Kings College London
-
నీటి కాలుష్యమే పొట్టన పెట్టుకుంది... వీడిన 350 ఏనుగుల మృతి మిస్టరీ
బోట్స్వానాలో 2020లో ఏనుగుల మూకు మ్మడి మరణం సృష్టించిన సంచలనం అంతా ఇంతా కాదు. ఒకేసారి ఏకంగా 350 ఏనుగులు అనుమానాస్పద స్థితిలో మరణించడంతో ప్రపంచవ్యాప్తంగా ఆందోళనలు వ్యక్తమ య్యాయి. ఈ ఉదంతంపై లండన్‌లోని కింగ్స్ కాలేజీ పరిశోధనలు జరిపింది. ఆ ఏనుగుల మరణాల వెనుక మిస్టరీ నాలుగేళ్లకు వీడింది. అడవిలోని నీటి గుంతలు కలుషితమవడమే ఏనుగుల మృతికి కారణమని అధ్యయన బృందం తెలిపింది. ‘‘సైనో బ్యాక్టీరియా విడుదల చేసిన సైనో టాక్సిన్లు నీటిపై విషపూరిత నురగకు కారణమయ్యాయి. అదే ఏనుగుల మరణానికి దారి తీసింది’’ అని వెల్లడించింది.వర్షాధారిత గుంతల వల్లే.ఒకవాంగో డెల్టాలోని 6 వేల చదరపు కిలోమీట ర్ల పరిధిలో 20 నీటి గుంతలు కలుషితమైనట్టు అధ్యయనంలో తేలింది. ఆ నీటిని తాగాక 88 గంటల్లోనే ఏనుగులు చనిపోయినట్టు అంచనా వేసింది. అవి శాశ్వత నీటి వనరులు కావు. కేవ లం వర్షాధారిత గుంతలు. వాటివల్లే ప్రమాదం జరిగిందని అధ్యయన సారథి శాస్త్రవేత్త డేవిడే లోమియో చెప్పారు. చనిపోయిన ఏనుగులు వేర్వేరు వయసులవి. పైగా వాటి దంతాలు చెక్కుచెదరకుండా ఉన్నాయి. కనుక వాటిని వేటాడారన్న వాదన సరికాదు’’ అని తెలిపారు.ఆల్గే పెరుగుదలకు కారణం?సైనో బాక్టీరియాగా పిలిచే నీలం–ఆకుపచ్చ ఆల్గే లో అన్నిరకాలూ విషపూరితం కావు. కొన్నిరకాల సైనోబాక్టీరియా నిలకడగా ఉన్న నీటిలో ఒక రకమైన ప్రాణాంతక ఆల్గల్ బ్లూమ్స్ (హెచ్ఎబి) ను ఉత్పత్తి చేస్తుంది. బోట్స్వానాలో 2019లో అస్సలు వానల్లేవు. 2020లోనేమో విపరీతంగా వానలు పడ్డాయి. ‘‘అధిక వర్షపాతంతో భూమి నుంచి భారీ అవక్షేపాలతో పాటు పోషకాల పునరుత్పత్తి విపరీతంగా జరిగింది. అదే ఆల్గల్ పెరుగుదలకు కారణమైంది’’ అని శాస్త్రవేత్తలు భావిస్తున్నారు. వాతావరణ మార్పుల వల్ల భవిష్యత్తులో ఇలాంటివి తరచూ జరగవచ్చని హెచ్చరిస్తున్నారు. వాతావరణ మార్పుల వల్ల అతివృష్టి, అనావృష్టితో ఆఫ్రికా దక్షిణ భాగం వైరుధ్య వాతావరణ పరిస్థితులను ఎదుర్కొంటోందని వారంటున్నారు. ‘‘ఇదే నీటిపై ప్రభా వం చూపుతోంది. దాంతో జంతువులు విపత్కర పరిణామాలను ఎదుర్కొంటున్నాయి’’ అని తెలిపారు. అడవులు, పార్కుల్లోని నీటి వనరుల నాణ్యతను ఎప్పటికప్పుడు పర్యవేక్షించడం చాలా అవసరమన్నారు. – సాక్షి, నేషనల్ డెస్క్ -
Kudrat Dutta Chaudhary: హక్కుల గొంతుక
దేశం కాని దేశం వెళ్లిన వారికి రకరకాల సమస్యలు ఎదురవుతుంటాయి. అలాంటి సమస్యల్లో ఉన్న వారికి తక్షణ సహాయం చేసే బలమైన వ్యక్తి అవసరం. అలాంటి వ్యక్తి... కుద్రత్ చౌదరి. ఇమిగ్రెంట్ రైట్స్ కమిషనర్‌గా శాన్ఫ్రాన్సిస్కోలో నివసించే వలసదారులకు అండగా ఉండనుంది... శాన్ఫ్రాన్సిస్కో (యూఎస్) ఇమిగ్రెంట్ రైట్స్ కమిషనర్(ఐఆర్సీ)గా బాధ్యతలు చేపట్టిన కుద్రత్ దత్తా చౌదరి వార్తల్లో వ్యక్తిగా నిలిచింది. ఈ పదవికి ఎంపికైన భారతసంతతి(ఇమిగ్రెంట్)కి చెందిన తొలివ్యక్తిగా గుర్తింపు పొందింది. శాన్ఫ్రాన్సిస్కోలో నివసించే వలసదారుల సమస్యలు, విధానాలకు సంబంధించిన విషయాలపై మేయర్, బోర్డ్ ఆఫ్ సూపర్వైజర్స్కు ‘ఐఆర్సీ’ సలహాలు ఇస్తుంది. ‘కొత్త బాధ్యత నాలో ఉత్సాహాన్ని, ఉద్వేగాన్ని నింపింది. నా వాళ్ల గురించి పనిచేసే అవకాశం లభించింది’ అంటుంది కుద్రత్. చండీగఢ్‌లో జన్మించిన కుద్రత్ ‘పంజాబ్ ఆర్మీ ఇన్స్టిట్యూట్ ఆఫ్ లా’లో న్యాయశాస్త్రాన్ని అభ్యసించింది. లండన్ కింగ్స్ కాలేజీలో క్రిమినాలజీ, క్రిమినల్ జస్టిస్ చదువుకుంది. హార్వర్డ్ లా స్కూల్లో స్త్రీవాదం, పితృస్వామిక హింస, లైంగిక దోపిడికి సంబంధించిన అంశాలను లోతుగా అధ్యయనం చేసింది. హక్కుల ఉద్యమాలపై మంచి అవగాహన ఉన్న కుద్రత్ సమస్యల పరిష్కారంలో ‘ట్రబుల్ షూటర్’గా పేరు తెచ్చుకుంది. ఎవరికి ఏ సమస్య వచ్చినా తనదైన శైలిలో పరిష్కరించేది. కుద్రత్ మంచి రచయిత్రి కూడా. 2015 భూకంపం (నేపాల్) తరువాత మానవసంబంధాల్లో వచ్చిన మార్పులు, మనుషుల అక్రమరవాణా, లైంగిక దోపిడిపై ‘లైజా: సమ్ టైమ్స్ ది ఎండ్ ఈజ్ ఓన్లీ ఏ బిగినింగ్’ అనే పుస్తకం రాసింది. కుద్రత్ రాసిన ‘లైజా’ పుస్తకం నేపాల్‌లో ఒక వేసవిలో వచ్చిన భూకంపం తాలూకు భయానక భౌతిక విలయ విధ్వంసాన్ని మాత్రమే కాదు మనిషిలోని విధ్వంసాన్ని కూడా కళ్లకు కడుతుంది. 