ఎవరికి వారే..యమునా తీరే
► ఆశీర్వాద యాత్రలో కానరాని ‘అనుబంధం’
► మంత్రి అఖిల, ఏవీ సుబ్బారెడ్డి మధ్య కుదరని సయోధ్య
►మంత్రి ఫొటో, పేరు లేకుండానే ఏవీ వార్డుల పర్యటన
►కార్యకర్తల్లో ఆందోళన
కర్నూలు: ఆశీర్వాద యాత్ర పేరుతో అధికార పార్టీ చేపట్టిన కార్యక్రమంలో నేతలు ఎవరికి వారే యమునా తీరే అన్న చందంగా వ్యవహరిస్తున్నారు. మంత్రి అఖిలప్రియ, భూమా సన్నిహితుడు ఏవీ సుబ్బారెడ్డి మధ్య అగాధం మరింత పెరిగిందన్న చర్చ అధికార పార్టీలో సాగుతోంది. ఇందుకు కారణం.. ఆశీర్వాద యాత్ర పేరుతో ఏవీ సుబ్బారెడ్డి చేపట్టిన వార్డుల పర్యటన కోసం ప్రచురించిన కరపత్రాల్లో ఎక్కడా భూమా అఖిలప్రియ పేరుకానీ, ఫొటో కానీ ప్రచురించకపోవడమే. ఈ విషయం కాస్తా ఇప్పుడు నంద్యాలలో హాట్‌టాపిక్‌గా మారింది.
ఇదే తరుణంలో అధికార పార్టీ నేతలు, కార్యకర్తల్లో గందరగోళం కూడా నెలకొంది. ఎవరి వెనక వెళితే ఎవరికి కోపం వస్తుందేమోనన్న ఆందోళనకు వారు గురవుతున్నారు. ఒకానొక దశలో స్వయంగా ముఖ్యమంత్రి చంద్రబాబు పిలిపించి.. ఏవీతో కలిసి పనిచేయాలని మంత్రి అఖిలప్రియకు సూచించారు. అయినా అదే పరిస్థితి కొనసాగుతోంది. తానేమీ తక్కువ తినలేదన్నట్టుగా ఏవీ సుబ్బారెడ్డి కూడా తన దారి తనదే అన్నట్లు వ్యవహరిస్తున్నారు. ఈ క్రమంలోనే మంత్రి అఖిలప్రియ పేరు ఎత్తకుండానే వార్డుల పర్యటనకు దిగినట్టు తెలుస్తోంది.
ఆది నుంచీ అంతే!
వాస్తవానికి భూమా మరణం తర్వాత మంత్రికి, ఏవీ సుబ్బారెడ్డికి మధ్య అంతరం పెరిగిపోయింది. ఒకరికి ఒకరు మాటలు లేకుండా రోజుల తరబడి ఉన్నారు. నంద్యాల ఉప ఎన్నిక నేపథ్యంలో ఏవీ సుబ్బారెడ్డిని కలుపుకొని వెళ్లాలని సీఎం ఆదేశించారు. అయినప్పటికీ మంత్రి పొడిపొడిగానే మాట్లాడి చేతులు దులిపేసుకున్నట్టు తెలుస్తోంది. కొన్ని రోజుల క్రితం నంద్యాలలో నేతలు, కార్యకర్తలతో జరిగిన సమావేశానికి జిల్లా అధ్యక్షుడు సోమిశెట్టి, మాజీ మంత్రి కేఈ ప్రభాకర్ నాయకత్వం వహించినప్పటికీ ఆమె హాజరుకాలేదు. ఈ విషయం సీఎం దృష్టికి తీసుకెళ్లినా అదే తీరే కొనసాగుతోంది. మొత్తమ్మీద ఇక సయోధ్య కుదరదని భావించి ఎవరి యాత్రలకు వారు శ్రీకారం చుట్టారు. దీంతో ఎవరి వెనకాల నడవాలనే విషయంలో అధికార పార్టీ నేతలు, కార్యకర్తల్లో గందరగోళం నెలకొంది.
ఆర్థిక వ్యవహారాలే కారణమా?
భూమాకు, ఏవీకి మధ్య సన్నిహిత సంబంధాలు అందరికీ తెలిసిందే. ఒకరికి తెలియకుండా మరొకరు ఎటువంటి వ్యవహారాలూ నడిపే అవకాశం లేనంతగా వారి మధ్య సంబంధబాంధవ్యాలు ఉండేవి. అయితే, భూమా మరణం తర్వాత ఆ కుటుంబంతో ఏవీకి సంబంధాలు పూర్తిగా దెబ్బతిన్నాయి. ఆర్థికపరమైన విషయాల్లోనే ఇరువురి మధ్య విభేదాలు నెలకొన్నట్లు తెలుస్తోంది. తమకు సంబంధించిన ఆర్థిక వ్యవహారాలను తెలియజేయనివ్వడం లేదన్న అభిప్రాయంలో ఇరువర్గాలు ఉన్నట్టు తెలుస్తోంది. ఓ కాంట్రాక్టు వ్యవహారంలో కూడా తమకు తెలియకుండా ఆర్థిక వ్యవహారాలు చక్కబెట్టుకుంటున్నారని ఒకరిపై ఒకరు ఫిర్యాదు చేసుకుంటున్నట్టు సమాచారం. ఈ నేపథ్యంలోనే ఇరువురి మధ్య అగాధం భారీగా పెరిగిపోయి.. యాత్రలు కూడా ఎవరికివారుగా చేపట్టారు.