Science Fiction
-
Arati Kadav: సాఫ్ట్వేర్ టు సైన్స్–ఫిక్షన్ డైరెక్టర్
మల్టీ టాలెంట్ అంటే మాటలు కాదు. ఎంచుకున్న రంగాల్లో సమాన ప్రతిభ చాటాలి. తేడా జరిగితే అన్నిట్లో ‘జీరో’ తప్ప ఏమీ మిగలదు. సాఫ్ట్వేర్ ఇంజినీర్, రైటర్, డైరెక్టర్, ప్రొడ్యూసర్‌గా తన ప్రతిభను చాటుకున్న ఆరతి కదవ్ గురించి.... చిన్నప్పటి నుంచి ఆరతికి ఫాంటసీ జానర్ అంటే ఇష్టం. ‘పంచతంత్ర’ ‘మహాభారత’ కథల పుస్తకాలు చదువుతున్నప్పుడు వాటికి తన ఊహాలోకంలో తనదైన ఫాంటసీ జోడించేది. ఆ తరువాత సైన్స్–ఫిక్షన్ తన ఆసక్తిగా మారింది. ‘ఈ జీవితానికి అర్థం ఏమిటి? పుట్టడం, గిట్టడమేనా ఇంకేదైనా పరమావధి ఉందా?’ ఇలాంటి ప్రశ్నలతో చావుపుట్టుకల గురించి ఎన్నో కోణాలలో ఆలోచించేది. మరణానంతర జీవితం గురించి కథలు రాసేది. సైన్స్–ఫిక్షన్ ఫిల్మ్‌మేకర్‌గా ఆరతి గుర్తింపు తెచ్చుకోవడానికి ఈ ఊహలే పునాదిగా ఉపయోగపడ్డాయి. డైరెక్టర్‌గా తనకు ఎంతో పేరు తెచ్చిన ఫిలసాఫికల్ సైన్స్ ఫిక్షన్, బ్లాక్‌కామెడీ ఫిల్మ్ ‘కార్గో’కు ముందు రోబోలను దృష్టిలో పెట్టుకొని ‘టైమ్ మెషిన్’ అనే షార్ట్ ఫిల్మ్ తీసింది ఆరతి. ఈ చిన్న చిత్రం తనకు ఎంతో ఆత్మవిశ్వాసాన్ని ఇచ్చింది. మన పురాణాలలో నుంచి ఊహాజనితమైన కథలతో హాలీవుడ్ స్థాయిలో సినిమాలు తీయాలనే లక్ష్యాన్ని ఏర్పాటు చేసుకునేలా చేసింది., మహారాష్ట్రలోని నాగ్‌పుర్‌కు చెందిన ఆరతి కదవ్ అమెరికాలో సాఫ్ట్వేర్ డెవలపర్‌గా పనిచేసింది. సాంకేతిక విషయాలకు తప్ప కాల్పనిక ఊహలకు బుర్రలో కాసింత చోటు దొరకనంత క్లిష్ట పరిస్థితుల్లో కూడా ‘ఫాంటసీ’ కోసం కొంత స్థలం రిజర్వ్ చేసుకునేది. కొంతకాలం తరువాత ఉద్యోగాన్ని వదిలి ఫిల్మ్ డైరెక్షన్ కోర్సులో చేరింది. కాల్పనిక విషయాల మీద ఆసక్తి ఆరతిని సైన్స్‌కు దూరం చేయలేదు. సందర్భాన్ని బట్టి శాస్త్రీయ విషయాలపై రచనలు చేస్తుంటుంది. చిత్రరంగంలో కృత్రిమ మేథ(ఏఐ)కి సంబంధించి ‘విల్ ఏఐ మీన్ ది డెత్ ఆఫ్ క్రియేటివిటీ’ పేరుతో రాసిన వ్యాసానికి మంచి స్పందన వచ్చింది. రచయిత్రిగా కలం పట్టినప్పుడు తనలోని సాఫ్ట్వేర్ ఇంజినీర్ బయటకు వచ్చి ‘రిసెర్చ్’ చేయమంటూ సలహా ఇస్తుంది. దీంతో ఊహలకు విరామం ఇచ్చి తాను ఏ సబ్జెక్ట్ గురించి అయితే రాస్తుందో ఆ సబ్జెక్ట్‌కు సంబంధించిన వ్యక్తులతో మాట్లాడి సాధికారమైన సమాచారాన్ని పోగు చేస్తుంది. దీని ఆధారంగా మళ్లీ రచన చేస్తుంది. డైరెక్టర్‌గా ఉన్నప్పుడు తనలోని రచయిత్రి బయటకు వచ్చి సీన్–డైలాగ్‌లను ఇంకా ఎలా మెరుగుపెట్టవచ్చో సలహా ఇస్తుంది. ఇక ప్రొడ్యూసర్‌గా ఉన్నప్పుడు బడ్టెట్‌ను సమర్థవంతంగా వాడుకోవాలనే విషయంలో సలహాలు ఇవ్వడానికి తనలోని సాప్ట్వేర్ ఇంజినీర్, రైటర్, డైరెక్టర్ ఎప్పుడూ సిద్ధంగా ఉంటారు. ‘కార్గో’ సినిమా అయిదుగురు నిర్మాతలలో ఆరతి ఒకరు. ‘నేర్చుకున్న విద్య ఏదీ వృథా పోదు’ అని చెప్పడానికి ఆరతి బహుముఖ ప్రజ్ఞ సాక్ష్యంగా నిలుస్తుంది. -
ఇంతమందికి నచ్చుతుందనుకోలేదు!
అవరోధాలు, ఆటంకాలు, అడ్డుగోడలు ఎన్ని ఎదురైనా మనలో ప్రతిభ ఉంటే అనుకున్న లక్ష్యాన్ని చేరుకోవడం కాస్త ఆలస్యమైనా చివరికి నిర్దేశించుకున్న గమ్యాన్ని చేరుకుంటాం. అనుకున్న దానిని సాధించేందుకు పట్టుదలతో పాటు ఆత్మస్థైర్యం ఉండాలని నిరూపించి, ఉదాహరణగా నిలుస్తోంది పదిహేడేళ్ల ఖుషీ శర్మ. ఒక పక్క చదువు, మరోపక్క ఆటల్లో రాణిస్తూనే పాఠకులు మెచ్చే నవలను రాసి, టీన్ ఆథర్‌గా ఎంతోమందికి ప్రేరణగా నిలుస్తోంది. చండీగఢ్‌కు చెందిన ఖుషీ శర్మ ఇంటర్మీడియట్ విద్యార్థి. జాతీయ స్థాయి స్క్వాష్ పోటీల్లో పాల్గొని రెండుసార్లు పతకాలను సాధించింది. పియానో బాగా ప్లే చేస్తుంది. కథక్ డ్యాన్సర్. అనేక స్టేజ్ ప్రదర్శనలు కూడా ఇచ్చింది. చిన్నప్పటి నుంచి తనకు ఏది అనిపించినా వెంటనే నోట్ చేసుకునే అలవాటు ఉన్న ఖుషీ..ఏకంగా సైన్స్ ఫిక్షన్ అడ్వెంచర్ థ్రిల్లర్ నవలను రాసింది.‘ద మిస్సింగ్ ప్రాఫెసీ– రైజ్ ఆఫ్ ద బ్లూ ఫోనిక్స్’ పేరిట నవలను విడుదల చేసింది. బుక్ విడుదలైన నెలరోజుల్లోనే వెయ్యికాపీలు అమ్ముడవడమేగాక, అమేజాన్ ట్రెండింగ్ బుక్ జాబితాలో టాప్‌ప్లేస్‌లో దూసుకుపోతోంది ఖుషి నవల. ఇంత చిన్నవయసులో థ్రిల్లింగ్ నవలను రాసి పాఠకుల మనసులు దోచుకుంటోంది ఈ టీనేజర్. కరోనా సమయంలో వైరస్‌కు సంబంధించిన అనేక విషయాలపై పరిశోధిస్తూ, అందుకు సంబంధించిన సమాచారాన్ని తను నడుపుతోన్న ‘బ్లాగ్ విత్ ఖుషి’లో పోస్ట్ చేస్తుండేది. ఇలా అనేక విషయాలమీద అవగాహన ఏర్పర్చుకున్న ఖుషి తనకు వచ్చే వినూత్న ఆలోచనలను పుస్తకంలో రాసి దాన్ని నవలగా తీర్చిదిద్దింది. ఈ నవలలో అంబర్ హార్ట్ అనే హీరోయిన్ ఉంటుంది. ఈమె మూడొందల ఏళ్లకోసారి ఒక గ్రహం నుంచి మరో గ్రహానికి తిరుగుతూ ఉంటుంది. ఈ క్రమంలో ఎదురయ్యే దుష్టశక్తులతో పోరాడుతుంటుంది. దీనిలో అడుగడుగునా సాహసాలు, సైన్స్, పర్యావరణానికి సంబంధించిన అనేక అంశాలను ఉత్కంఠ భరితంగా కథలో వర్ణించింది ఖుషి. చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ల వరకు అందరినీ ఆకట్టుకునే అంశాలు దీనిలో ఉన్నాయి. ఇంత చిన్నవయసులో ఎంతో అనుభవం ఉన్న రచయితలా ఖుషి నవలను రాయడం విశేషం. ఇంతమందికి నచ్చుతుందనుకోలేదు! ‘‘చిన్నప్పటి నుంచి రాయడం ఇష్టమేగానీ, నా నవల పాఠకులకు నచ్చుతుందని ఎప్పుడూ అనుకోలేదు. కరోనా రాకముందు పదోతరగతి పరీక్షలు, మరోపక్క స్క్వాష్‌లో బిజీగా ఉండేదాన్ని. కరోనా లాక్‌డౌన్‌తో అన్నీ బంద్ అయిపోయి ఇంట్లో కూర్చోవాల్సిన పరిస్థితి. ఈ సమయంలో చిన్నచిన్న పద్యాలు రాయడం ప్రారంభించాను. ఇలా రాస్తుండగా... ‘వన్ కంట్రోల్స్ ఫైర్, ద అదర్ కంట్రోల్స్ సోల్, టు సేవ్ ది వరల్డ్, ఈచ్ మస్ట్ ప్లే దెయిర్ రోల్’ కవిత తట్టింది. దీని ఆధారంగా పదిహేడు చాప్టర్ల వరకు రాశాను. అయితే మధ్యలో నా మొదటి సంవత్సరం ఇంటర్మీడియట్ పరీక్షలు అయిపోయాయి. ఖాళీ సమయం దొరకడంతో అక్కను విసిగిస్తున్నానని చెప్పి ‘నువ్వు రాస్తున్న బుక్‌ను రెండురోజుల్లో’ పూర్తిచేయగలవా? అని ఇంట్లో వాళ్లు డెడ్‌లైన్ పెట్టారు. దీంతో కొన్ని రోజుల్లో తొమ్మిదివేల పదాలు రాశాను. అలా రాస్తూ 75000 పదాలతో ఏకంగా ఈ నవలను రాయగలిగాను’’ అని ఖుషి చెప్పింది. -
సైన్స్ ఫిక్షన్ చిత్రంలో సునైనా
సైన్స్ ఫిక్షన్ డార్క్ కామెడీ చిత్రంలో నటి సునైనా నటించనుంది. ఆ మధ్య పలు చిత్రాల్లో వరుసగా నటించిన తెలుగు అమ్మాయి ఇటీవల కాస్త వెనుక పడింది. తాజాగా మళ్లీ బిజీ అవుతోంది. యోగిబాబు, కరుణాకరన్ కలిసి నటిస్తున్న సైన్స్ ఫిక్షన్ డార్క్ కామెడీ చిత్రం గురించి ప్రకటన రాగానే సినీ వర్గాల్లో, ప్రేక్షకుల్లోనూ ఆసక్తి నెలకొంది. ఇందులో హీరోయిన్గా నటి సునైనాను ఎంపిక చేసినట్లు చిత్రవర్గాలు వెల్లడించాయి. ప్రవీణ్ అనే వర్థమాన నటుడు కథానాయకుడిగా పరిచయం అవుతున్నాడు. డెన్నీస్ దర్శకత్వం వహిస్తున్నారు. ఆయన మాట్లాడుతూ ఈ చిత్రంలో కథానాయకి పాత్ర సవాల్‌తో కూడుకున్నదన్నారు. ఆ పాత్రకు అనుభవం ఉన్న నటి నటిస్తే బాగుంటుందని భావించామన్నారు. సునైనా మాట్లాడుతూ ఈ చిత్రానికి సంబంధించిన స్క్రీన్‌ప్లే తనను బాగా ఆకట్టుకుందన్నారు. దర్శకుడు కథ చెబుతున్నప్పుడు తాను ఆ కథతో పయనం అవుతున్న ఫీలింగ్ కలిగిందని చెప్పుకొచ్చింది. హీరో ప్రవీణ్ గురించి మాట్లాడుతూ నూతన నటుడు అన్నది సినిమాలో ముఖ్యం కాదని, వారికి ఇచ్చిన పాత్రకు ఎంత వరకు న్యాయం చేశారన్నదే ముఖ్యం అని అంది. ఈ చిత్రం కోసం నిర్వహించిన రిహార్సల్స్‌లో ప్రవీణ్ తనదైన శైలిలో ఉత్తమ నటనను ప్రదర్శించాడని పేర్కొంది. కాగా సాయి ఫిలింస్ స్టూడియోస్ పతాకంపై ఏ.విశ్వనాథన్ నిర్మిస్తున్న ఈ చిత్రం ఇటీవల పూజా కార్యక్రమాలతో ప్రారంభం అయ్యింది. -
సూపర్ హ్యూమన్!
విడ్డూరం సైన్స్‌ఫిక్షన్‌లో మనం చదువుకొని ఆశ్చర్యపడిన విషయాలన్నీ నిజ జీవితంలో ఆచరణలోకి వచ్చి అబ్బురపరిచాయి. శాంటి కొర్పోరాల్ వ్యవహారం కూడా అంతే. సిడ్నీ(ఆస్ట్రేలియా)కు చెందిన కొర్పోరాల్ తన హస్తాల్లో మైక్రోచిప్స్‌ను అమర్చుకున్నారు. దీనివల్ల ఆమె... తాళం చెవి లేకుండానే డోర్ ఓపెన్ చేయవచ్చు. ఎలాంటి పరికరం లేకుండానే కారు డోర్స్‌ను ఓపెన్ చేయవచ్చు. పాస్వర్డ్ ఉపయోగించకుండానే కంప్యూటర్లోకి వెళ్లవచ్చు. మైక్రోచిప్స్ బియ్యపు గింజ ఆకారంలో ఉంటాయి. ఇది మాత్రమే కాదు... పర్స్‌లు, కార్డులలాంటివేమీ ఉపయోగించకుండా కొత్తదారిలో ప్రయాణించాలనేది ఆమె భవిష్యత్ కల. పాస్వర్డ్లు, పిన్ నెంబర్లు అవసరం లేని సరికొత్త జీవితం చూడొచ్చు అంటుంది కొర్పోరాల్. ‘‘ఆ తరువాత ఏమిటి? అనేదానికి ఆకాశమే హద్దు’’ అంటున్న కొర్పోరాల్ పరికరాల సహాయం లేకుండా ఎన్నో పనులు చేయాలని కలలు కంటోంది. కలలు కనడమే కాదు ఇంప్లాంట్స్ కోసం భర్త స్టీవెన్స్‌తో కలిసి ‘చిప్ మై లైఫ్’ పేరుతో డిస్ట్రిబ్యూషన్ సర్వీస్‌ను మొదలుపెట్టింది. సూపర్ హ్యూమన్‌లు నిజ జీవితంలో కూడా కనిపించే రోజు ఇంకెంతో కాలం లేదని అంటోంది కొర్పోరాల్. -
చనిపోయిన వాళ్లు నిజంగా బతికొస్తే....?
