తాజాగా ‘ఎస్‌ఎస్‌కేఎం’లో 40 మంది వైద్యుల రాజీనామా
కోల్‌కతా: ట్రైనీ డాక్టర్ అత్యాచారం, హత్య కేసులో న్యాయం చేయాలని, ఆస్పత్రుల్లో భద్రత, సౌకర్యాలు కల్పించాలని డిమాండ్‌తో ఆమరణ నిరాహార దీక్ష చేస్తున్న జూనియర్ డాక్టర్లకు మద్దతు పెరుగుతోంది. వారికి సంఘీభావంగా గురువారం ప్రభు త్వ ఆధ్వర్యంలోని ఎస్‌ఎస్‌కేఎం ఆస్పత్రి లోని 40 మంది డాక్టర్లు మూకుమ్మడిగా రాజీనామా చేశారు.
కోల్‌కతాలోని ఆర్.జి. కర్ ఆస్పత్రిలో ఏడుగురు, ఉత్తర బెంగాల్లో ఇద్దరు జూనియర్ డాక్టర్లు ఆమరణ నిరాహార దీక్ష చేస్తున్నారు. ఆందోళన చేస్తున్న వైద్యుల ఆరోగ్యం రోజురోజుకీ క్షీణిస్తోందని ఎస్‌ఎస్‌కేఎం ఆస్పత్రి డాక్టర్ గౌతమ్ దాస్ తెలిపారు. ప్రతిష్టంభనను తొలగించడానికి ప్రభుత్వం ఏమాత్రం చొరవ చూపడం లేదని ఆయన విమర్శించారు. పరిష్కరించడంలో పురోగతి లేదని ఆయన ఎత్తిచూపారు.
రాష్ట్ర ప్రభుత్వ ఉదాసీన వైఖరి వల్లే రాజీనామాల నిర్ణయం తీసుకోవాల్సి వచ్చిందని ఆయన తెలిపారు. ఆమరణ దీక్ష చేస్తున్న జూనియర్లకు మద్దతుగా గురువారం సీనియర్ డాక్టర్లు కూడా నిరసనలో పాల్గొన్నారు. వారికి సంఘీభావంగా ఆర్.జి.కర్ మెడికల్ కాలేజ్, హాస్పిటల్‌కు చెందిన 54 మంది సీనియర్ డాక్టర్లు మంగళవారం రాజీనామా చేసిన విషయం తెలిసిందే.
ఆ తరువాత సిలిగురిలోని నార్త్ బెంగాల్ మెడికల్ కాలేజ్, హాస్పిటల్‌కు చెందిన సుమారు 35 మంది వైద్యులు మూకుమ్మడిగా రాజీనామా చేశారు. కాగా, జూనియర్ డాక్టర్లు చేస్తున్న దీక్ష గురువారం ఐదో రోజూ కొనసాగింది. ఈ సందర్భంగా నిరాహార దీక్షా స్థలాన్ని సందర్శించిన పోలీసు బృందం... జూనియర్ డాక్టర్ల ఆరోగ్యం క్షీణించడంపై ఆందోళన వ్యక్తం చేసింది. దీక్షను విరమించాలని కోరింది.
Comments
Please login to add a commentAdd a comment