శైలుకు ఘోర పరాభవం | Sailajanath Got Less Than NOTA Votes | Sakshi
Sakshi News home page

శైలుకు ఘోర పరాభవం

Published Sun, May 26 2019 10:02 AM | Last Updated on Sun, May 26 2019 10:02 AM

Sailajanath Got Less Than NOTA Votes - Sakshi

అనంతపురం: ఆయన గత చరిత్ర ఘనం. రెండు పర్యాయాలు ఒకే స్థానం నుంచి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. వైఎస్‌ హయాం లో విప్‌గా పని చేశారు. వైఎస్‌ అకాలమరణంతో ముఖ్యమంత్రి పీఠం ఎక్కిన కిరణ్‌కుమార్‌రెడ్డి కేబినేట్‌లో విద్యాశాఖ మంత్రిగా పని చేశారు. కాంగ్రెస్‌ పార్టీ జాతీయ కార్యదర్శిగా, ఆ పార్టీ కర్ణాటక ఎన్నికల వ్యవహారాల ఇన్‌చార్జ్‌గా పని చేస్తున్నారు. ఇంతటి చరిష్మా ఉన్న నాయకుడికి మొన్న జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో ఘోర అవమానం జరిగింది. ఇంతకీ ఆయన ఎవరంటే డాక్టర్‌ సాకే శైలజానాథ్‌!  శింగనమల నియోజకవర్గం కాంగ్రెస్‌ పార్టీ అభ్యర్థిగా మొన్న జరిగిన ఎన్నికల్లో బరిలో నిలిచిన శైలజానాథ్‌కు కేవలం 1,384 ఓట్లు (0.69 శాతం) మాత్రమే పోలయ్యాయి.

ఈ ఓట్లు నన్‌ ఆఫ్‌ ద అబౌ (నోటా)తో పోల్చుకుంటే ఇది చాలా తక్కువ కావడం విశేషం. ఇక్కడ ‘నోటా’కు 2,340 ఓట్లు వచ్చాయి. శైలజానాథ్‌కు వచ్చిన ఓట్లు చూసి జిల్లా ప్రజలు ముక్కున వేలేసుకుంటున్నారు. మంత్రిగా పని చేసే సమయంలో కాంగ్రెస్‌ పార్టీలో అన్నీ తానై రాష్ట్రమంతా హడావుడి చేసిన ఆయన తన సొంత నియోజకవర్గంలో కనీసం డిపాజిట్లు సైతం దక్కించుకోలేకపోవడంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. నిరంతరం రాష్ట్ర, దేశ రాజకీయాల గురించే మాట్లాడే ఆయన సొంత నియోజకవర్గంలో కనీస రాజకీయ పరువు కూడా నిలబెట్టుకోలేకపోయారు. ఉట్టికెగరలేనమ్మ.. స్వర్గానికి ఎగబాకిందన్న చందంగా ‘నోటా’ కంటే తక్కువ ఓట్లు సాధించిన శైలూ.. కర్ణాటకలో ఎన్నికల్లో కాంగ్రెస్‌ పార్టీని గెలిపిస్తాడట!’ అంటూ జిల్లా ప్రజలు బాహటంగానే విమర్శలు గుప్పిస్తున్నారు.   

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement