ఎక్కువసేపు టీవీ చూస్తే.. పురుషులకు ముప్పు!
ఒలింపిక్స్ వస్తున్నాయనో... ఫేవరెట్ కార్యక్రమాలు వస్తున్నాయనో గంటల తరబడి టీవీలకు అతుక్కుపోయి చూస్తున్నారా.. అయితే జర భద్రం. దానివల్ల దీర్ఘకాలంలో సమస్యలు ఎదురవుతాయట. ముఖ్యంగా పురుష పుంగవులు అలా ఎక్కువ సేపు టీవీ చూడటం ఏమాత్రం మంచిది కాదని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. రోజుకు ఐదు గంటల కంటే ఎక్కువసేపు టీవీ చూస్తే.. స్పెర్మ్ కౌంట్ మూడోవంతు తగ్గుతుందట. 1200 మంది ఆరోగ్యవంతులైన యువకుల మీద చేసిన పరిశోధనల అనంతరం కోపెన్హాగెన్ యూనివర్సిటీ ఈ విషయాన్ని వెల్లడించింది.
సాధారణంగా టీవీ ఎక్కువ సేపు చూడని వారికి మిల్లీమీటరు వీర్యంలో 52 మిలియన్ల శుక్రకణాలు ఉంటే.. రోజుకు 5 గంటలు టీవీ చూసేవాళ్లలో మిల్లీలీటరు వీర్యానికి 37 మిలియన్ల శుక్రకణాలే ఉంటాయట. అంతేకాదు.. శుక్రకణాలను ఉత్పత్తి చేయడానికి శరీరానికి కావల్సిన టెస్టోస్టిరాన్ హార్మోను కూడా తగ్గుతుందని చెబుతున్నారు. టీవీ చూడటమే కాదు.. ఎక్కువసేపు కంప్యూటర్ ముందు కూర్చున్నా కూడా ఇదే పరిస్థితి ఉంటుందని చెబుతున్నారు.
ఎక్కువసేపు టీవీ ముందు లేదా కంప్యూటర్ ముందు కూర్చోవడం వల్ల తగినంత వ్యాయామం గానీ, ఆరోగ్యకరమైన ఆహారం గానీ ఉండవని.. దానివల్ల సంతానభాగ్యం కలిగే అవకాశాలు గణనీయంగా తగ్గుతాయని శాస్త్రవేత్తలు తేల్చి చెప్పారు. వారానికి 15 గంటల పాటు వ్యాయామం చేస్తే మాత్రం శుక్రకణాల నాణ్యత బాగా పెరుగుతుందని 2013లోనే అమెరికన్ పరిశోధకులు చెప్పారు. ఇటీవలి కాలంలో పురుషులలో శుక్రకణాల సంఖ్య బాగా పడిపోతోందని గత 20 ఏళ్లుగా జరిగిన పరిశోధనలు చెబుతూనే ఉన్నాయి. కొవ్వు ఎక్కువగా ఉండే జంక్ ఫుడ్ తీసుకోవడం కూడా ఇందుకు ప్రధాన కారణం అవుతోంది.