london scientists
-
‘కెంట్’ త్వరలో ప్రపంచమంతటా..!
లండన్: ‘యూకేలో బయట పడిన కరోనా స్ట్రెయిన్ ‘కెంట్’ త్వరలో ప్రపంచమంతటా వ్యాపించే అవకాశం ఉంది. ఈ తరహా మ్యుటేషన్ కనీసం 10 ఏళ్ల పాటు కొనసాగవచ్చు’ అంటూ యూకే కోవిడ్–19 యూకే కన్సార్టియం డైరెక్టర్ ప్రొఫెసర్ పీకాక్ అభిప్రాయపడ్డారు. 2020 సెప్టెంబర్‌లో బయటపడిన ఈ స్ట్రెయిన్ ఇప్పటికే యూకేతో పాటు మరో 50 దేశాలకు వ్యాపించిందని ఆమె చెప్పారు. వైరస్ మ్యుటేషన్ జరగకుండా ఆగిపోతే బాధపడాల్సిన అవసరం లేదని, కానీ ఈ మ్యుటేషన్ కనీసం 10 ఏళ్ల పాటు కొనసాగవచ్చని భావిస్తున్నాను అంటూ హెచ్చరించారు. అయితే పదేళ్ల పాటు మహమ్మారి కొనసాగకపోవచ్చని, కానీ పాజిటివ్ కేసుల్లో వచ్చే మ్యుటేషన్ ప్రపంచంలో అక్కడక్కడా బయట పడొచ్చని అభిప్రాయపడ్డారు. -
కరోనా వైరస్ లక్షణాలు రోజుకో రకంగా..
లండన్: కరోనా వైరస్ లక్షణాలు రోజుకో రకంగా వెలుగులోకి వస్తున్నాయి. మొదట్లో దగ్గు, జ్వరం, శ్వాసకోశ సంబంధ సమస్యలు మాత్రమే ఉంటాయని భావించారు. ఆ తర్వాత రుచి, వాసన కోల్పోవడం, కండరాల నొప్పి, డయేరియా వంటివి వచ్చి చేరాయి. యూకేలో కింగ్స్ కాలేజీ లండన్ శాస్త్రవేత్తలు తాజాగా చేపట్టిన అధ్యయనంలో కరోనా లక్షణాలు ఆరు రకాలుగా ఉంటాయని వెల్లడైంది. ఆకలి లేకపోవడం, పొత్తి కడుపు నొప్పి వంటివి చాలా మందిలో కనిపిస్తున్నాయని తేలింది. మార్చి, ఏప్రిల్ నెలల్లో కొన్ని వందల మంది కోవిడ్ రోగుల లక్షణాలను ప్రత్యేకంగా రూపొందించిన యాప్ ద్వారా తెలుసుకున్న అనంతరం ఈ అధ్యయనం ఫలితాలను మెడ్రిగ్జివ్ పత్రిక ముద్రించింది. కోవిడ్ రోగులకు చికిత్సనందించే వైద్యులకు ఈ అధ్యయనం ఫలితాలు మార్గదర్శకంగా ఉంటాయని అధ్యయనంలో పాల్గొన్న సీనియర్ శాస్త్రవేత్త, సహరచయిత క్లెయిర్ స్టీవ్స్ అభిప్రాయపడ్డారు. ఎక్కువ మందికి ఏ లక్షణాలు సోకుతున్నాయి ? వైరస్‌ను నియంత్రించడానికి ఏం చేయాలి? ఆస్పత్రి అవసరం ఎవరికి ఉంటుంది? అన్న అంశాలపై తాము చేపట్టిన అధ్యయనం ద్వారా అవగాహన పెరుగుతుందని అన్నారు. ► మొదటి రకంలో ఫ్లూ తరహా లక్షణాలన్నీ ఉంటాయి. కానీ జ్వరం మాత్రం రాదు. వాసన కోల్పోవడం, కండరాల నొప్పులు, దగ్గు, గొంతులో మంట, ఛాతీ నొప్పి వంటివి బాధిస్తాయి. ► రెండో రకంలో జ్వరంతో కూడిన ఫ్లూ లక్షణాలు కనిపిస్తాయి. తలనొప్పి, వాసన కోల్పోవడం, దగ్గు, గొంతు బొంగురుపోవడం, జ్వరం కనిపిస్తాయి. ► మూడో రకంలో జీర్ణ ప్రక్రియకు సంబంధించిన సమస్యలు తలెత్తుతాయి. ఆకలి మందగించడం, డయేరియా వంటివి కనిపిస్తాయి. ఈ లక్షణాలు కనిపించిన వారిలో దగ్గు, గొంతు నొప్పి ఉండవు. ► నాలుగో రకం లక్షణాల్లో కాస్త తీవ్రత కనిపిస్తుంది. జ్వరం, దగ్గు, గొంతు నొప్పి, తలనొప్పి, రుచి, వాసన కోల్పోవడం, ఊపిరి తీసుకోవడంలో ఇబ్బందులు తలెత్తుతాయి. ► అయిదో రకం లక్షణాలు మరింత తీవ్రమైనవి. తలనొప్పి, వాసన కోల్పోవడం, దగ్గు, జ్వరం, కండరాల నొప్పి, ఆయాసం, ఆకలి మందగించడం, స్థిమితంగా ఉండలేకపోవడం వంటివి కనిపిస్తాయి. ► ఆరో రకంలో లక్షణాలు అత్యంత తీవ్రంగా బాధిస్తాయి. మొదటి అయిదు రకాల్లో ఉన్న అన్ని లక్షణాలతో పాటుగా పొత్తి కడుపులో నొప్పి వస్తుంది. అధ్యయనంలో ఇంకా ఏముందంటే.. ► కరోనా రోగుల్లో మొదటి తరహా లక్షణాలు 1.5 శాతం మందిలో, రెండోరకం 4.4%మందిలో కనిపిస్తున్నాయి. 3.3 శాతం మంది మూడో తరహా రోగులకి ఆక్సిజన్ సపోర్ట్ అవసరం. ఆ తర్వాత నాలుగు, అయిదు, ఆరు రకాల లక్షణాలు వరసగా 8.6%, 9.9%, 19.8 శాతం మందిలో కనిపిస్తున్నాయి. ► ఆరో రకం లక్షణాలు ఉన్న వారిలో 50 శాతం మందికి ఆస్పత్రి అవసరం ఏర్పడుతోంది. ► డయాబెటీస్, ఆయాసం, అధిక బరువు ఉన్న రోగులు తప్పనిసరిగా ఆస్పత్రిలో చేరాలి. ► అయిదు రోజులైనా కరోనా లక్షణాలు అదుపులోకి రాకపోతే హోం క్వారంటైన్లో అయినా వైద్యుల పర్యవేక్షణ అవసరం. నిరంతరం షుగర్ లెవల్స్, ఆక్సిజన్ లెవల్స్ పరీక్షిస్తూ ప్రాణాలకు ప్రమాదం రాకుండా చూడాలి. ► మొదటి రకం లక్షణాలున్న వారిలో 16 శాతం మంది కరోనా సోకి, తగ్గిపోయిందన్న విషయాన్ని కూడా గుర్తించలేకపోతున్నారు. -
ఇక క్షణాల్లో కరోనా వైరస్‌ను గుర్తించవచ్చు!
సాక్షి, న్యూఢిల్లీ : ప్రపంచ దేశాలను భయకంపితుల్ని చేస్తోన్న కరోనా వైరస్ (కొవిడ్–19) వైరస్‌ను కొన్ని క్షణాల్లో గుర్తించడంలో లండన్ శాస్త్రవేత్తలు విజయం సాధించారు. న్యూకాజల్‌లోని నార్తుంబ్రియా యూనివర్శిటీకి చెందిన పరిశోధకుల బృందం శ్వాస ద్వారా కొవిడ్‌ను గుర్తించే బయో మీటర్‌ను కనుగొన్నారు. ప్రస్తుతం రోగుల లాలాజలాన్ని ల్యాబ్‌కు పంపించి పరీక్షించడం ద్వారా కనుగొంటున్నారు. దీనికి 24 గంటల నుంచి 48 గంటల సమయం పడుతోంది. కొత్త విధానం ద్వారా కొన్ని క్షణాల్లోనే వైరస్ సోకిందీ లేనిదీ కనుగొనవచ్చు. మద్యం మత్తులో వాహనాలను నడిపేవారిని గుర్తించేందుకు పోలీసులు ప్రస్తుతం వాడుతున్న ‘బ్రీతింగ్ అనలైజర్’లాగే ఇది పనిచేస్తుందని, అయితే ఇందులో డీఎన్ఏ, ఆర్ఎన్ఏ, ప్రొటీన్లు, ఫ్యాట్ మాలెక్యూల్స్ ఉంటాయని పరిశోధకులు తెలిపారు. కరోనా వైరస్‌తోపాటు ఇతర ఊపిరితిత్తుల జబ్బులను, క్యాన్సర్, మధు మేహం లాంటి జబ్బులను గుర్తించేందుకు కూడా ఈ సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించవచ్చని వారు చెబుతున్నారు. చదవండి: కరోనా మమ్మల్ని చంపితే నువ్వూ చస్తావ్: వర్మ విమానాశ్రయాలు, రైల్వేస్టేషన్లు, బస్టాండ్ల వద్ద ప్రయాణికులను తనిఖీ చేయడానికి ఈ కొత్త విధానం ఎక్కువగా ఉపయోగ పడుతుందని వారు చెబుతున్నారు. వెంటనే వీటి ఉత్పత్తులను చేపట్టి ప్రపంచవ్యాప్తంగా సరఫరా చేసేందుకు ప్రయత్నిస్తామని పరిశోధకులు తెలిపారు. ప్రస్తుతం చైనా, అమెరికా, సింగపూర్ దేశాలు విమానాశ్రయాల వద్ద ప్రయాణికుల జ్వరాన్ని గుర్తించడం ద్వారా కొవిడ్ బాధితులను గుర్తించేందుకు ప్రయత్నిస్తున్నారు. -
చరిత్ర ‘బుగ్గి’ కాదు..!
సాక్షి, హైదరాబాద్: ఏ వస్తువైనా బుగ్గిపాలైతే అది శాశ్వతంగా అంతరించినట్లే. కాని వేల ఏళ్ల క్రితం అంతరించిన పదార్థాలు, వస్తువుల సమాచారాన్ని అదే బుగ్గి వెల్లడిస్తే? లండన్ నుంచి వచ్చిన పరిశోధకురాలు ఆ బుగ్గి నుంచి కీలక సమాచారం సేకరించే పరిశో ధనలో తలమునకలయ్యారు. పది వేల ఏళ్ల కాలంలో తెలంగాణలో ప్రధాన ఆహారం ఏంటి..? ఇక్కడ పండిన పంటలేంటీ..? ఎప్పటి నుంచి వరి పండిస్తున్నారు..? వర్షపాతం ఎలా ఉండేది..? తదితర సమాచారాన్ని బుగ్గి అవశేషాల నుంచి సేకరిస్తున్నారు. జనగామ జిల్లా బచ్చన్నపేట మండలం కొన్నె రామచంద్రాపురం గ్రామాల మధ్య ఉన్న గజగిరిగుట్ట వద్ద హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ ప్రొఫెసర్ పుల్లారావు ఆధ్వర్యంలో జరుగుతున్న ఈ పరిశోధనలో కీలక సమాచారం కోసం అన్వేషణ సాగిస్తున్నారు. బొగ్గు, బుగ్గి అవశేషాల్లో.. యూనివర్సిటీ కాలేజ్ ఆఫ్ లండన్‌లోని ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఆర్కియోలజీ ప్రొఫెసర్ ఎలనార్కింగ్వెల్ బెన్హామ్ ఇలాంటి పరిశోధనల్లో దిట్ట. అందుకే హైదరాబాద్ సెంట్రల్ వర్సిటీ ఆమెతో ఒప్పందం చేసుకుంది. ప్రొఫెసర్ పుల్లారావు తన విద్యార్థులతో కలసి కొన్ని రోజులుగా గజగిరిగుట్టలో తవ్వకాలు జరుపుతూ పరిశోధనలు చేస్తున్న విషయం తెలిసిందే. రెండు రోజుల క్రితం ఇక్కడికి వచ్చిన బెన్హామ్.. పుల్లారావు ఆధ్వర్యంలో పరిశోధనలు ప్రారంభించారు. వేల ఏళ్ల కిత్రం ఇక్కడి వాతావరణం, జీవావరణం ఎలా ఉందన్న అంశంపై వివరాలు సేకరిస్తున్నారు. ఇందుకోసం భూమి పొరల్లో ఉన్న బొగ్గు, బుగ్గి అవశేషాలను విశ్లేషిస్తున్నారు. బెన్హామ్ ఈ నెల 21 వరకు ఇక్కడే ఉండి అధ్యయనం చేయనున్నారు. అవే ఎందుకు? సాధారణంగా బియ్యం, జొన్నలు, గోధుమలు, రాగులు లాంటి ధాన్యాలు కొంతకాలానికి పురుగు, ఫంగస్‌లతో నాశనమవుతాయి. సూక్ష్మ అవశేషాలు కూడా లేకుండా సూక్ష్మక్రిములు వాటిని నాశనం చేస్తాయి. కాని మంటలో దగ్ధమై బొగ్గుగా మారిన వాటి జోలికి ఫంగస్, సూక్ష్మ క్రిములు, బ్యాక్టీరియా వెళ్లవు. ఫలితంగా బొగ్గుగా మారిన వాటిల్లో వాటి అవశేషాలు భద్రంగా ఉంటాయి. ఆదిమానవులు ఆహారం వండే క్రమంలో వరి, జొన్న, గోధుమ, ఇతర ధాన్యపు మొక్కలు కాల్చినపుడు బొగ్గుగా మారిన వాటి అవశేషాలు భూమి పొరల్లో ఉండిపోతాయి. భూగర్భం నుంచి మట్టి సేకరించి నీటిలో కలిపితే బొగ్గు అవశేషాలుపైకి తేలుతాయి. వాటి నుంచి ధాన్యపు అవశేషాలున్న బొగ్గు రేణువులను గుర్తించి సమీకరిస్తారు. వాటిని లండన్ తరలించి మైక్రోస్కోపిక్ ఎగ్జామినేషన్ జరుపుతారు. స్కానింగ్ ఎలక్ట్రిక్ మైక్రోస్కాప్ ద్వారా పరిశోధించి విశ్లే షిస్తారు. యాగ్జిలరేటెడ్ మాస్ స్పెక్ట్రోస్కొపీ ద్వారా ఆ అవశేషాల వయసు నిర్ధారిస్తారు. ఆది మానవుల సమాధుల నుంచి అవశేషాలు సేకరించి పరీక్షిస్తారు. అలాగే మట్టి పొరల్లో ఉన్న పుప్పొడి, నాటి వృక్ష జాతుల వివరాలు సేకరిస్తారు. వెరసి నాటి మానవుల ప్రధాన ఆహారం, ఏ ధాన్యం ముందు ఉత్పత్తి చేశారు, వాటి వయసు, నాటి వర్షపాతం వివరాలు విశ్లేషిస్తారు. -
‘యాంటీ బయాటిక్’ బాంబు!
లండన్: బహుళజాతి ఫార్మాసూటికల్ సంస్థలు ప్రభుత్వ అనుమతి తీసుకోకుండానే మిలియన్ల కొద్దీ యాంటీ బయాటిక్స్‌ను భారత్‌లో అమ్ముతున్నాయని ఓ అధ్యయనంలో తేలింది. వీటిని విచ్చలవిడిగా వాడటం ద్వారా వ్యాధికారక సూక్ష్మజీవులు యాంటి బయాటిక్స్‌ను తట్టుకునే సామర్థ్యాన్ని పెంచుకుంటున్నాయని బ్రిటన్‌లోని క్వీన్ మేరీ వర్సిటీ ఆఫ్ లండన్ పరిశోధకులు తెలిపారు. బహుళజాతి ఫార్మా కంపెనీలు భారత్‌లో ఇష్టానుసారంగా యాంటీ బయాటిక్స్‌ను ఉత్పత్తి చేయకుండా నిలువరించడంలో ఔషధ నియంత్రణ సంస్థలు విఫలమయ్యాయన్నారు. ఈ అధ్యయనంలో భాగంగా 2007 నుంచి 2012 వరకూ భారత ఔషధ నియంత్రణ సంస్థ రికార్డులతో పాటు దేశవ్యాప్తంగా యాంటీ బయాటిక్స్ అమ్మకాల వివరాలను సేకరించినట్లు పరిశోధనలో పాల్గొన్న మెక్గెట్టిగన్ తెలిపారు. భారత్‌లో 118 రకాల ఫిక్స్డ్ డోస్ కాంబినేషన్స్ (ఎఫ్డీసీ)ను అమ్ముతున్నట్లు వెల్లడించారు. ఈ సంఖ్య అమెరికా, బ్రిటన్లలో కేవలం ఐదుగానే ఉందన్నారు. మొత్తం 118 రకాల ఎఫ్‌డీసీల్లో 63 శాతం డ్రగ్స్‌ను ఎలాంటి అనుమతులు లేకుండానే భారత్‌లో అమ్ముతున్నారని పేర్కొన్నారు. ఇందుకు విరుద్ధంగా మొత్తం 86 సింగిల్ డ్రగ్ ఫార్ములేషన్(ఎస్డీఎఫ్)ల్లో 93 శాతం మందులకు ఔషధ నియంత్రణ సంస్థ అనుమతి ఉందన్నారు. -
నీటిపై పవన విద్యుదుత్పత్తి
గాలితో విద్యుత్‌ను ఉత్పత్తి చేయడాన్ని పవన విద్యుత్ అంటారనే విషయం మనకు తెలుసు. ఇందుకోసం కొండలు, గుట్టలు, మైదాన ప్రాంతాల్లో భారీ గాలి మరలను ఏర్పాటు చేస్తారు. గాలికి ఇవి తిరుగుతూ ఉంటే వాటికి బిగించిన టర్బైన్లు తిరగడం వల్ల విద్యుత్ ఉత్పత్తి అవుతుంది. అయితే గాలి వేగం మైదాన ప్రాంతాలు, కొండలు, గుట్టల కంటే సముద్ర ప్రాంతంలో ఎక్కువగా ఉంటుంది. ఇటువంటి చోట ఈ గాలిమరలను ఏర్పాటు చేస్తే ప్రయోజనకరంగా ఉంటుందని భావించిన లండన్ శాస్త్రవేత్తలు ఏకంగా సముద్రంలోనే తేలియాడే గాలిమరలను స్కాట్లాండ్ జలభాగంలో ఏర్పాటు చేశారు. లండన్‌లోని బిగ్ బెన్ గడియారం కంటే ఎక్కువ ఎత్తులో ఏర్పాటు చేసిన ఈ గాలి మరలతో ఏకంగా 20,000 గృహాలకు విద్యుత్‌ను సరఫరా చేయవచ్చని చెబుతున్నారు. అయితే నీళ్లపై ఈ భారీ స్తంభాలు నిలబడేందుకు స్టాటాయిల్ అనే సంస్థ ప్రత్యేక సాంకేతిక పరిజ్ఞానాన్ని అభివృద్ధి చేసిందని, ఈ టెక్నాలజీని మరింతగా, తక్కువ ఖర్చులో అందుబాటులోకి తీసుకువస్తే పవన విద్యుత్ ఖర్చు చాలా వరకు తగ్గుతుందని ప్రాజెక్ట్ డైరెక్టర్ లీఫ్ డెల్ప్ తెలిపారు. దీనికి హైవిండ్ ప్రాజెక్టుగా నామకరణం చేశామన్నారు. -
ఎక్కువసేపు టీవీ చూస్తే.. పురుషులకు ముప్పు!
ఒలింపిక్స్ వస్తున్నాయనో... ఫేవరెట్ కార్యక్రమాలు వస్తున్నాయనో గంటల తరబడి టీవీలకు అతుక్కుపోయి చూస్తున్నారా.. అయితే జర భద్రం. దానివల్ల దీర్ఘకాలంలో సమస్యలు ఎదురవుతాయట. ముఖ్యంగా పురుష పుంగవులు అలా ఎక్కువ సేపు టీవీ చూడటం ఏమాత్రం మంచిది కాదని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. రోజుకు ఐదు గంటల కంటే ఎక్కువసేపు టీవీ చూస్తే.. స్పెర్మ్ కౌంట్ మూడోవంతు తగ్గుతుందట. 1200 మంది ఆరోగ్యవంతులైన యువకుల మీద చేసిన పరిశోధనల అనంతరం కోపెన్‌హాగెన్ యూనివర్సిటీ ఈ విషయాన్ని వెల్లడించింది. సాధారణంగా టీవీ ఎక్కువ సేపు చూడని వారికి మిల్లీమీటరు వీర్యంలో 52 మిలియన్ల శుక్రకణాలు ఉంటే.. రోజుకు 5 గంటలు టీవీ చూసేవాళ్లలో మిల్లీలీటరు వీర్యానికి 37 మిలియన్ల శుక్రకణాలే ఉంటాయట. అంతేకాదు.. శుక్రకణాలను ఉత్పత్తి చేయడానికి శరీరానికి కావల్సిన టెస్టోస్టిరాన్ హార్మోను కూడా తగ్గుతుందని చెబుతున్నారు. టీవీ చూడటమే కాదు.. ఎక్కువసేపు కంప్యూటర్ ముందు కూర్చున్నా కూడా ఇదే పరిస్థితి ఉంటుందని చెబుతున్నారు. ఎక్కువసేపు టీవీ ముందు లేదా కంప్యూటర్ ముందు కూర్చోవడం వల్ల తగినంత వ్యాయామం గానీ, ఆరోగ్యకరమైన ఆహారం గానీ ఉండవని.. దానివల్ల సంతానభాగ్యం కలిగే అవకాశాలు గణనీయంగా తగ్గుతాయని శాస్త్రవేత్తలు తేల్చి చెప్పారు. వారానికి 15 గంటల పాటు వ్యాయామం చేస్తే మాత్రం శుక్రకణాల నాణ్యత బాగా పెరుగుతుందని 2013లోనే అమెరికన్ పరిశోధకులు చెప్పారు. ఇటీవలి కాలంలో పురుషులలో శుక్రకణాల సంఖ్య బాగా పడిపోతోందని గత 20 ఏళ్లుగా జరిగిన పరిశోధనలు చెబుతూనే ఉన్నాయి. కొవ్వు ఎక్కువగా ఉండే జంక్ ఫుడ్ తీసుకోవడం కూడా ఇందుకు ప్రధాన కారణం అవుతోంది.