19 సంవత్సరాల లైజా భూకంపంలో తల్లిదండ్రులను కోల్పోతుంది. ఏ దిక్కూ లేని పరిస్థితులలో తమ్ముడిని తీసుకొని కట్మాండూలోని మామయ్య ఇంటికి వెళుతుంది. నా అనుకున్నవారే మోసం చేయడంతో, ఇండియాలోని ఒక చీకటిప్రపంచంలోకి నెట్టబడుతుంది లైజా. ఇలాంటి విషాదాలెన్నో ఈ పుస్తకంలో కనిపిస్తాయి. -
పిల్లలపై కోవిడ్ ప్రభావం తక్కువే: లాన్సెట్ జర్నల్
లండన్: చిన్నారులపై కోవిడ్ ప్రభావాన్ని అంచనా వేసేందుకు యూకేలో భారీ అధ్యయనం జరిగింది. కోవిడ్ సోకిన చిన్నారుల్లో అత్యధిక శాతం మందిలో కరోనా లక్షణాలు ఆరు రోజులకు మించి ఉండట్లేదని తాజా పరిశోధనలో తేలింది. ఈ అధ్యయన వివరాలు లాన్సెట్ జర్నల్‌లో ప్రచురితమయ్యాయి. ఈ పరిశోధనను లండన్‌లోని కింగ్స్ కాలేజ్ నిపుణులు 2020 సెప్టెంబర్ 1 నుంచి 2021 ఫిబ్రవరి 22 వరకూ జరిపారు. జోయ్ కోవిడ్ స్టడీ అనే స్మార్ట్ ఫోన్ యాప్ ద్వారా చిన్నారుల తల్లిదండ్రులు, టీనేజర్ల నుంచి సమాచారం సేకరించారు. మొత్తం మీద 17 ఏళ్ల లోపు ఉన్న రెండున్నర లక్షల మంది యూకే చిన్నారుల మీద ఈ ప్రయోగం జరిగింది. కరోనా సోకిన చాలా మంది చిన్నారుల్లో లక్షణాలు లేవని అధ్యయనంలో తేలింది. మొత్తంమీద అధిక శాతం చిన్నారులు కేవలం నాలుగు వారాల్లో పూర్తిగా కోలుకున్నారని పరిశోధనలో పాల్గొన్న ప్రొఫెసర్ ఎమ్మా చెప్పారు. నీరసమే లక్షణం.. కోవిడ్ సోకిన చిన్నారుల్లో అత్యంత ఉమ్మడిగా కనిపించిన అంశం నీరసంగా ఉండటమేనని పరిశోధనలో పాల్గొన్న తల్లిదండ్రులు తెలిపారు. 84 శాతం మంది పిల్లల్లో నీరసం కనిపించినట్లు పేర్కొన్నారు.8వారాలు దాటిన తర్వాత కూడా కోవిడ్ లక్షణాలు ఉన్న పిల్లలు కేవలం 2శాతం మాత్రమే కావడం గమనార్హం. కరోనా వైరస్ సోకి కోలుకున్న తర్వాత చిన్నారుల్లో జలుబు కొనసాగిందని అధ్యయనంలో తేలింది. మహమ్మారి తర్వాత పరిస్థితుల్లో చిన్నారులను సురక్షితంగా కాపాడుకోవడానికి ఈ లక్షణాన్ని పరిగణనలోనికి తీసుకోవాలని తెలిపారు. -
కరోనా వైరస్ లక్షణాలు రోజుకో రకంగా..
లండన్: కరోనా వైరస్ లక్షణాలు రోజుకో రకంగా వెలుగులోకి వస్తున్నాయి. మొదట్లో దగ్గు, జ్వరం, శ్వాసకోశ సంబంధ సమస్యలు మాత్రమే ఉంటాయని భావించారు. ఆ తర్వాత రుచి, వాసన కోల్పోవడం, కండరాల నొప్పి, డయేరియా వంటివి వచ్చి చేరాయి. యూకేలో కింగ్స్ కాలేజీ లండన్ శాస్త్రవేత్తలు తాజాగా చేపట్టిన అధ్యయనంలో కరోనా లక్షణాలు ఆరు రకాలుగా ఉంటాయని వెల్లడైంది. ఆకలి లేకపోవడం, పొత్తి కడుపు నొప్పి వంటివి చాలా మందిలో కనిపిస్తున్నాయని తేలింది. మార్చి, ఏప్రిల్ నెలల్లో కొన్ని వందల మంది కోవిడ్ రోగుల లక్షణాలను ప్రత్యేకంగా రూపొందించిన యాప్ ద్వారా తెలుసుకున్న అనంతరం ఈ అధ్యయనం ఫలితాలను మెడ్రిగ్జివ్ పత్రిక ముద్రించింది. కోవిడ్ రోగులకు చికిత్సనందించే వైద్యులకు ఈ అధ్యయనం ఫలితాలు మార్గదర్శకంగా ఉంటాయని అధ్యయనంలో పాల్గొన్న సీనియర్ శాస్త్రవేత్త, సహరచయిత క్లెయిర్ స్టీవ్స్ అభిప్రాయపడ్డారు. ఎక్కువ మందికి ఏ లక్షణాలు సోకుతున్నాయి ? వైరస్‌ను నియంత్రించడానికి ఏం చేయాలి? ఆస్పత్రి అవసరం ఎవరికి ఉంటుంది? అన్న అంశాలపై తాము చేపట్టిన అధ్యయనం ద్వారా అవగాహన పెరుగుతుందని అన్నారు. ► మొదటి రకంలో ఫ్లూ తరహా లక్షణాలన్నీ ఉంటాయి. కానీ జ్వరం మాత్రం రాదు. వాసన కోల్పోవడం, కండరాల నొప్పులు, దగ్గు, గొంతులో మంట, ఛాతీ నొప్పి వంటివి బాధిస్తాయి. ► రెండో రకంలో జ్వరంతో కూడిన ఫ్లూ లక్షణాలు కనిపిస్తాయి. తలనొప్పి, వాసన కోల్పోవడం, దగ్గు, గొంతు బొంగురుపోవడం, జ్వరం కనిపిస్తాయి. ► మూడో రకంలో జీర్ణ ప్రక్రియకు సంబంధించిన సమస్యలు తలెత్తుతాయి. ఆకలి మందగించడం, డయేరియా వంటివి కనిపిస్తాయి. ఈ లక్షణాలు కనిపించిన వారిలో దగ్గు, గొంతు నొప్పి ఉండవు. ► నాలుగో రకం లక్షణాల్లో కాస్త తీవ్రత కనిపిస్తుంది. జ్వరం, దగ్గు, గొంతు నొప్పి, తలనొప్పి, రుచి, వాసన కోల్పోవడం, ఊపిరి తీసుకోవడంలో ఇబ్బందులు తలెత్తుతాయి. ► అయిదో రకం లక్షణాలు మరింత తీవ్రమైనవి. తలనొప్పి, వాసన కోల్పోవడం, దగ్గు, జ్వరం, కండరాల నొప్పి, ఆయాసం, ఆకలి మందగించడం, స్థిమితంగా ఉండలేకపోవడం వంటివి కనిపిస్తాయి. ► ఆరో రకంలో లక్షణాలు అత్యంత తీవ్రంగా బాధిస్తాయి. మొదటి అయిదు రకాల్లో ఉన్న అన్ని లక్షణాలతో పాటుగా పొత్తి కడుపులో నొప్పి వస్తుంది. అధ్యయనంలో ఇంకా ఏముందంటే.. ► కరోనా రోగుల్లో మొదటి తరహా లక్షణాలు 1.5 శాతం మందిలో, రెండోరకం 4.4%మందిలో కనిపిస్తున్నాయి. 3.3 శాతం మంది మూడో తరహా రోగులకి ఆక్సిజన్ సపోర్ట్ అవసరం. ఆ తర్వాత నాలుగు, అయిదు, ఆరు రకాల లక్షణాలు వరసగా 8.6%, 9.9%, 19.8 శాతం మందిలో కనిపిస్తున్నాయి. ► ఆరో రకం లక్షణాలు ఉన్న వారిలో 50 శాతం మందికి ఆస్పత్రి అవసరం ఏర్పడుతోంది. ► డయాబెటీస్, ఆయాసం, అధిక బరువు ఉన్న రోగులు తప్పనిసరిగా ఆస్పత్రిలో చేరాలి. ► అయిదు రోజులైనా కరోనా లక్షణాలు అదుపులోకి రాకపోతే హోం క్వారంటైన్లో అయినా వైద్యుల పర్యవేక్షణ అవసరం. నిరంతరం షుగర్ లెవల్స్, ఆక్సిజన్ లెవల్స్ పరీక్షిస్తూ ప్రాణాలకు ప్రమాదం రాకుండా చూడాలి. ► మొదటి రకం లక్షణాలున్న వారిలో 16 శాతం మంది కరోనా సోకి, తగ్గిపోయిందన్న విషయాన్ని కూడా గుర్తించలేకపోతున్నారు. -
‘అందుకే వారిలో మరోసారి కరోనా’
లండన్: కరోనాతో ప్రపంచం అంతా కకావికలమవుతోంది. ఈ మహమ్మారికి ఇంతవరకు వ్యాక్సిన్ అందుబాటులోకి రాలేదు. సరైన వైద్యం కూడా లేదు. ఇన్ని సమస్యల మధ్య ఒకసారి కరోనా బారిన పడ్డ వారిలో మరోసారి వైరస్ లక్షణాలు కనిపిస్తుండటంతో ఆందోళన వ్యక్తమవుతోంది. ఈ క్రమంలో తాజాగా లండన్ కింగ్స్ కాలేజీ సంచలన విషయాలు వెల్లడించింది. కరోనా వైరస్ సోకిన వారిలో నెలల వ్యవధిలో రోగ నిరోధక శక్తి తగ్గడంతో.. మరోసారి తిరిగి వైరస్ బారిన పడుతున్నట్లు వెల్లడించింది. తేలికపాటి లక్షణాలు ఉన్న వారిలో కూడా రోగనిరోధక వ్యవస్థ కొంత ప్రతిస్పందనను కలిగి ఉన్నట్లు నివేదిక తెలిపింది. (త్వరలో శుభవార్త అందించబోతున్నాం) 90 మంది కరోనా రోగులను పరీక్షించిన తర్వాత ఈ నివేదిక వెల్లడించింది. ఈ అధ్యయనంలో పాల్గొన్న వారిలో దాదాపు 60 మందిలో వైరస్ సంక్రమించిన మొదటి వారాల్లో శక్తివంతమైన ప్రతిస్పందన చూపినట్లు నివేదిక వెల్లడించింది. అంతేకాక 16.7శాతం మందిలో మూడు నెలల తర్వాత కరోనా న్యూట్రలైజింగ్ యాంటీబాడీస్ అధిక స్థాయిలో ఉన్నట్లు వెల్లడించింది. అయితే ఎక్కువ అధిక శాతం మందిలో 90 రోజుల తర్వాత యాంటీబాడీస్ చాలా తక్కువ స్థాయిలో ఉన్నట్లు నివేదిక తెలిపింది. దానివల్ల రోగనిరోధక శక్తి సన్నగిల్లింది. అందువల్లే ఇలాంటి వారికి మరోసారి కరోనా వచ్చే అవకాశం ఉన్నట్లు నివేదిక తెలిపింది. శరీరంలో యాంటీబాడీస్ ఎక్కువ ఉన్నట్లయితే రోగ నిరోధక శక్తి అధికంగా ఉంటుంది. ఫలితంగా కొత్త వైరస్‌లను సమర్థవంతంగా ఎదుర్కొంటారు. ప్రస్తుత పరిస్థితుల్లో ఈ నివేదిక ఎంతగానో ఉపయోగపడుతుందని నిపుణులు భావిస్తున్నారు. రాబోయే పరిణామాలకు తగ్గట్లు ప్రభుత్వాలు చర్యలు తీసుకోవడానికి ఈ నివేదిక ఎంతో ఉపయోగపడుతుందని నిపుణులు భావిస్తున్నారు. (పెళ్లి విందు అడ్డుకున్నారు..!) -
కోవిడ్ పేదలు వంద కోట్లు
న్యూయార్క్: కరోనా వైరస్ కారణంగా ప్రపంచ వ్యాప్తంగా దాదాపు 100 కోట్ల మంది పేదరికం బారిన పడతారని, అందులోనూ దక్షిణాసియాలో భారీ స్థాయిలో పేదలుగా మిగులుతారని ఓ సర్వేలో తేలింది. కింగ్స్ లండన్ కాలేజీ, ఆస్ట్రేలియన్ నేషనల్ యూనివర్సిటీ సంయుక్తంగా ఐక్యరాజ్యసమితిలోని యూనివర్సిటీ వరల్డ్ ఇన్స్టిట్యూట్ ఫర్ డెవలప్మెంట్ ఎకనమిక్ రీసెర్చ్ కలసి ఓ సర్వే చేశాయి. ఈ సర్వే నివేదిక తాజాగా వెల్లడైంది. 100 కోట్ల మంది కలసి రోజుకు 50 కోట్ల డాలర్ల రాబడి కోల్పోతున్నారని నివేదిక పేర్కొంది. మున్ముందు పరిస్థితులు ఇంతకంటే దిగజారవచ్చని తెలిపింది. దక్షిణాసియాలో భారీగా పేదలు పెరగనున్నారని పేర్కొంది. భారత్, సబ్ సహారన్ ఆఫ్రికాలోనే పేదరికం 30 శాతం వరకూ ఉంటుందని నివేదిక వెల్లడించింది. తూర్పు ఆసియా, పసిఫిక్, చైనాలు కలిపి 41 శాతం పేదలకు ఆవాసాలుగా మారనున్నాయంది. అల్పాదాయ దేశాలైన నైజీరియా, ఇథియోపియా, బంగ్లాదేశ్, ఇండోనేíసియాలు కలిపి 18 శాతం పేదరికాన్ని చవి చూస్తాయని అంచనా వేసింది. డీఆర్ కాంగో, టాంజానియా, పాకిస్తాన్, కెన్యా, ఉగాండా, ఫిలిప్పీన్స్ దేశాలు 11–12 శాతం పేదలకు కేంద్రాలుగా ఉంటాయని తెలిపింది. అత్యంత నిరుపేదలు ఉండే దేశాల్లో ఇథియోపియా, భారత్, నైజీరియా దేశాలు టాప్ 10లో ఉంటాయంది. -
భారత సంతతి మహిళపై జాతి విద్వేష వ్యాఖ్యలు
లండన్ : 17 ఏళ్లుగా తనను ఉద్దేశించి ప్రతిష్టాత్మక కింగ్స్ కాలేజి స్టాఫ్ జాతి విద్వేషపూరిత వ్యాఖ్యలు చేస్తున్నారని భారత సంతతి మహిళ ప్రియంవద గోపాల్(50) ఆరోపించారు. కేంబ్రిడ్జి విశ్వవిద్యాలయంలో ఫెలోగా ఉన్న ప్రియంవద యూనివర్సిటీ తరఫున కింగ్స్ కాలేజిలో పని చేస్తున్నారు. ఎప్పటినుంచో తనపై జాతి విద్వేషపూరిత వ్యాఖ్యలు చేస్తున్నా వాటిని భరిస్తూ వస్తున్నానని, ఇక ఓపిక నశించిందని ప్రియంవద ఫేస్బుక్లో రాసుకొచ్చారు. అయితే, ప్రియంవద ఆరోపణలపై స్పందించిన కళాశాల యాజమాన్యం ప్రియంవదను ఉద్దేశించి స్టాఫ్ విద్వేషపూరిత వ్యాఖ్యలు చేయలేదని పేర్కొంది. -
స్కాట్లాండ్ వెళ్లిన ఎంపీ కవిత
రాయికల్: నిజామాబాద్ ఎంపీ కల్వకుంట్ల కవిత మంగళవారం వ్యక్తిగత పనులపై స్కాట్లాండ్ వెళ్లారు. నవంబర్ 2 నుంచి 8 వరకు లండన్‌లోని కింగ్స్ కాలేజీలో నిర్వహించిన సెమినార్‌కు ఆమె హాజరయ్యారు. ఈ నెల 10 వరకు లండన్‌లోనే ఉన్నారు. ఈ నెల 14న కవిత భారత్ తిరిగి రానున్నారని సమాచారం.