సాక్షి, వైఎస్‌ఆర్ కడప: దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి హయాంలో ప్రతి ఒక్కరికీ సంక్షేమ పథకాలు అందాయని ఏఐసీసీ కార్యదర్శి, మాజీమంత్రి శైలజనాథ్ పేర్కొన్నారు. శుక్రవారం నగరంలోని ఇందిరాభవన్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. వైఎస్ రాజశేఖరరెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో విద్య, వైద్యరంగానికి పెద్దపీట వేశారని గుర్తు చేశారు. ఫీజురీయింబర్స్‌మెంట్, ఆరోగ్యశ్రీ, 108,104 వంటి పథకాలను ప్రజలు ఎప్పటికీ మరువలేరన్నారు. కాంగ్రెస్ పార్టీ హయాంలోనే రాయలసీమలోని ప్రాజెక్టులకు మహర్దశ వచ్చిందన్నారు. కాంగ్రెస్ పార్టీ హయాంలో సాగునీటి రంగానికి బడ్జెట్‌లో అధిక నిధులను కేటాయించామన్నారు. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ అన్నట్టుగా శ్రీశైలం ప్రాజెక్టును కేవలం రాయలసీమకు కేటాయిస్తే సస్యశ్యామలం అవుతుందన్నారు. ప్రస్తుత ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి సాగునీటి రంగానికి ప్రాధాన్యత ఇచ్చి మంచిపాలన అందించాలని కోరారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం రాజ్యాంగ వ్యవస్థలను ధ్వంసం చేస్తుందని విమర్శించారు. కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు నజీర్ అహ్మద్, సత్తార్, బండి జకరయ్య, నీలిశ్రీనివాసరావు, చార్లెస్, గోశాల దేవి తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment