శింగనమల సీటు..ప్రభుత్వ ఏర్పాటుకు రూటు! | Singanamala Assembly Constituency Key Role In Elections | Sakshi
Sakshi News home page

శింగనమల సీటు..ప్రభుత్వ ఏర్పాటుకు రూటు!

Published Thu, Mar 14 2019 2:26 PM | Last Updated on Thu, Mar 14 2019 2:28 PM

Singanamala Assembly Constituency Key Role In Elections - Sakshi

శింగనమల నియోజకవర్గానికి దేశంలోనే చెప్పుకోదగ్గ ప్రత్యేకత ఉంది. మాజీ రాష్ట్రపతి దివంగత నీలం సంజీవరెడ్డి, కమ్యూనిస్ట్‌ పోరాట యోధుడు తరిమెల నాగిరెడ్డి ఈ నియోజకవర్గానికి చెందిన వారే. నిత్య చైతన్యశీలురైన ఈ నియోజకవర్గ ఓటర్లు తమదైన శైలిలో తీర్పునిస్తూ వస్తున్నారు.  నియోజకవర్గ ఎమ్మెల్యేగా ఏ పార్టీ అభ్యర్థి గెలుస్తాడో ఆ పార్టీ అధికారంలోకి వస్తుందని చాలా మంది నమ్ముతారు. గత ఎన్నికలు పరిశీలిస్తే ఇది వాస్తవ మనే తేలుతోంది. పార్టీలు మారి పోటీ చేసిన వారిని ఓడించడం ఈ నియోజకవర్గ ఓటర్ల ప్రత్యేకత. చివరకు వారు రాజకీయాల నుంచే తప్పుకునేందుకు రణమవుతుంటారు. 

శింగనమల నియోజకవర్గం 1967లో ఏర్పడింది. ఇప్పటి వరకు 11 సార్లు ఎన్నికలు జరిగాయి. 1978లో ఎస్సీ నియోజకవర్గంగా రిజర్వుడు అయింది. ఇప్పటి వరకూ జరిగిన ఎన్నికల్లో ప్రాంతీయ పార్టీల హవానే కొనసాగింది.

పార్టీలు మారిన వారిని ఓడించారు  
1985లో కాంగ్రెస్‌ పార్టీలోకి పామిడి శమంతకమణి చేరి పోటీ చేశారు. ఆ ఎన్నికల్లో ఓటమి చెందారు. 1989లో ఆదే పార్టీ నుంచి పామిడి శమంతకమణి పోటీ చేసి టీడీపీ అభ్యర్థిపై గెలిచారు. 1994లో కాంగ్రెస్‌ తరఫున శమంతకమణి పోటీ చేసి ఓడిపోయారు. 1999లో కాంగ్రెస్‌ టికెట్‌ రాకపోవడంతో శమంతకమణి టీడీపీలో చేరిపోయారు. 2004, 2009 ఎన్నికల్లో టీడీపీపై పోటీ చేసిన శమంతకమణిని ఓటర్లు ఓడించారు. 2009 ఎన్నికల్లో టీడీపీ టిక్కెట్‌ రాకపోవడంతో కె.జయరాం పీఆర్‌పీలోకి మారారు. ఆ ఎన్నికల్లో జయరాంకు డిపాజిట్‌ కూడ దక్కలేదు. 

ప్రధాన సమస్యలు  
శింగనమల చెరువు లోకలైజేషన్‌ హమీగానే నిలిచిపోయింది. ఇంతవరకు నీటి కేటాయింపులు చేయలేదు. దీంతో శింగనమల మండలంలో దాదాపు 15 గ్రామాల రైతులు, ప్రజలు తిండి గింజలు, తాగునీటికి ఇబ్బం దులు పడుతున్నారు.  గార్లదిన్నె మండలం యర్రగుంట్ల వద్ద బైపాస్‌ కెనాల్‌ నిర్మాణానికి అప్పటి ముఖ్యమంత్రి వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి నిధులు మంజూరు చేసినా.. పనులు చేపట్టలేకపోయారు. రోశయ్య, కిరణ్‌కుమార్‌రెడ్డి, చంద్రబాబు ప్రభుత్వంలో ఎటువంటి పనులు చేపట్టలేదు. మిడ్‌ పెన్నార్‌ డ్యాం కింద ఆయకట్టు 60 వేలు ఎకరాలు వరకూ నీరు పారక రైతులు అగచాట్లు పడుతున్నారు. నియోజకవర్గానికి ఇప్పటి వరకూ ఎన్నికైన ప్రజాప్రతినిధులు వైఫల్యాలకు నిదర్శనంగా సాగు, తాగునీటితో ప్రజలు అష్టకష్టాలు పడుతున్నారు. 

నియోజకవర్గ అభివృద్ధికి వైఎస్సార్‌ చేయూత ..
దివంగత ముఖ్యమంత్రి డాక్టర్‌ వైఎస్‌ రాజశేఖరరెడ్డి హయాంలో నియోజకవర్గంలోని ఆన్ని మండలాల్లో ఇందిరమ్మ గృహాలు, పింఛన్లు పంపిణీ విరివిగా చేపట్టారు.  ఎర్రగుంట్ల నుంచి ముంటిముడుగు వరకూ 6 కిలోమీటర్లు బైపాస్‌ కాలువ ఏర్పాటు చేయాలని 43 ప్యాకేజీ కింద నిధులు మంజూరు చేయించారు. గార్లదిన్నెలో కేజీబీవీ, ఆదర్శ పాఠశాల, ప్రభుత్వ జూనియర్‌ కళాశాల ఏర్పాటు చేశారు. హెచ్చెల్సీ చివరి అయుకట్టు వరకూ నీరు వచ్చాయి. బుక్కరాయసముద్రం మండలంలో కేజీబీవీ, నార్పలకు డబుల్‌ రోడ్డు నిర్మాణానికి రూ.12 కోట్లు మంజూరు చేశారు. ఎస్సీ, ఎస్టీ విద్యార్థుల వసతి గృహాలకు పక్కా భవనాలు నిర్మించారు. శింగనమలలో కేజీబీవీ ఏర్పాటు చేశారు.

శింగనమల చెరువుకు నాలుగేళ్లపాటు పంట కోసం హెచ్చెల్సీ నీటిని విడుదల చేయించి రైతులను ఆదుకున్నారు. శింగనమల చెరువును లోకలైజేషన్‌ చేస్తానని, నార్పలలో జరిగిన ఎన్నికల సభలో హమీ ఇచ్చారు. కాని అయన మరణాంతరం చెరువుకు నీరు విడిపించేవారు లేకుండా పోయారు. నార్పల మండలంలో గూగూడు రోడ్డు నిర్మాణం, ఇందిరమ్మ గృహాలు, కేజీబీవీ ఏర్పాటు చేశారు. పుట్లూరు మండలంలో రూ.4.50 కోట్లతో రోడ్లు, కేజీవీ, ఆదర్శ పాఠశాలలు మంజూరు చేశారు.   గండికోట నుంచి పార్నపల్లి వరకూ కృష్ణా జలాలను తరలించడం కోసం ఎత్తిపోతల పథకాన్ని ప్రారంభించారు.  

అధికార పార్టీపై పెరిగిన వ్యతిరేకత
నియోజవకర్గ ఎమ్మెల్యే యామినిబాల వ్యక్తిగత  సంపాదనే ధ్యేయంగా పని చేయడంతో ఆమెపై వ్యతిరేకత బలపడింది. సొంత పార్టీకి చెందిన నాయకులు, కార్యకర్తలే ఆమెను వ్యతిరేకిస్తూ వస్తు న్నారు. సీఎం చంద్రబాబు చేపట్టిన అంతర్గత సర్వేలలో సైతం యామినిబాలకు వ్యతిరేకంగా నివేదికలు వెళ్లాయి. దీంతో ఆ పార్టీ అధిష్టానం కొత్త అభ్యర్థుల కోసం వేట మొదలు పెట్టింది. ఇప్పటికే బండారు శ్రావణితో పాటు పీసీసీ ఉపాధ్యక్షుడు, మాజీ మంత్రి శైలజానాథ్‌ పేర్లను టీడీపీ అధిష్టానం పరిశీలిస్తోంది. జేసీ వర్గీయులు  తప్ప మిగిలిన నాయకులందరూ బండారు శ్రావణిని వ్యతిరేకిస్తున్నారు.  ఇదే విషయంపై ఇప్పటికే అధిష్టానానికి అల్టిమేటం ఇచ్చినట్లు తెలిసింది. మాజీ మంత్రి సాకే శైలజానాథ్‌ను తీసుకురావడానికి  విశ్వ ప్రయత్నాలు సాగుతున్నాయి.

ఓడిపోయే పార్టీలోకి  తాను రాలేనంటూ శైలజనాథ్‌ తెగేసి చెప్పినట్లు సమాచారం. కాగా, నియోజకవర్గంలో వైఎస్సార్‌సీపీ సమన్వయకర్త జొన్నలగడ్డ పద్మావతి ప్రత్యేక కార్యాచరణతో ప్రజల్లోకి దూసుకెళుతోంది. నిరంతరం ఏవో ఒక కార్యక్రమాలతో ప్రజల్లో మమేకమవుతూ వచ్చారు. రావాలి జగన్‌–కావాలి జగన్‌ కార్యక్రమాలతో పాటు, నవరత్నాలు పథకాలను   వివరిస్తూ ప్రజలకు చేరువయ్యారు. నియోజకవర్గంలోని అన్ని మండలాల్లో ఈ కార్యక్రమాలతో అనేక ప్రజా సమస్యలపై ఇప్పటికే ఎన్నోసార్లు పోరాటాలు చేశారు. దీంతో ప్రజలు కూడా వైఎస్సార్‌సీపీని ఆదరిస్తున్నారు. 

శింగనమల నియోజకవర్గం ఎమ్మెల్యేలు 

సంవత్సరం   గెలిచిన అభ్యర్థి     సమీప ప్రత్యర్థి     పార్టీ    పార్టీ     మెజారిటీ  
1967  చిన్న రంగయ్య శెట్టి  కాంగ్రెస్‌  కుమ్మెత రంగారెడ్డి       సీపీఎం    1851     
1972    తరిమెల రంగారెడ్డి   స్వంతంత్ర    తిమ్మారెడ్డి     కాంగ్రెస్‌       5355 
1978    బి.రుక్మీణీదేవి    జనత    కె.ఆనందరావు    కాంగ్రెస్‌    3627     
1983   గురుమూర్తి  టీడీపీ   కె.ఆనందరావు    కాంగ్రెస్‌   18,903     
1985     కె.జయరాం     టీడీపీ   పామిడి శమంతకమణి కాంగ్రెస్‌      14212     
1989   పామిడి శమంతకమణి కాంగ్రెస్‌    బీ.సీ.గోవిందప్ప     టీడీపీ    7079     
1994   కె.జయరాం  టీడీపీ   పామిడి శమంతకమణి     కాంగ్రెస్‌    47,198     
1999   కె.జయరాం     టీడీపీ   సాయిరాం   కాంగ్రెస్‌    4290     
2004   సాకే శైలజానాథ్‌    కాంగ్రెస్‌   పామిడి శమంతకమణి     టీడీపీ    8586    
2009 సాకే శైలజానాథ్‌   కాంగ్రెస్‌   పామిడి శమంతకమణి     టీడీపీ   3176
2014     యామినిబాల   టీడీపీ  జొన్నలగడ్డ పద్మావతి     వైఎస్సార్‌సీపీ   4584     


        

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

Photos

View all
Advertisement