ఏఎన్నార్, రాజ్ కపూర్, మహమ్మద్ రఫీ, తపన్ సిన్హాలకు నివాళి
అక్కినేని నాగేశ్వరరావు, రాజ్ కపూర్, మహమ్మద్ రఫీ, తపన్ సిన్హా... భారతీయ చిత్రసీమలో ఒక్కొక్కరిది ఒక్కో చరిత్ర. నటులుగా ఏఎన్నార్, రాజ్ కపూర్, గాయకుడిగా మహమ్మద్ రఫీ, దర్శకుడిగా తపన్ సిన్హా చిత్ర పరిశ్రమకు చేసిన సేవలకు గాను ‘ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ ఆఫ్ ఇండియా’ (ఇఫీ) ఘనంగా నివాళులర్పించనుంది. 55వ ఇఫీ వేడుకలు గోవాలో ఈ నెల 20న ఆరంభమై 28 వరకూ జరుగుతాయి.
22న అక్కినేని నాగేశ్వరరావు, 24న రాజ్ కపూర్, 26న మహమ్మద్ రఫీ, 27న తపన్ సిన్హాలకు చెందిన శతాబ్ది వేడుకలను జరపడానికి ‘ఇఫీ’ నిర్వాహకులు ప్లాన్ చేశారు. గోవా రాష్ట్ర ప్రభుత్వం సహకారంతో నేషనల్ ఫిల్మ్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్, కేంద్ర సమాచార మరియు ప్రసార మంత్రిత్వ శాఖ ఈ చిత్రోత్సవాలను నిర్వహించనున్న సంగతి తెలిసిందే. ఇక నలుగురు లెజెండ్స్ నివాళి కార్యక్రమానికి సంబంధించిన విశేషాలు తెలుసుకుందాం.
⇒ నలుగురు లెజెండ్స్ కెరీర్‌లో చెరగని ముద్ర వేసిన చిత్రాలను, పాటలను ప్రదర్శించనున్నారు. ఏఎన్నార్ క్లాసిక్ మూవీ ‘దేవదాసు’, రాజ్ కపూర్ కెరీర్‌లో మైలురాయి అయిన ‘ఆవారా’, తపన్ సిన్హా దర్శకత్వంలో రూపొందిన చిత్రాల్లో అద్భుత చిత్రం ‘హార్మోనియమ్’ చిత్రాలను ప్రదర్శించడంతో పాటు ‘హమ్ దోనో’లో మహమ్మద్ రఫీ పాడిన పాటలను వినిపించనున్నారు. కాగా, వీక్షకులకు నాణ్యతతో చూపించడానికి ఈ చిత్రాలను పునరుద్ధరించే బాధ్యతను నేషనల్ ఫిల్మ్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్, నేషనల్ ఫిల్మ్ ఆరై్కవ్ ఆఫ్ ఇండియా తీసుకుంది. అలాగే ఈ ప్రముఖుల సినిమా కెరీర్‌కి సంబంధించిన ఏవీ (ఆడియో విజువల్) చూపించనున్నారు.
⇒నలుగురు కళాకారుల ప్రత్యేక నివాళిలో భాగంగా వారి విజయాలను గౌరవిస్తూ పద్మశ్రీ సుదర్శన్ పటా్నయక్ గోవాలోని కళా అకాడమీలో సృష్టించే ‘శాండ్ ఆర్ట్’ ఇల్ల్రస్టేషన్‌ని ప్రదర్శించనున్నారు.
⇒ సినిమా రంగంలో, భారతీయ సంస్కృతిపై వీరు వేసిన ముద్రకు ప్రతీకగా ఈ నలుగురు దిగ్గజాలకు అంకితం చేస్తూ ప్రత్యేక స్టాంపును ఆవిష్కరించనున్నారు.
⇒ ఈ నలుగురి కెరీర్‌లో తీపి గుర్తులుగా నిలిచిపోయిన చిత్రాలకు సంబంధించిన ఫొటోలు, అలాగే వ్యక్తిగత జీవితానికి సంబంధించిన ప్రత్యేకమైన ఫొటోలతో ఓ ఎగ్జిబిషన్ ఏర్పాటు చేయడానికి ‘ఇఫీ’ ప్లాన్ చేస్తోంది.
⇒ రాజ్ కపూర్, మహమ్మద్ రఫీ కెరీర్‌లోని చిత్రాల్లోని 150 పాటలు, ఏఎన్నార్, తపన్ సిన్హా చిత్రాల్లోని 75 పాటలు... మొత్తంగా 225 పాటలతో ఓ సంగీత విభావరి జరగనుంది.
భవిష్యత్ తరాలకు స్ఫూర్తినిచ్చే విధంగా ఈ నలుగురు కళాకారుల శతాబ్ది వేడుకల్లో భాగంగా ఇంకా పలు కార్యక్రమాలను ప్లాన్ చేశారు.
Comments
Please login to add a commentAdd a comment