సిటీజనుల డైలీ రొటీన్‌లో భాగంగా కేక్స్
క్రిస్మస్, న్యూఇయర్‌తో పాటు ఇతర పండుగలకూ గిఫ్టులు
బర్త్‌డేల నుంచి మరిన్ని వేడుకల్లోనూ కేకులదే షోకు..
Cake Mixing:
ప్రయాణం చేస్తూనే అల్పాహారం తీసుకోవాలనుకున్న ఓ యువ ప్రొఫెషనల్ దీని కోసం అరటి వాల్‌నట్ కేక్ తయారు చేసుకుంటాడు. బిజీగా ఉండే ఓ మోడ్రన్ మదర్.. చిన్నపిల్లల స్నాక్ బాక్స్ కోసం తన ప్యాంట్రీలో నిల్వ చేసిన ఫ్రూట్ పుడ్డింగ్ కేక్‌ని బయటకు తీసి రెడీగా ఉంచుతుంది. ఇలా ఉదయాన్నే తీసుకునే అల్పాహారం నుంచి రాత్రి పూట ఆస్వాదించే బ్రౌనీస్ వరకూ.. కేక్స్ నగరవాసుల వేగవంతమైన డైలీ రొటీన్‌లో భాగం అయిపోయాయి. ఇక న్యూఇయర్‌ని, క్రిస్మస్‌లను మోసుకొచ్చే డిసెంబర్ నెలలో అయితే కేక్‌ల సందడికి హద్దే ఉండదని చెప్పాలి.
కేకుల వినియోగంలో సౌలభ్యంతో పాటు వాటి రుచి కారణంగా చాలా మందికి ఆహారపరంగా ప్రాధాన్యత జాబితాలో అగ్రస్థానంలో ఉన్నాయి. లాక్‌డౌన్ సమయంలో ఇళ్లకే పరిమితమైన సిటిజనులు హోమ్ బేకింగ్‌ను అలవాటు చేసుకున్నారు. అలా పదుల సంఖ్యలో పుట్టుకొచి్చన హోమ్ బేకర్స్.. ఆన్‌లైన్ వేదికగా అనేక మందికి వీటిని చేరువ చేశారు. దీంతో ఈ డెజర్ట్ సిటిజనులకు మరింత ఇష్టమైన ఆహారంగా మారింది.
హాట్ కేక్.. ఈట్ రైట్..
సిటీలో విరివిగా వినియోగంలో ఉన్నవాటిని ప్యాకేజ్డ్ కేకులు: ఆరి్టసానల్ కేక్‌లుగా విభజించవచ్చు. వీటిలో స్పాంజ్ కేక్‌లు, కప్ కేక్‌లు, చీజ్ కేక్‌లు, కేక్ పాప్స్ వంటివి వేగంగా తినే పని ముగించాలనుకునేవారికి ఇష్టమైనవిగా మారాయి. దీనికి తోడు పలు బ్రాండ్స్ మార్కెట్లోకి ప్రవేశపెడుతున్న వివిధ రుచులు ఆకట్టుకునే ప్యాకేజ్‌లతో మరింతగా ఆదరణ దక్కించుకుంటున్నాయి. ప్లెయిన్ స్పాంజ్ కేకులు, ఫ్రాస్టెడ్ ఐసింగ్, స్విస్ రోల్స్, ఫ్రూట్ ఫిల్డ్ మఫిన్‌ల వరకు అందుబాటులో ఉన్న అనేక రకాల ప్యాకేజ్డ్ కేక్‌లకు డిమాండ్ బాగా ఉంది. గులాబ్ జామూన్, రస్‌మలై కేకులు లేదా ఫిర్ని తిరమిసు ఇలా బ్రెడ్ తయారీదారులు మన రుచులతో పాశ్చాత్య డెజర్ట్‌లను చొప్పిస్తున్నారు.
పండుగలకూ పసందే..