మాస్కో: చనిపోయిన వారు మళ్లీ బతికొస్తారా? మనతోపాటు మన ఇంట్లో ఒక సభ్యుల్లా బతికిన కుక్క, పిల్లి కూడా మనలాగే బతికొస్తే...? సైన్స్ ఫిక్షన్ అంటారు. అవును ప్రస్తుతానికి ఇది సైన్స్ ఫిక్షనే. మరో 40, 50 ఏళ్లలో ఇది నిజం కాబోతోందని ఆధునిక సైన్స్ చెబుతోంది. మరి అన్నేళ్లు మృతదేహాలు కుళ్లిపోకుండా నిద్రపోయినట్లుగానే ఎలా ఉంటాయి? అందుకే క్రయోనిక్స్ సంస్థలు ప్రపంచంలోని పలు చోట్ల వెలిశాయి. మానవ మృతదేహాలు, వాటిలోని అవయవాలను ఏమాత్రం దెబ్బతినకుండా అతిశీతలంలో భద్రపర్చడాన్నే క్రయోనిక్స్ అంటారు. అమెరికాలో ఇప్పటికే ఇలాంటి రెండు సంస్థలు ఉండగా, రష్యాలో ఒకటి ఉంది. రష్యాలో 2005లోనే క్రయోనిక్స్ సంస్థను స్థాపించగా అది ఇప్పుడిప్పుడే ప్రాచుర్యంలోకి వస్తోంది. ఓ రష్యా శాస్త్రవేత్త కుమారుడైన 35 ఏళ్ల దనిలా మెద్వెదెవ్ ల్యాబ్ లాంటి ‘క్రియోరస్’ సంస్థను నిర్వహిస్తున్నారు. మాస్కో శివారులోని సెర్గీవ్ పొసద్ పట్టణంలో ఈ సంస్థ ఉంది. అక్కడ ఏం జరుగుతుందో చుట్టుపక్కల నివసిస్తున్న ప్రజలెవరికీ తెలియదు. అప్పుడప్పుడు ఆధునిక అంబులెన్స్ వాహనాలు గ్రీన్ గేట్ గుండా లోపలకి వెళ్లడం మాత్రం కనిపిస్తుంది. అందులో ప్రస్తుతం 9 దేశాలకు చెందిన 24 మానవ మృతదేహాలను, 21 మనుషుల తలలను భద్రపరుస్తున్నారు. కుక్కలు, పిల్లుల శవాలు కూడా ఇంతకంటే ఎక్కువగానే ఉన్నాయట. జబ్బుల కారణంగానో, ప్రమాదాల కారణంగానో ఆస్పత్రుల్లో చనిపోయిన వారి మృతదేశాలను కొన్ని క్షణాల్లోనే ఫ్రీజర్ బాక్సుల్లోకి ఎక్కించి, అక్కడి నుంచి ఈ ఆస్పత్రి ల్యాబ్‌కు తరలిస్తారు. శీతలీకరణలో మృతదేహంలోని రక్తకణాలు దెబ్బతినకుండా ఉండేందుకు పాత రక్తాన్ని కొంతతీసి రసాయనాలతో మిశ్రమం చేసిన కొత్త రక్తాని శరీరంలోకి ఎక్కిస్తారు. అనంతరం మృతదేహాలన్ని లేదంటే తలలను మైనస్ 196 సెంటీగ్రేడ్ ఉష్ణోగ్రత వద్ద భద్రపరుస్తారు. ఇదేమి ప్రభుత్వం ఆధ్వర్యంలో జరుగుతున్న వ్యవహారమేమి కాదు. కార్పొరేట్ కల్చర్‌గా కొనసాగుతున్న వ్యాపారం. మొత్తం మృదదేహాన్ని భద్రపర్చేందుకు 24 లక్షల రూపాయలు, ఒక తలను భద్రపర్చేందుకు 8 లక్షల రూపాయలను వసూలు చేస్తారు. తలను భద్రపర్చినట్టయితే మెదడు భద్రంగా ఉంటుందని, భవిష్యత్తులో తలను రక్షించుకుంటే దాన్ని తగిలించుకునేందుకు సరైన బాడీ దొరక్కపోతుందా ? అన్న ఆశాభావం కొందరిదైతే, తలను మాత్రమే భద్రపరిస్తే తక్కువ ఖర్చవుతుందన్నది మరి కొందరి కస్టమర్ల భావన. అమెరికాలో ఇలాంటి ఓ క్రయోనిక్స్ సంస్థ కోర్టు కేసుల కారణంగా దివాలాతీసి మూతపడగా, ఆరిజోనాలోని అల్కార్ ఇనిస్టిట్యూట్ మాత్రం ఇప్పటికీ నడుస్తోంది. అందులో ప్రముఖ బేస్‌బాల్ స్టార్ టెడ్ విలియమ్స్‌తోపాటు పలు రంగాలకు చెందిన ప్రముఖుల మృతదేహాలు భద్రంగా ఉన్నాయి. మృతదేహాల వివరాలు బహిర్గతం చేయరాదన్నది సంస్థ నియమం. ఈ అల్కార్లో మానవ మృతదేహాలను భద్రపర్చడం రష్యా సంస్థకన్నా మరింత కాస్లీ వ్యవహారం. ఇందులో ఒక్క మానవ మృతదేహాన్ని భద్రపర్చేందుకు 1.33 కోట్ల రూపాయలను, తలకు 53 లక్షలను వసూలు చేస్తున్నారు. ఈ సంస్థకు బతికున్న సభ్యులు కూడా దాదాపు 1100 మంది ఉన్నారు. భీమా సౌకర్యం కూడా కల్పిస్తున్నారు. ఇది ముందుగానే సీటు రిజర్వ్ చేసుకోవడం లాంటిది. చనిపోయిన వారిని లేదా క్లినికల్ డెడ్ అని ప్రకటించిన వారిని కొన్ని గంటల్లోనే భద్రపరిస్తే మళ్లీ భవిష్యత్తులో ప్రాణం పోయవచ్చన్నది మిచిగాన్ కాలేజీలో ప్రొఫెసర్‌గా పనిచేసిన రాబర్ట్ ఎటింగ్ సిద్ధాంతం. ఆయన సిద్ధాంతం ప్రాతిపదికనే ఇలాంటి క్రయోనిక్స్ సంస్థలు పుట్టుకొచ్చాయి. చైనాలో కూడా జాయింట్ వెంచర్‌గా క్రయోనిక్స్ భారీ సెంటర్ ఏర్పాటుకు ప్రయత్నాలు జరుగుతుండగా, స్విడ్జర్లాండ్‌లో కూడా మరోటి వెలుస్తోంది. ఆరిజోనాలోని ఆల్కార్ తన వ్యాపారాన్ని విస్తృతం చేసుకునేందుకు వివిధ ఆస్పత్రులతోని, మార్చురీలతోని టైఅప్‌లు పెట్టుకోగా రష్యా సంస్థ ముందుగా ఒప్పందం చేసుకున్న ప్రకారం కొన ఊపిరితోనున్న వాళ్లకు ట్రీట్మెంట్ ఇవ్వడానికి ఏకంగా అనుబంధ ఆస్పత్రినే ఏర్పాటు చేస్తోంది. ఈ క్రయోనిక్స్ సంస్థల పరిభాష కూడా భిన్నంగా ఉంటుంది. మృతదేహాలను పేషంట్స్‌గా వ్యవహరిస్తారు. శీతలీకరణ చేయడాన్ని నిశ్చల స్థితి అని పిలుస్తారు. తిరిగి ప్రాణం తెప్పించే ప్రక్రియను రీయానిమేషన్ అని అంటారు. -
దీని సామర్థ్యం.. ఫెంటాస్టిక్..
ఏదో సైన్స్ ఫిక్షన్ సినిమాల్లోని విమానంలా ఉంది కదూ.. అయితే ఇది విమానం కాదు.. యుద్ధ హెలికాప్టర్. పేరు ఏవీఎక్స్ జేఎంఆర్. టెక్సాస్‌కు చెందిన ఏవీఎక్స్ సంస్థ దీని డిజైన్‌ను రూపొందించింది. ప్రస్తుత పరిస్థితులను బట్టి చూస్తే.. అమెరికా తదుపరి తరం యుద్ధ హెలికాప్టర్ అయ్యే చాన్స్ దీనికే ఎక్కువని నిపుణులు చెబుతున్నారు. ప్రస్తుతం అమెరికా సైన్యంలో సేవలందిస్తున్న బ్లాక్ హాక్ హెలికాప్టర్ల్లను మార్చాలని భావిస్తున్న పెంటగాన్.. ఇందుకోసం టెండర్లను ఆహ్వానించింది. రూ.6 లక్షల కోట్ల విలువైన ఈ కాంట్రాక్ట్‌ను దక్కించుకోవడానికి ఓ నాలుగైదు సంస్థలు పోటీపడుతుండగా.. ఏవీఎక్స్ అందులో ముందంజలో ఉంది. ఈ ఎటాక్ హెలికాప్టర్‌కు రెండు రోటర్లు ఉంటాయి. మొత్తం 16 మంది ప్రయాణించే వీలున్న ఈ హెలికాప్టర్ అత్యధిక వేగం గంటకు 434 కిలోమీటర్లు. బరువు 12 వేల కిలోలు. 5,900 కిలోల బరువును సునాయాసంగా మోయగలదు. ఇక శత్రువులపై దాడి చేయడానికి కావాల్సిన అన్ని ఆయుధాలు, ఏర్పాట్లు ఇందులో దండిగా ఉన్నాయి. -
నడపక్కర్లేదు.. ఆదేశిస్తే చాలు
ఈ వాహనం డిజైన్ చూశారా? ఎంత వెరైటీగా ఉందో.. దీని రూపకర్త టొయోటా. చైనాలోని బీజింగ్‌తోపాటు న్యూయార్క్‌లో జరుగుతున్న అంతర్జాతీయ ఆటోషోలో ప్రదర్శిస్తున్న ఈ ఎఫ్‌వీ2(ఫన్ వెహికల్) వాహనం డిజైన్‌ను చూసినవారంతా ఇదేదో సైన్స్ ఫిక్షన్ సినిమాలోని వాహనంలా కనిపిస్తోందని అంటున్నారు. దీని పూర్తి వివరాలను టొయోటా కంపెనీ వెల్లడించనప్పటికీ.. నిపుణులు చెబుతున్న సమాచారం ప్రకారం.. ఇది డ్రైవర్ రహిత వాహనం. ఒక్కరు మాత్రమే కూర్చునే అవకాశముంది. ముందొకటి.. మధ్యలో రెండు, చివ ర ఒక చక్రం కలిపి మొత్తం నాలుగు చక్రాలుంటాయి. ఏ ఇంజిన్ అన్న వివరాలు తెలియనప్పటికీ.. ఎలక్ట్రిక్ ఇంజిన్ అయి ఉండొచ్చని నిపుణులు భావిస్తున్నారు. ఎఫ్‌వీ2 వాహనం ముందు ఉండే తెరపై మనకు ట్రాఫిక్‌కు సంబంధించిన సూచనలు వంటివి వస్తాయి. అంతేకాదు.. మన మూడ్ బట్టి తెర రంగు మారుతుంది. మీరు ఆగ్రహంగా ఉంటే.. ఎరుపు రంగులోకి తెర మారిపోతుంది. ప్రశాంతంగా ఉన్నప్పుడు పచ్చ రంగులోకి వస్తుంది. దిగులుగా ఉంటే.. మీకు నచ్చే ప్రదేశాల్లో ఒకదాన్ని సూచిస్తూ.. అక్కడికి