బ్రహ్మాండం... కృష్ణుడి పాకుండలు | Vinayakudu Movie Hero Krishnudu Celebrates Sankranthi With His Family, Comments On Sankranti Special Recipes | Sakshi
Sakshi News home page

బ్రహ్మాండం... కృష్ణుడి పాకుండలు

Published Mon, Jan 13 2025 8:37 AM | Last Updated on Mon, Jan 13 2025 10:46 AM

Vinayakudu Movie Hero Krishnudu Celebrates Sankranthi with His Family

కృష్ణుడు నవ్వడు. తెగ నవ్విస్తాడు. కృష్ణుడు అమాయకంగా కనిపిస్తాడు. కానీ అల్లరల్లరి చేస్తాడు. ‘అయ్‌ బాబోయ్‌... మా రాజోలులో ఇలా కాదండీ’ అనేది ‘వినాయకుడు’ సినిమాలో కృష్ణుడి మార్క్‌ డైలాగ్‌. కృష్ణుడు నటుడు మాత్రమే కాదు ్రపొఫెషనల్‌ ఫొటోగ్రాఫర్‌ కూడా. ఈ ‘కూడా’కు మరో ‘కూడా’ కలిపితే వంటలు చేయడంలో దిట్ట కూడా! కృష్ణుడు కోనసీమ బిడ్డ. ఉమ్మడి కుటుంబాల విలువ తెలిసిన కృష్ణుడు ఈస్ట్, వెస్ట్‌ స్పెషల్‌ పాకుండల గురించి నోరూరించేలా చెబుతాడు. అంతేనా! ‘అయ్‌ బాబాయ్‌. మా రాజోలులో అలా కాదండి. ఎలా ఉంటాయో చెప్పడంతో పాటు ఎలా చేయాలో కూడా చెబుతామండీ’... మరి ఆయన మాటల్లోనే... పాకుండలు, పెద్ద చెగోడీలతో పాటు... తన స్వీట్‌ ఫ్యామిలీ కబుర్లు...

కనుల పండగ చేసే రంగవల్లులే కాదు... సంక్రాంతి అంటే కమ్మని కర కరలు కూడా తెలుగు రాష్ట్రాల్లో ప్రతి ్రపాంతానికి ప్రత్యేక వంటకాలు ఉన్నాయి. పెద్ద పండగ రోజు ఆ కరకరల స్వరాలు వినాల్సిందే. తన సహజ నటనతో ప్రేక్షక అభిమానాన్ని సొంతం చేసుకున్న గీతాభాస్కర్‌ చేసే సకినాల రుచి ఇంతా అంతా కాదు. కృష్ణుడు అంటే అల్లరి. వెండితెర కృష్ణుడు అంటే నవ్వుల సందడి. కోనసీమ బిడ్డ కృష్ణుడు పాకుండల గురించి చెబితే తీయగా నోరూరాల్సిందే. తమకు ఇష్టమైన వంటకాల గురించి చెప్పడమే కాదు... ఎలా చేయాలో కూడా చెబుతున్నారు గీతాభాస్కర్, కృష్ణుడు. ఆ కబుర్ల కరకరలు... 

కృష్ణుడు: ట్రెడిషనల్‌ పిండి వంటలు చేయడం అనేది నాకు చిన్నప్పుడు అలవాటు. మా అమ్మ చేసేవారు. అలాగే మా ఇంట్లో సుబ్బయ్య అని కుక్‌ ఉండేవారు. ఆయన దగ్గర్నుంచి నేర్చుకున్నా. బియ్యం నానబెట్టి, తర్వాత ఆరబెట్టి, దంచేవాళ్లు. నా చిన్నప్పుడు బాగా గుర్తున్నది అంటే ఇదే. ఇప్పుడంటే మిషన్‌లో పిండి ఆడిస్తున్నారు కానీ అప్పట్లో దంచడమే. మన చిన్నప్పుడు మనం తిన్నంత టేస్టీగా ఇప్పుడు ఉండటంలేదు. చిన్నప్పుడు టేస్ట్‌ చూశాం కాబట్టి మనకు ఆ తేడా తెలుస్తుంది. ఇప్పటి జనరేషన్‌కి ఆ తేడా తెలియదు. అప్పట్లో ఎక్కువగా ఉమ్మడి కుటుంబాలు ఉండేవి. అందరూ కలిసి రోజుకొక ఇంటికి అన్నట్లు వండేవారు. అది చాలా బాగుండేది.

