ఏడున్నరేళ్ల పదవీయోగం...
ఫ్లాష్‌బ్యాక్: ఏపీ మొదటి శాసనసభ రికార్డు
ఒకసారి ఎన్నికై ఏడున్నరేళ్లు శాసనసభకు ప్రాతినిధ్యం వహించిన అరుదైన అవకాశం తెలుగువారికే దక్కింది. హేమాహేమీలు కొలువుదీరిన 1956 ఆంధ్రప్రదేశ్ మొదటి శాసనసభ ఇందుకు వేదికైంది. ఉమ్మడి రాష్ట్రంలో జరుగుతున్న చివరి ఎన్నికల సందర్భంగా ఈ సభ విశేషాలను గుర్తు చేసుకుందాం.
మూడు ప్రాంతాల ఉద్ధండుల వేదిక
1956లో ఏర్పాటైన ఆంధ్రప్రదేశ్ మొదటి శాసనసభకు బూర్గుల రామకృష్ణారావు, నీలం సంజీవరెడ్డి, బెజవాడ గోపాల్‌రెడ్డి లాంటి ప్రముఖులు ప్రాతినిధ్యం వహించారు. ఉమ్మడి మద్రాసు రాష్ట్రంలో కోస్తాంధ్ర, రాయలసీమ ప్రాంతాలు అంతర్భాగంగా ఉన్నప్పుడు 1952లో మొదటి సార్వత్రిక ఎన్నికలు జరిగాయి. ప్రత్యేకాంధ్ర ఉద్యమం, అమరజీవి పొట్టిశ్రీరాములు ఆత్మాహుతి ఫలితంగా 1953లో అవతరించిన ఆంధ్ర రాష్ట్రానికి టంగుటూరి ప్రకాశం పంతులు ముఖ్యమంత్రిగా ఎన్నికయ్యారు. మధ్యనిషేధం అంశంపై ఎదుర్కొన్న అవిశ్వాస తీర్మానం కారణంగా ఆయన స్వల్పకాలంలోనే పదవీచ్యుతులయ్యారు. కొంతకాలం రాష్ట్రపతి పాలన తర్వాత 1955లో ఈ ప్రాంతంలోని 196 అసెంబ్లీ నియోజకవర్గాలకు ఉప ఎన్నికలు జరిగాయి.
ముఖ్యమంత్రిగా బెజవాడ గోపాల్‌రెడ్డి...
1955 ఎన్నికల్లో కాంగ్రెస్ ఘన విజయం సాధించింది. ఆంధ్ర రాష్ట్రానికి బెజవాడ గోపాల్‌రెడ్డి ముఖ్యమంత్రి అయ్యారు. 1956లో ఆంధ్ర, తెలంగాణ (హైదరాబాద్ రాష్ట్రం) కలిసి తొలి భాషాప్రయుక్త రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ ఏర్పడింది. నీలం సంజీవరెడ్డి మొదటి ముఖ్యమంత్రి అయ్యారు. ఈ తర్వాతి సంవత్సరమే 1957లో దేశవ్యాప్తంగా సార్వత్రిక ఎన్నికలు జరిగాయి. తెలంగాణ ప్రాంతంలోని 104 అసెంబ్లీ నియోజకవర్గాలకు మాత్రమే ఎన్నికలు నిర్వహించారు. ఆంధ్ర ప్రాంతంలో ఉప ఎన్నికలు జరిగి రెండేళ్లే కావడంతో ఇక్కడ ఎన్నికలు జరపలేదు. ఫలితంగా ఆంధ్ర ప్రాంతంలోని 196 మంది శాసనసభ్యులు 1955 నుంచి 1962 వరకూ సుమారు ఏడున్నరేళ్లపాటు శాసనసభ్యులుగా కొనసాగారు. ఇలా ఆంధ్రప్రదేశ్ మొదటి అసెంబ్లీ మూడు పర్యాయాలు ఎన్నికైన (1952, 1955, 1957) వారితో కొలువైంది.
ఆంధ్ర రాష్ట్రానికి ఉప ముఖ్యమంత్రిగా ఉన్న నీలం సంజీవరెడ్డి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ముఖ్యమంత్రి కావడం, తన మంత్రివర్గంలో ఉప ముఖ్యమంత్రిగా ఉన్న నీలం సంజీవరెడ్డి దగ్గరే ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రి బెజవాడ గోపాల్‌రెడ్డి మంత్రిగా పనిచేయడం, మరో ఆసక్తికర విషయం.