వెళ్లమంటూ ఓ సందేశం తెరపై ప్రదర్శితమవుతుంది. ఇది డ్రైవర్ రహిత వాహనమైనప్పటికీ.. మనం నడపాలంటే.. దీన్ని నడపొచ్చు. డ్రైవర్ మోడ్‌లోకి మారిస్తే.. మన శరీర కదలికలు ఆధారంగా దీన్ని నియంత్రించవచ్చట. అంటే.. వాహనం ఎడమ వైపునకు తిరగాలంటే, మనం ఎడమ వైపునకు వంగితే అలా తిరుగుతుందన్నమాట. ఏ సైడు మన శరీరాన్ని వంచితే.. అటు వైపు వెళ్తుంది. భవిష్యత్తు వాహనంగా పేర్కొంటున్న ఎఫ్‌వీ2.. ఎప్పుడు మార్కెట్లోకి వస్తుందన్న వివరాలను టొయోటా కంపెనీ ఇంకా ప్రకటించలేదు. అయితే, అంతవరకూ ఉత్సాహవంతుల కోసం టొయోటా ఎఫ్‌వీ2 పేరిట ఆండ్రాయిడ్ అప్లికేషన్‌ను విడుదల చేశారు. దీని ద్వారా మనం ఆ వాహనాన్ని నడిపిన అనుభూతిని పొందొచ్చట. -
అడవికి అమ్మలాంటిది..
సైన్స్ ఫిక్షన్ సినిమాల్లోని భవంతిలా కనిపిస్తోంది కదూ.. ఇది ఓ ఆకాశహర్మ్యం డిజైన్. ముఖ్యంగా అడవులను సంరక్షించడానికి, పర్యావరణ పరిశోధనలు చేయడానికి ఉద్దేశించినది. దీని పేరు రెయిన్ ఫారెస్ట్ గార్డియన్. అడవికి అమ్మలాంటిదన్నమాట. మొన్న శేషాచల అడవుల్లో కార్చిచ్చు రేగిందే.. ఇలాంటిదే అక్కడుంటుంటే.. క్షణాల్లో దాన్ని ఆర్పేసే వీలుండేది. ఈ ఆకాశహర్మ్యంలో వాటర్ టవర్‌తోపాటు అగ్నిమాపక కేంద్రం, వాతావరణ, పరిశోధన కేంద్రాలు ఉంటాయి. అమెజాన్ అడవుల కోసం ఈ డిజైన్‌ను తయారుచేశారు. ఇందులో ఉండే వాటర్ టవర్ వర్షపు నీటిని సేకరిస్తుంది. దాన్ని ఫిల్టర్ చేసి... అందులోని రిజర్వాయర్లలో భద్రపరుస్తుంది. మర్రిచెట్టుకుంటే ఊడల్లా కనిపిస్తున్న ఈ తీగలు.. భూమిలోని అదనపు నీటిని స్పాంజిలా పీల్చుకుని.. భద్రపరుస్తాయి. పైనుంచి అడవి మొత్తాన్ని పర్యవేక్షించే సదుపాయమూ ఉంది. ఎక్కడైనా చిన్న నిప్పు పుట్టినా.. వెంటనే గుర్తించి.. అక్కడికి ద్రోన్స్ను పంపుతుంది. ముందునుంచే సేకరించి ఉంచిన వర్షపు నీటితో అవి మంటలను ఆర్పేస్తాయి. అంటే.. మనుషులు అక్కడికి వెళ్లాల్సిన పనిలేదన్నమాట. అవే ఆటోమెటిక్‌గా ఆర్పేసి వచ్చేస్తాయి. అంతేకాదు.. వర్షాలు లేని సమయంలో నీటిని సరఫరా చేస్తూ.. అడవంతా పచ్చగా ఉండేలా చూస్తుంది. ఈ డిజైన్ ఇంత బాగుంది కాబట్టే.. 2014 ఈవాల్వో మేగజీన్ ఆకాశహర్మ్య పోటీలో బహుమతిని సైతం కొట్టేసింది.