కర్నూలు బైక్ ర్యాలీ చేపట్టిన సోమిశెట్టి, ఎమ్మెల్యే ఎస్వీ
కర్నూలు(కొండారెడ్డి ఫోర్టు) : ప్రత్యేక హోదా సాధన కోసమంటూ టీడీపీ నేతలు జిల్లాలో శనివారం చేపట్టిన సైకిల్ యాత్రలు మొక్కుబడిగా కొనసాగాయి. ప్రజలు నుంచి స్పందన కరువై హోదా నినాదం ఎక్కడా వినిపించ లేదు. కొన్ని నియోజకవర్గాల్లో కనీసం కార్యకర్తలు కూడా వెంట లేక పోవడంతో నేతలు తూతూమంత్రంగా చేపట్టారు. కొన్ని చోట్ల నేతలు సైకిల్ తొక్కలేక ఇబ్బంది పడ్డారు. మరి కొన్ని చోట్ల సైకిల్ కష్టమంటూ బైక్ ర్యాలీలు నిర్వహించారు. కర్నూలులో టీడీపీ జిల్లా అధ్యక్షుడు సోమిశెట్టి వెంకటేశ్వర్లు, ఎమ్మెల్యే ఎస్వీ మోహన్‌రెడ్డి బైక్ ర్యాలీ నిర్వహించారు. వారి వెంట కార్యకర్తలు, ప్రజలు కనిపించలేదు. నందికొట్కూరు ఇన్‌చార్జి మాండ్ర శివానందరెడ్డి ఆధ్వర్యంలో సైకిల్ యాత్ర జూపాడుబంగ్లా నుంచి పాములపాడు వరకు కొనసాగింది.
నంద్యాలలో ఎమ్మెల్యే భూమా బ్రహ్మానందారెడ్డి ఆధ్వర్యంలో కొత్తపల్లి నుంచి నంద్యాల వరకు, మంత్రి భూమా అఖిలప్రియ చాగలమర్రిలో సైకిల్ ర్యాలీ చేపట్టారు. బనగానపల్లె ఎమ్మెల్యే బీసీ జనార్దన్‌రెడ్డి ఆధ్వర్యంలో బనగానపల్లె నుంచి పసుపల వరకు బైక్ ర్యాలీ చేశారు. డోన్‌లో కేఈ ప్రతాప్ ఆధ్వర్యంలో అవులదొడ్డి నుంచి కామగానిగుండ్ల వరకు నాయకులు సైకిల్ తొక్కారు. కోడుమూరు ఎమ్మెల్యే మణిగాంధీ ఆధ్వర్యంలో సి. బెళగల్‌లో సైకిల్ ర్యాలీ నిర్వహించారు. సైకిల్ తొక్కేందుకు ఇతరుల సాయం తీసుకోవాల్సి వచ్చింది. ఆత్మకూరు ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖరరెడ్డి వెలుగోడులో సైకిల్ ర్యాలీలో పాల్గొన్నారు.ఎమ్మిగనూరులో ఎమ్మెల్యే జయనాగేశ్వరరెడ్డి ఆధ్వర్యంలో పట్టణంలో సైకిల్ ర్యాలీ చేపట్టారు. కేఈ శ్యామ్‌బాబు ఆధ్వర్యంలో పులికొండ నుంచి పత్తికొండకు వరకు యాత్ర కొనసాగింది. పాణ్యంలో ఇన్‌చార్జి ఏరాసు ప్రతాప్‌రెడ్డి ఆధ్వర్యంలో సైకిల్ ర్యాలీ నిర్వహించారు.
Comments
Please login to add a commentAdd a comment