పరిశోధన చేస్తున్న ప్రొఫెసర్ ఎలనార్‌కింగ్‌వెల్ బెన్‌హామ్
సాక్షి, హైదరాబాద్: ఏ వస్తువైనా బుగ్గిపాలైతే అది శాశ్వతంగా అంతరించినట్లే. కాని వేల ఏళ్ల క్రితం అంతరించిన పదార్థాలు, వస్తువుల సమాచారాన్ని అదే బుగ్గి వెల్లడిస్తే? లండన్ నుంచి వచ్చిన పరిశోధకురాలు ఆ బుగ్గి నుంచి కీలక సమాచారం సేకరించే పరిశో ధనలో తలమునకలయ్యారు. పది వేల ఏళ్ల కాలంలో తెలంగాణలో ప్రధాన ఆహారం ఏంటి..? ఇక్కడ పండిన పంటలేంటీ..? ఎప్పటి నుంచి వరి పండిస్తున్నారు..? వర్షపాతం ఎలా ఉండేది..? తదితర సమాచారాన్ని బుగ్గి అవశేషాల నుంచి సేకరిస్తున్నారు. జనగామ జిల్లా బచ్చన్నపేట మండలం కొన్నె రామచంద్రాపురం గ్రామాల మధ్య ఉన్న గజగిరిగుట్ట వద్ద హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ ప్రొఫెసర్ పుల్లారావు ఆధ్వర్యంలో జరుగుతున్న ఈ పరిశోధనలో కీలక సమాచారం కోసం అన్వేషణ సాగిస్తున్నారు.
బొగ్గు, బుగ్గి అవశేషాల్లో..
యూనివర్సిటీ కాలేజ్ ఆఫ్ లండన్‌లోని ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఆర్కియోలజీ ప్రొఫెసర్ ఎలనార్‌కింగ్‌వెల్ బెన్‌హామ్ ఇలాంటి పరిశోధనల్లో దిట్ట. అందుకే హైదరాబాద్ సెంట్రల్ వర్సిటీ ఆమెతో ఒప్పందం చేసుకుంది. ప్రొఫెసర్ పుల్లారావు తన విద్యార్థులతో కలసి కొన్ని రోజులుగా గజగిరిగుట్టలో తవ్వకాలు జరుపుతూ పరిశోధనలు చేస్తున్న విషయం తెలిసిందే. రెండు రోజుల క్రితం ఇక్కడికి వచ్చిన బెన్‌హామ్.. పుల్లారావు ఆధ్వర్యంలో పరిశోధనలు ప్రారంభించారు. వేల ఏళ్ల కిత్రం ఇక్కడి వాతావరణం, జీవావరణం ఎలా ఉందన్న అంశంపై వివరాలు సేకరిస్తున్నారు. ఇందుకోసం భూమి పొరల్లో ఉన్న బొగ్గు, బుగ్గి అవశేషాలను విశ్లేషిస్తున్నారు. బెన్‌హామ్ ఈ నెల 21 వరకు ఇక్కడే ఉండి అధ్యయనం చేయనున్నారు.
అవే ఎందుకు?
సాధారణంగా బియ్యం, జొన్నలు, గోధుమలు, రాగులు లాంటి ధాన్యాలు కొంతకాలానికి పురుగు, ఫంగస్‌లతో నాశనమవుతాయి. సూక్ష్మ అవశేషాలు కూడా లేకుండా సూక్ష్మక్రిములు వాటిని నాశనం చేస్తాయి. కాని మంటలో దగ్ధమై బొగ్గుగా మారిన వాటి జోలికి ఫంగస్, సూక్ష్మ క్రిములు, బ్యాక్టీరియా వెళ్లవు. ఫలితంగా బొగ్గుగా మారిన వాటిల్లో వాటి అవశేషాలు భద్రంగా ఉంటాయి. ఆదిమానవులు ఆహారం వండే క్రమంలో వరి, జొన్న, గోధుమ, ఇతర ధాన్యపు మొక్కలు కాల్చినపుడు బొగ్గుగా మారిన వాటి అవశేషాలు భూమి పొరల్లో ఉండిపోతాయి.
భూగర్భం నుంచి మట్టి సేకరించి నీటిలో కలిపితే బొగ్గు అవశేషాలుపైకి తేలుతాయి. వాటి నుంచి ధాన్యపు అవశేషాలున్న బొగ్గు రేణువులను గుర్తించి సమీకరిస్తారు. వాటిని లండన్ తరలించి మైక్రోస్కోపిక్ ఎగ్జామినేషన్ జరుపుతారు. స్కానింగ్ ఎలక్ట్రిక్ మైక్రోస్కాప్ ద్వారా పరిశోధించి విశ్లే షిస్తారు. యాగ్జిలరేటెడ్ మాస్ స్పెక్ట్రోస్కొపీ ద్వారా ఆ అవశేషాల వయసు నిర్ధారిస్తారు. ఆది మానవుల సమాధుల నుంచి అవశేషాలు సేకరించి పరీక్షిస్తారు. అలాగే మట్టి పొరల్లో ఉన్న పుప్పొడి, నాటి వృక్ష జాతుల వివరాలు సేకరిస్తారు. వెరసి నాటి మానవుల ప్రధాన ఆహారం, ఏ ధాన్యం ముందు ఉత్పత్తి చేశారు, వాటి వయసు, నాటి వర్షపాతం వివరాలు విశ్లేషిస్తారు.
Comments
Please login to add a commentAdd a comment