కోవిడ్ టైమ్‌లో దేశం ఏం చూసింది?
ముంబై: కోవిడ్ మహమ్మారి కాలంలో భారత్‌లో టెలివిజన్ వీక్షణ తొమ్మిది శాతం పెరిగినట్టు టీవీ రేటింగ్ ఏజెన్సీ బ్రాడ్కాస్ట్ ఆడియన్స్ రీసెర్చ్ కౌన్సిల్(బీఏఆర్సీ) వెల్లడించింది. మొత్తం టీవీ వ్యూయర్షిప్లో న్యూస్ ఛానళ్ల వ్యూయర్షిప్ 27 శాతం పెరిగినట్టు ఈ అధ్యయనం గుర్తించింది. పంజాబీ, గుజరాతీ, మళయాళం, తమిళ్, మరాఠీ, హిందీ న్యూస్‌ఛానళ్లకు అత్యధికంగా 10.4 శాతం వ్యూయర్షిప్ నమోదైంది. గత ఏడాది తొలి అర్థ భాగంలోకంటే ద్వితీయార్థ భాగంలో ప్రకటనలు 34 శాతం పెరిగాయని కూడా ఈ అధ్యయనం గుర్తించింది. అదే సమయంలో ఇంగ్లీష్ న్యూస్ ఛానల్స్ వీక్షణలో మాత్రం రెండు శాతం తగ్గుదల కనిపించింది. వారంలో టీవీ వీక్షించే సమయం ఆధారంగా ఈ శాతాన్ని లెక్కించారు.
భారతీయులు ఏం చూశారు?
కోవిడ్ కాలంలో భారత ప్రజలు దేన్ని వీక్షించారు ‘వాట్ ఇండియా వాచ్డ్’అనే కోణంలో ఈ అధ్యయనం చేశారు. ఈ అధ్యయనంలో కోవిడ్‌కి ముందు, కోవిడ్ సమయంలో, లాక్డౌన్ సమయంలో, లాక్డౌన్ అనంతరం, అలాగే 2020 ఏడాది చివర్లో భారతీయుల టీవీ వీక్షణపై ఈ అధ్యయనం చేశారు. ‘ద ఇయర్ ఆఫ్టర్ టూ థౌజండ్ అండ్ నైన్టీన్’అనే పేరుతో నిర్వహించిన ఈ అధ్యయనంలో 2020 మార్చి 25న భారత్‌లో లాక్డౌన్ విధించాక ప్రజలు తమ ఇళ్లకే పరిమితమై టీవీలకు అతుక్కుపోయి, టీవీల ద్వారా బాహ్యప్రపంచాన్ని వీక్షించేందుకు ప్రయత్నించారని ఈ సర్వే వెల్లడించింది.
లాక్డౌన్ సమయంలో ఎంటర్టైన్మెంట్ కార్యక్రమాలు, న్యూస్ ఛానళ్లను ఎక్కువగా వీక్షించినట్టు సర్వే పేర్కొంది. గత ఏడాది జనవరి–మార్చి కాలంతో పోలిస్తే మార్చి– జూన్ కాలంలో టీవీ వీక్షణం 23 శాతం పెరిగినట్టు ఈ అధ్యయనం గుర్తించింది. పిల్లల కార్యక్రమాల వీక్షణ 27 శాతం పెరిగింది. 2019తో పోల్చుకుంటే కోవిడ్ కాలంలో 2020లో జనరల్ ఎంటర్టెయిన్మెంట్ ఛానల్స్ వ్యూయర్షిప్ 9 శాతం పెరిగింది. సినిమా వీక్షణ 10 శాతం పెరిగింది. నాన్ ప్రైమ్ టైమ్ కార్యక్రమాల వీక్షణశాతం 2019లో 51 శాతం ఉంటే, లాక్డౌన్ కాలంలో (మార్చి 14 నుంచి జూలై 3 వరకు) 2020లో 53 శాతానికి పెరిగింది. టీవీ వీక్షకులు ఒక్క రోజులో టీవీల ముందు గడిపే సమయం 2019లో 3 గంటల 42 నిముషాలు ఉంటే 2020కి వచ్చేసరికి 4 గంటల 2 నిముషాలకు చేరుకుందని సర్వే వెల్లడించింది.
లాక్డౌన్ ప్రధాన కారణం
2020లో కోవిడ్‌కి ముందు జనవరి 4 నుంచి మార్చి 13 వరకు టీవీ వ్యూయర్షిప్ ఆరుశాతం తగ్గినట్టు ఈ అధ్యయనం వెల్లడించింది. ఎంటర్టైన్మెంట్ కార్యక్రమాలు,లాక్డౌన్ కాలంలో జాతీయంగా, అంతర్జాతీయంగా క్రీడాకార్యక్రమాలు నిలిచిపోవడంతో క్రీడాకార్యక్రమాల వీక్షణ తగ్గిపోయింది. జూలై 4 నుంచి సెప్టెంబర్ 18 వరకు ఎంటర్టైన్మెంట్ కార్యక్రమాలకు సంబంధించిన టీవీ వీక్షణ క్రమంగా పెరిగింది. 2020 చివరి నెలల్లో మొత్తం టెలివిజన్ వీక్షణ 6 శాతం పెరిగింది.
127 శాతం పెరిగిన ఐపీఎల్ 13 వ్యూయర్షిప్
ఐపీఎల్–13 నేపథ్యంలో క్రీడా సంబంధిత కార్యక్రమాల వీక్షణలో 127 శాతం పెరుగుదలను నమోదు చేసింది. టీవీ వీక్షకుల్లో అతిపెద్ద క్యాటగిరీ అయిన జనరల్ ఎంటర్టైన్మెంట్ ఛానల్స్(జీఈసీ) వీక్షకులు టీవీ చూసే సమయం 9 శాతం పెరిగింది. సినిమా చూసేవారిలో పదిశాతం పెరిగింది. చిన్నపిల్లల కార్యక్రమాల్లో 27 శాతం పెరుగుదల, సంగీత కార్యక్రమాల వీక్షణ 11 శాతం పెరిగింది. క్రీడల వీక్షించే సమయం –35 శాతం తగ్గినట్టు తేలింది. 2020 తొలి అర్థభాగంతో పోల్చుకుంటే 2020 ద్వితీయార్థ భాగంలో ప్రకటనలు 34 శాతం పెరిగాయి. 2020లోని మొత్తం ప్రకటనల్లో టాప్ 10 అడ్వర్టైజింగ్ సెక్టార్లు 80 శాతం ప్రకటనలు ఇచ్చాయి.
భారీగా పెరిగిన ప్రభుత్వ ప్రకటనలు..
2020 పోల్చుకుంటే 2019లో ప్రభుత్వ ప్రకటనలు 184 శాతం(2.7 రెట్లు) పెరిగాయి. ఐపీఎల్–12 తో పోల్చుకుంటే ఐపీఎల్–13 వీక్షకుల శాతం 23 శాతం పెరిగింది. మొత్తం 40,000 కోట్ల నిముషాల పాటు ఐపీఎల్‌ని వీక్షించారు. ముంబై ఇండియన్స్ అండ్ చెన్నై సూపర్ కింగ్స్ మధ్య అబుదాబీలో జరిగిన ఓపెనింగ్ మ్యాచ్‌ని అత్యధికంగా 11.2 బిలియన్ల సమయం వీక్షించినట్టు ఈ అధ్యయనం వెల్లడించింది.
ప్రపంచవ్యాప్తంగా ఇదే ధోరణి
రిపబ్లిక్ టీవీ సహా మరో రెండు ఛానళ్ళు టీఆర్పీ రేటింగ్‌ని తారుమారు చేశారన్న ఆరోపణల నేపథ్యంలో స్వతంత్ర న్యూస్ చానళ్లకు సంబంధించిన వీక్లీ వ్యూయర్షిప్ డేటాని అక్టోబర్ మధ్య వరకు బీఏఆర్సీ వెల్లడించలేదు. మాజీ ప్రసార నిపుణులు పరితోష్ జోషి మాట్లాడుతూ భారత్‌లోనే కాకుండా ప్రపంచవ్యాప్తంగా ఇదే ధోరణి కొనసాగుతోందని అన్నారు.
2019లోనే వార్తా ప్రాధాన్యత కలిగిన ఘటనలు
2019లో ఇదే కాలంలో వార్తా ప్రాధాన్యత కలిగిన అనేక ఘటనలు జరిగాయి. లోక్‌సభ ఎన్నికలు, పుల్వామాలో ఉగ్రదాడి, బాలాకోట్ ఎయిర్ స్ట్రైక్స్, వింగ్ కమాండర్ అభినందన్ వర్థమాన్ పాక్ నుంచి తిరిగి రాకలాంటి ఎన్నో ఘటనలు జరిగాయి. అప్పుడు వార్తా వీక్షకుల సంఖ్య పెరగడానికీ, 2020లో వార్తా ఛానళ్ళ వీక్షకుల సంఖ్య తగ్గడానికి ఇదొక కారణమై ఉండొచ్చని రిపోర్టు వెల్లడించింది. అయితే లాక్డౌన్ సమయంలో ప్రజలు ఇళ్ళకే పరిమితం కావడం వల్ల టీవీ వీక్షకుల శాతం 2019లో ఇదే కాలంతో పోల్చి చూస్తే 18 శాతం పెరిగినట్టు రిపోర్టు తేల్చింది. 2019తో పోల్చితే వార్తా వీక్షకుల సంఖ్య లాక్డౌన్ కాలంలో 90 శాతం పెరిగితే, ఎంటర్టైన్మెంట్ కార్యక్రమాల వీక్షకుల సంఖ్య 8 శాతం మాత్రమే పెరిగింది. దూర్దర్శన్ ఛానళ్లలో ప్రసారం అయిన రామాయణ్, మహా భారత్ కార్యక్రమాల కారణంగా ఎంటర్టైన్మెంట్ వీక్షకులు పెరిగారు.