ఇప్పటికే నగరానికి చేరుకున్న బాలీవుడ్ డీజేలు..
నోవోటెల్‌లో స్టెప్పులేయనున్న గ్లామర్ స్టార్ శ్రీలీల..
సందడి చేయనున్న సునీత, రామ్ మిర్యాల, కార్తీక్ వంటి సింగర్లు..
బుకింగ్స్ ప్రారంభించిన ఈవెంట్ ఆర్గనైజర్లు..
ఎప్పటిలానే మన గ్లామర్ సిటీ నూతన సంవత్సరాన్ని ఘనంగా ఆహ్వానించడానికి సిద్ధమవుతోంది. ఈ నేపథ్యంలో నగరంలో నిర్వహించనున్న ఇయర్ ఎండ్ వేడుకలకు వేదికలు రెడీ అయ్యాయి. ఇందులో లైవ్ మ్యూజిక్ సెటప్‌లు, సెలిబ్రిటీ గెస్టులు వంటి ఇతర వినోద కార్యక్రమాలకు సన్నాహాలు మొదలయ్యాయి. నగర యువత ఈ వేడుకలను ఎక్కడెక్కడ చేసుకోవాలో ఇప్పటి నుంచే ప్లాన్‌లు చేసుకోవడం మొదలుపెట్టేశారు. ఇప్పటికే పలువురు బుక్ మై షోలో పాస్‌లు రిజిష్టర్ చేసేసుకున్నారు. వీరి ఆసక్తి, ఆదరణను దృష్టిలో ఉంచుకుని ఇప్పటికే నిర్వాహకులు సైతం తమ ప్రణాళికలను సిద్ధం చేశారు. ఈ నేపథ్యంలో దీని గురించిన మరిన్ని విశేషాలు..
ఇప్పటికే నగరంలో నూతన సంవత్సరానికి స్వాగతం పలికేందుకు, ప్రస్తుత సంవత్సరానికి వీడ్కోలు పలికేందుకు యువత సిద్ధమయ్యారు. ఇందులో భాగంగా కొన్ని థీమ్స్‌ను సైతం సోషల్ మీడియా వేదికగా ప్రచారం చేస్తున్నారు పలువురు ఈవెంట్ ఆర్గనైజర్లు. ముఖ్యంగా సినీ తారలు, ప్రముఖ సింగర్స్, డ్యాన్సర్స్.. ఎవరు ఎక్కడ హాజరవుతున్నారనే సమాచారాన్ని సామాజిక మాధ్యమాల వేదికగా జోరుగా ప్రచారం జరుగుతోంది. ప్రత్యేకించి ఢిల్లీ, ముంబయి తదితర ప్రాంతాల నుంచి నగరానికి చేరుకున్న డీజే స్పెషలిస్టులు, లైవ్ మ్యూజిక్ స్పెషలిస్టులు వారి ప్రోమోలను వదులుతున్నారు. తెలుగు, ఇంగ్లీష్, హిందీ భాషలో లైవ్ బ్యాండ్‌లు ఏర్పాటు చేస్తున్నారు. అయితే.. ఈ ఈవెంట్లకు బుకింగ్స్ ప్రారంభం కావడమే కాదు కొన్నింటికి ఇప్పటికే సోల్డ్ ఔట్ బోర్డులు పెట్టడం విశేషం.
స్టార్ గ్లామర్ ఈవెంట్స్..
వేడుకలు ఏవైనా సరే... అందులో గ్లామర్ ఉంటేనే వినోదమైనా, ఉల్లాసమైనా. ఈ నేపథ్యంలో ఇయర్ ఎండ్ వేడుకల నిర్వహణలో సెలిబ్రిటీలను భాగం చేస్తున్నారు నిర్వాహకులు. సాధారణంగా ఇటువంటి ఈవెంట్స్‌లో సినీతారలకు ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఇందులో భాగంగానే నగరంలో పలు వేదికల్లో గ్రాండ్‌గా నిర్వహించే లైవ్‌మ్యూజిక్ కాన్సర్ట్‌లు, పబ్, రిసార్ట్, ఓపెన్ ఏరియా ఈవెంట్లలో పలువురు సినీతారలు, సింగర్లు తళుక్కున మెరవనున్నారు. ముఖ్యంగా ఈ ఏడాది న్యూ ఇయర్ సెలబ్రేషన్స్‌లో ప్రముఖ నటి శ్రీలీల, గాయకులు సునీత, రాకింగ్ సింగర్ రామ్ మిరియాల, తదితర టాలీవుడ్, బాలీవుడ్ సింగర్స్ నగరంలో ప్రేక్షకులకు తమ గాత్రంతో అలరించనున్నారు.
డీజేల సందడి..
నూతన సంవత్సర వేడుకలకు సినిమా గ్లామర్ తోడైతే ఆ కిక్కేవేరబ్బా అంటోంది నగర యువత. తమకు నచి్చన భాష, హీరోల సినిమా పాటలు ఎక్కడ అందుబాటులో ఉన్నాయి అంటూ సామాజిక మాధ్యమాల్లో శోధిస్తున్నారు. తెలుగు లైవ్ కాన్సర్ట్స్‌కు ఎక్కువ మంది మొగ్గుచూపుతుండగా, ఉత్తర భారతం నుంచి వచ్చి ఇక్కడ నివాసం ఉంటున్నవారు మాత్రం హిందీ, ఇంగ్లి‹Ùకార్యక్రమాలను కోరుకుంటున్నారు. దీంతో ఈవెంట్ నిర్వాహకులు సైతం అందుకు అనుగుణంగానే కార్యక్రమాలు ఏర్పాటు చేస్తూ.. జాగ్రత్తలు తీసుకుంటున్నారు. దీంతో నిపుణులైన డీజే ఆర్టిస్టులకు డిమాండ్ నెలకొంది. సాయంత్రం 8 గంటల నుంచి కార్యక్రమాలు ప్రారంభం కానున్నాయని నిర్వాహకులు ప్రచారం చేస్తున్నారు.
‘నై’ వేడుకల్లో శ్రీలీల...
సాక్షి, సిటీబ్యూరో: నగరంలో నిర్వహించనున్న ఇయర్ ఎండ్ వేడుకలకు అప్పుడే గ్లామర్ వచ్చేసింది. ఆల్వేస్ ఈవెంట్స్, ఎస్‌వీ ప్రొడక్షన్స్ ఆధ్వర్యంలో ఈ నెల 31న నగరంలోని నోవోటెల్ వేదికగా నిర్వహించనున్న నై (ఎన్‌వైఈ) 2025 వేడుకల్లో టాలీవుడ్ గ్లామర్ క్వీన్ శ్రీలీల తన స్టెప్పులతో అలరించనున్నారు. ఈ ఈవెంట్ పోస్టర్‌ను శుక్రవారం నోవాటెల్ వేదికగా ఆవిష్కరించారు. ఇందులో ప్రముఖ యాంకర్ రవి, నటి సౌమ్య జాను పాల్గొని సందడి చేశారు. నిర్వాహకులు సుమంత్ మాట్లాడుతూ.. బాలీవుడ్ లైవ్ మ్యూజిక్, కలర్‌ఫుల్ వేదికతో పాటు టాప్ మోడల్స్‌తో నిర్వహిస్తున్న ఫ్యాషన్ షోతో నై (ఎన్‌వైఈ) 2025 వేదిక కానుందన్నారు. నిరావల్ లైవ్ బ్యాండ్ నగరానికి ప్రత్యేకంగా రానుందని, వేడుకల్లో ప్రముఖ సినీతార శ్రీలీల పాల్గొని అలరించనున్నారని తెలిపారు. ప్రత్యేకమైన ఎస్‌ఎఫ్‌ఎక్స్ ప్రదర్శనలతో, న్యూ ఇయర్ కౌంట్ డౌన్‌తో పాటు విభిన్న రుచుల ఆహారం, ప్రీమియం డ్రింక్స్, టాటూ, ఫొటో బూత్‌లు అందుబాటులో ఉంటాయని సహ నిర్వాహకులు వినోద్ పేర్కొన్నారు. అంతేకాకుండా పలువురు సెలిబ్రిటీలు ఇందులో భాగం కానున్నారని అన్నారు.
నగరంలో పలు కార్యక్రమాలు..
⇒ హెచ్‌ఐసీసీ నోవోటెల్‌లో నూతన సంవత్సర వేడుకలకు ప్రముఖ సినీ నటి శ్రీలీల హాజరుకానున్నారు. లైవ్ బ్యాండ్, డ్యాన్స్, బాలీవుడ్ డీజే, మ్యాజిక్‌షో, కిడ్స్ జోన్, ఫ్యాషన్ షో, తదితర కార్యక్రమాలను ఏర్పాటు చేస్తున్నట్లు నిర్వాహకులు చెబుతున్నారు. ‘న్యూ ఇయర్ ఈవ్’ పేరిట రాత్రి 8 గంటల నుంచి కార్యక్రమాలు ప్రారంభమవుతాయి. ఇంగ్లిష్, తెలుగు, హిందీ పాటలు ఉంటాయి.
⇒ ప్రిజమ్ క్లబ్ అండ్ కిచెన్‌లో రామ్ మిరియాల బ్యాండ్ అమృతం ‘ది ప్రిజమ్ సర్కస్ 4.0’ కార్యక్రమన్ని ఏర్పాటు చేస్తున్నారు.
⇒ ఎల్‌బి నగర్ ఇండోర్ స్టేడియంలో యూబీ ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యాండ్ కాప్రిసియోని ప్రత్యక్షంగా ప్రదర్శిస్తుంది. సంగీతం, ఎనర్జీ, ఉత్సాహంతో కూడిన విద్యుత్ వెలుగుల్లో నూతన సంవత్సరాన్ని స్వాగతించడానికి సిద్ధంగా ఉండండి. చార్ట్–టాపింగ్ హిట్‌లు, హై–ఎనర్జీ పెర్ఫార్మెన్స్‌ల మిక్సింగ్ ఉంటుందని నిర్వాహకులు చెబుతున్నారు.
⇒ బోల్డర్ హిల్స్‌లోని ప్రిజమ్ ఔట్ డోర్స్‌లో ప్రముఖ సింగర్స్ కార్తీక్, సునీత హాజరవుతున్నారు.
⇒ హైటెక్స్ ఎరీనాలో హైదరాబాద్ బిగ్గెస్ట్ న్యూ ఇయర్ బాష్ 2025 (ఓపెన్ ఎయిర్) కార్యక్రమానికి నేహ ఆర్ గుప్తా ప్రత్యేక ఆకర్షణగా నిలవనున్నారు.
Comments
Please login to add a commentAdd a comment