస్తున్నామని, వారితో పాటు మీకూ (మీడియా) ఇవ్వాల్సిన అవసరముందని సీఎం చెప్పుకొచ్చారు.