లండన్: కరోనా వైరస్ లక్షణాలు రోజుకో రకంగా వెలుగులోకి వస్తున్నాయి. మొదట్లో దగ్గు, జ్వరం, శ్వాసకోశ సంబంధ సమస్యలు మాత్రమే ఉంటాయని భావించారు. ఆ తర్వాత రుచి, వాసన కోల్పోవడం, కండరాల నొప్పి, డయేరియా వంటివి వచ్చి చేరాయి. యూకేలో కింగ్స్ కాలేజీ లండన్ శాస్త్రవేత్తలు తాజాగా చేపట్టిన అధ్యయనంలో కరోనా లక్షణాలు ఆరు రకాలుగా ఉంటాయని వెల్లడైంది. ఆకలి లేకపోవడం, పొత్తి కడుపు నొప్పి వంటివి చాలా మందిలో కనిపిస్తున్నాయని తేలింది.
మార్చి, ఏప్రిల్ నెలల్లో కొన్ని వందల మంది కోవిడ్ రోగుల లక్షణాలను ప్రత్యేకంగా రూపొందించిన యాప్ ద్వారా తెలుసుకున్న అనంతరం ఈ అధ్యయనం ఫలితాలను మెడ్‌రిగ్జివ్ పత్రిక ముద్రించింది. కోవిడ్ రోగులకు చికిత్సనందించే వైద్యులకు ఈ అధ్యయనం ఫలితాలు మార్గదర్శకంగా ఉంటాయని అధ్యయనంలో పాల్గొన్న సీనియర్ శాస్త్రవేత్త, సహరచయిత క్లెయిర్ స్టీవ్స్ అభిప్రాయపడ్డారు. ఎక్కువ మందికి ఏ లక్షణాలు సోకుతున్నాయి ? వైరస్‌ను నియంత్రించడానికి ఏం చేయాలి? ఆస్పత్రి అవసరం ఎవరికి ఉంటుంది? అన్న అంశాలపై తాము చేపట్టిన అధ్యయనం ద్వారా అవగాహన పెరుగుతుందని అన్నారు.
► మొదటి రకంలో ఫ్లూ తరహా లక్షణాలన్నీ ఉంటాయి. కానీ జ్వరం మాత్రం రాదు. వాసన కోల్పోవడం, కండరాల నొప్పులు, దగ్గు, గొంతులో మంట, ఛాతీ నొప్పి వంటివి బాధిస్తాయి.
► రెండో రకంలో జ్వరంతో కూడిన ఫ్లూ లక్షణాలు కనిపిస్తాయి. తలనొప్పి, వాసన కోల్పోవడం, దగ్గు, గొంతు బొంగురుపోవడం, జ్వరం కనిపిస్తాయి.
► మూడో రకంలో జీర్ణ ప్రక్రియకు సంబంధించిన సమస్యలు తలెత్తుతాయి. ఆకలి మందగించడం, డయేరియా వంటివి కనిపిస్తాయి. ఈ లక్షణాలు కనిపించిన వారిలో దగ్గు, గొంతు నొప్పి ఉండవు.
► నాలుగో రకం లక్షణాల్లో కాస్త తీవ్రత కనిపిస్తుంది. జ్వరం, దగ్గు, గొంతు నొప్పి, తలనొప్పి, రుచి, వాసన కోల్పోవడం, ఊపిరి తీసుకోవడంలో ఇబ్బందులు తలెత్తుతాయి.
► అయిదో రకం లక్షణాలు మరింత తీవ్రమైనవి. తలనొప్పి, వాసన కోల్పోవడం, దగ్గు, జ్వరం, కండరాల నొప్పి, ఆయాసం, ఆకలి మందగించడం, స్థిమితంగా ఉండలేకపోవడం వంటివి కనిపిస్తాయి.
► ఆరో రకంలో లక్షణాలు అత్యంత తీవ్రంగా బాధిస్తాయి. మొదటి అయిదు రకాల్లో ఉన్న అన్ని లక్షణాలతో పాటుగా పొత్తి కడుపులో నొప్పి వస్తుంది.
అధ్యయనంలో ఇంకా ఏముందంటే..
► కరోనా రోగుల్లో మొదటి తరహా లక్షణాలు 1.5 శాతం మందిలో, రెండోరకం 4.4%మందిలో కనిపిస్తున్నాయి. 3.3 శాతం మంది మూడో తరహా రోగులకి ఆక్సిజన్ సపోర్ట్ అవసరం. ఆ తర్వాత నాలుగు, అయిదు, ఆరు రకాల లక్షణాలు వరసగా 8.6%, 9.9%, 19.8 శాతం మందిలో కనిపిస్తున్నాయి.
► ఆరో రకం లక్షణాలు ఉన్న వారిలో 50 శాతం మందికి ఆస్పత్రి అవసరం ఏర్పడుతోంది.
► డయాబెటీస్, ఆయాసం, అధిక బరువు ఉన్న రోగులు తప్పనిసరిగా ఆస్పత్రిలో చేరాలి.
► అయిదు రోజులైనా కరోనా లక్షణాలు అదుపులోకి రాకపోతే హోం క్వారంటైన్‌లో అయినా వైద్యుల పర్యవేక్షణ అవసరం. నిరంతరం షుగర్ లెవల్స్, ఆక్సిజన్ లెవల్స్ పరీక్షిస్తూ ప్రాణాలకు ప్రమాదం రాకుండా చూడాలి.
► మొదటి రకం లక్షణాలున్న వారిలో 16 శాతం మంది కరోనా సోకి, తగ్గిపోయిందన్న విషయాన్ని కూడా గుర్తించలేకపోతున్నారు.
Comments
Please login to add a commentAdd a comment