సాక్షి, న్యూఢిల్లీ : ప్రపంచ దేశాలను భయకంపితుల్ని చేస్తోన్న కరోనా వైరస్ (కొవిడ్–19) వైరస్‌ను కొన్ని క్షణాల్లో గుర్తించడంలో లండన్ శాస్త్రవేత్తలు విజయం సాధించారు. న్యూకాజల్‌లోని నార్తుంబ్రియా యూనివర్శిటీకి చెందిన పరిశోధకుల బృందం శ్వాస ద్వారా కొవిడ్‌ను గుర్తించే బయో మీటర్‌ను కనుగొన్నారు. ప్రస్తుతం రోగుల లాలాజలాన్ని ల్యాబ్‌కు పంపించి పరీక్షించడం ద్వారా కనుగొంటున్నారు. దీనికి 24 గంటల నుంచి 48 గంటల సమయం పడుతోంది. కొత్త విధానం ద్వారా కొన్ని క్షణాల్లోనే వైరస్ సోకిందీ లేనిదీ కనుగొనవచ్చు.
మద్యం మత్తులో వాహనాలను నడిపేవారిని గుర్తించేందుకు పోలీసులు ప్రస్తుతం వాడుతున్న ‘బ్రీతింగ్ అనలైజర్’లాగే ఇది పనిచేస్తుందని, అయితే ఇందులో డీఎన్‌ఏ, ఆర్‌ఎన్‌ఏ, ప్రొటీన్లు, ఫ్యాట్ మాలెక్యూల్స్ ఉంటాయని పరిశోధకులు తెలిపారు. కరోనా వైరస్‌తోపాటు ఇతర ఊపిరితిత్తుల జబ్బులను, క్యాన్సర్, మధు మేహం లాంటి జబ్బులను గుర్తించేందుకు కూడా ఈ సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించవచ్చని వారు చెబుతున్నారు. చదవండి: కరోనా మమ్మల్ని చంపితే నువ్వూ చస్తావ్: వర్మ
విమానాశ్రయాలు, రైల్వేస్టేషన్లు, బస్టాండ్ల వద్ద ప్రయాణికులను తనిఖీ చేయడానికి ఈ కొత్త విధానం ఎక్కువగా ఉపయోగ పడుతుందని వారు చెబుతున్నారు. వెంటనే వీటి ఉత్పత్తులను చేపట్టి ప్రపంచవ్యాప్తంగా సరఫరా చేసేందుకు ప్రయత్నిస్తామని పరిశోధకులు తెలిపారు. ప్రస్తుతం చైనా, అమెరికా, సింగపూర్ దేశాలు విమానాశ్రయాల వద్ద ప్రయాణికుల జ్వరాన్ని గుర్తించడం ద్వారా కొవిడ్ బాధితులను గుర్తించేందుకు ప్రయత్నిస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment