
దేశం కాని దేశం వెళ్లిన వారికి రకరకాల సమస్యలు ఎదురవుతుంటాయి. అలాంటి సమస్యల్లో ఉన్న వారికి తక్షణ సహాయం చేసే బలమైన వ్యక్తి అవసరం. అలాంటి వ్యక్తి... కుద్రత్ చౌదరి. ఇమిగ్రెంట్ రైట్స్ కమిషనర్‌గా శాన్‌ఫ్రాన్సిస్కోలో నివసించే వలసదారులకు అండగా ఉండనుంది...
శాన్‌ఫ్రాన్సిస్కో (యూఎస్) ఇమిగ్రెంట్ రైట్స్ కమిషనర్(ఐఆర్‌సీ)గా బాధ్యతలు చేపట్టిన కుద్రత్ దత్తా చౌదరి వార్తల్లో వ్యక్తిగా నిలిచింది. ఈ పదవికి ఎంపికైన భారతసంతతి(ఇమిగ్రెంట్)కి చెందిన తొలివ్యక్తిగా గుర్తింపు పొందింది. శాన్‌ఫ్రాన్సిస్కోలో నివసించే వలసదారుల సమస్యలు, విధానాలకు సంబంధించిన విషయాలపై మేయర్, బోర్డ్ ఆఫ్ సూపర్వైజర్స్‌కు ‘ఐఆర్‌సీ’ సలహాలు ఇస్తుంది.
‘కొత్త బాధ్యత నాలో ఉత్సాహాన్ని, ఉద్వేగాన్ని నింపింది. నా వాళ్ల గురించి పనిచేసే అవకాశం లభించింది’ అంటుంది కుద్రత్.
చండీగఢ్‌లో జన్మించిన కుద్రత్ ‘పంజాబ్ ఆర్మీ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ లా’లో న్యాయశాస్త్రాన్ని అభ్యసించింది. లండన్ కింగ్స్ కాలేజీలో క్రిమినాలజీ, క్రిమినల్ జస్టిస్ చదువుకుంది. హార్వర్డ్ లా స్కూల్లో స్త్రీవాదం, పితృస్వామిక హింస, లైంగిక దోపిడికి సంబంధించిన అంశాలను లోతుగా అధ్యయనం చేసింది. హక్కుల ఉద్యమాలపై మంచి అవగాహన ఉన్న కుద్రత్ సమస్యల పరిష్కారంలో ‘ట్రబుల్ షూటర్’గా పేరు తెచ్చుకుంది. ఎవరికి ఏ సమస్య వచ్చినా తనదైన శైలిలో పరిష్కరించేది.
కుద్రత్ మంచి రచయిత్రి కూడా. 2015 భూకంపం (నేపాల్) తరువాత మానవసంబంధాల్లో వచ్చిన మార్పులు, మనుషుల అక్రమరవాణా, లైంగిక దోపిడిపై ‘లైజా: సమ్ టైమ్స్ ది ఎండ్ ఈజ్ ఓన్లీ ఏ బిగినింగ్’ అనే పుస్తకం రాసింది. కుద్రత్ రాసిన ‘లైజా’ పుస్తకం నేపాల్‌లో ఒక వేసవిలో వచ్చిన భూకంపం తాలూకు భయానక భౌతిక విలయ విధ్వంసాన్ని మాత్రమే కాదు మనిషిలోని విధ్వంసాన్ని కూడా కళ్లకు కడుతుంది. 19 సంవత్సరాల లైజా భూకంపంలో తల్లిదండ్రులను కోల్పోతుంది. ఏ దిక్కూ లేని పరిస్థితులలో తమ్ముడిని తీసుకొని కట్మాండూలోని మామయ్య ఇంటికి వెళుతుంది. నా అనుకున్నవారే మోసం చేయడంతో, ఇండియాలోని ఒక చీకటిప్రపంచంలోకి నెట్టబడుతుంది లైజా. ఇలాంటి విషాదాలెన్నో ఈ పుస్తకంలో కనిపిస్తాయి.
Comments
Please login to add a commentAdd a comment