పుట్టిన రోజులు లేదా వివాహాలతో పాటు కేక్ సంప్రదాయం భారతీయ పండుగలకు కూడా విస్తరించింది. రాఖీ, దీపావళి భాయ్ దూజ్ వంటి పండుగలు సంప్రదాయ స్వీట్లు – బహుమతులతో పాటు కేక్‌లను బహుమతిగా ఇచ్చే వారి సంఖ్య పెరుగుతోంది. సంప్రదాయ స్వీట్‌లు ఇప్పటికీ పెద్ద ఎత్తున ఆదరణ పొందుతున్నప్పటికీ, కేక్‌ను బహుమతిగా ఇవ్వడం అనేది కూడా క్రమక్రమంగా ఊపందుకుంటోంది. అలా ఇచ్చి పుచ్చుకోవాలనుకునేవారి కోసం రిచ్ ప్లమ్ కేక్, విక్టోరియన్ ప్లమ్ కేక్, చాకొలెట్ ఐసింగ్ కేక్, వెనీలా ఐసింగ్ కేక్, పైనాపిల్, స్ట్రాబెర్రీ, బట్టర్ స్కాచ్, బ్లాక్ ఫారెస్ట్ కేకులతో పాటు ఫ్రెష్ ఫ్రూట్ కేక్, క్యారామిల్ కేక్, చాకొలెట్ ఆల్మండ్ కేక్.. వంటì వెన్నో.. సిటీ మార్కెట్లో సందడి చేస్తున్నాయి.
ఊపుతెచ్చిన.. ఈ–కామర్స్
ఇ–కామర్స్ ప్లాట్‌ఫారమ్‌ల వల్ల కొన్ని గంటల్లో ఫ్యాన్సీ కేక్‌లను పంపడం/స్వీకరించడం çసర్వసాధారణమైపోయింది. కేక్ గిఫ్టింగ్ కోసం ఈ ప్లాట్‌ఫారమ్‌ల ద్వారా కొనుగోలు చేసి, బహుమతిగా పంపే సౌలభ్యంతో కేక్‌ల విక్రయాల్లో 12–15% పెంపునకు ఈ సైట్లు కారణమయ్యాయని అంచనా. ప్రముఖ ఆన్‌లైన్ బేకరీ రిటైల్ చైన్ అయిన విన్నీ విక్రయాల తీరు రాఖీ, భాయ్ దూజ్ లేదా దీపావళి వంటి పండుగల సమయంలో డిమాండ్‌కు అద్దం పడుతోంది. ఏతావాతా ప్లాట్‌ఫారమ్‌ల వెల్లువ కేక్ గిఫ్టింగ్ మార్కెట్ వృద్ధికి గణనీయంగా దోహదపడింది. రాఖీ, భైదూజ్ దీపావళి వంటి పండుగల సమయంలో కేక్ విక్రయాల దాదాపు 20% వృద్ధి రేటును చూసింది.
సోషల్.. సోస్టైల్..
డిజైనర్ కేక్స్ హవాకు సోషల్ మీడియా ఆజ్యం పోస్తోంది. ఆకర్షణీయమైన వెరైటీలను సోషల్ వేదికలపై ఇన్‌ఫ్లుయెన్సర్లు, ఫుడ్ బ్లాగర్‌లు తాజా కేక్ డిజైన్‌లను క్రమం తప్పకుండా ప్రదర్శిస్తున్నారు. తద్వారా ప్రత్యేక సందర్భాలకు తగ్గట్టుగా డిజైన్ చేసిన కేక్‌ల వైపు వినియోగదారుల చూపు మళ్లేలా చేస్తున్నారు. పరిశ్రమ నివేదికల ప్రకారం, సోషల్ మీడియా ప్రభావం వల్ల దేశంలో కేక్ మార్కెట్ కొన్ని సంవత్సరాలుగా 20శాతం వరకూ పెరుగుతోందట.
సందర్భమేదైనా.. సందడి కేక్స్‌దే..
ఒకప్పుడు కేక్స్‌ను కేవలం బర్త్‌డేలకు మాత్రమే ఎక్కువగా వినియోగించేవారు. క్రిస్మస్, న్యూ ఇయర్‌లతో పాటు ఇప్పుడు ఇవి విభిన్న సందర్భాలకు విస్తరించాయి. చిన్నారుల పుట్టిన రోజుల్ని ప్రతినెలా జరపడం దగ్గర నుంచీ వివాహ వార్షికోత్సవాల దాకా అలాగే కొత్తగా జాబ్‌లో చేరడం దగ్గర నుంచీ ప్రమోషన్స్, పదవీ విరమణ దాకా.. ఇలా అనేకానేక సందర్భాలకు కేక్స్‌ను వినియోగించడం జరుగుతోంది. పైనాపిల్ కేక్, బటర్‌స్కాచ్ కేక్, ఛీజ్ కేక్, బిస్కోటి కేక్.. తదితర వెరైటీలకు ఫుల్ డిమాండ్ ఉంది.
– సయ్యద్ ఇర్ఫాన్, సుభాన్ బేకరీ
Comments
Please login to add a commentAdd a comment