ఖుషీ శర్మ
అవరోధాలు, ఆటంకాలు, అడ్డుగోడలు ఎన్ని ఎదురైనా మనలో ప్రతిభ ఉంటే అనుకున్న లక్ష్యాన్ని చేరుకోవడం కాస్త ఆలస్యమైనా చివరికి నిర్దేశించుకున్న గమ్యాన్ని చేరుకుంటాం. అనుకున్న దానిని సాధించేందుకు పట్టుదలతో పాటు ఆత్మస్థైర్యం ఉండాలని నిరూపించి, ఉదాహరణగా నిలుస్తోంది పదిహేడేళ్ల ఖుషీ శర్మ. ఒక పక్క చదువు, మరోపక్క ఆటల్లో రాణిస్తూనే పాఠకులు మెచ్చే నవలను రాసి, టీన్ ఆథర్‌గా ఎంతోమందికి ప్రేరణగా నిలుస్తోంది.
చండీగఢ్‌కు చెందిన ఖుషీ శర్మ ఇంటర్మీడియట్ విద్యార్థి. జాతీయ స్థాయి స్క్వాష్ పోటీల్లో పాల్గొని రెండుసార్లు పతకాలను సాధించింది. పియానో బాగా ప్లే చేస్తుంది. కథక్ డ్యాన్సర్. అనేక స్టేజ్ ప్రదర్శనలు కూడా ఇచ్చింది. చిన్నప్పటి నుంచి తనకు ఏది అనిపించినా వెంటనే నోట్ చేసుకునే అలవాటు ఉన్న ఖుషీ..ఏకంగా సైన్స్ ఫిక్షన్ అడ్వెంచర్ థ్రిల్లర్ నవలను రాసింది.‘ద మిస్సింగ్ ప్రాఫెసీ– రైజ్ ఆఫ్ ద బ్లూ ఫోనిక్స్’ పేరిట నవలను విడుదల చేసింది. బుక్ విడుదలైన నెలరోజుల్లోనే వెయ్యికాపీలు అమ్ముడవడమేగాక, అమేజాన్ ట్రెండింగ్ బుక్ జాబితాలో టాప్‌ప్లేస్‌లో దూసుకుపోతోంది ఖుషి నవల. ఇంత చిన్నవయసులో థ్రిల్లింగ్ నవలను రాసి పాఠకుల మనసులు దోచుకుంటోంది ఈ టీనేజర్.
కరోనా సమయంలో వైరస్‌కు సంబంధించిన అనేక విషయాలపై పరిశోధిస్తూ, అందుకు సంబంధించిన సమాచారాన్ని తను నడుపుతోన్న ‘బ్లాగ్ విత్ ఖుషి’లో పోస్ట్ చేస్తుండేది. ఇలా అనేక విషయాలమీద అవగాహన ఏర్పర్చుకున్న ఖుషి తనకు వచ్చే వినూత్న ఆలోచనలను పుస్తకంలో రాసి దాన్ని నవలగా తీర్చిదిద్దింది. ఈ నవలలో అంబర్ హార్ట్ అనే హీరోయిన్ ఉంటుంది. ఈమె మూడొందల ఏళ్లకోసారి ఒక గ్రహం నుంచి మరో గ్రహానికి తిరుగుతూ ఉంటుంది. ఈ క్రమంలో ఎదురయ్యే దుష్టశక్తులతో పోరాడుతుంటుంది. దీనిలో అడుగడుగునా సాహసాలు, సైన్స్, పర్యావరణానికి సంబంధించిన అనేక అంశాలను ఉత్కంఠ భరితంగా కథలో వర్ణించింది ఖుషి. చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ల వరకు అందరినీ ఆకట్టుకునే అంశాలు దీనిలో ఉన్నాయి. ఇంత చిన్నవయసులో ఎంతో అనుభవం ఉన్న రచయితలా ఖుషి నవలను రాయడం విశేషం.
ఇంతమందికి నచ్చుతుందనుకోలేదు!
‘‘చిన్నప్పటి నుంచి రాయడం ఇష్టమేగానీ, నా నవల పాఠకులకు నచ్చుతుందని ఎప్పుడూ అనుకోలేదు. కరోనా రాకముందు పదోతరగతి పరీక్షలు, మరోపక్క స్క్వాష్‌లో బిజీగా ఉండేదాన్ని. కరోనా లాక్‌డౌన్‌తో అన్నీ బంద్ అయిపోయి ఇంట్లో కూర్చోవాల్సిన పరిస్థితి. ఈ సమయంలో చిన్నచిన్న పద్యాలు రాయడం ప్రారంభించాను. ఇలా రాస్తుండగా... ‘వన్ కంట్రోల్స్ ఫైర్, ద అదర్ కంట్రోల్స్ సోల్, టు సేవ్ ది వరల్డ్, ఈచ్ మస్ట్ ప్లే దెయిర్ రోల్’ కవిత తట్టింది.
దీని ఆధారంగా పదిహేడు చాప్టర్ల వరకు రాశాను. అయితే మధ్యలో నా మొదటి సంవత్సరం ఇంటర్మీడియట్ పరీక్షలు అయిపోయాయి. ఖాళీ సమయం దొరకడంతో అక్కను విసిగిస్తున్నానని చెప్పి ‘నువ్వు రాస్తున్న బుక్‌ను రెండురోజుల్లో’ పూర్తిచేయగలవా? అని ఇంట్లో వాళ్లు డెడ్‌లైన్ పెట్టారు. దీంతో కొన్ని రోజుల్లో తొమ్మిదివేల పదాలు రాశాను. అలా రాస్తూ 75000 పదాలతో ఏకంగా ఈ నవలను రాయగలిగాను’’ అని ఖుషి చెప్పింది.
Comments
Please login to add a commentAdd a comment