మంత్రివర్గంలో జిల్లాకు చోటు?
మంత్రివర్గంలో జిల్లాకు చోటు?
Published Sat, Apr 1 2017 10:40 PM | Last Updated on Tue, Sep 5 2017 7:41 AM
– అఖిలప్రియకు స్థానం...!
– మండిపడుతున్న పాత కాపులు
సాక్షి ప్రతినిధి, కర్నూలు: మంత్రివర్గ విస్తరణలో కర్నూలు జిల్లాకు స్థానం దక్కనుంది. ఆళ్లగడ్డ నుంచి ఎమ్మెల్యేగా గెలిచిన అఖిలప్రియకు మంత్రివర్గంలో స్థానం కల్పించాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నిర్ణయం తీసుకున్నట్టు ఆ పార్టీలో చర్చ జరుగుతోంది. విజయవాడలో ఆదివారం నిర్వహిస్తున్న ప్రమాణ స్వీకార కార్యక్రమానికి రావాలంటూ కబురు కూడా అందిందని ఆమె అనుచరులు పేర్కొంటున్నారు. అదేవిధంగా తాము కూడా కార్యక్రమానికి వెళ్తున్నట్టు ఆ పార్టీ నేతలు చెబుతున్నారు. అయితే, అధికార పార్టీలోని మరికొందరు మాత్రం అఖిలప్రియకు మంత్రి పదవి ఇవ్వడంపై మండిపడుతున్నారు. పార్టీ మారి వచ్చిన వారికి పదవులు కట్టబెడితే తమ పరిస్థితి ఏమిటని వాపోతున్నారు. ఇది అంతిమంగా పార్టీనే నమ్ముకున్న కార్యకర్తలను, నేతలను అవమానపర్చినట్టేనని వాదిస్తున్నారు. మరోవైపు తెలంగాణలో తలసానికి మంత్రి పదవి ఇచ్చినప్పుడు రచ్చ చేసిన మనమే.. ఇప్పుడు అదే తప్పు చేస్తే ప్రజలు ఏమనుకుంటారోనన్న విషయాన్ని కూడా ఆలోచించాలని కోరుతున్నారు. ఏదేమైనప్పటికీ అఖిలప్రియకు మాత్రం మంత్రి పదవి ఖాయమని ఆమె వర్గీయులు బల్లగుద్ది చెబుతున్నారు.
రాజీనామా చేయకుండానే..!
వాస్తవానికి భూమా అఖిలప్రియ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నుంచి ఎమ్మెల్యేగా గెలుపొందారు. ఈ నేపథ్యంలో ఆమెకు మంత్రి పదవి ఇవ్వాలంటే మొదట ఆ పదవికి రాజీనామా చేయాల్సి ఉంటుంది. అనంతరం ఆరు నెలల్లోగా తిరిగి ఎన్నిక కావాల్సి ఉంది. అయితే, ఈ సంప్రదాయాలకు భిన్నంగా ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయకుండానే మంత్రి పదవి కట్టబెట్టాలని నిర్ణయం తీసుకోవడం విమర్శల పాలవుతోంది. గతంలో తలసానికి మంత్రి పదవి ఇచ్చినప్పుడు గవర్నర్‌కు ఫిర్యాదు చేయడంతో పాటు ఏకంగా గవర్నర్‌పై కేంద్ర హోంశాఖకు కూడా తెలంగాణ తెలుగుదేశం పార్టీ ఫిర్యాదు చేసింది. ఈ నేపథ్యంలో కేంద్ర హోంశాఖ కూడా గవర్నర్‌కు లేఖ రాసి.. సదరు వ్యవహారంపై నివేదిక పంపాలని కూడా ఆదేశించినట్టు వార్తలు గుప్పుమంటున్నాయి.
ఇప్పుడు ఆంధ్రప్రదేశ్‌లో అదే తప్పు చేసేందుకు తమ అధిష్టానం సిద్ధపడటాన్ని ఇక్కడి నేతలు జీర్ణించుకోలేకపోతున్నారు. పార్టీలోని పలువురు పాత కాపులు ఈ నిర్ణయంపై మండిపడుతున్నారు. తమను కాదని కొత్తగా వచ్చిన వారికి పదవులు కట్టబెట్టడంపై అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ప్రధానంగా జిల్లా అధ్యక్షుడు శిల్పా చక్రపాణిరెడ్డితో పాటు బనగానపల్లె, ఎమ్మిగనూరు ఎమ్మెల్యేలు బీసీ జనార్దన్ రెడ్డి, జయనాగేశ్వరరెడ్డిలు కూడా మంత్రి పదవి ఆశిస్తున్నారు. తమకు అవకాశం ఇస్తారని వీరు ఎదురుచూస్తున్నారు. వీరు కూడా ఎవరికి వారుగా తమ ప్రయత్నాలు కొనసాగిస్తున్నారు. అదే సందర్భంలో పార్టీ మారిన వారికి మంత్రి పదవి ఇస్తే తాము కూడా ఏదో ఒక నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుందని కూడా అధికార పార్టీలోని పలువురు తమ సన్నిహితులతో వ్యాఖ్యానిస్తున్నట్టు సమాచారం.
Advertisement
Advertisement