Gussadi dance
-
ఇఫీలో గుస్సాడీ నృత్యం
తెలంగాణ సంప్రదాయ నృత్య వైభవం మరోసారి జాతీయ అంతర్జాతీయ వేదికలపై తళుక్కుమననుంది. గోవాలో అట్టహాసంగా బుధవారం జరుగనున్న అంతర్జాతీయ భారత్ చిత్రోత్సవం (ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ ఆఫ్ ఇండియా.. ఇఫీ)ప్రారంభ కార్యక్రమంలో తెలంగాణకు చెందిన ఆదివాసీ గోండు గిరిజనుల గుస్సాడీ నృత్యం ప్రదర్శనకు అవకాశం దక్కించుకుంది. ఈ నృత్య కళాకారునిగా ఇటీవలే కీర్తిశేషులైన పద్మశ్రీ కనకరాజు జాతీయ స్థాయిలో పేరొందిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ప్రతిష్ఠాత్మక చిత్రోత్సవంలో తెలంగాణ సంప్రదాయ నృత్య ప్రదర్శనకు నోచుకోవడం, ఆ ప్రదర్శనలో పాల్గొనే కళాకారులు అందరూ దివంగత కనకరాజు శిష్యులే కావడంతో ఇది గత నెలలోనే దివికేగిన గుస్సాడీ నృత్య దిగ్గజానికి ఘన నివాళిగా చెప్పొచ్చు. – సాక్షి, హైదరాబాద్ -
గుస్సాడి గుండెచప్పుడు పద్మశ్రీ కనకరాజు
నెమలీకల టోపీ ధరించి కోలాహలంగా ఆడతారు. రేలా... రే... రేలా అంటూ గొంతు కలిపి పా డతారు. ప్రకృతి గురువు నేర్పిన పా ఠాలకు ఆనవాళ్లు వారు. మొన్నటి వరకు అడవి తల్లి ఒడిలో దాగిన కళారూపా లివన్నీ. నేడవి అడవి గోడలు దాటి నగరాన్ని ఉర్రూతలూగిస్తున్నాయి. దేశం ఎల్లలు కూడా దాటే వరకు గుస్సాడి ఆడాలంటున్నారు... పద్మశ్రీ కనకరాజు. కనకరాజు పేరులో ఇంటి పేరు కనక, ఆయన పేరు రాజు. ఇన్ని వివరాలు మాకక్కర్లేదు, గుస్సాడి నృత్యం చేస్తాడు, మా అందరి చేత అడుగు వేయిస్తాడు కాబట్టి ఆయన మాకు ‘గుస్సాడి రాజు’ అంటారు స్థానికులు. ఆయన పద్మశ్రీ అందుకున్నప్పటి నుంచి నాగరక ప్రపంచం ఆయన మీద దృష్టి కేంద్రీకరించింది. కనకరాజు అని ఇంటిపేరుతో కలిసి వ్యవహారంలోకి వచ్చారు. అయినప్పటికీ వారి గూడేలకు వెళ్లి కనకరాజు అని అడిగితే వెంటనే గుర్తుపట్టరు. గుస్సాడి కనకరాజు అంటే టక్కున చెప్పేస్తారు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా మర్హలి ఆయన ఊరు. ప్రస్తుతం కుమ్రుం భీమ్ ఆసిఫాబాద్ జిల్లా, అంతేకాదు, కుమ్రుం భీమ్ వారసులు కూడా. ఆదిలాబాద్‌లో విస్తరించిన గోంద్ తెగకు చెందిన వాళ్లందరూ భీమ్ వారసులుగా గర్వంగా భావిస్తారు. ఎనభై ఏళ్ల కనకరాజు... తండ్రి చెప్పిన మాట కోసం గుస్సాడి నృత్యం పరిరక్షణకు జీవితాన్ని అంకితం చేశారు. గుస్సాడితో మమేకమైన తన జీవితానుభవాలను సాక్షితో పంచుకున్నారాయన. ఆట... పా ట... జీవితం! ‘‘మా ఆదివాసీల జీవనంలో ప్రకృతి, నృత్యం, గానం కలగలిసి పోయి ఉంటాయి. బిడ్డ పుడితే పా ట, పెళ్లి వేడుకకీ పా ట, అంతేకాదు... మనిషి పోయినా పా ట రూపంలో ఆ వ్యక్తితో మా అనుబంధాన్ని గుర్తు చేసుకుంటాం. దండారీ ఉత్సవాలంటే మాకు ఎక్కడ లేని ఉత్సాహం వచ్చేస్తుంది. మగపిల్లలకు నృత్యం, ఆడపిల్లలకు రేలా పా ట చిన్నప్పటి నుంచే నేర్పిస్తాం. గుస్సాడి నృత్యంలో అడుగులు వేయడం ఎప్పుడు మొదలైందో నాకు గుర్తు లేదు. కానీ మా నాన్న ఒక మాట చెప్పేవారు. ‘ఈ నృత్యమే మనకు దైవం. ‘ఈ నృత్యాన్ని మరువద్దు. తరతరాలుగా మోసుకొస్తున్నాం. దీన్ని కాపా డుకుంటేనే దేవుడు మనల్ని కాపా డుతాడు’ అని చెప్పేవాడు. ఆ మాట నాలో నాటుకుపోయింది. నాకు వయసొచ్చినప్పటి నుంచి నృత్యంలో తొలి ఆటగాడిగా అడుగులు వేస్తుండేవాణ్ని. ఆదిలాబాద్ జిల్లాలో ఆదివాసీలు నివసించే రెండువేల గూడేలకూ నేను తెలిసిపోయాను. గణతంత్ర వేడుక గణతంత్ర వేడుకల్లో మా ప్రాచీన వారసత్వ కళ అయిన గుస్సాడి నృత్యాన్ని ప్రదర్శించే అవకాశం నాకు 1982లో వచ్చింది. అప్పుడు ప్రధానమంత్రి ఇందిరాగాంధీకి మా గుస్సాడి టోపీ పెట్టించి, గజ్జెలు కట్టించాం. ఆమె మాతో అడుగులు వేసింది. ఆ తర్వాత ఓసారి అబ్దుల్ కలామ్ కూడా మాతో అడుగులు వేశారు. హైదరాబాద్‌లో ఎన్ని ప్రదర్శనలిచ్చామో లెక్కేలేదు. ఢిల్లీలో ఆజాదీ కా అమృత్ మహోత్సవ్‌లో కూడా మా గుస్సాడిని ప్రదర్శించాం. మరో పది దఫాలు యువతతో చేయించాం. నాయన మాట మీద గుస్సాడి కోసం బతికినందుకే మా దేవుడు మెచ్చి గొప్ప వాళ్లకిచ్చే పద్మశ్రీని ఇప్పించాడనుకుంటున్నా. నెమలీకల టోపీ మా నృత్యం సాధన చేయడమే కాదు, టోపీ, దుస్తులు, గజ్జెలు అన్నీ ప్రత్యేకమే. వాటిని తయారు చేయడానికి చాలా నైపుణ్యం ఉండాలి. పెద్ద టోపీకి రెండు వేల పింఛాలుంటాయి. మా ఇళ్లలో వాటిని భద్రపరుచుకోవడం పెద్ద పని. మా ముత్తాతలు ధరించిన టోపీ ఇంకా నేను ధరిస్తూనే ఉన్నాను. కొత్తవాళ్ల కోసం టోపీలు తయారు చేస్తున్నాం. పెద్ద టోపీ, దుస్తులతోపా టు మొత్తం వేషానికి ఇరవై వేల రూపా యలవుతాయి. మా ఆదివాసీ వ్యక్తి తుకారామ్ సాబ్ కలెక్టర్ అయిన తరవాత ఈ నృత్యానికి ఇంకా కొన్ని చేర్పులు చేసి బాగా మంచిగా చేశారు. పద్మశ్రీ వచ్చిన తర్వాత ఐటీడీఏ ఆఫీసర్లు గుస్సాడి నృత్యం నేర్పించడానికి వందకు పైగా బడులు పెట్టారు. ఒక్కో బడిలో రెండు– మూడు వందల మంది నేర్చుకుంటున్నారు. నేను పెద్ద మాస్టర్ (చీఫ్ డాన్స్ మాస్టర్)ని. గుస్సాడి, రేలా పా ట నేర్పించడానికి 30 మందిని ప్రత్యేకంగా తయారు చేశాను. మరో రెండు వందల మందికి సంపూర్ణంగా శిక్షణనిచ్చాను. ఇంక మామూలుగా నేర్చుకుని ఆడే వాళ్లు ఎన్ని వేల మంది ఉన్నారో నేను ఎప్పుడూ లెక్క చెప్పుకోలేదు. అడవి తల్లికి అందరూ ఒక్కటే! మా ఆదివాసీల్లో మగపిల్లాడు ఎక్కువ, ఆడపిల్ల తక్కువనే ఆలోచనే ఉండదు. బిడ్డలంతా సమమే. పెళ్లిలో కట్నకానుకలు ఉండవు. ఆడబిడ్డ పుట్టిందని చింతపడడం మాకు తెలియదు. నాకు ఎనిమిది మంది కూతుళ్లు, ముగ్గురు కొడుకులు. బతకడానికి ఆశ్రమ పా ఠశాలలో రోజు కూలీగా పని చేస్తూ కూడా అందరికీ చదువు చెప్పించాను. తొమ్మిది– పది తరగతుల వరకు అందరూ చదువుకున్నారు. రెండో కొడుకు వెంకటేశ్ మాత్రం డిగ్రీ చదివి టీచర్ ఉద్యోగం చేస్తున్నాడు. తరతరాలుగా అడవులకే పరిమితమైపోయిన గుస్సాడి నృత్యాన్ని నేను దేశానికి తెలియ చెప్పా ను. మీరు మన ఆట, పా టలను ఇతర దేశాలకు తీసుకెళ్లాలని నా పిల్లలు, శిష్యులకు చెబుతున్నాను’’ అని తన ఆకాంక్షను వ్యక్తం చేశారు గుస్సాడి కనకరాజు. – వాకా మంజులారెడ్డి -
ఆదివాసీ గ్రామాల్లో ఘనంగా కోలాబోడి!
కెరమెరి(ఆసిఫాబాద్): గడిచిన పక్షం రోజులుగా ఉమ్మడి జిల్లాలోని ఆదివాసీ గ్రామాల్లో ఎంతో భక్తి శ్రద్ధలతో కొనసాగిన గుస్సాడీ సంబరాలు సోమవారం ముగిశాయి. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని గ్రామాల్లో కోలబోడి పండుగను ఘనంగా జరుపుకున్నారు. ఆయా గ్రామాల్లో ఆదీవాసీలు ఇప్పచెట్టు వద్దకు వెళ్లి ప్రదక్షిణలు చేశారు. ఏత్మాసూర్ దేవతకు పూజలు చేశారు. గుస్సాడీలు నెమలి పింఛం టోపీ, దుడ్డు, జింక చర్మం, కాళ్ల గజ్జెలు, ఆభరణాలు, పోరీలు, దండారీలు దాండియా కర్రలు, దుస్తులు, డప్పులకు ప్రత్యేక పూజలు చేశారు. కులదేవతలకు మొక్కుకున్నారు. సమీపంలో ఉన్న గంగా, గోదావరి, పెద్ద వాగుల్లో స్నానాలు చేశారు. -
దండారి.. సందడి
సాక్షి, ఆదిలాబాద్: ఆదివాసీల పెద్ద పండగ దండారి. గిరిజనుల తీరు ప్రత్యేకం. వారి ఆచార వ్యవహారాలు సంస్కృతి సంప్రదాయాలు భిన్నంగా ఉంటాయి. గోండు గూడాల్లో గిరిజనుల జీవనశైలిని ప్రతిబింబించే దండారి గుస్సాడి ఉత్సవాలు నేడు ప్రారంభంకానున్నాయి. విచిత్ర వేశాధారణతో అంతే అద్భుతమైన పద్ధతులతో వారు చేసే పూజలు, ఏర్పాట్లు వారి సంప్రదాయాలను పరిచయం చేస్తాయి. దీపావళికి పక్షం రోజుల ముందు ఆదివాసీల సంస్కతి, సంప్రదాయాలకు ప్రతీక దండారి మొదలవుతుంది. బలిదానంతో దండారి మొదలు.. ఆదివాసీలు గ్రామ కూడలిలో నెమలి ఈకలతో ప్రత్యేకంగా తయారు చేసిన టోపీలు, జంతు చర్మంతో తయారు చేసిన డప్పులు, డోలు, గుమేల, ఫరా లాంటి వాయిద్యాలతో పాటు గజ్జెలు, కోలాలు, మంత్రదండం లాంటి రోకలి తదితర సంప్రదాయ వస్తువులను గ్రామ పటేల్ ఇంటి ముందు ఉంచి వాటికి బలిదానం చేసి ప్రత్యేక పూజలతో బోగి పండగ చేసి ఉత్సవాలు ఆరంభిస్తారు. గిరిజన గోండు గూడాల్లో గ్రామ పటేల్‌ది ప్రత్యేకమైన స్థానం. ఆయన ఊరి పెద్దగా వ్యవహరిస్తూ ఉంటారు. గిరిజనులకు పటేల్ మాట వేదవాక్కు. అందుకే దండారి ఉత్సవాలు గ్రామ పటేల్ ఇంటి ముందే నిర్వహించడం ఆనవాయితీ. ప్రత్యేక వేషధారణలు.. దండారి ఉత్సవాలలో భాగంగా తొమ్మిది రోజుల పాటు గుస్సాడి వేషాధారణ వేసిన వారు దండారి ముగింపు వరకు స్నానం చేయరు. ఒంటికి బూడిద పూసుకొని దాన్నే స్నానంగా భావించడం వీరి ఆచారం. దీనితో పాటు ముఖానికి మసి, ఎడమ భుజంపై జింక తోలు, మెడలో రుద్రాక్షలు, కుడి చేతిలో మంత్రదండం(రోకలి), జంతువుల కొమ్ములు, నెమలి ఈకలతో చేసిన టోపీలు, కాళ్లకు గజ్జలు, నడుముకు వారి వస్తువుల సంచితో, విచిత్ర వేశధారణతో సంప్రదాయానికి ప్రతీకగా నిలుస్తారు. ఇతర గ్రామాల గుస్సాడీలకు ఆథిత్యం.. గుస్సాడి వేశధారణ వేసినవారు ఒక సంవత్సరం తమ సొంత గ్రామం నుంచి మరో గ్రామానికి వెళ్లి అక్కడి గిరిజనుల ఆథిత్య విందులో పాల్గొని ఆటపాటలతో, నృత్యాలతో కనువిందు చేయడం ఆనవాయితీ. దీంతో ఇతర గ్రామాలకు వెళ్లిన గుస్సాడీలకు ఘన స్వాగతం పలుకుతారు. మొదట అథిత్యం పుచ్చుకున్న వీరు తర్వాతి సంవత్సరం తమ గ్రామానికి ఆహ్వానిస్తారు. ఇలా ఆ గ్రామాల మధ్య బంధుత్వం పెరుగుతుంది. గుస్సాడీ వేషాలు.. థింసా నృత్యాలు గిరిజనులు గుస్సాడీ వేషాన్ని ధరించేందుకు ఆసక్తి చూపుతారు. గుస్సాడీ వేషాధారణ వేసిన వారికి వారి దేవతలు ఆవహిస్తారని చెబుతారు. అతని చేతికి ఉన్న మంత్రదండం శరీరాన్ని తాకితే ఎలాంటి రోగాలైన నయమవుతాయని వారి నమ్మకం. డప్పులు, భాజాలతో చప్పుళ్లకు అనుగుణంగా గజ్జెల అడుగులతో లయబద్ధంగా నాట్యం చేస్తూ గుస్సాడీ నృత్యాలు ప్రదర్శిస్తారు. గోండు గిరిజన మహిళలు కూడా పురుషులతో సమానంగా థీంసా నృత్యాలు చేస్తారు. నువ్వుల నూనెతో పూజలు.. గిరిజన గ్రామాల్లో ప్రతి ఇంటిలో దీపావళి పండగ సందర్భంగా గిరిజన మహిళలు పవిత్రంగా ఉపావాస దీక్ష చేస్తూ నువ్వులను రోటిలో దంచి నూనెను తీస్తారు. ఆ నూనెతో దండారి ముగింపు వరకు దీపాలను వెలిగించి పూజలు చేస్తారు. నెమలి టోపీల తయారీకి కేరాఫ్ పాటగూడ.. నెమలి పింఛం టోపీల తయారీలో కెరమెరి మండలంలోని పాటగూడ గ్రామం ప్రసిద్ధి గాంచింది. గడిచిన పాతికేళ్ల నుంచి ఈ గ్రామస్తులు నెమలి టోపీలను తయారు చేస్తున్నారు. ఉమ్మడి జిల్లాలోని ఉట్నూర్, ఇచ్చోడ, ఇంద్రవెల్లి, జైనూర్, సిర్పూర్(యు), కెరమెరి, తిర్యాణీ, వాంకిడి తదితర గ్రామాలకు చెందిన వారు ఇక్కడి నుంచి నెమలి పింఛం టోపీలను కొనుగోలు చేసి తీసుకెళ్తుంటారు. ఒక్క టోపీ ఖరీదు రూ. 10 వేలు పలుకుతున్నా.. వీరు కేవలం రూ. 3 వేలు కూలీ కింద తీసుకుంటున్నారు. కొలబోడితో దండారి ముగింపు.. దీపావళి పండగ మరుసటి రోజు కొలబోడి ఉత్సవాలను దండారి సంబరాలు ముగిస్తారు. దీపావళి అనంతరం గుస్సాడీలు చివరి రోజున ఆనందంగా నృత్యాలు చేస్తారు. అనంతరం గ్రామ పొలిమేరల్లో ఉన్న ఇప్ప చెట్టు వద్ద తమ ఇలవేల్పు అయిన భీందేవుని సన్నిధికి చేరుకుంటారు. అక్కడ కొలబోడి సందర్భంగా నెమలి టోపీలను తొలగిస్తారు. గుస్సాడీ వేశధారణ, అలంకారణ వస్తువులను భీందేవుని సన్నిధిలో పెట్టి కోళ్లు, మేకలతో ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. పవిత్రమైన పండగ మా ఆదివాసీ గోండు గిరిజనులకు దీపావళి పండగా పవిత్రమైన పండగ. అత్యంత పవిత్రంగా గిరిజన దేవతలను, వన దేవతలను పూజిస్తాము. ఈ పండగకు బంధువుల ఇళ్లకు వెళ్తాం. గ్రామంలో ప్రతి రోజు రాత్రి గుస్సాడీలు థింసా నృత్యాలు, రేలారేరేలా ఆడపడుచుల నృత్యాలు ఆకట్టుకుంటాయి. –పర్చ సాయన్న, బజార్హత్నూర్ -
కళాత్మకం: గుండెలో కొలువైన గుస్సాడి...
అతను గిరిజనుడు కాదు, గిరిజన గ్రామానికి చెందినవాడు కాదు. గురువు దగ్గర నేర్చుకున్న గుస్సాడి నృత్యం కనుమరుగు కాకుండా ఉండేందుకు తన శాయశక్తులా ప్రయత్నిస్తున్నాడు. గిరిజనులు ఎక్కువగా ఉన్న ఆదిలాబాద్ జిల్లాకు చెందిన రవి అనుకోకుండా నేర్చుకున్న గుస్సాడి నృత్యాన్ని పలువురికి నేర్పిస్తూ, భావితరాలకు ఆ నృత్యంపై మక్కువ కలిగించేందుకు కృషి చేస్తున్నారు. ప్రైవేటు పాఠశాలలో పీఈటీగా పనిచేస్తూనే, తన పాఠశాల విద్యార్థులతో పాటు, నృత్యంపై ఆసక్తి ఉన్న విద్యార్థులకు శిక్షణ ఇస్తున్నారు. ఆదిలాబాద్ జిల్లా మంచిర్యాల మండలం కర్ణమామిడి గ్రామానికి చెందిన జునగరి రవి గుస్సాడి నృత్యంలో అత్యుత్తమ ప్రతిభను కనబరుస్తూ ఎన్నో అవార్డులు పొందారు. చిన్ననాటి నుండి పాశ్చాత్యనృత్యంపై రవికి ఆసక్తి ఎక్కువ. అయితే సౌత్‌జోన్ కాంపిటీషన్స్‌లో యూనివర్శిటీ తరపున ఆడే అవకాశం పొందేందుకు, తన గురువుగారు గిరి సలహా మేరకు గుస్సాడి నృత్యం చేసేందుకు సిద్ధమయ్యారు. అలా గుస్సాడిపై ఆసక్తి పెరిగింది. అది అభిమానంగా మారింది. గుస్సాడి నృత్యం, పులివేషధారణలతో పాటు రకరకాల జానపద నృత్యాలలో రాణిస్తున్న రవి ‘‘మనకు అద్భుతమైన జానపద కళలు ఉన్నాయి. ఈతరానికి వాటిని పరిచయం చేయాలనుకుంటున్నాను’’ అంటున్నారు. ఉత్సాహం ఉన్న విద్యార్థులను గుర్తించి, వారికి గుస్సాడి నేర్పించి ఆ నృత్యకళకు విస్తృతప్రచారం కలిగించడానికి తనవంతు ప్రోత్సాహాన్ని అందిస్తున్నారు. తన దగ్గర శిక్షణ పొందిన విద్యార్థులు జిల్లా, రాష్ట్రస్థాయిలో ప్రదర్శనలు ఇవ్వడం ఎంతో గర్వంగా ఉందని చెబుతున్నారు రవి. 2006లో హర్యానా రాష్ట్రం కురుక్షేత్రలో నిర్వహించిన జాతీయస్థాయి సాంస్కృతిక పోటీల్లో పాల్గొని గుస్సాడి నృత్యంలో ప్రథమ స్థానం, పులివేషంలో తృతీయ స్థానం పొందారు. ట్రెడిషనల్ విభాగంలో అత్యుత్తమ ప్రదర్శనకుగాను బహుమతి పొందారు. గుస్సాడి నృత్యానికి చేసిన కృషికి గాను 2009లో ఒక స్వచ్ఛంద సంస్థ ‘గ్రామీణ కళాజ్యోతి అవార్డు’ను ఇచ్చింది. ‘‘గుస్సాడి నృత్యం గురించి వీలైనంత ఎక్కువ మందికి తెలియజేయాలి. దాని విశిష్టతను ఊరువాడా చాటాలి. ఈతరం పిల్లలు గుస్సాడి నృత్యం నేర్చుకునేలా చేయాలి అనేది నా లక్ష్యం’’ అంటున్నారు రవి. ఆయన లక్ష్యం త్వరగా సిద్ధించాలని ఆశిద్దాం. - బన్న ఉపేందర్, సాక్షి, మంచిర్యాల రూరల్