సమ్మర్‌ జోష్‌.. | Summer hot spots In Hyderabad | Sakshi
Sakshi News home page

సమ్మర్‌ జోష్‌..

Published Wed, Mar 12 2025 1:16 PM | Last Updated on Wed, Mar 12 2025 1:16 PM

Summer hot spots In Hyderabad

రిసార్టులు, గేమింగ్‌ జోన్స్‌ తదితర వేదికల్లో ఏర్పాట్లు 

ఫ్యామిలీ, యూత్‌ కోసం వినూత్న కార్యక్రమాలు 

నగరం లోపల, శివార్లలో కూడా అడ్వెంచర్‌ గేమ్స్‌

 

 

వేసవి వచ్చిందంటే చాలు.. అందరి చూపూ నగరంలోని వినోద వేదికలు, గేమింగ్‌ జోన్స్‌ తదితర ఎంటర్‌టైన్మెంట్‌ సెంటర్ల వైపు మళ్లుతోంది. ముఖ్యంగా విద్యార్థులకు వేసవి సెలవులు ఉండటంతో కుటుంబ సమేతంగా వివిధ ప్రాంతాలకు వెళ్లడానికి ఏర్పాట్లను చేస్తుంటారు. ఈ నేపథ్యంలో నగరంలోని పలు వినోద వేదికలు, అడ్వెంచర్‌ గేమ్‌ సెంటర్లు వినూత్న రీతిలో ఫన్‌ యాక్టివిటీస్‌ రూపకల్పన చేయడంతో పాటు అందంగా ఆధునీకరిస్తున్నారు. గేమ్స్, వినోద–విజ్ఞాన కార్యక్రమాలు, సాహస క్రీడలు, ముఖ్యంగా వేసవిలో ఇష్టపడే వాటర్‌ గేమ్స్‌ తదితర వేదికలు సమ్మర్‌ హంగామాకు సంసిద్ధమవుతున్నాయి. ఈ సందర్భంగా నగరంతో పాటు నగర శివార్లలోని ఈ కోవకు చెందిన వివిధ హాట్‌ స్పాట్స్‌ గురించి తెలసుకుందాం.  

నగరవాసులను అలరించడానికి ఎన్ని ఎంటర్‌టైన్మెంట్‌ వేదికలొచ్చినా.. ఆల్‌ టైం ఫేవరెట్‌ మాత్రం ట్యాంక్‌బండ్‌–నెక్లెస్‌ రోడ్‌. ఇక్కడి పరిసర ప్రాంతాల్లోని సందర్శనీయ ప్రాంతాలను తిలకించడానికి కుటుంబ సభ్యులతో పాటు యువత, చిన్నారులకు ప్రత్యేక గమ్యస్థానాలున్నాయి. అలా హుస్సేన్‌ సాగర్‌లో బోటింగ్‌తో పాటు చుట్టుపక్కల ఉన్న థ్రిల్‌ సిటీ పార్క్, ఎన్‌టీఆర్‌ గార్డెన్, బిర్లామందిర్, ప్రసాద్‌ ఐమాక్స్‌లు ఆకర్షిస్తుంటాయి. నెక్లెస్‌ రోడ్డులోని జలవిహార్‌ వేసవి ఎండలను చల్లబరచడానికి సిద్ధంగా ఉంటుంది. విద్యార్థులకు, యువతకు, పరిశోధకులకు విజ్ఞానాన్ని అందించే ప్రతిష్టాత్మక బిర్లా ప్లానిటోరియం వెరీ స్పెషల్‌. వీటితో పాటు ఈ మధ్య నిర్మించిన సెక్రటేరియట్, దేశంలోనే అతిపెద్ద అంబేద్కర్‌ విగ్రహం, దేశంలోనే అతిపెద్ద జాతీయ జెండా, అమరవీరుల స్థూపం, సైక్లింగ్‌ స్పాట్‌లు ప్రత్యేకం.

ఆనందాన్ని పంచే.. మంచు.. 
సమ్మర్‌లో మండే ఎండలకు కాసింత చల్లని వాతావరణం ఉంటే చాలు అనుకుంటాం. అలాంటిది ఏకంగా మంచు ఎడారే నగరంలో పలకరిస్తే ఎలా ఉంటుంది. ఈ అనుభూతిని అందంచడానికి నగరంలోని వివిధ ప్రాంతాల్లో స్నో సెంటర్లు ఎదురుచూస్తున్నాయి. ఇక్కడ ప్రత్యేకంగా ఏర్రాటు చేసిన పెద్ద హాల్స్‌లో మంచు దిబ్బలు, ఐస్‌ స్కేటింగ్‌ వంటి వినూత్న కార్యక్రమాలతో అలరిస్తున్నాయి. ఇలాంటి సెంటర్లు నగరంలోని శరత్‌ సిటీమాల్, ట్యాంక్‌బండ్‌తో పాటు ఇతర ప్రాంతాల్లోనూ ఉన్నాయి.  

వీనుల విందు.. విడిది కేంద్రాలు.. 
నగరంలో ప్రస్తుతం ప్రధాన ఎంటర్‌టైన్మెంట్‌ జోన్స్‌ అంటే రిసార్టులే.. విందు, విడిది, వినోదం, కాలక్షేపం, నైట్‌ స్టే, వాటర్‌ గేమ్స్‌ వంటి సేవలతో అందరినీ ఆకర్షిస్తున్నాయి. ఈ రిసార్టుల గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదేమో.. నగరానికి నలుదిక్కులా.. ఇటు శామీర్‌ పేట్‌ నుంచి అటు శంషాబాద్‌ వరకూ.. కొండాపూర్‌–గచ్చి»ౌలి నుంచి ఎల్‌బీనగర్‌ శివారు వరకూ వందల సంఖ్యలో రిసార్టులు ఉన్నాయి. ఈ తరంలో అత్యధికంగా ఔటింగ్‌ అంటే రిసార్టులేనని నగరవాసులు చెబుతున్నారు.

సాహస క్రీడలు, వాటర్‌ గేమ్స్‌.. 
అనుభవాలతో పాటు అన్ని రకాల ఎంటర్‌టైన్మెంట్‌ ప్యాకేజీ వేదికలైన అమ్యూజ్మెంట్‌ పార్కులు సైతం నగరంలో ఈ సారి వేసవికి సరికొత్త హంగులతో సిద్ధంగా ఉన్నాయి. ఇందులో భాగంగా వండర్లా అమ్యూజ్మెంట్‌ పార్క్‌లో ఇంటర్‌స్టెల్లార్‌ ఎక్స్‌పీరియన్స్‌తో పాటు వర్చువల్‌ త్రీడీ స్క్రీనింగ్‌ హాల్స్‌ అలరించనున్నాయి. ఈ మధ్యనే విదేశాల నుంచి దిగుమతి చేసుకున్న అధునాతన సాంకేతికతతో పనిచేసే రైడ్‌లను ఆవిష్కరించింది. దీంతో పాటు థ్రిల్‌ సిటీ వంటి సెంటర్లు సైతం అడ్వెంచర్‌కు కేరాఫ్‌ అడ్రస్‌గా నిలుస్తున్నాయి.

అరుదైన మొక్కలకు వేదికగా.. 
ప్రపంచంలోని అరుదైన మొక్కలు, ఇతర వింతలు, విశేషాలతో ఈ మధ్యనే నగరంలో ఆవిష్కృతమైన ఎక్స్‌పీరియం ఎకో పార్క్‌ ఈ వేసవికి విద్యార్థులకు మంచి సందర్శనీయ వేదికగా నిలువనుంది. వివిధ రకాల మొక్కలు, అరుదైన వృక్షాలు, పర్యావరణ సంరక్షణతో ప్రతి ఒక్కరినీ ఆశ్చర్యచకితులను చేస్తోంది.

గేమింగ్‌  జోన్స్‌..నగర మాల్స్‌.. 
ప్రస్తుత తరుణంలో నగరం ఎక్కడ చూసినా మాల్స్‌తో నిండిపోయింది. ఒకప్పుడు బంజారాహిల్స్, హైటెక్‌ సిటీ వంటి ప్రాంతాలకు మాత్రమే పరిమితమైన పెద్ద పెద్ద మాల్స్‌ ప్రస్తుతం అన్ని ప్రాంతాలకూ విస్తరించాయి. మాల్స్‌ అంటే షాపింగ్‌ మాత్రమే కాదు.. పిల్లలను పెద్దలను అలరించే ఎన్నో ఫన్‌ యాక్టివిటీస్, గేమింగ్‌ జోన్స్‌ ఇతర కాలక్షేప కేంద్రాలకు నిలయాలుగా మారాయి. ఈ వేసవికి నగరంలోని మాల్స్‌ సైతం హాట్‌ స్పాట్‌లుగా 
మారనున్నాయి.  

ఎంటర్‌టైన్‌మెంట్‌ కింగ్‌.. ట్రెక్కింగ్‌ 
వేసవి సెలవులను ఆస్వాదించడానికి ప్రకృతితోపాటు సాహసం తోడైతే బాగుంటుందని చాలా మంది అనుకుంటారు. దీనికి చక్కని వేదిక 

్రెక్కింగ్‌. ఈ ట్రెక్కింగ్‌ ఎంజాయ్‌ చేయడానికి నగరవాసులు అనంతగిరి హిల్స్‌ వంటి ప్రాంతాలను ఎంపిక చేసుకుంటున్నారు. పలువురు 

ట్రెక్కింగ్‌ నిర్వాహకులు కిలోమీటర్ల మేర ట్రెక్కింగ్‌ ట్రాక్‌తో పాటు పలు సాహస క్రీడలతో మధుర జ్ఞాపకాలను అందిస్తున్నారు.

 

 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement