కథక్ భూషణుడు | Kathak Dancer anjubabu | Sakshi
Sakshi News home page

కథక్ భూషణుడు

Published Sun, Nov 9 2014 10:57 PM | Last Updated on Sat, Sep 2 2017 4:09 PM

Kathak Dancer anjubabu

ఆయన చేయి కదిపితే కథక్...
 కాలు కదిపితే కథక్...
 కనుల భావాలు కథక్... పెదవి పలికితే కథక్...
 ఆపాద మస్తకం కథక్... దక్కనీ కథక్ ను సృష్టించారు... వరల్డ్ డ్యాన్స్ ఫెస్టివల్ నిర్వహించారు...
 కథక్ మీద పుస్తకం ప్రచురించారు... గోపీకృష్ణ, బిర్జూ మహరాజ్‌లను కలుసుకున్నారు...  తబలా వాయించారు...
 నటరాజ రామకృష్ణను ఆదర్శంగా తీసుకున్నారు... ఆరు పదుల వయసు మీద పడుతున్నా... ఆలోచనలు మాత్రం రెండు పదులు దాటనివ్వని ఆ కథక్ డాన్సర్ పేరు అంజుబాబు... తన నాట్య ప్రయాణం గురించి సాక్షికి ప్రత్యేకంగా చెప్పిన వివరాలు...

 
మా నాన్నగారిది విజయవాడ. ఆయన ఉద్యోగ రీత్యా హైదరాబాదులో స్థిరపడ్డాం. అక్కడే విద్యాభ్యాసం, నాట్యాభ్యాసం కూడా. నాకు బాల్యం నుంచి చదువు మీద కంటె నాట్యం మీద శ్రద్ధ ఉండేది. ముఖ్యంగా ప్రతి యేడూ జరిగే గణపతి నవరాత్రి ఉత్సవాల సమయంలో నాట్య ప్రదర్శనలు చూసేవాడిని. అలాగే నిమజ్జనం సమయంలో డాన్స్ చేసేవాణ్ని. నేను లయబద్ధంగా చేయడం చూసిన మా అమ్మగారి స్నేహితులు, ‘‘మీఅబ్బాయి డాన్స్ చాలా బాగా చేస్తున్నాడు. అతడికి మంచి గురువు దగ్గర నాట్యం నేర్పించండి’ అని సలహా ఇచ్చారు. ఇంకేమీ ఆలోచించకుండా అమ్మ నన్ను ‘ైెహ దరాబాద్, రామ్‌కోఠీలో వున్న మ్యూజిక్ కాలేజీలో చేరమంది. నేను సరేనని ఆ కాలేజీకి వెళ్లాను. అక్కడ అన్ని నాట్య రీతులు చూసిన మీదట, మగవారికి కథక్ నాట్యమైతే బావుంటుందనిపించి, కథక్ విభాగంలో చేరాను. అప్పుడు నాకు పన్నెండేళ్లు. అలా నా నాట్య ప్రయాణం కథక్‌తో ప్రారంభమైంది. అక్కడ కోర్సు పూర్తయ్యాక  ‘ఢిల్లీ సంగీత నాటక అకాడెమీ’ లో కథక్ విభాగంలో 120 రూపాయల ఉపకార వేతనం మీద ఢిల్లీలో అడ్వాన్స్‌డ్ కోర్సు నేర్చుకున్నాను. సాధారణంగా ఢిల్లీ వెళ్లినవారు అక్కడే స్థిరపడిపోతారు. అయితే నేను మాత్రం మళ్లీ అక్కడికే వచ్చి కథక్ నాట్యాన్ని విద్యార్థులకు నేర్పాను. తెలుగు రాష్ట్రాలలోని ప్రతి పట్టణంలోనూ శిష్యులతో కలిసి నాట్య ప్రదర్శనలు ఇచ్చాను. మొదటిసారిగా కోస్తా జిల్లాల్లో కథక్ నాట్యాన్ని ప్రచారం చేసి, ఆ నాట్యం ఇలా ఉంటుందని చూపింది నేనే.
 
‘కథక్’ దక్షిణాది వారిది కూడా...
 
చాలామంది కథక్ నాట్యం ఉత్తరాది వారిదే అనుకుంటారు. అయితే అవ్వచ్చు కానీ, హైదరాబాద్‌లో మొఘలుల ప్రభావం ఎక్కువగా ఉండటం వల్ల, హైదరాబాద్ నగరం కథక్‌కి నిలయంగా ఉండేది. నటరాజ రామకృష్ణ వంటి వారు భాగ్యనగరానికి వచ్చాక ఇక్కడ కథక్ నాట్యం కొద్దిగా వెనుకబడింది. ప్రభుత్వాలు కూడా ‘మనం తెలుగువాళ్లం, మన కూచిపూడిని ప్రోత్సహిద్దాం’ అని ఆ నాట్యానికి ప్రాధాన్యత ఇవ్వడంతో, ఇక్కడ కూచిపూడి నేర్చుకునేవారు ఎక్కువై, కథక్ మరికొంత వెనుకబడింది.
 
మరచిపోలేని సంఘటనలు...


ప్రతి నాట్య ప్రదర్శనలోనూ నాకు తగినంత ప్రోత్సాహం వచ్చింది. అయితే అందరిలాగే నా జీవితంలోనూ మరపురాని సంఘటనలు ఉన్నాయి. 1970 ప్రాంతంలో, రవీంద్రభారతి మినీ థియేటర్‌లో నా నాట్య ప్రదర్శన చూసిన ఈల పాట రఘురామయ్యగారు నా దగ్గరకు వచ్చి, భుజం తట్టి, ‘చాలా బాగా చేశావు. వృద్ధిలోకి వస్తావు’ అని నన్ను ప్రశంసించి, ఆశీర్వదించారు.  ఆయన ఆశీర్వదించినట్లే నేను వృద్ధిలోకి వచ్చాను. మరో సంఘటన... టెక్సాస్‌లో వారి స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల సందర్భంగా భారతదేశానికి సంబంధించిన అనేక నృత్యరీతుల ప్రదర్శనలు ఏర్పాటు చేశారు. కథక్‌కి సంబంధించి నన్ను ఆహ్వానించారు. నా నాట్యం చూసి, ‘ఇలాంటి డ్యాన్స్ ఎప్పుడూ చూడలేదు’ అని కమిటీ వారు మెచ్చుకోవడం, నా జీవితంలో మర్చిపోలేను.
 
దక్కనీ ఘరానా...

నటరాజ రామకృష్ణ ‘ఆంధ్రనాట్యం’ సృష్టించాక, నాకు కూడా కొత్తగా ఏదైనా చేయాలనిపించింది.  అలా వచ్చిన ఆలోచనకు రూపకల్పనే ‘దక్కనీ ఘరానా’. ప్రతి ఒక్కరూ సులువుగా నేర్చుకునేలా హస్త ముద్రలలో, కదలికలో చిన్న చిన్న మార్పులు చేశాను. ఈ మార్పుల వల్ల, ఏడాది లోపే ప్రదర్శన  ఇవ్వగలుగుతున్నారు.
 
వరల్డ్ డాన్స్ ఫెస్టివల్...

కోణార్క, ఖజురహో వంటి ప్రదేశాలలో నాట్యోత్సవాలు ప్రత్యేకంగా జరుగుతాయి. నేను మన హైదరాబాద్‌లో ‘డెక్కన్ డ్యాన్స్ ఫెస్టివల్’ ప్రారంభించాను. అలాగే ప్రతి యేడాదీ ‘వరల్డ్ డ్యాన్స్ ఫెస్టివల్’ నిర్వహిస్తున్నాను. అన్నిరకాల నృత్య రీతులకు సంబంధించిన ప్రసిద్ధ కళాకారుల నాట్య ప్రదర్శన ఏర్పాటు చేసి, వారిని ఘనంగా సన్మానిస్తాను.
 
ప్రత్యేకంగా రూపొందించినవి...

‘నిర్భయ’ సంఘటన మీద చేసిన బ్యాలే చూసి, అప్పటి ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి నన్ను ప్రశంసించారు. జాతీయ సమైక్యత మీద తయారు చేసిన ‘ఏక్‌తా కా దివస్’  ప్రదర్శనకు అమెరికాలోని దూరదర్శన్ ‘ఉత్తమ ప్రదర్శన’ అవార్డు వచ్చింది. ఇంకా... జటాయు వధ, ‘రంగ రంగ రంగపతి’ అనే అన్నమయ్య కీర్తనకు నృత్యం సమకూర్చాను. మరిన్ని కీర్తనలకు కూడా నాట్యం సమకూరుస్తున్నాను.
 
కథక్ కళాక్షేత్ర... కథక్ నృత్య వికాసం...

చెన్నైలో శ్రీమతి రుక్మిణీ అరండేళ్  స్థాపించిన ‘కళాక్షేత్ర’ స్ఫూర్తితో హైదరాబాద్‌లో కథక్ కళాక్షేత్ర స్థాపించాను. దక్షిణభారతదేశంలో కథక్‌కి సంబంధించిన కళాక్షేత్రం ఇదొక్కటే. పూర్వం రోజుల్లో కథక్‌కి సంబంధించిన పుస్తకాలన్నీ బ్రిజ్ భాషలోనే ఉండేవి. అందువల్ల అందరికీ అర్థం అయ్యేవి కాదు. నటరాజ రామకృష్ణ మాస్టారి సూచనల మేరకు ఆ పుస్తకాన్ని ‘కథక్ నృత్య వికాసం’ పేరుతో తెనిగించాను. ఇందులో కథక్ నాట్యానికి సంబంధించిన అన్ని అంశాలూ ఉంటాయి. ఇప్పటికీ నేను చాలామంది శిష్యులను తయారుచేస్తున్నాను. వారి నాట్యంలో న న్ను నేను చూసుకుంటూ ఆనందిస్తాను.
 
- సంభాషణ: డా.పురాణపండ వైజయంతి
 
మధురానుభూతులు...
మొదటి జార్జ్‌బుష్ దగ్గర ప్రదర్శన.
{పముఖ కథక్ డ్యాన్సర్లు... గోపీకృష్ణ, బిర్జూ మహరాజ్‌లను కలుసుకోవడం
 
అవార్డులు...
 1986లో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నుంచి నృత్యభూషణ అవార్డు
     
 రాజమంద్రి కళాసమితి వారిచే వెండి కిరీట బహూకరణ
     
 హోస్టన్‌లో ఇందిరా గాంధీ సాంస్కృతికసంస్థ వారి అవార్డు
     
 2011లో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చేతుల మీదుగా ఉగాది పురస్కారం
     
 మరెన్నో పురస్కారాలు...

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement