భూమాకు తుది వీడ్కోలు
⇒ అధికారిక లాంఛనాలతో అంత్యక్రియలు
⇒ భౌతిక కాయానికి నివాళులర్పించిన నేతలు
⇒ కుటుంబ సభ్యులను ఓదార్చిన ముఖ్యమంత్రి చంద్రబాబు
⇒ అఖిలప్రియకు మంత్రి పదవి ఇవ్వాలని కార్యకర్తల నినాదాలు
సాక్షి ప్రతినిధి, కర్నూలు: నంద్యాల ఎమ్మెల్యే భూమా నాగిరెడ్డికి సోమవారం ఆళ్లగడ్డలో అధికారిక లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వ హించారు. పెద్ద ఎత్తున తరలివచ్చిన నాయ కులు, వేలాదిమంది అభిమానుల మధ్య భూమా అంతిమయాత్ర సాగింది. ఆళ్లగడ్డ లోని శోభానాగిరెడ్డి ఘాట్ వద్దనే భూమా అంత్యక్రియలను ఆయన కుమారుడు జగత్ విఖ్యాత్‌రెడ్డి నిర్వహించారు. ఆదివారం ఉద యం భూమా గుండెపోటుతో హఠాన్మరణం చెందిన విషయం తెలిసిందే. సాయంత్రం నాలుగు గంటల సమయంలో భారీ జన సందోహం మధ్య భూమా పార్థివ దేహాన్ని ప్రత్యేక వాహనంపై ఉంచి వైపీపీఎం కళాశాల, పాత బస్టాండు మీదుగా శోభాఘాట్ వరకు అంతిమయాత్ర నిర్వహించారు. అనంతరం అక్కడే అంత్యక్రియలను అధికార లాంఛనా లతో పూర్తి చేశారు. ప్రత్యేక పోలీసులు గౌరవ వందనం సమర్పించి సంతాపసూచకంగా గాల్లోకి రెండు రౌండ్ల కాల్పులు జరిపారు. అనంతరం జగత్‌విఖ్యాత్‌రెడ్డి తన తండ్రి చితికి నిప్పంటించారు. భూమా కుమార్తెలు ఆళ్లగడ్డ ఎమ్మెల్యే అఖిల ప్రియ, నాగ మౌనిక, కుటుంబసభ్యుల రోద నలతో ఆ ప్రాంతంలో విషాదం అలుముకుంది.
భూమా కుటుంబానికి సీఎం భరోసా
భూమా కుటుంబానికి అండగా ఉంటామని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రకటించారు. కుటుంబ సభ్యులతో కాసేపు ఏకాంతంగా చర్చించి ఓదార్చారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ.. చనిపోయే సమయానికి 24 గంటల ముందు భూమా విజయవాడలో తనను కలిశారని.. నంద్యాల, ఆళ్లగడ్డ నియోజకవర్గాల అభివృద్ధి గురించి చర్చించారని తెలిపారు. అఖిలప్రియ ద్వారా ఆయన ఆశయాలను నెరవేరుస్తామని ప్రకటించారు. సీఎం మాట్లాడుతున్నప్పుడు కొందరు కార్యకర్తలు అఖిలప్రియకు మంత్రి పదవి ఇవ్వాలంటూ నినాదాలు చేశారు. అయితే సీఎం స్పందించలేదు.
నేతల నివాళి
భూమా భౌతిక కాయానికి కేంద్ర మంత్రి సుజనా చౌదరి, శాసనమండలి చైర్మన్ చక్ర పాణి యాదవ్, స్పీకర్ కోడెల శివప్రసాద్ రావుతో పాటు డిప్యూటీ సీఎంలు కె.ఇ.కృష్ణ మూర్తి, చిన్నరాజప్ప, మంత్రులు అచ్చెన్నా యుడు, పరిటాల సునీత, పీతల సుజాత, ప్రత్తిపాటి పుల్లారావు, కొల్లు రవీంద్ర, చీఫ్ విప్ కాల్వ శ్రీనివాసులు, ఎంపీ జె.సి.దివా కర్‌రెడ్డితో పాటు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నుంచి మాజీ ఎంపీ అనంత వెంకట్రామిరెడ్డి, పార్టీ జిల్లా అధ్యక్షుడు గౌరువెంకటరెడ్డి, ఎమ్మెల్యేలు బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి, ఐజ య్య, సాయిప్రసాద్‌రెడ్డి, బాలనాగిరెడ్డి, ఆది మూలపు సురేష్, మాజీ ఎమ్మెల్యే కాటసాని రామిరెడ్డి, కాపు రామచంద్రారెడ్డి, రాజ గోపాల్‌రెడ్డిలు భూమాకు నివాళులు అర్పించి కుటుంబ సభ్యులను ఓదార్చారు.