సాక్షి, కర్నూలు : నంద్యాల ఎంపీ ఎస్పీవై రెడ్డి అంత్యక్రియలు గురువారం అధికారిక లాంఛనాల మధ్య ముగిశాయి. బొమ్మలసత్రంలో ఉన్న ఎస్పీవై రెడ్డి ఇంటి ఆవరణలోనే కుటుంబసభ్యులు అంత్యక్రియలు నిర్వహించారు. ఎస్పీవై రెడ్డి తల్లి ఈరమ్మ సమాధి పక్కనే ఆయన అంత్యక్రియలు కూడా చేశారు. అంత్యక్రియల కార్యక్రమానికి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి, కాటసాని రామిరెడ్డి, కోట్ల సుజాతమ్మ, బ్రహ్మానందరెడ్డి, శిల్ప రవిచంద్ర, కిషోర్ రెడ్డితో పాటు పెద్ద ఎత్తున రైతులు హాజరయ్యారు.
పైపుల రెడ్డిని కడసారి చూసేందుకు..
మూడు సార్లు ఎంపీగా విజయం సాధించి నంద్యాల పార్లమెంట్ నియోజకవర్గంలో మంచి పేరు కలిగివున్న ఎస్పీవై రెడ్డి మరణించారని తెలియగానే నంద్యాల ప్రజలు శోకసంద్రంలో మునిగిపోయారు. పేదల ఆకలిని తీర్చిన అన్నదాత పైపులరెడ్డి ఇక లేరనే విషయాన్ని జీర్ణించుకోలేకపోతున్నారు. నంద్యాల ఎంపీ ఎస్పీ వైరెడ్డి మంగళవారం రాత్రి హైదరాబాద్ కేర్ ఆసుపత్రిలో మరణించిన విషయం తెలిసిందే. హైదరాబాద్ నుంచి ఆయన భౌతికకాయాన్ని బుధవారం ఉదయం 6 గంటలకు నంద్యాలకు తీసుకొచ్చి ఆయన ఇంటి వద్ద ఉంచారు. ఎస్పీవై రెడ్డిని చూడటానికి పెద్ద ఎత్తున ప్రజలు తరలి వచ్చారు.
అధికారులు, ప్రజాప్రతినిధులు, ప్రజాసంఘాలు, పలు పార్టీల నాయకులు మృతదేహాన్ని సందర్శించి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఉదయం నుంచి పట్టణంలోని బొమ్మలసత్రంలోని ఎస్పీవైరెడ్డి స్వగృహం ప్రజలతో నిండిపోయింది. పైపుల రెడ్డి ఇక లేరని పలువురు కన్నీరు మున్నీరయ్యారు. ఎస్పీవై రెడ్డి భౌతికాయం వద్ద నివాళులర్పించిన నాయకులు, అధికారులు ఆయన కుమార్తె సుజలరెడ్డి, అల్లుడు శ్రీధర్‌రెడ్డిలను ఓదార్చి ధైర్యం చెప్పారు. ఎస్పీవై రెడ్డి పెద్ద కుమార్తె సుజలరెడ్డి తండ్రి మృతదేహం వద్ద విలపించిన తీరు అందరినీ కలచివేసింది.
Comments
Please login to add a commentAdd a comment