మాకు పాకుండలు ఫేమస్‌
మేం ఈ సంక్రాంతికి  పాకుండలు చేశాం. మాకు అదే ప్రత్యేకత. ఈస్ట్, వెస్ట్‌లో సంక్రాంతికి పాకుండలు ఫేమస్‌. విడిగా పెద్దగా చేయరు. ఈ పండగకే చేస్తుంటారు. అరిసెల పిండి ఫార్మాట్‌లోనే పాకుండల పిండి కూడా ఉంటుంది. బియ్యాన్ని ఓ రోజంతా కానీ 30 గంటలు కానీ నానబెట్టి, పిండి పట్టించుకోవాలి. బెల్లం పాకం పట్టి చేసుకోవాలి. పాకం సరిగ్గా కుదరడానికి కొలతలు ముఖ్యం. నాలుగు గ్లాసుల బియ్యం పిండికి రెండు గ్లాసుల బెల్లం వాడాలి. ఒక అరగ్లాసు నీళ్లు పోసి, పాకం పట్టాలి. పాకుండలలో కొబ్బరి ముక్కలు వేస్తారు. అది టేస్టీగా ఉంటుంది. సంక్రాంతికి అరిసెలు ఉంటాయి కానీ కోనసీమ జిల్లాల్లో పాకుండలనే ప్రిఫర్‌ చేస్తారు.

ఆ మంచు... అదో అందం
చిన్నప్పుడు సంక్రాంతి అంటే భోగి మంటలు, హరిదాసులు, ఇరుగుపొరుగు కలిసి పిండి వంటలు వండుకోవడం... ఊర్లో ఇలాంటి సందడి ఉండేది. ఇప్పటికీ ఊళ్లో ఉన్నాయి. కానీ సిటీలో అంత సందడి కనిపించదు. చిన్నప్పుడు ఆ మంచులో భోగి మంటలు వేయడం, హరిదాసులు రావడం, పెద్ద పెద్ద ముగ్గులు చూడటం... అంతా ఓ అందంగా ఉండేది. అదో మంచి అనుభూతి. సిటీల్లో గేటెడ్‌ కమ్యూనిటీల్లో భోగి మంటలు అవి వేస్తారు కానీ ఊళ్లో ఉన్నంత సందడి ఇక్కడ కనిపించదు. అందుకే చాలామంది పండగలకి ఊరు వెళ్లిపోతుంటారు. నేను కూడా వీలున్నప్పుడల్లా వెళుతుంటాను. మా పాపకి ఆ కల్చర్‌ తెలియాలని తనని కూడా తీసుకెళుతుంటాను. ఉద్యోగాలు, వ్యాపారాలంటూ సిటీల్లో స్థిరపడుతున్నారు. వాళ్లల్లో ఎక్కువ మంది పండగకి ఊరికి వెళుతుంటారు. అందుకే సంక్రాంతి అంటే అందర్నీ కలిపే పండగ.    

బయటి ఫుడ్‌ తినదు
మాది లవ్‌ మ్యారేజ్‌. మా ఆవిడ (లలితా గాయత్రి) వాళ్లది నిజామాబాద్‌. ఆ వంటల స్టయిల్‌ వేరు. ఏ ్రపాంతం రుచి ఆ ్రపాంతానిది. నేను బేసిక్‌గా ఫుడ్‌ లవర్‌ని. బాగా వండిన ప్రతిదీ నాకు ఇష్టం. ఇక మా ఆవిడకి కూడా పాకుండలు చేడయం వచ్చు. నిజానికి పెళ్లయ్యాక నేను వంట చేయడం మానేశాను. అయితే అప్పుడప్పుడూ చేస్తుంటాను. ఈ పండగకి నేనే చేశాను... తను పక్కనే ఉండి, కాస్త హెల్ప్‌ చేసింది. మా పాపకు నచ్చిన పిజ్జా, గార్లిక్‌ బ్రెడ్‌ అవన్నీ కూడా చేస్తుంటాను. మా పాప బయటి ఫుడ్‌ దాదాపు తినదు. ఇంట్లోనే చేసి పెడతాం.

పండగకి పెద్ద చెగోడీలూ చేస్తాం
సంక్రాంతికి మేం పాకుండలతో పాటు పెద్ద చెగోడీలు చేస్తుంటాం. మా రాజోలులో ఈ చెగోడీలు ఫేమస్‌. కారపొ్పడితో చేస్తాం. చాలా సాఫ్ట్‌గా ఉంటాయి. నాకు చాలా ఇష్టం. ఊరెళ్లినప్పుడుల్లా తింటాను. ఇప్పుడు పాకుండలతోపాటు అవి కూడా వండాను. చెగోడీలకు కూడా బియ్యం పిండినే వాడతాం. ఒక గ్లాసుడు పిండికి ఒక గ్లాసు నీళ్ల రేషియోతో చేయాలి. పచ్చి మిరపకాయలు, అల్లం, జీలకర్ర... మూడూ నూరి, వేడి నీళ్లలో కలిపి, ఉప్పు వేసి, అందులో బియ్యం పిండి వేసి, కలపాలి. ఆ తర్వాత చెగోడీలను లావుగా వత్తి, పెసరపప్పు అద్ది, నూనెలో వేసి వేయించుకోవాలి.

 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement